శ్రీ సూర్యనారాయణా…


సూర్యునిలో తుఫాను

సంవత్సరం 1859. తేదీ ఆగస్ట్ 28. సూర్యుని నుంచి వెలువడి సౌరమండలంలో ప్రయాణించే విద్యుత్ కణాలు కొన్ని భూమి అయస్కాంత క్షేత్రానికి లోబడి ఎప్పటిలాగే భూమిని చేరాయి. ఈ విద్యుత్ కణాలు సాధారణంగా ధృవాల దగ్గర మాత్రమే వెలుగుతూ సుమేరు జ్యోతి (Aurora Borealis) లాగా కనిపిస్తాయి. కానీ… 1859 సంవత్సరం 28 తేదీన మొదలుకొని ఆరు రోజుల పాటు ఈ విద్యుత్ కణాల వల్ల ప్రపంచంలో చాలా చోట్ల రాత్రి సమయం ఆకాశం అంతా వెలుగుతో నిండిపోయింది. ఆస్ట్రేలియా లోని సిడ్నీ నుంచి ఉత్తరాన ఉన్న క్వీన్స్‌లాండ్ వరకు ఆకాశం ఈ వెలుగుతో నిండింది. ఆగష్ట్ 29వ తారీకున టెలిగ్రాఫ్ సర్వీసులు పనిచేయటం మానేశాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఆకాశంలో ఈ వెలుగులు కెరీబియన్ ద్వీపవాసులకి కూడా కనిపించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాకీ పర్వతశ్రేణి ప్రాంతాల పనిచేసే బంగారుగని కూలీలు రాత్రి వేళ కనిపించే ఈ వెలుగు చూసి, సూర్యోదయం అయిందనుకొని పనుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేశారు. అమెరికా లోని ఉత్తర-తూర్పు ప్రాంత వాసులు రాత్రిపూట కనిపించే ఈ వెలుగులో వార్తాపత్రికలు చదువుకున్నారు. అమెరికా, ఐరోపా ఖండాల్లో టెలిగ్రాఫ్ సర్వీసులు మూతబడ్డాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ స్తంభాలు కాలిపోయాయి. పౌర్ణిమ రోజు చంద్రుని కాంతి కన్నా ఎన్నో రెట్లు కాంతితో వెలిగిన ఈ వెలుగులు అర్ధరాత్రి 12 నుంచి ఒంటి గంట దాకా దేదీప్యమానంగా వెలుగుతూ నిర్మానుష్యంగా ఉన్న నగర వీధులను ముస్తాబు చేశాయి.

ఇవన్నీ జరగటానికి కారణం? మానవ చరిత్రలో ఇంతకుమునుపెన్నడూ నమోదు కాని ‘సౌరమండలపు పెనుతుఫాను’ భూమిని కమ్ముకోటమే!


పరమాణు ద్రవ్యరాశి

సూర్యుని చుట్టూ కనిపించే కాంతి వలయం ప్రతిక్షణం సౌరమండలం లోకి కొన్ని బిలియన్ టన్నుల ద్రవ్యరాశిని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువుల రూపంలో విరజిమ్ముతూ ఉంటుందని శాస్రజ్ఞులు కనుగొన్నారు. దీనినే ఆంగ్లంలో Coronal Mass Ejection అంటారు. అటువంటి తుఫానుల్లో అతి పెద్దదయిన పెనుతుఫాను సంభవించింది 28 ఆగస్ట్ 1859 సంవత్సరంలో.

ఈ మధ్యనే టీవీలో, సూర్యునిలోని రహస్యాలు (Secrets of Sun) అన్న పేరుతో నోవా (NOVA) ప్రోగ్రాం వచ్చింది. ఈ ప్రోగ్రాం చూసిన వెంటనే నా చిన్నప్పటి అనుభవాలు గుర్తుకు వచ్చాయి. అవి నేను హైస్కూల్లో చదువుకునే రోజులు. ప్రతి ఆదివారం ఉదయాన్నే భక్తిరంజని కార్యక్రమంలో ఒక భాగంగా “శ్రీ సూర్యనారాయణా మేలుకో” అన్న సూర్యస్తుతి వినవచ్చేది. 1953 సంవత్సరంలో, రజనీగా ప్రసిద్ధులైన బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతసారధ్యంలో వినవచ్చే మేలుకొలుపు, తరవాత రజని స్వయంగా రచించి, స్వరపరచి, రమణ మూర్తి, లక్షి గార్లు పాడిన సూర్య స్తుతి ఎంతో బాగుండేది. ఈ స్తుతిలో సూర్యునిపై కొన్ని విశేషణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.

