ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!


జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్
!


ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
(19 జూన్1928 – 11 ఆగస్ట్ 2012)<

శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై చిరంజీవులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, ద్రావిడ భాషాశాస్త్రవేత్త, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. భాషాశాస్త్రానికి ఎనలేని సేవ చేసిన ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. తమ విశేషమైన కృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు. ఎంతోమంది శిష్యులకు, ప్రశిష్యులకు, ఔత్సాహికులకు తమ జ్ఞ్ఞానాన్ని పంచి ఇచ్చిన వారు లేని లోటు పూడ్చలేనిది.

తమ వెలుగుతో ప్రపంచపు చీకట్లను పారద్రోలే దీపాలు కొడిగట్టటం, సహజమరణం అనివార్యమని తెలిసినా కూడా బాధించే విషయం. గత కొద్దికాలంగా, అతి తక్కువ వ్యవధిలో చనిపోయిన తెలుగు తేజోమూర్తులను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇది ఒక తరం అంతరిస్తున్న సమయమేమో అనే భావన రాకా మానదు. వారు వెళ్ళిపోగా ఏర్పడ్డ శూన్యం భయపెట్టకా మానదు. దీపాన్ని దీపంతో వెలిగించి దీపావళిగా మార్చినట్లు వారి మార్గదర్శకతను ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు అందించడం మన బాధ్యత, మనం ఆ జ్ఞానమూర్తులకు చూపగల గౌరవం. ఈ తరంలోనూ, రాబోయే తరాల్లోనూ వారు వెలిగించిన జ్ఞానదీపాలు కొడిగట్టకుండా కాపాడే సమర్థులు ఉన్నారనీ, ఉంటారనీ ఆశించడం ఒక పగటికల కాదనే మా బలమైన నమ్మకం.


ఈ సంచికలో కథలు, కవితలు, వ్యాసాలతో పాటుగా సంగీతపరిమళం వెదజల్లే డా. శ్రీపాద పినాకపాణి గారు నిండు నూరవ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంలో వారి గురించి పరిచయ వ్యాసం, ప్రత్యేకం. భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినం సందర్భంగా ఈమాట ప్రచురించిన ప్రత్యేక సంచిక ఈ సమయంలో మరొక్కసారి గుర్తు చేయడం సముచితం. విశ్వనాథ వేదాంత చర్చ ఆడియో మరొక విశేషాంశం….


ఈ సంచికలో: