కళ గురించి ఆలోచిస్తే రెండు రకాల అభిప్రాయాలు ముందుకు వస్తాయి. కళ సంఘం కోసరమని, కళ కళ కోసమేనని. కళారంగంలో ఈ రెండు విభిన్న దృక్పథాల వాదాలు నేటికీ వెంటాడుతూనే వున్నాయి. ఈ రెంటిలో ఏది సరియైనదో ఖచ్చితంగా నిర్ణయించలేక పోయారు విజ్ఞానులు, తార్కికులు. సగంమంది ఒక వైపు, సగంమంది మరొకవైపు ఉండటం వల్ల తెగే సమస్య కాకుండా పోయింది. కళ కళ కోసమే అయితే గానీ ఉత్కృష్ట స్థాయికి పోదని చాలా మంది అభిప్రాయం. కళ సంఘం కోసరమే అయితే కళ ఎప్పుడూ మామూలు మనిషి స్థాయిలోనే ఉంటుంది, ఉన్నత స్థాయికి పోదు. నిజానికి కళ ఎప్పుడూ సంఘానికి మూడడుగులు ముందే వుంటుంది నడకలో. సంఘమే ప్రయత్నించి అందుకుంటుంది. అలా అందుకునే ప్రయత్నంలోనే అది విజ్ఞానవంతం అవుతుంది. ఇక రెండో అభిప్రాయం, సామాన్య మానవుడి స్థాయికి దిగి అతన్ని ఉన్నత స్థాయికి తీసికొని పోవడమే కళ కర్తవ్యం అనేది. లేకపోతే కళకు, సంఘానికి మధ్య పెద్ద అగాధమేర్పడుతుంది.
దుర్గ (జామినీ రాయ్)
జానపద కళల్లో ఆయా దేశాల, ప్రజల సంస్కృతి, అభిరుచులు వ్యక్తమవుతాయి సూటిగా. ఈ కళ పుట్టి పెరిగింది గ్రామాల్లో. గ్రామీణులు తమ ఆనందాల్ని, భావాల్ని, భక్తిని, భయాన్ని, బహుకొద్ది రంగుల్లో ఎలా తోస్తే అలా వ్యక్తపరిచారు చిత్రాల్లో, బొమ్మల్లో. కళ కోసరమై పని కట్టుకుని చేసిందేమీ లేదు. అవసరానికి పనికి వచ్చే వస్తువుల్నే అందంగా వారికి తట్టిన నాజూకుతనంతో సుందరమయం చేశారు. బెంగాల్ పట్ వర్ణచిత్రాలు, కాళికాదేవి మట్టిబొమ్మలు, మన తిరుపతి కొయ్యబొమ్మలు, బందరూ కలంకారి వస్త్రాలు, ఒరిస్సా జగన్నాధుని చిత్రాలు, మహారాష్ట్రుల, ఆంధ్రుల తోలుబొమ్మలు, తంజావూరు చిత్రపటాలు చూస్తే తెలుస్తుంది జానపదుల పనితనం, వారి మోటైన నాజూకుతనం. బహుకొద్ది రంగుల్లో ఎన్నో డిజైనులు, లతలు, పువ్వులు చిత్రిస్తారు. తిరునాళ్ళలో తయారు చేసి అమ్మే మట్టి, పేడ బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. దేవుని విగ్రహాలు చూస్తే ఎంత భక్తి ప్రపత్తులతో తయారు చేశారో తెలుస్తుంది. అలా ఈ జానపద కళ పల్లె వాతావరణానికి చుట్టుకొని అభివృద్ధి అయిందే కానీ, పట్టణాల్లో నాగరికులైన చిత్రకారుల వల్ల కానే కాదు. పల్లెటూరివారు సరదాగానూ, కొంతమంది వృత్తిగానూ పెట్టుకుని అభివృద్ధి పరచిందే ఈ జానపద చిత్రకళ.