సూర్యస్తుతి

ఈ సూర్య స్తుతిలో ముందుగా ఉదయిస్తున్న సూర్యుని వర్ణన నుంచి మొదలయ్యి అస్తమిస్తున్న సూర్యుని వర్ణన దాకా వివరణ ఉంటుంది. తొమ్మిది ఛాయలలో ఉండే సూర్యుని వర్ణన, ముఖ్యంగా ఒక్క రోజులో వివిధ దశల్లో కనిపించే సూర్యుని రంగులని వివిధ పుష్పచ్ఛాయలతో పోల్చటం అందంగా ఉంటుంది. ఆ తరవాత సాగే స్తుతి రజని గొంతులో అత్యద్భుతంగా ఇలా సాగుతుంది.

“శ్రీ సూర్యనారాయణా
వేద పారాయణా
లోక రక్షామణీ
దైవ చూడామణీ

ఆత్మరక్షా, నమో పాపశిక్షా, నమో విశ్వకర్తా, నమో విశ్వభర్తా, నమో దేవతా చక్రవర్తి, పరబ్రహ్మ మూర్తి, త్రిలోకైక నాధాదినాధా, మహాభూత తేజంబులున్ నీవెయై బ్రోవ నెల్లప్పుడూ, భాస్కరా, హస్కరా! పద్మినీ వల్లభా, వల్లకీ గానలోలా! త్రిమూర్తి స్వరూపా, విరూపాక్షనేత్రా, మహాదివ్యగాత్రా, అచించావతారా, నిరాకార ధీరా…”.

ఇక్కడ ఇచ్చిన సూర్య స్తుతి భక్తి పూర్వకంగా వినిపించినా, కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే గత కొన్ని వందల సంవత్సరాలల్లో శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు ఈ స్తుతిలో నిక్షిప్తమై ఉన్నాయి అనిపిస్తుంది. ఉదాహరణకి సూర్యుడిని విశ్వకర్త, విశ్వభర్త అని స్తుతించటం ఎంతో సమంజసం! సూర్యుడు మనకి పరబ్రహ్మమూర్తి, త్రిమూర్తి స్వరూపుడు. అవే ఈ సూర్య స్తుతిలో చెప్పబడ్డాయి. నేను 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పెద్దాయన చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. “మానవ మేధస్సు గురించి మనం గొప్పగా ఊహించుకొని, గర్వంతో విర్రవీగుతున్నప్పుడు ఒక్క సారి తల ఎత్తి ఆకాశంలోకి చూడాలి! విశాలవిశ్వంలో ఉండే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత చూస్తే మానవులుగా మనం ఎంత అల్పులమో బోధపడుతుంది!”

ఈ స్తుతి అర్ధం నాకు అప్పుడు పూర్తిగా తెలియకపోయినా, ఆ పెద్దాయన చెప్పిన మాటలు మాత్రం గుర్తుండిపోయాయి. విశాలవిశ్వం, పాలపుంత, నక్షత్రాలు వంటి విషయాలు తెలుసుకోటం కన్నా ముందు మన సౌరకుటుంబంలో ఉన్న సూర్యుని గురించి వివరాలు తెలుసుకోటం, ఒకవేళ ఆ వివరాలు ఇంతకు మునుపే తెలిస్తే మళ్ళీ గుర్తు తెచ్చుకోటం, చాలా ప్రాధమిక అవసరం! సూర్యుని గురించి వీలైనన్ని వివరాలు మీ ముందుచటం కోసమే ఈ పరిచయ వ్యాసం!

భూమి మీద మానవుని నాగరిక జీవనం ప్రారంభమైనప్పటి నుంచి అనేక ప్రాచీన సంస్కృతులు సూర్యుని ప్రత్యేకత గ్రహించాయి. ప్రాచీన సంస్కృతుల్లో చెప్పుకోతగ్గవి నైల్ నదీ తీరాన పరిఢవిల్లిన ఈజిప్ట్ సంస్కృతి, దక్షిణ మధ్య అమెరికాలో విస్తరించిన మాయా, ఇన్‌కా (Inca) సంస్కృతులు, భరత ఉపఖండంలో బీజం పోసుకున్న ఆర్య సంస్కృతులు మొదలైనవి. ఈ సంస్కృతులన్నీ ఉచ్ఛదశలో ఉన్నప్పడు, తమతమ కాలాల్లో సూర్యుడిని ఆరాధించటం మొదలు పెట్టాయని చరిత్రకారులు నిర్ధారించారు. ఈ పురాతన సంస్కృతులన్నీ తమంత తామే విడివిడిగా తమ దైనందిన జీవితాల్లో సూర్యుడి ఆవశ్యకత తెలుసుకున్నవారే! సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి గమనాలు, కాలమానం, గ్రహాణాలను ఖచ్చితంగా లెక్కకట్టే జ్ఞానము సంపాదించినవారే!

