బురద

నీకు ద్రోహం చేసిన మిత్రుడే గుర్తొస్తాడు. పోయిన డబ్బు కాదు నిన్ను బాధ పెడుతూంది, వాడు చేసిన ద్రోహం.

ఇప్పటి స్నేహం కాదు మీది. ఎత్తుపల్లాలు చాలా కలిసే చూశారు. ఒకరినొకరు ఆదుకున్నారు, ఓదార్చుకున్నారు. దొంగతనంగా తాగిన మొదటి సిగరెట్, మొదటి బీర్, క్లాసు ఎగ్గొట్టి చూసిన మొదటి సినిమా; మీరు పంచుకున్నవి చాలానే ఉన్నాయి. యాక్సిడెంట్‌లో కాళ్ళు విరిగి హాస్పిటల్లో ఉన్నాడని వచ్చిన కబురు విన్ననాటి నుండీ నిన్ను కలత పెడుతూంది. కానీ వాడి ద్రోహం బయటపడ్డప్పటినుంచీ, నువ్వు వాణ్ణి నిలదీసి అడిగినప్పటినుంచీ మీ ఇద్దరి మధ్యా మాటల్లేవు. లేకుంటే ఈ పాటికి వాడి బెడ్ పక్కనే ఉండేవాడివి. అసలా వార్త తెలియగానే ‘అయ్యో’ అని ఒక వైపు అనిపించినా ‘అంతే కావాలి వాడు చేసిన అన్యాయానికి’ అనిపించింది నీకు.

నీ తప్పేమీ లేదు. నువ్వంత చెడ్డవాడివి కాదు. మళ్ళీ నీకు నువ్వు చెప్పుకుంటావు.

సాక్ష్యంగా చిన్నప్పుడు బడికెళుతూ జేబులో పది రూపాయలు రోడ్డుపక్క అడుక్కునే ముసలమ్మకు ఇచ్చిన దగ్గర నుంచీ మొన్న తిత్లీ తుఫానుకు ఇచ్చిన చందాల దాకా అన్నీ గుర్తు చేసుకుంటావు. నువు ఎన్నిసార్లు కొవ్వొత్తుల ప్రదర్శనకు వెళ్ళిందీ, ఎన్ని విజ్ఞాపన పత్రాలమీద సంతకాలు పెట్టిందీ, ఎన్నిసార్లు అన్యాయాలను ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్స్ పెట్టిందీ, ఇంకా ఎన్నిటికి లైక్స్ పెట్టిందీ లెక్కపెట్టుకుంటూ కొంచెం భరోసా పొందుతావు.

కానీ నీకు తెలుసు నువ్వంత ఉత్తముడివీ కాదని. దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడవు. మరీ చిన్న విషయాలు కొన్ని. మళ్ళీ మళ్ళీ జరిగేవే అయినప్పటికీ పట్టించుకోనక్కర్లేదనుకునేవే. అయినా ఆకల్లేదని చెప్పి అన్నం తినకుండా పడుకుని ఇప్పుడిట్లా నిద్రపట్టక చప్పుడు చేయకుండా బాల్కనీలో కూచుంటే అవే గుర్తొస్తున్నాయి నీకు.

నువ్వెంత మంచివాడివో చెడ్డవాడివో అంచనా చిక్కదు నీకు. ఒక కొలబద్ద పెట్టుకుంటావు. బాధా నష్టమూ కష్టమూ కలిగినప్పటికీ, లేదా కలక్కపోతేనే, లేదా ఆనందమూ లాభమూ కలిగితే మాత్రమేనో, బాధించడం నుంచి, ఆనందమూ లాభమూ కలిగేతేనో, లేదా నష్టమూ కష్టమూ లేకుంటేనేనో, లేదా కలిగినప్పటికిన్నూ సాయం చేయడం దాకా ఉన్న వరసలో అటునుంచి ఇటుదాకా సాగుతూ ఉంటావు.

కొన్ని మొహాలు నీ కళ్ళముందు కదులుతుంటాయి బిగుసుకునీ, ముడుచుకునీ, మాడ్చుకునీ, ఏడుపు మింగుకుంటూనూ, ఆపుకోలేకానూ. ప్రశ్నలు అడుగుతూనూ, అడక్కుండానూ. నువు తిట్టినవీ, ఎగతాళి చేసినవీ, చిన్నబుచ్చినవీ, అవమానించినవీ. నీకేమీ ఒరగనప్పటికీ ఉత్తి పుణ్యానికి. నీ కోపాన్ని తక్షణం తీర్చుకోడానికి.

నీ మీద కాఫీ తొణికించిన వెయిటరూ, క్యూలో నిన్ను తోసుకుంటూ ముందుకెళ్ళినవాడూ, షాప్‌లో కౌంటర్లో అమ్మాయీ, నీ కార్ వెనక అడ్డంగా పెట్టిన స్కూటర్ వాడూ.

“మీరు కూడానా సార్!”

ఆ బాధా, అపనమ్మకమూ నీకు తెలుస్తూనే ఉంటాయి. ‘ఊరికే జోక్ గా…’ అనేసి తప్పించుకోలేవు. అతని చూపునుంచి సరే, నీనుంచి నువ్వు. నీకు తెలియకనా అతని లావూ, నలుపులపై ఎగతాళి మాటలు రెండు అని అందరినీ నవ్వించగలవుగానీ అది అతనికి జోక్ కాదని! అతడు వింటాడనుకోలేదు నువ్వు. తోటి ఉద్యోగుల ఆమోదం పొందడానికి, ఆ గుంపులో ఒకడిగా ఒదిగిపోవడానికీ తేలిగ్గా రెండు మాటలు. గొంతెత్తలేని అతన్నుంచి ఏ ప్రమాదమూ లేదని నీకు గట్టిగా తెలిసే. లేక అదంతా ఆలోచించకుండానే సహజంగానే. అదే నీ నైజం కనుక.

బయటివాళ్ళ సంగతి వదిలేయి. గొలుసు పోగొట్టుకుందని పాపను తిట్టిపోశావు. పోగొట్టుకున్న బాధ తనకేమీ లేనట్టు. తన సంతోషం కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టగలిగిన నువ్వే. ‘మా డాడీ నన్నెప్పుడూ కొట్టలేదు’ అని గొప్పగా చెప్పుకునే పాపనే. కానీ నీకు తెలుసు నువ్వేం చేస్తావో. ఎలా పోగొట్టుకున్నదాన్నో, పగలగొట్టినదాన్నో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఎట్లా సాధిస్తావో.

అలవాటుగానే అందుకు ఆమెనీ బాధ్యురాల్ని చేశావు. కించపరిచే మాటలు ఒకటి రెండు. తిట్టడానికి అవకాశం కోసం వేచి ఉన్నట్టు. ఆ తప్పుపట్టడాలూ, తిట్టడాలూ, నష్టాన్ని ఏ మాత్రమూ పూడ్చవని తెలిసీ. నీ ఇష్టానికి విరుద్ధంగానో, నీకు చెప్పకుండానో ఏం చేసినా వంకలు పెట్టడమూ. ఆమె ఏడుపు మొహంకంటే నవ్వు మొహమే నీకు ఇష్టమనీ, నిన్ను ఆనందపరుస్తుందనీ తెలిసికూడా. కసురుకునీ, విసుక్కునీ, మనసు గాయపడేలా అన్ని మాటలూ అనేసి, కోపమంతా తీర్చుకుని, మరునాటి ఉదయం ఒక ‘సినిమాకి వెళ్దామా సాయంత్రం?’ లాంటి పేలవమైన క్షమాపణతో బయటపడతావు.

నువ్వనుకోవడమే కానీ నీ తోటివాళ్ళకంటే నువ్వేమీ వేరు కాదు. ఏవో కాసిని పుస్తకాలు చదవడమూ, తార్కికంగా నలుగురితో మాట్లాడగలగడమూ వల్ల పెద్ద తేడా ఏం పడదు. వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నువ్వూ దూరతావు. ‘వాడికి బాగా బలిసింది’, ‘దాని ఏసాలు చూశారా ఇవాళ?’, ‘వాళ్ళు మొన్న సినిమా హాలు దగ్గర…’ వంటి మాటలు ముచ్చటగా వింటావు. ఎదురుగా ఉన్నప్పుడు ‘మీరొస్తేనే ఆఫీస్‌లో సందడి మేడమ్!’, ‘మీ స్టయిలే వేరు బాస్!’ అంటూ మిగతా వాళ్ళలాగే మర్యాదగా నువ్వూ.

