కిటికీ

“కూర్చోండి మిస్టర్ నటెల్. మా పిన్ని ఇప్పుడే కిందికి వచ్చేస్తారు.” అందా పదిహేనేళ్ళ అమ్మాయి. ఆమె మాట తీరులో ఏదో వయసుకి మించిన గాంభీర్యం వుంది.

“అంత వరకూ మీరు నా కంపెనీ భరించక తప్పదు,” అంది తనే.

పదిహేనేళ్ళ అమ్మాయిని సంతోషపెట్టే కబుర్లు ఏం వుంటాయో ఫ్రాంటన్ తల బద్దలు కొట్టుకున్నా తట్టలేదు. నిజానికతడు ఇలా అపరిచితుల ఇళ్ళకు వెళ్ళి వారితో కాలం గడపడం తన నరాల వ్యాధికి ఉపశమనం ఎలా కలిగిస్తుందోనని అనుమానంతో వున్నాడు.

“అక్కడ ఎలా వుంటుందో నాకు బాగా తెలుసు,” అంది అతని అక్క, అతనీ మారుమూల పల్లెకి ప్రయాణం ఐనప్పుడు. “నువ్వక్కడ ఒక్కడివే ఇంట్లో ఈసురోమంటూ చుట్టు పక్కల ఎవరినీ పట్టించుకోకుండా గడిపేయాలనుకుంటున్నావు. దానితో నీ నరాల బలహీనత ఎక్కువయ్యే అవకాశం వుంది. అందుకే నేన్నీకు కొన్ని ఉత్తరాలిస్తాను, నీ గురించి చెప్పుతూ. ఆ ఉత్తరాలు పట్టుకెళ్ళి అక్కడ ఇరుగూ పొరుగుతో కాస్త పరిచయాలు చేసుకో. నాకు గుర్తున్నంత వరకూ అక్కడ చాలావరకు మంచి మనుషులే వున్నారు.”

ఇప్పుడీ మిసెస్ సేపుల్టన్ మంచివాళ్ళ కిందికొస్తారో లేదో అనుకున్నాడు, ఫ్రాంటన్.

“మీకీ వూళ్ళో ఎవరైనా పరిచయస్తులున్నారా?” మౌనం చాలనుకుని అడిగిందా అమ్మాయి.

“అబ్బే! ఒక్కళ్ళైనా తెలిస్తే ఒట్టు! ఇక్కడ నాలుగేళ్ళ కింద మా అక్కయ్య వుండేది. ఇప్పుడు నన్ను అందరిళ్ళకీ వెళ్ళి పరిచయం చేసుకోమంది,” జవాబిచ్చాడు ఫ్రాంటన్. అతనా మాట అంటున్నప్పుడు అంత సంతోషంగా అనిపించలేదు.

“అయితే మీకు మా పిన్ని గురించేమీ తెలియదన్నమాట!”

“ఆవిడ పేరూ, చిరునామా మాత్రం తెలుసు,” ఒప్పుకున్నాడు ఫ్రాంటన్.

ఇంతకీ ఇప్పుడీ మిసెస్ సేపుల్టన్ భర్తగారు జీవించి వున్నట్టా లేదా, అంతుపట్టలేదతనికి. ఆ గది వాలకం చూస్తే ఇంట్లో మగవాళ్ళున్నట్టే అనిపిస్తుంది మరి.

“ఆవిడ మూడేళ్ళ కింద ఒక విషాదాన్నెదుర్కొన్నారు, బహుశా అప్పటికి మీ అక్కయ్యగారీ ఊరొదిలి వెళ్ళిపోయి ఉంటారు.”

“అయ్యయ్యో! అలాగా పాపం.” అతనెందుకో ఈ అందమైన పల్లెటూరులో విషాదమైన సంఘటనలకి చోటు వుంటుందనుకోలేదు.

“ఆ కిటికీ చూడండి! ఈ అక్టోబరు నెలలో ఎవరైనా అంత పెద్ద కిటికీ తెరచి వుంచుకుంటారా?” బయట తోటలోకి దారి తీస్తున్న పెద్ద ఫ్రెంచి కిటికీలని చూపిస్తూ అడిగిందా అమ్మాయి.

“అంటే, ఇప్పుడు కొంచెం వెచ్చగానే వుంది కాబట్టి ఫర్వాలేదనుకుంటాను. ఆ కిటికీకి ఈ ఇంట్లో జరిగిన సంఘటనకీ ఏదైనా సంబంధం వుందా?” కుతూహలంగా అడిగాడు.

“ఆ ఫ్రెంచి విండో గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.” బాధగా అందా అమ్మాయి. ఆమె గొంతులో ఇంతకు ముందున్న దృఢత్వం తగ్గి, గొంతు జీర పోయింది.

“పాపం, పిన్ని, వాళ్ళు ఎప్పుడో తిరిగి వస్తారనుకుంటుంది. అందుకే సాయంత్రం వరకూ ఆ కిటికీ అలా తెరిచే వుంచుతుంది. కొన్ని సార్లు ఆవిడ ఆ రోజుని తలచుకుంటుంది. ఆవిడ భర్త తెల్లని కోటులో, ఆవిడ చిన్న తమ్ముడు రోనీ పెద్దగా పాటలు పాడి ఆవిడని విసిగిస్తూ, వాళ్ళ వెంట ఆ రోజు వెళ్ళిన చిన్న కుక్క, అన్నీ ఆవిడకి బాగా జ్ఞాపకం. ఇలా ఇక్కడ నిశ్శబ్దంగా సాయంత్రం కూర్చున్నప్పుడు, నాకు కొన్నిసార్లు నిజంగానే వాళ్ళు ఆ కిటికీలోంచి తిరిగొస్తారేమో అనిపిస్తుంది.”