జామినీ రాయ్ (1887-1972)
భారతదేశపు కీర్తి నలుదిశల విస్తరింపచేసిన జానపద చిత్రకారుడు జామినీ రాయ్. భారతీయ చిత్రకళలో ఆయన ఒక మైలురాయి. జామినీ రాయ్ చిత్రాన్ని ఇద్దరు చూస్తే, ఇద్దరికీ రెండు వేరు వేరు అభిప్రాయాలు కలుగుతాయి. ఒకరు భారతదేశ చిత్రకారుల్లో అత్యంత ప్రతిభాశాలి, మహామేధావి, సాహసిగా లెక్క వేస్తే, రెండవవారు జానపదులు ఏనాడో వేసిన చిత్రాలకు నకళ్ళు తయారు చేసే అతి సాధారణమైన, చవుకబారు చిత్రకారుడిగా పరిగణిస్తారు. ఇలా విభిన్న కోణాల్లో చిక్కుకున్న వ్యక్తిని గురించి బెవర్లీ నికలస్ సంవత్సరం పాటు భారతదేశమంతా తిరిగి ఎన్నో చిత్రాలు చూసి, ఎంతో మంది చిత్రకారులని కలిసిన మీదట, “భారతదేశంలో గొప్ప చిత్రకారుల గురించి చెప్పాలంటే ఒక్క జామినీ రాయ్‌ని గురించే చెప్పాలి,” అన్నారు.
రష్యా నుండి ఇటీవల వచ్చిన సాంస్కృతిక సంఘ సభ్యులు కూడా రాయ్ చిత్రాలు చూసి, భారతీయ జానపద శైలిని మూడుమూర్తుల ప్రతిబింబింపజేస్తున్న చిత్రకారుడన్నారు.
శ్రీ సంజీవదేవ్, “జామినీ రాయ్ చిత్రాల్లోని విషయ వస్తువులో కాని, ప్రక్రియలో కాని, రూపసృష్టిలో కాని, ఊహాపుష్టిలో కాని నాకేమాత్రం లోతు, లావణ్యం కనిపించదు. ఆయనది కేవలం జానపద చిత్రకళ మాత్రమే కాని మోడర్నిస్ట్ చిత్రకళ కాదు” అన్నారు.
ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటరుగారైన శ్రీ ఎ. ఎస్. రామన్, “జామినీ రాయ్ కౌశలం అద్భుతం అనడంలో సందేహం లేదు. కానీ, విమర్శనా దృష్టితో తీక్షణంగా చూసినట్టయితే తెలుస్తుంది ఆయన చిత్రకళలోని శూన్యం. బెంగాల్ జానపద చిత్రకళకు కార్బన్ కాపీ లాంటిది రాయ్ చిత్రకళ” అని నిరసించాడు. ఇలా విరుద్ధ విమర్శనాశక్తుల మధ్య నిలచి, చిత్రకారుడిగా విజయం సాధించిన వ్యక్తి ఎంత గట్టివాడో ఊహించగలం.
వైష్ణవులు
జామినీ రాయ్ ఉండేది కలకత్తాలో బహు జనసమ్మర్దమైన చోట. ఇరుకు సందుల్లోంచి, జనసమూహం మధ్యనుండి వెళితే వస్తుంది ఆయన ఇల్లు. అదే రాయ్ నివసించేది, చిత్రించే స్థలము కూడా. భారతీయ చిత్రకారులు వారు వుండే ఇంట్లోనే ఒక గదిలో చిత్రరచన సాగిస్తారు. ప్రత్యేకంగా చిత్రరచనకు వేరే ఇల్లు వుండదు. కానీ పాశ్చాత్యులు చాలామంది సంసారంతో వుండేది ఒక చోట, చిత్రరచన చేసేది మరొక చోట. సాంసారిక వాతావరణానికి సుదూరంగా వుండి చిత్రిస్తారు ఏకాంతంగా, ప్రశాంతంగా. మనకు, వారికి గల ఈ తేడా ఆర్ధిక కారణాల వల్లే అనుకుంటా. వచ్చిన కళాపిపాసకులని రాయ్ ఎంతో ఆదరంతో, ముకుళిత హస్తాలతో, గుమ్మం దగ్గరే ఎదురై లోనికి తీసుకుని వెళ్తారు. గోడలకు తగిలించిన ఎన్నో చిత్రాలు వెలుగును సృష్టిస్తూ, ముదురు రంగుల్లో ప్రకాశిస్తుంటాయి. సిగ్గుతో ముడుచుకున్న కండ్లతో పిలిచే పల్లెటూరి భామలు, రాధాకృష్ణులు, శివపార్వతులు, శిష్ట వైష్ణవ బ్రాహ్మణులు, రామాయణ, భాగవత ఘట్టాల చిత్రాలు, క్రైస్తవమత సంబంధ చిత్రాలు, ఎన్నో ఇంటి గోడల నిండా, ఒక మూల దొంతర్లుగా వుంటాయి. రాయ్ చూపిస్తున్న చిత్రాలు చూస్తూ, ఆయన వైపు ఒకసారి చూస్తే తెలుస్తుంది చిత్రకారుని నిశ్చలత, దృఢ నిశ్చయం, గాంభీర్యం. పొడవైన నిండు విగ్రహం, గుండ్రని ముఖం, బలమైన అవయవాలు, వయసుతో పండిన రంగులో వుంటాయి. నెరసిన జుట్టు, సుమారు డెబ్బైరెండేండ్ల రాయ్‌కి ఒక ప్రత్యేక శోభ చేకూర్చింది. ఎంత గొప్ప చిత్రకారుడో అంత నిరాడంబరుడు, అంత మితభాషి.
బంకురా జిల్లా, చెలియతోర్ గ్రామంలో జన్మించాడు రాయ్. ఆ గ్రామంలో కుమ్మరులు చేసే కుండలు, బొమ్మలు, వాటికి వేసే రంగులు ఎంతో ఆకర్షించాయి. చిన్నప్పటి నుండి వారితో తిరిగి మట్టిబొమ్మలు వారిలా చేస్తూ, రంగులు వేస్తుండేవాడు. రాయ్ తండ్రి కొడుకుకు గల కళాభిలాషను గుర్తించి కలకత్తా లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేర్పించాడు. ఎంతో శ్రద్ధతో చిత్రకళ నేర్చుకొని పట్టుదల గలవాడని అనిపించుకున్నాడు. రూపచిత్రాలు వెయ్యడంలో దిట్ట. ఎంతోమంది రూపచిత్రాలు వేసి డబ్బు, కీర్తి గడించాడు. ఆ రోజుల్లోని రాయ్ చిత్రాలు అమెరికన్ చిత్రకారుడు విజ్‌లర్ (James Whistler) చిత్రాలకు దగ్గరగా ఉండేవి. దృశ్యచిత్రాలను, అవనీంద్రనాధ టాగోర్ గురుత్వాన వర్ధిల్లిన బెంగాల్ చిత్రకళా పద్ధతుల్లోనూ విరివిగా చిత్రాలు వేస్తూ వుండేవాడు. తైలవర్ణల్లో, నీటిరంగుల్లో, వివిధ రకాల ప్రయోగాలు చేస్తుండడం మొదటినుండీ అలవాటు. వాన్‌గో (Van gogh), గోగాన్‌ల (Paul Gauguin) ప్రభావం రాయ్ చిత్రాల మీద వుండేది. రాయ్ విచిత్రమైన వ్యక్తి. అందరు చిత్రకారుల్లా దేశం తిరిగి చూసిన మనిషి కాదు. అంతగా చదువుకున్నవాడు కాదు. కలకత్తా నగరమే ఆయనకు ప్రపంచం. అక్కడి జనసమ్మర్దమే రాయ్‌కి అనుభూతుల్ని, అనుభవాల్ని అందిస్తుంది.
గోపిని (టెంపేరా)
ఇన్నిరకాలుగా చిత్రించినా రాయ్ హృదయాంతరాళంలో తన చిన్నతనం లోని మట్టిబొమ్మలు, చిత్రాలు మెదులుతూనే వున్నాయి. ఏదో చిత్రిస్తున్నాడే గానీ ధ్యాస లేదు. ఏదో సంపాదిస్తున్నాడే గానీ ఆత్మసంతృప్తి లేదు. అశాంతితో అలానే బ్రతుకుతున్నాడు. ఒక్కసారిగా ఏదో మార్పు వచ్చింది రాయ్‌లో. తను సాధించదల్చుకున్న దానికి తను వేస్తున్న పద్ధతులు పనికి రావని గ్రహించాడు. తను చిన్నతనంలో చేసిన, వేసిన పద్ధతికి తిరిగివెళ్ళాడు. అప్పటి వరకు నేర్చిన చిత్రకళా కౌశలంతో, ఆనాటి జానపద చిత్రకళే తన మార్గంగా నమ్మి, ప్రస్తుతం ప్రచారంలో వున్న చిత్రకళా పద్ధతులను, చిత్రకారులను వదిలి వేసి, తీవ్రమైన కృషి పెట్టాడు, ఒక్కడే. అంత పేరున్న చిత్రకారుడు, పెద్దగా అర్జిస్తున్న వ్యక్తి అన్నీ వదలి భవిష్యత్తు లేని జానపద కళలోకి వెళ్ళడం, ఎవరూ నమ్మలేని విషయం. అదే ఆయనలోని విశేషం. తనకు ఏది తోస్తే అది సాధించేవరకు నిద్రపోని రకం రాయ్. కొంతమంది అధునాతన పాశ్చాత్యులు కొందరు అల్టామీరా (Cave of Altamira) గుహ చిత్రకళా పద్ధతులకు వెళ్ళారు, రాయ్ బెంగాలీ జానపద చిత్రకళ వద్దకు వెళ్ళినట్టుగా. దీన్ని వివరిస్తూ, శ్రీ బిష్నూ డే, జాన్ ఇర్విన్‌లు “ఎవరో కొత్తవారు జానపద కళ నుండి ఏదో గ్రహించేందుకు ఆ కళను సమీపించినట్లుగా కాక, జానపద సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని జీర్ణించుకున్నవానిలా తిరిగి వెళ్ళాడు రాయ్,” అన్నారు.