ఆ విన్నవి కడుపులోనూ పెట్టుకోవు. ఇంకే గుంపులో కూచున్నప్పుడో కక్కేస్తావు. అనుకోకుండానే అని అనుకుంటావు కనీసం దాని వెనక దురుద్దేశమేదీ లేదనీ. ఆ మాటలు ఎటు ఎటు తిరిగో ఎవరినో గాయపరుస్తాయని నీ సౌకర్యార్థం గమనించవు.

అసలు అది నీ కడుపుమంట అని తెలిసినా కప్పిపుచ్చుకుంటావు. ‘వాడికంత సీన్ లేదు! ఆ మొహానికి మారుతీ సెకండ్ హాండే ఎక్కువ. పెళ్ళాం తరపునుంచి కలిసిరాబట్టి కానీ…’ ఎవరో చెపుతుంటే నిజమేనంటూ తలూపుతావు. ‘పేరుకే కానీ అది అసలు చెత్త మోడల్. మా కజిన్ ఒకడు ఇదే మోడల్ కొన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక ట్రబులే!’ అంటూ వంతపాడతావు.

నీ ఓర్వలేనితనం నీకు తెలుస్తూనే ఉంటుంది. నీ స్నేహితుడి తమ్ముడు నీకంటే పెద్ద అపార్ట్‌మెంట్ కొన్నప్పుడో, ఎంట్రన్స్‌లో నీ కొడుక్కంటే నీ ఎదురింటి వాళ్ళ అమ్మాయికి మంచి రాంక్ వచ్చినప్పుడో, అసలక్కడిదాకా ఎందుకు, నువు కొన్న టీవీనే పక్కింటివాడికి పదివేలు చవగ్గా వచ్చిందని తెలిసినప్పుడో కుళ్ళుకోలేదూ? కొత్త కారు కొని గొప్పగా చూపించిన వాడి కారుకు సొట్టపడితే పైకి ‘అరెరె! అయ్యో!’ అంటూనే లోపల ‘తిక్క కుదిరింది వెధవకి’ అని పొంగిపోలేదా! ఇప్పుడు తలుచుకుంటే నీకు చిన్నతనమనిపించినా, రోత కలిగించినా అదీ నువ్వు.

అవి నీ చేతిలో లేవనుకో. నీకు తెలియకుండానే అనాలోచితంగా జరిగే ప్రతీకార చర్యలే అనుకో. ఒక మంచి పని చేయడానికి మాత్రం నీకు చేతులు వచ్చేనా?

రోడ్డుపక్క దుమ్ములో స్పృహలేకుండా పడి ఉన్నతన్ని ఇంకా మర్చిపోలేవు నువ్వు. తాగి పడిపోయాడో, మరేదయినా అనారోగ్యమో – ఏదయినా నువు సాయం చేయగల స్థితిలోనే ఉండీ మొహం తిప్పుకు వచ్చేశావు. అతడి గతి ఏమయిందో అని నీకు ఒకపక్క పీకుతూ ఉంటుంది ఇంకా. ఆలస్యమయ్యుండేదనీ, కొన్న సినిమా టికెట్స్ వేస్టయ్యేవనీ కవరింగ్ ఇచ్చుకుంటావు. నిన్ను నువ్వు ఇంకా నమ్ముతున్నావా?

ఎవరో అవసరానికి అప్పడిగితే అంతకుముందు నీకేదో పని చేసిపెట్టలేదని దగ్గర డబ్బులుండీ లేవని అబద్ధం సులువుగా చెప్పేస్తావు. ఎవడు ఎప్పుడు నీ మీద నీకు నచ్చని జోకు వేసేడో, ఎప్పుడు నీకు సాయం చేయలేదో అన్నీ లెక్కలు పెట్టుకుంటావు పైకి ‘హి హి హి’ మొహం పెట్టుకుని, ‘పర్లేదు, మీకు కుదరకపోతే ఏం చేస్తారు?’ అంటూ. నిన్ను కాకుండా ఇంకెవరినో సలహా అడిగారనో, నీకంటే ఇంకెవరికో ఎక్కువ మర్యాద చూపారనో, ఇంకా అలాటి అల్పమైన విషయాలన్నీ బాగా గుర్తుంచుకుంటావు. బదులు తీర్చుకునే అదనుకోసం ఎదురుచూస్తుంటావు. కనీసం అలిగి పలక్కుండా నీ కోపం చూపిస్తావు.