సూర్యుని గురించి శాస్త్రజ్ఞులు తెలుసుకొన్న కొన్ని నిజాలు

మానవులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించటం మొదలెప్పటి నుంచి సూర్యుని ప్రత్యేకత గమనిస్తూ గత రెండు, మూడు వందల ఏళ్ళల్లో సాధించిన ప్రగతివల్ల సూర్యుని గురించి మనకి తెలిసిన వివరాలు ఇవి!


సూర్యుని అంతర్భాగం

సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం 15కోట్ల కిలోమీటర్లు (93 మిలియన్ల మైళ్ళు.) సూర్యుని చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్ష్యలో (Elliptical Orbit) తిరగటం వల్ల, సూర్యునికి – భూమికి మధ్య ఉన్న దూరాన్ని సగటు దూరంగా ఇక్కడ ఇవ్వడమయింది. సూర్యకాంతి సూర్యుని నుంచి భూమి చేరటానికి ఎనిమిది నిమషాల పంతొమ్మిది సెకండ్లు పడుతుంది. సౌర మండలం, అంటే సూర్యునితో పాటు ఉన్న అన్ని గ్రహాలు, వాటి ఉపగ్రహాలు కలిపితే వచ్చే ద్రవ్యరాశిలో 99.86 శాతం పైగా ద్రవ్యరాశి సూర్యునిలో ఉంటుంది. ఇప్పటికి మన సౌరమండలం వయస్సు 4.6 బిలియన్ సంవత్సరాలు. అంటే, గత 4.6 బిలియన్ సంవత్సరాలుగా సూర్యుడు కాంతి విరజిమ్ముతూనే ఉన్నాడు. ఇంకా రాబోయే నాలుగు బిలియన్ సంవత్సరాల వరకూ సూర్యుడు కాంతి ప్రసరిస్తూనే ఉంటాడని శాస్త్రజ్ఞుల అంచనా! అప్పటితో మన సౌరమండలం నశిస్తుంది.

సూర్యుని గోళంలో మూడింట నాలుగు వంతుల్లో ఉదజని (హైడ్రోజన్) వాయువు, మిగిలిన ఒక వంతు భాగంలో ఎక్కువ శాతం హీలియం వాయువుతో నిండి ఉంది. రెండు ఉదజని అణువులు కలిసినపుడు ఒక్కొక్క ఉదజని అణువు కేంద్రకంలో ఉన్న ఒకే ఒక ప్రోటాన్ (ధనావేశ పూరితమైన కణము) మరొక ఉదజని అణువులోని ప్రోటాన్ తో కలసి అణుప్రతిక్రియ (Nuclear Reaction) వల్ల హీలియం పరమాణు కేంద్రకంగా మారుతుంది. ఈ మార్పులో అమితమైన శక్తి విడుదల అవుతుంది. ఆ పరమాణు చర్యలు నిరంతరం కొన్ని బిలియన్ బిలయన్ల సంఖ్యలో జరగటం వల్ల అనూహ్యమైన శక్తి ప్రతి క్షణం కాంతి రూపంలో వెలువడుతుంది. నిర్దిష్టంగా చెప్పాలంటే, సూర్యునిలో ఒక్క సెకండులో 620 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉదజని అణువుల కలయిక వల్ల అనూహ్యమైన శక్తి వెలువడుతుంది. ఈ శక్తినే మనం భూమి పై నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో మండే గోళంగా కనపడే సూర్యునిలా చూస్తాం! నిజానికి భూమికి అతి దగ్గరగా ఉన్నా నక్షత్రమే సూర్యుడు!

మన సౌర మండలంలో జరిగే ప్రతి మార్పుకు కారణభూతుడు సూర్యుడే. గ్రహాల గమనమైనా, వాటి ఉపగ్రహాల గమనమైనా, గ్రహాల చుట్టూ ఉండే వాతావరణం, అందులోని మార్పులూ, గ్రహణాలూ – వీటన్నిటికీ మూల కారణం సూర్యుడు. భూమి పైన జనించే సకల సృష్టికి కారణం సూర్యుడు. ఈ సృష్టిలో చేతనాచేతనమైన జీవాలకి ప్రత్యక్ష సాక్షి – సృష్టికర్త సూర్యభగవానుడు. పైన ఉదాహరించిన సూర్యస్తుతిలో ఈ విషయాలే చెప్పబడ్డాయి.

