పొద్దుపొడుపు చుక్క
మసక వెలుతురులో కరిగిపోయిన చోట
తొండమెత్తి
మొదటి కిరణాన్ని రారమ్మని పిలుస్తోంది
ఒక ఆవిరి ఏనుగు.నిన్న రాత్రి
వెన్నెల్లో దొరికిన శంఖంలో
కొన్నంటే కొన్ని నా చిన్ని కలలను దాచి
చల్లగా నా కాళ్ళను ముద్దాడిన
చిట్టి అల ఒడిలో వదిలాను
అవి నిన్ను చేరుకోవాలని.నువు నన్ను అమాంతంగా గాల్లోకి ఎగరేసి
పట్టుకుని గుండెకు హత్తుకుంటే
నీ మెడలో ముఖం దాచుకుని
కెరటాలపై నురగను అంటీ అంటనట్టుగా తాకి
ఎగిరిపోతున్న సీగల్ రెక్కల చప్పుళ్ళు వినాలని
వుంది నాన్నా!
తన కంటి చివరి తడిలో దొరికిన వెంట్రుకను
నా గుప్పిటపై ఉంచి, ఏదైనా మంచి కోరికను
మనసులో అనుకుని
వెంట్రుకను గాలిలోకి ఊదమంటుంది
అమ్మ.కళ్ళు గట్టిగా మూసేసుకుని
నల్ల చేపపిల్ల కథ పుస్తకంలో
దాచుకున్న ఎండిన పసుపుపచ్చ పూల
మాలల్ని మెడలో వేసుకుని
రాజు, రాణి, ఓ ముద్దుల యువరాణి
ఆట మీ ఇద్దరితో ఆడాలని…
నావీ కొన్ని కన్నీటి చుక్కల్ని
తనలో ఇముడ్చుకుని
బయల్దేరిన చిట్టి అల
నిన్ను చేరిందా?
వినేవుంటావు శంఖంలో
నా గుండె పాట.నా అణువణువులో నిండిన
నీ జ్ఞాపకాల అలజడిని మోసుకుని
తేలుతూ వెళ్ళిన కనువెంట్రుక
నిన్ను చేరిందా?
గుర్తొచ్చే వుంటుంది నీకు
మనం కలిసి ఊదిన డాన్డెలియన్
దూదిపూల తెల్లదనం.నాన్నా!
ఇక రారాదూ?
చేతిలో చేయి వేసుకుని
(నీ వేళ్ళలో నా వేళ్ళు ముడిచి, ఇదిగో, ఇలా!)
మబ్బుల్తో బొమ్మలు చేస్తూ
(అదిగదిగో ఏనుగు ఎప్పుడో సీతాకోకచిలుకైపోయింది!)
నడిచొద్దాం
ఆ చివరిదాకా!