అవును, నిజంగా ఆయన అలానే సమీపించారు జానపద చిత్రకళను. చిన్నతనంలో తను జానపద చిత్రకారుల్తో కలిసిపోయి నేర్చుకున్న చిత్రకళ లోని వర్ణమాధుర్యం, రేఖావిన్యాసం లోనికి వెళ్ళడం ఆయనకు అతిసహజం. అందుకే రాయ్‌కి, కొంతమంది ప్రఖ్యాత భారతీయ చిత్రకారుల మాదిరిగా, పాశ్చాత్య చిత్రకారులైన డెరైన్ (Andre Derain), మథీస్‌ల (Matthias Grunewald) పద్ధతుల వద్దకు వెళ్ళవలసిన అగత్యం లేకపోయింది జానపద చిత్రకళా నైర్మల్యాన్ని పట్టుకుంటానికి.
పిల్లి, రొయ్య
జామినీ రాయ్‌కి జానపద చిత్రకళలో శాంతి లభించింది. తలచిన భావాన్ని వెంటనే అతి కొద్ది రంగుల్లో, బలమైన రేఖల్లో చెప్పడం అలవడింది. ఈ సాధనకు టెంపేరా (Tempera) వర్ణ పద్ధతి (ధవళ వర్ణ మిశ్రమ విధాన పద్ధతి) ఎంతగానో ఉపకరించింది. జానపదులు భగవంతుని ఊహాచిత్రాలు వేయాలంటే గ్రంథాలలోని రూపలక్షణ వివరాలకై అంతగా బాధపడరు. ఎలా ఊహిస్తే అలా నిండైన మనసుతో, భక్తితో చిత్రిస్తారు. హనుమంతుణ్ణి చిత్రిస్తే ఆయన్ను ఎంతో గంభీరంగాను, చిత్రంలో వున్న ఇతర రూపాలకంటే పెద్దదిగానూ చిత్రిస్తారు. వారి దృష్టిలో భగవంతుడు సర్వ చరాచర ప్రాణికోటికంటే ఉన్నతమైనవాడు. అందుకే అలా చిత్రిస్తారు. హనుమంతుడు హిమాలయ పర్వతాల వద్ద ఉన్నా సరే హిమాలయాల్ని చిన్నవిగా చేసి, హనుమంతుణ్ణి పెద్దగానే, గాంభీర్యంగానే చిత్రిస్తారు. ఇక్కడ వస్తుగుణాలకు రూపభేదాలకు తారతమ్యం లేదు. వారి మనో దృష్టికి అందిందే కళ.
రాయ్ చిత్రకళను సమీక్షిస్తూ శ్రీ ముల్కరాజ్ ఆనంద్ “భారతీయ తత్వం, తంత్రాలలోని నిబిడీకృత జీవాన్ని ఒకవైపు, నేటి మధ్య తరగతి ప్రజా జీవితాన్నంటి పెట్టుకున్న మనోవైకల్యం, ఆకలి, క్రూరత్వం, బాధల్ని రెండవవైపు, అధిగమించి తన భావాల్ని, అనుభవాల్ని, మనో దృశ్యాల్ని విడమర్చి ఈ దృశ్య సంబంధమైన చిత్రకళలో చెప్పడం లోనే వుంది రాయ్ ప్రజ్ఞ.” అన్నారు. మరుగు పడిన జానపద కళలోని ఔన్నత్యాన్ని వెలికి తీసి ప్రాణప్రతిష్ట చేయడం లోనే వుంది రాయ్ గొప్పతనం. దేశంలో ఎంతోమంది విజ్ఞుల విమర్శలకు గురి ఐనా రాయ్ చిత్రకళ విజయం పొందింది. ధనం ఆర్జించింది. ఎంతోమంది చిత్రకారులను ఆకర్షించింది. ఆయన మార్గదర్శకత్వంలో జానపద చిత్రకళ అంటే జామినీ రాయ్ మారుపేరు అయింది. వారి చిత్రాలు కొన్నంతగా ఏ చిత్రకారుని చిత్రాలు భారతీయులు, పాశ్చాత్యులు కొని వుండరు.