సూర్యునిలో మచ్చలు

సూర్యుని మన కళ్ళతో ఎటువంటి పరికరాల సహాయం లేకుండా ఎక్కువసేపు చూడటం కష్టం. పైగా, అలా చూడటం మన కళ్ళకి మంచిది కాదు. కానీ, కొన్ని ప్రత్యేక పరికరాల సహాయంతో సూర్యుని గమనిస్తే, సూర్యగోళం ఉపరితలంపై నల్లని మచ్చలు కనపడతాయి!


సూర్యునిలో మచ్చలు

సూర్యుని ఉపరితలం పై అనుక్షణం చిత్రాతి చిత్రంగా విద్యుదావేశ కణాల మధ్య జరిగే చర్యల వల్ల సూర్యుని ఉపరితలం అంతా ఒక ప్లాస్మా (Plasma) గా మారుతుంది. ప్లాస్మా అంటే,అటు ఘన, ద్రవ, వాయు రూపాలకి భిన్నంగా ఉండే పదార్ధ స్వరూపం అన్న మాట. ఈ విద్యుదావేశ కణాల వల్ల వచ్చే అయస్కాంత శక్తి సూర్యుని ఉపరితలంలో కొన్ని ప్రాంతాల్లో ఉధృతంగా ఉండి ఆ ప్రాంతాల్లో ఉదజని అణువుల మధ్య జరిగే అణుప్రక్రియల తీవ్రత తగ్గుతుంది. దీన్నే శాస్త్రజ్ఞులు సూర్యునిలో మచ్చలుగా చూస్తారు.

ఈ మచ్చలు పరిమాణంలో భూమి కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయి. భూమికి ఉత్తర, దక్షిణ ధృవాలు ఉన్నట్టుగానే, సూర్యునికి కూడా ఉత్తర – దక్షిణ ధృవాలు ఉంటాయి. అయితే, సూర్యునిలో జరిగే అనేక చర్యల కారణాల వల్ల ఈ ధృవాలు మార్పిడికి లోనవుతాయి. అంటే, ఉత్తర ధృవం దక్షిణ ధృవం అవుతుంది. అప్పుడు దక్షిణ ధృవం, ఉత్తర ధృవంగా మార్పు చెందుతుంది. సూర్యునిలో అయ్యే చర్యల కారణంగా సూర్యుడు ప్రతి 11 సంవత్సరాలకు ఒక గరిష్ఠ స్థాయికి చేరుకుంటాడు. ఈ సమయంలో సౌర మండలంలోకి ఎక్కువగా విద్యుదావేశకణాలు విసిరివేయబడే అవకాశం ఉంటుంది. అలాగే, సూర్యుడు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు సూర్యునిలోని మచ్చలు కుడా ఎక్కువగా కనపడతాయి. ఎక్కడ సూర్యుని ఉపరితలంలో అయస్కాంత క్షేత్రాల ప్రభావం ఎక్కువ ఉంటుందో అక్కడ ‘సూర్యుని మచ్చలు’ ఎక్కువగా కనపడతాయి.

సూర్యుని ఉపరితలం

సూర్యునిలో ప్రతి క్షణం కొన్ని బిలియన్ ఉదజని అణువులు అణుప్రతిక్రియలో పాల్గొంటూ ఉంటే, సూర్య గోళం ఎందుకు బద్దలవ్వదు? ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది. నిజమే! ఇటువంటి పరిస్థితుల్లో సూర్య గోళం విస్ఫోటనం కావాల్సిందే! ఇలా కాకుండా ఉండటానికి సూర్యగోళంలో జరిగే రెండు చర్యలు ఇందుకు కారణం. ఒక చర్యకి వ్యతిరేకంగా జరిగే రెండో చర్యవల్ల ఏర్పడే సమతుల్యత (Equilibrium) వల్ల సూర్యగోళం బద్దలు కాకుండా నిలుస్తోంది. సూర్యగోళంలో జరిగే అణుప్రతిక్రియలు ఒక పక్క సూర్యుని ముక్కలు చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటే, సూర్యులో ఉన్న బ్రహ్మాండమైన ద్రవ్యరాశి (సూర్యుని బరువు కిలోగ్రాముల్లో చెప్పాలంటే రెండు పక్కన ముప్ఫై సున్నాలు ఉంచితే వచ్చే సంఖ్య అంత బరువు) గురుత్వాకర్షణ వల్ల బంధింపబడి ఒక్కటిలా ఉండటానికి పయత్నిస్తుంది. ఈ రెండు చర్యలు పరస్పరం విరుద్ధంగాను, వ్యతిరేక దిశలో పని చేయటం వల్ల సూర్యుడు స్థిరంగా నిలిచి ఉన్నాడు.