నీ అల్పత్వం నీకు తెలుసు. ఇలాంటప్పుడయినా అనుకుంటావు అలా అనుకుని ఉండవలసింది కాదు, అలా అని ఉండవలసింది కాదు, అలా చేసి ఉండవలసింది కాదు అని. లేదా అలా అని ఉండవలసింది, అలా చేసి ఉండవలసింది అని.

నీ సమర్థనలూ నీకు ఉంటాయి. అవసరానికి మళ్ళీ మళ్ళీ వాడుకుంటారు, తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియనివాళ్ళు. సాయం పొందాక కృతజ్ఞత చూపడం అటుంచి తెలియనట్టు మొహం తిప్పుకుంటారు. మనసు చివుక్కుమనీ, ఎక్కడో మండీ. ఎప్పుడూ అవతలివాళ్ళ దృక్కోణంలోనే ఆలోచిస్తే ఎలా? నిన్ను నువు రక్షించుకోవాలి. నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి. నువు నీకోసం, నీ న్యాయమైన వంతు కోసం పోరాడాలి కదా! ఏదయినా చెడ్డపని చేసి ఉంటే, లేదా మంచిపని చేయకుంటే జవాబుదారీ నువ్వు కాదు. నీకు తగిలిన ఎదురుదెబ్బలు. నువు గాయపడినప్పటికీ ఏం కాలేదన్నట్టు నవ్వుతూ పలకరిస్తే మళ్ళీ గాయపరుస్తూనే ఉంటారు. ఎప్పటికయినా నీకు విసుగొచ్చి నువ్వూ వాళ్ళలాంటి మామూలు మనిషివేనని రుజువు చేసుకున్నదాకా. అసలీ మంచివాడిగా ఉండడంపట్ల ఈ అబ్సెషన్ ఏమిటో నీకర్థం కాదు.

కుడుతుందని తెలిసినా తేలును రక్షించాలనే ప్రయత్నిస్తుంటాడు సాధువు. ఎదుటి వ్యక్తినిబట్టి నీ వ్యక్తిత్వం మారితే నీదేం గొప్ప? వాళ్ళకూ నీకూ తేడా ఏముంది? నువు నీకు ఇష్టం లేని విధంగా ఎందుకు మారడం? నీ దుష్టత్వానికి కారణం ఎదుటివాళ్ళే అయితే నీ మంచితనానికీ వాళ్ళే కారణం కదా!

కానీ నువు మంచివాడివనే అనుకుంటావు. కనీసం కావాలని. నిన్నటికంటే మెరుగయిన వ్యక్తిగా నిలవాలని. నువ్వంటే నీకింకా గౌరవం ఉంది. కొంచెం ఉన్నతంగా, కాస్త ఉదాత్తంగా బతకాలని నీకు నువ్వు గుర్తుచేసుకుంటూనే ఉంటావు. సంఘం కోసమో, ధర్మం కోసమో, న్యాయమనో కాదు. ఇది నీకోసం. నీకు నువ్వు చేసుకునే మేలు. నీకు నువ్వు రుణపడి ఉన్నావు. కనీసం ఈ మాత్రమయినా.

అవకాశం వస్తూనే ఉంటుంది నీకు నువ్వు నిరూపించుకోవడానికి. అయినా నువ్వందుకోవు. లేదా భంగపడుతూనే ఉంటావు. ఇప్పుడు ఇంకో అవకాశం. వాడిని క్షమించగలవా? ఒక రాత్రి నిద్ర పట్టకపోవడమూ, ఒక పూట తినకపోవడమూ, నువ్వెంత దుర్మార్గుడివో లేక సన్మార్గుడివో చింతిస్తూ కూచోవడమూ మాత్రమే ఏ మార్పూ తేదు నీలోనూ, నీకూ.

