పొద్దు పోయింది

పొద్దు కాస్తా పడమటింటికి జారుకుంది
పడవలన్నీ రేవుకు చేరుకున్నాయి
పిట్టలన్నీ చెట్లలో దూరిపోయాయి

చుక్కలన్నీ ఒక్కటొక్కటే పొడుస్తుంటవి
నల్ల ముసుగు నింగిని తూట్లు తూట్లు
దొంగచాటుగా పంటకాలవ పారిపోతుంటుంది
పైరగాలి ఊరిమీదికి పయనమవుతుంది
గాలివాటుగా ఏవో పాటలు చెవినపడతాయి
గుడ్డివెలుగులో గడ్డిపూలల్లే మిణుగురులు పూస్తాయి

మసకచీకటి మాపటేలకి
గూడు చేరే గుబులు రేపుతుంది
అమ్మ కడుపులో తిరిగి చేరి పదిలమయ్యే
లోని తలపు తెలియని తపన పెడుతుంది
చుట్టూ పరుచుకున్న చీకటి చిక్కబడుతుంది
ఎక్కడో ఎదురు చూచే గుండె ఒకటి చిక్కబడుతుంది

సద్దు మణిగిన చేల గట్ల వెంబడి
వొంపు తిరిగిన డొంక వెంబడి
వడిగా పద
ఒడలంతా బడలికతో
కడగా మిగిలింది నువే
వడి వడిగా పద
ఒంటరి దారులఓ తొందరగా పద!


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...