ఇది గత 4.6 బిలియన్ సంవత్సరాలుగా మన సౌరకుటుంబంలో జరుగుతున్న అతి చిత్రమైన సంతులన సన్నివేశం (Balancing Act)!

సౌరభౌతిక శాస్త్రం – భవిష్యత్తు

గత మూడు దశాబ్దాలుగా భౌతిక శాస్త్రంలో సూర్యుని గురించిన అంశాలపై పరిశోధనల ఫలితంగా సౌరభౌతిక శాస్త్రం ఒక ప్రత్యేకత సంతరించుకొంది. విశాలవిశ్వంలోని గ్రహాలను, సూర్యుడిని, నక్షత్రాలను అర్ధం చేసుకోటమే కాక, రేడియో ఆస్ట్రానమీ (Radio Astronomy) సాధించిన ప్రగతి వల్ల తదితర ఖగోళ పరిశోధనలు సులభం అయ్యాయి. ఇప్పుడు లభ్యం అవుతునన్న సాంకేతిక పరికరాలు, కంప్యూటర్‌ల ద్వారా లభ్యమవుతున్న అనేక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంల వల్ల, అంతరిక్షానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఎక్కువైంది. ఉదాహరణకి, సూర్యుని నుంచి వెలువడే Coronal Mass Ejection దాదాపు గంటకి మూడు మినియన్ మైళ్ళ వేగంతో సూర్యుని వదలి సౌరమండలంలో ప్రయాణిస్తుంది. దీన్ని ‘సోలార్ సునామీ’గా పేర్కొంటారు శాస్త్రజ్ఞులు. ఈ సునామీ సూర్యుని నించి భూమిని చేరటానికి దాదాపు 24 గంటలు పడుతుంది. ప్రతి నిత్యం సూర్యుని పై జరిగే చర్యలు శాస్త్రజ్ఞులు గమనిస్తూ ఉంటారు. రాబోవు కాలాల్లో, సూర్యుని వల్ల భూమిపై జరిగే మార్పులను ముందే పసిగట్టే అవకాశం ఇందువల్ల వీలవుతుంది.

పొంచి ఉన్న పెనుప్రమాదం

ఈ వ్యాసం మొదట్లో ఉదాహహరించిన 1859 సంవత్సరపు సంఘటన ఇప్పుడు మళ్ళీ జరిగితే! ఫలితాలు ఊహకు అందటం కూడా కష్టమే! 1859 సంవత్సర ప్రాంతాల్లో విద్యుత్‌శక్తి వాడకం లేదు. అప్పుడు వాడబడుతున్న టెలిగ్రాఫ్ స్తంభాలు కాలిపోయాయన్నది నిజం. మరి ఇప్పుడో? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్‌శక్తి వాడకం చాలా ఎక్కువ. ఒకవేళ మళ్ళీ ఒక పెనుసౌరతుఫాను వచ్చినట్లయితే మొత్తం ప్రపంచం అంతటా సరఫరా చేసే విద్యుత్‌ జాలం (Power Grid) పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని శాస్రజ్ఞుల అంచనా! ఈ విధ్వంసం ఎంత ఉధృతంగా ఉంటుందంటే, కొన్ని సంవత్సరాల దాకా ప్రపంచంలో విద్యుత్ సరఫరా ఆగిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇళ్ళల్లో కరెంటు ఉండదు, ఫోన్లు పని చేయవు. కంపూటర్లు, ఇంటర్నెట్ల వాడకం గోవిందా! చలిదేశాల్లో ఇళ్ళను వేడిగా ఉంచటం కోసం పాత పద్ధతిలో కట్టెలు కాల్చటం మళ్ళీ వాడుకలోకి వస్తుంది. విమానాల రాకపోకలు బంద్! ఎందుకంటే, వాటిని క్రమబద్ధంగా నడపటానికి కావలసిన రాడార్ సర్వీసులు పని చేయవు. ఎలక్ట్రిక్ రైళ్ళు పని చేయవు!

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు అమలులో ఉన్న మానవ జనజీవనం స్థంభిస్తుంది. ఇంకేం ఫలితాలు ఇందువల్ల ఉంటాయో అంచనా వెయ్యటం కూడా కష్టమే! ఇంతటి ప్రళయాన్ని సృష్టించ గలిగిన సూర్యుని శక్తిని అంచనా వేయటం మన తరమా!

నమస్తే! నమస్తే! నమః!!

[ఈ వ్యాసంలోని బొమ్మలు ఇంటర్నెట్ నుంచి తీసుకోబడ్డాయి – ర.]