ఊహ వల్ల వచ్చిన భయంతో కాబోలు, ఆ అమ్మాయి సన్నగా వణికింది.

ఇంతలో మిసెస్ సేపుల్టన్ ఆ గదిలోకి వస్తున్న అలికిడైంది. ఫ్రాంటన్ ఊపిరి పీల్చుకున్నాడు. వస్తూనే ఆవిడ అతన్ని అంత సేపు కూర్చోపెట్టినందుకు క్షమాపణలు చెప్పింది.

“మా వేరాతో కాలక్షేపం బాగా అయిందనుకుంటాను,” వాకబు చేసింది ఆవిడ.

“అమ్మాయి చాలా తెలివైనది,” వ్యాఖ్యానించాడు ఫ్రాంటన్.

“ఆ కిటికీ తెరిచి వుంటే మీకేం అభ్యంతరం వుండదు కదా? మా వారూ, మా తమ్ముళ్ళూ పొద్దున్నననగా వెళ్ళారు వేటకి. ఏ క్షణంలో నైనా వచ్చేస్తారు. ఇవాళ బోలెడు పిట్టలని కొడతామన్నారు. రాగానే ఇల్లంతా మురికి చేస్తారు,”

ఏదో ఒకటి మాట్లాడుతూనే వుందావిడ. బయట అడవిలో పక్షుల గురించీ, వేట గురించీ, భర్త గురించీ. ఫ్రాంటన్ ఎన్నో సార్లు సంభాషణని వేరే వైపు మళ్ళించటానికి ప్రయత్నించాడు కానీ, కుదరలేదు. అసలావిడ అతని మాటలు వింటున్నట్టే లేదు. ఏదో ధ్యాసలో కిటికీ వైపు మాత్రమే చూస్తూ వుంది. అతనికా పరిస్థితి ఏ మాత్రమూ నచ్చటం లేదు.

“డాక్టర్లు నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని ఇక్కడకి పంపారు,” ఫ్రాంటన్ మొదలు పెట్టాడు. ప్రపంచంలో అందరూ తన వ్యాధి గురించీ, వ్యాధి లక్షణాల గురించీ, చికిత్స గురించీ చాలా ఆసక్తిగా వుంటారని అతని ప్రగాఢ విశ్వాసం. అదే వూపులో అతను తన వ్యాయామ నియమాల గురించీ, ఆహార నిష్టల గురించీ, ఇంకా చాలా వివరంగా చెప్పాడు. వస్తున్న ఆవలింతల నాపుకుంటూ, “అవునా?” అంటున్నారు మిసెస్ సేపుల్టన్. ఉన్నట్టుండి ఆమె మొహంలోకి కాంతి వొచ్చింది.

“వచ్చేశారా, రండి. మీ కోసమే చూస్తున్నా,” అంది లేచి నిలబడుతూ.

అసంకల్పితంగా వేరా వైపు చూశాడు ఫ్రాంటన్. ఆశ్చర్యంతో, భయంతో కొయ్యబారి పోయి కిటికీ వైపే చూస్తుందా అమ్మాయి. ఆమె మొహం పాలిపోయి వుంది. ఏదో అర్ధం కాని భయంతో తనూ కిటికీ వైపు చూశాడు ఫ్రాంటన్.

ఆ మసక వెల్తుర్లో ముగ్గురు మగవాళ్ళు తోట దాటుకుంటూ కిటికీ వైపొస్తున్నారు. ముగ్గురి భుజాలపైనా తుపాకులు వేళ్ళాడుతున్నాయి. ఒకతని భుజం పైన ఒక తెల్ల కోటు కూడా వేళ్ళాడుతుంది. చిన్న కుక్క పిల్ల వాళ్ళ కాళ్ళ దగ్గర పరిగెడుతుంది. నిశ్శబ్దంగా తోట దాటి కిటికీ దగ్గరకొచ్చారు వాళ్ళు. రాగానే అందులో ఒకడు పెద్ద గొంతుతో ఏదో పాటెత్తుకున్నాడు.

ఒక్క ఉదుటున లేచాడు ఫ్రాంటన్. తన చేతి కర్రా, టోపీ అందుకుని వాయు వేగంతో తలుపూ, మెయిన్ గేటూ దాటుకుని బయటపడ్డాడు.

తెల్లకోటు వేసుకున్న అతను లోపలికొస్తూ, “వచ్చేశాం చూడు. బయట పెద్ద తడిగా ఏం లేదు. బూట్లకి కొంచెం మట్టి అంటిందనుకో. అన్నట్టు ఎవరలా బయటికి పరిగెట్టింది?” అన్నాడు.

“ఎవరో విచిత్రమైన వ్యక్తి లాగున్నాడు. పేరు మిస్టర్ నటెల్. పాపం తన జబ్బుల గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేడనుకుంటా. మిమ్మలని చూడగానే అలా దయ్యాల్ని చూసినట్టు భయపడి పారిపోయాడెందుకో!” ఆశ్చర్యంగా అంది మిసెస్ సేపుల్టన్.

“అతనికి కుక్కలంటే భయంట పిన్నీ! ఎప్పుడో ఇండియా వెళ్ళాడట. గంగానది ఒడ్డున ఊర కుక్కలు వెంటబడ్డాయట. రాత్రంతా ఒక స్మశానంలో దాక్కున్నాడట, భయంతో వణికిపోతూ. ఇందాకే చెప్తున్నాడు, పాపం!” చెప్పింది వేరా జాలిగా.

అన్నట్టు, ఆ అమ్మాయి కథలు రాస్తుంటుంది.

[మూలం: ది ఓపెన్ విండో (The Open Window) – హెచ్. హెచ్. మన్రో (సాకి) (H. H. Munro, 1870-1917).]


శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...