ముందు నీకు నువు తేల్చుకోవాలి. నువ్వు ఏ నువ్వు? నీకు అనువుగా, నీ మనసుకి కుదురుగా ఎప్పుడుంటుంది?

వాడేమీ బద్ధశత్రువు కాదు. ఈ మోసం తప్ప ఏనాడూ నీకు కీడు తలపెట్టలేదు. ఏదో అవసరానికో, ప్రలోభానికో లొంగిపోయాడు. వాడూ మానవమాత్రుడే. ప్రతివాడూ గాయపడతాడు, గాయపరుస్తాడు. దీనికే వాణ్ని అసహ్యించుకోనక్కర్లేదు. అసలు వాడే ‘ఇది నేనే ఉంచుకుంటాన్రా!’ అని ఉంటే ‘పర్లేదు ఉంచుకో’ అని ఉండేవాడివేమో! ఏమో నీ మీద మరీ అంత నమ్మకం పెట్టుకోకూడదని నీకు తెలియకపోదు.

తర్వాత అయినా వాడు తప్పు ఒప్పేసుకుని ఉంటే సరిపోయేది. అహం అడ్డొచ్చింది, బుకాయించబోయాడు. నువ్వు మాత్రం ఏం మెరుగని? వాడు తప్పించుకునేందుకు వీలుగా దారి లేకుండా కార్నర్ చేశావు.

కానీ నువు హాస్పిటల్‌దాకా వెళ్ళి తిరిగొచ్చేశావు పోయిన రెండు రోజులూ. నీవల్ల కాలేదు.

వాడికోసం కాదు. నీకోసమయినా వాడిని క్షమించాలి. క్షమించినట్టు వాడికి తెలియకుండా. ఇంకొంచెం ఉన్నతంగా, ఇంకాస్త ఉదాత్తంగా.


ఆ రోజు నిజంగానే వెళ్ళావు. వాడి కళ్ళలో సంతోషం వాడి మొహంలో ఇబ్బందిని వెంటనే చెరిపేసింది. యాక్సిడెంట్ వివరాలూ, ట్రీట్‌మెంట్ ప్లానూ ఆసక్తిగానే వింటావు.

వాళ్ళావిడ అంటుంది “మీ ఇంటికే వస్తున్నాడు డబ్బు ఇచ్చి వద్దామని. మధ్యలోనే ఈ యాక్సిడెంట్…” అది నిజమో కాదో నీకు తెలియదు. అసలు యాక్సిడెంట్‌కి ఒకరకంగా నువ్వే కారణమంటూందేమో కూడా.

“భలేవాడివిరా! పర్వాలేదు, డబ్బుల్దేముంది! ఇదంతా నయంచేయించుకుని బయటపడు ముందు.” అంటావు. ఇంకా చెప్పాలనుకుంటావు ‘నిన్ను చూసినప్పుడు నవ్వుతూ పలకరిస్తాను. చిన్న చిన్న సాయాలు కూడా చేయొచ్చు. అప్పుడప్పుడూ ఇదంతా మర్చిపోయినట్టు నటించగలనేమో కూడా. అయితే మన స్నేహం ఇక ఎప్పటికీ మునుపట్లా ఉండకపోవొచ్చు.’ కానీ అది ఇప్పుడు కాదు.

నీకు నువ్వు తెలియదు. తెలుసుకూడానేమో. నువ్వంత చెడ్డవాడివి కాకపోయినా ఉత్తముడివీ కాదు. నీనుంచి నువు తప్పించుకోలేవు, నీకు విమోచన లేదు. ఈ బురద నుంచి బయటపడలేవు. ఆ బిచ్చగత్తెకు ఇచ్చింది రూపాయేనని గుర్తుపెట్టుకోవు. చందాలు మొహామాటానికే ఇచ్చావనీ మనసులో పెట్టుకోవు. మొక్కుబడికీ, ప్రదర్శనకీ తప్పించి నీ వల్ల ఏ కాజ్‌కీ ఇసుమంత ప్రయోజనం కలగదనీ గమనించవు. ఆ మురికినీళ్ళతోటే రోజూ రాత్రిపూట కూచుని కడుక్కుంటూ ఉంటావు.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...