ఓ రికామీ వారాంతం, ఆదివారం ప్రత్యేక సంచికలు చదివి, షరామాములుగా బాలేని కవిత్వపేజీని పక్కన పడేసి, గరికపాటి పవన్ ‘ఆ సాయంత్రం’ కవితా సంకలనం తిరగేశాను. చిక్కని కవిత్వంతో, శిల్పవైవిధ్యంతో ఈ చిన్న సంకలనం ఇట్టే మనసును ఆకట్టుకుంటుంది.
పవన్ కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు రెండు. క్లుప్తత, నిశ్శబ్దం. కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ “భావ ప్రకటనకి పనికిరాని ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు.”. ఆ లక్షణాన్ని పవన్ బహు చక్కగా పుణికిపుచ్చుకున్నారు. పుస్తకం మొత్తంలో ఒక్క కవితలోనైనా అనవసర వర్ణనలు, వివరణలు కనిపించవు. సాహిత్యపేజీల్లో దీర్ఘ నినాద కవితలకూ, కవిత్వ వేషధారణలో వచ్చిన కథలు/వ్యాసాలకు అలవాటు పడ్డ ప్రాణానికి ఈ కవిత్వంలో క్లుప్తత ఎంత హాయిని కలిగిస్తుందో చదివి తెలుసుకోవలసిందే. ఉదాహరణకు కలవరింత అన్న ఈ కవితలో సూత్రానికున్నంత క్లుప్తత సాధించారు.
ముఖాన రంగు,
వికారంగా నవ్వు,
ఉరితాళ్ళతో
ఊరేగుతాం
ఇంటికొచ్చి
రాత్రెపుడో
నిద్రలో నిజాన్ని
కలవరిస్తాం ( కలవరింత )
ఇస్మాయిల్ గారు ‘కవిత్వంలో నిశ్శబ్దం‘ అన్న వ్యాసంలో చెప్పినట్టు, “జటిలమైన అనుభూతి సామాన్య భాషకు అందదు. దాని పరిధి కావలి నిశ్శబ్ద, అనుభవిక ప్రపంచంలోనిది. ఈ అనిర్వచనీయాన్నీ, నిశ్శబ్దాన్నీ కావ్యంలోకి ప్రవేశపెట్టాలంటే కిటికీలూ, గుమ్మాలూ అవసరం. ఇవే పదచిత్రాలు.” పవన్ కవిత్వమంతా ఇలాంటి పదచిత్రాలతో ఆవిష్కరించిన అనుభూతులమయం. ఉదాహరణకు,
మల్లెపూల మాటలు
పారే సెలయేరులు
వెంట వెంట తిరుగాడే
సీతాకోకచిలుకలు (పిల్లలం)
ఎర్రబడిన బుగ్గలతో
అందమైన ఆకాశం నవ్వు (ఆ సాయంత్రం)
తెల్లగన్నేరు చెట్టు
విరగబూసి నవ్వుతున్నట్లుండే ఆకాశం (అమావాస్య)
ప్రియురాలు తలస్నానం చేసి
జడలు విరబోసుకున్నట్ట్లు
నవ్వుతూ రోడ్డు. (రోడ్డు)
“అనుభవం సమిష్టి కావచ్చు. అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. ఒకరి అనుభూతి మరొకరి అనుభూతిలా ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం.” కవితకైనా అంతే. ఒకే కవిత వేర్వేరు పాఠకులకు వేర్వేరు అనుభూతి కలిగించవచ్చు. కవి నేర్పంతా, ఒక అనుభూతికి కట్టడి చేయకుండా పాఠకుడికి ఆ స్వేచ్ఛను వదిలివేయడంలో ఉంది. గణిత సిద్ధాంతానికి మల్లే ముగింపులో కవి అభిప్రాయాన్ని మరో మారు ఉటంకించడం, భీకరమైన విశేషణాలతో ఉద్వేగాలు ప్రదర్శించి పాఠకుడికి పాఠాలు బోధించడం మన కవుల్లో నిత్యకృత్యం. పవన్ వీటికి మినహాయింపు. ఒక చిత్రకారుడికి మల్లే కేవలం తను ఎంచుకున్న వస్తువుకు మాత్రమే పనికివచ్చే కనీస వివరాలతో ఒక వర్ణచిత్రాన్ని పాఠకుడి మనసులో చిత్రీకరిస్తాడు. అది బీభత్సమే కావొచ్చు (ప్రమాదం, తుపాన్ రాత్రి), సౌందర్యాత్మకం కావొచ్చు ( లాల్సా), సూటిగా ప్రశ్నించే పదునైన చిత్రమే కావచ్చు (ట్రాఫిక్ జాం, ఒక్కక్షణం).
ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకంలో అంతగా నప్పనిదీ, ఒక్కసారి వచ్చిపోరా అనే కవిత. ఉద్యమంలో పడి కనిపించని కొడుకు కోసం తల్లి పడుతున్న బాధను చిత్రీకరించడంలో ఎంతో నిజాయితీ ఉన్నా, యాసలు కొంచెం కలగలిసి పోయి మిగిలిన కవితల స్థాయికి తూగలేదు.
ముగించే ముందు మరో కవిత.
నూనె ఉన్నంత వరకూ
ఉజ్జ్వలంగా వెలిగి
ఆరిపోతాయి
దీపాలు.
నిప్పంటని దీపాలు
చీకటికి
అలవాటుపడిపోతాయి. (దీపాలు)
సాహిత్యపేజీల్లో వాదనలతో నిండిన అకవిత్వపు చీకటికి అలవాటు పడిపోయి ఉన్నాం పాఠకులం. ఇలాంటి చక్కని సంకలనాల దీపాలు మరిన్ని వెలిగించేందుకు కవిలో తైలమెప్పటికీ తరగదనే ఆశిద్దాం.
అమెరికాలో పుస్తకం కావలసిన వారు thammineni at lycos.com కు మెయిలు ఇవ్వండి. ఇండియా లో పుస్తకాలు దొరుకు చోటు నవోదయ ,విశాలాంధ్ర .