మళ్ళీ అదే సంచిక

మన ప్రేమ
మనం కళ్ళతో చెప్పుకున్న కబురు
అది
వేటగాళ్ళ కళ్ళల్లో పడకుండా
గూటిని కప్పుకున్న గుబురు…

మన ప్రేమ
పరిచయం పెరిగినా
పలకరించుకోవడానికి తడబడిన సనాతని
అది
తపస్సు చేయడమేగానీ
వరాలు కోరని మౌని…

మన ప్రేమ
మన ఊపిరులు కలబోసి
ఊదుకున్న పిల్లన గ్రోవి
అది
వ్రజ గోధూళిలో
సరళీ స్వరాల తావి…

మన ప్రేమ
అచ్చులూ హల్లులూ లేని మాట
అది
మునిపంటితో
పెదవుల మీద రాసుకున్న పాట…

మన ప్రేమ
తెలుగు జనపదాల నానుడి
అది
ఏరువాకలో
పడమటి దిక్కున వరదగుడి…

మన ప్రేమ
మన కలల చుట్టూ
మనం అల్లుకున్న వల
అది
కొండగాలి
కౌగిలిలో కోన కిలకిల…

మన ప్రేమ
మనల్ని వెక్కిరించిన లోకంలో
మనల్ని అక్కున చేర్చుకున్న అమ్మ
అది
ప్రవాహం లో కొట్టుకు పోతున్న చీమకు
పావురం అందించిన రావి ఆకు రెమ్మ…

మన ప్రేమ
మనల్నిగిచ్చి గుచ్చి కవ్వించిన లోకంలో
మనల్నినవ్వించిన చాప్లిన్
అది
పోటెత్తిన సముద్రపొడ్డున
ఇసుకలో గుల్లలేరుకుంటున్న పికాసో…

మన ప్రేమ
మన కోసులను చిత్రిక పట్టి
మనకు కొత్త రూపురేఖల్ని ప్రసాదించిన లలిత కళ
అది
ఉలి తాకగానే ఉలిక్కిపడి లేచి
వలెవాటు వేసుకునే ఉపల…

మన ప్రేమ
నిరస్త నీరదాకాశం కింద
పరుచుకున్న మన దృక్పథాల మీద వాలిన వెన్నెల
అది
ఊహల సెలయేరు కవితల కావేరై
పరుగెడుతున్న అలల గలగల…

మన ప్రేమ
ప్రాచీ రశ్మిమంత వివస్వంతునికి
ప్రతీచీ సంధ్యా రాగవతి నివాళి
అది
వంశీ స్ఫురిత గమకాల వెంట
ఒయ్యారాల వాయులీన కుంతల వరాళి…

మన ప్రేమ
మన కొంగుముడి వేళ మోగిన విపంచిక
అది
ఎన్ని సంపుటులు వెలువరించినా
అట్ట మీది బొమ్మతో సహా
మళ్ళీ అదే సంచిక!