ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు

శ్రీకాంతశర్మగారు 1963 నాటి నుండి చాలా పాటలు కూడా రాశారు. వీటిలో కొన్ని సినిమా పాటలున్నాయి. కానీ ఎక్కువ భాగం రేడియో ద్వారా ప్రసారమయి నలుగురు చెవుల్లో పడ్డాయి. వాటిలో ఒక 85 పాటల్ని ఆయనే ఎంచుకుని 1986లో పొగడపూలు అన్న సంకలనంగా అచ్చు వేశారు. మరల 1999లో గతంలో సంకలన పరిచిన పాటలకు సినిమా పాటలు, మరికొన్ని ఇతర పాటలను కలిపి సుమారు ఒక 150 పాటలతో ఆలాపన అన్న పేరుతొ మరొక పుస్తకం తీసుకువచ్చారు.

అచ్చులో వచ్చిన పాటల వివరాలు ఇలా ఉంటే, 2002 ప్రాంతంలో శర్మగారికి ఆప్తమిత్రులు అయిన శ్రీ ఎస్. బి. శ్రీరామమూర్తి (రామం) గారు ఒక 18 పాటలను ఎన్నుకుని ఒక సి.డి.గా వెలువరించారు. తరువాత 2015లో శ్రీరంగం గోపాలరత్నంగారిపై జానకీబాలగారు రాసిన పుస్తకానికి అనుబంధంగా ఇచ్చిన సి.డి. లో గోపాలరత్నంగారు పాడిన శర్మగారి పాటలు ఒక ఏడు జతపరిచారు. ఆ సి.డి.లో నుండి రెండు పాటలు: కడలి పతాకల కెరటాలెత్తెను (శ్రీరంగం గోపాలరత్నం, N. C. V. జగన్నాథాచార్యులు; సంగీతం: M. S. శ్రీరామ్), తిరునాళ్ళకు తరాలొచ్చే కన్నెపిల్లలా (శ్రీరంగం గోపాలరత్నం; సంగీతం: ఏల్చూరి విజయరాఘవరావు) ఇక్కడ వినవచ్చు. ‘తిరునాళ్ళకు తరాలొచ్చే కన్నెపిల్లలా’ పాట చాలా ప్రఖ్యాతి గడించింది. ఈ పాట పుట్టుకపై రామంగారు చేసిన అరగంట డాక్యుమెంటరీ–ఒక పాట పుట్టింది–కూడా బాగా పేరు తెచ్చుకుంది.

2016లో శ్రీకాంతశర్మ లలితగీతాలు అన్న పేరుతొ ఒక 35 గీతాల పుస్తకం, దానికి జతగా 15 పాటలున్న ఒక సి.డి. వెలువడింది. ఈ సంకలనం నుండి, తేనెల తేటల మాటలతో అన్న బహు ప్రసిద్ధి గాంచిన దేశభక్తి గీతంతో పాటుగా (పాడింది: M. L. నరసింహం, బృందం; సంగీతం: M. S. శ్రీరామ్), పూవులపై గాలులతో (బి. వరహాలు; సంగీతం: N. C. V. జగన్నాథాచార్యులు), నింగి నేల ఏకమై (గానం, సంగీతం: ఓలేటి వెంకటేశ్వర్లు) అన్న పాటలు కూడా ఇక్కడ వినవచ్చు.

మిగిలిన అయిదు పాటలు సి.డి.ల పైన మార్కెట్లో లభ్యం కానివి. వియోగాల వానకారు (K. లక్ష్మీనరసమ్మ; సంగీతం: మల్లాది సూరిబాబు), పూలపల్లకీ దిగివచ్చే రెవ్వారే? (మల్లాది సూరిబాబు, పెమ్మరాజు సూర్యారావు; సంగీతం: ఓలేటి), ముద్దుల పాపకు తెలియునులే (బి. సుశీల, సుబ్బులక్ష్మి, బృందం; సంగీతం: M. S. శ్రీరామ్); ఏ రేవులో ఎక్కేవురా (B. రజనీకాంతరావు; సంగీతం: కలగా కృష్ణమోహన్, ‘మాట మౌనం’ రూపకం నుంచి).

[20-9-2019: లలితగీతాల వివరాలు జతచేయబడ్డాయి – సం.]

  1. ఏ రేవులోఎక్కేవురా

  2. ఇంత వింత వెలుగంత
  3. కడలి పతాకల కెరటాలెత్తెను
  4. ముద్దులపాపకు తెలియునులే
  5. నింగి నేల ఏకమై
  6. పూలపల్లకీ దిగివచ్చేదెవ్వారే
  7. పూవులపై గాలులతో
  8. తేనెల తేటల మాటలతో
  9. తిరునాళ్ళకు
  10. వియోగాల వానకారు