వర్ష రచన

పగలు పగలంతా
ధగధగా మెరిసిపోతూ
ఎండ
ఊరి భుజాల మీద
నుంచొని ఊరేగుతోంది
ఎండని మోయాలేక
దించటం చేతాకాక
ఊరికి నోరెండిపోతోంది

తెల్లారితే మళ్ళీ
ఎండ నెత్తుకుని తిరగాలన్న
భయంతో దిగులుతో
రాత్రుళ్ళు ఊరికి కునుకు లేదు
“వచ్చేస్తోంది మాన్సూనూ
ఉరుములూ మెరుపులూ
ఇక వరదలే వరదల”ని
దూరదర్శన్ చెవిలో అరుస్తున్నా
ఎండకు పిసరు భయం లేదు
అది ఊరి మెడ దిగలేదు

ఊరి మీద వాన చినుకు లేదు
చర్మం వలిచిచ్చినా
చెమటారనియ్యని
బంగాళాఖాతం
పిల్లలు చూడకూడని సినిమా బొమ్మల్ని
కనబడే చోటల్లా అంటించినట్టు
ఊరు వంటికి ఉక్కని
ఎక్కడ బడితే అక్కడ
కనపడగూడని చోట్ల గూడా
అంటించేసింది

మనం సాగిస్తున్న ఆగడాలకు
వేకితో మన్ను
వేగిపోతోందన్నట్టు ఎండ
ఆగ్రహంతో మిన్ను
కన్నెఱ్ఱ చేసిందన్నట్టు ఎండ
ఎడా తెరిపీ లేకుండా ఎండ
ఎండ ఎండ ఎండ

అచ్చం ఆవుల్లాగా
గడ్డి తిని పాలిస్తున్న నేతలూ
వాణిని వాణిజ్యంలో మాత్రమే
చూడగలిగిన విద్యావేత్తలూ
కూడబలుక్కుని
తెరిపించారు బళ్ళు
శలవులెక్కువైతే
చదువు చట్టుబండలౌతుందంటూ

పైన బడబాగ్నిలాంటి ఎండ
కింద పిచ్చుకల్లాంటి పిల్లలు
పైన భగ్గు మంటున్న ఎండ
కింద మగ్గిపోతున్న పిల్లలు

రేపు సైన్యంలో చేరబోతున్న వాళ్ళ లాగా
బళ్ళల్లో వాళ్ళ చేత చేయిస్తున్న కవాతులు
ఒక్క పూట బడి మానేస్తే
ఐ ఐ టీ లో సీటు పోతుందని
గద్దింపు కళ్ళతో అమ్మలు
గతిలేని చూపుల్తో నాన్నలు
ఉడుతలు బుడుతలు
ఎండ మంటల్లో మిడతలు

పిల్లల్ని ఇలా చూస్తూ ఇక ఊరుకోలేను
ఎలా తేగలను వానల్ని
ఎలా సేద తీర్చను ఈ కూనల్ని
నేను చేయగలిగింది
చేయదలుచుకున్నాను
ధరావరణ ధర్మదేవతకు
దండం పెట్టుకున్నాను
కవి కంకణం కట్టుకున్నాను
కలం పట్టుకున్నాను

ఇదుగో ఈ గీత రచన
మహామోఘనీల మేఘ
గళ గర్జా మూర్ఛన
దీనితో ఒక్క జల్లు
ఒక్క జల్లు కురిసిందా
వేలకు వేలు రాసి
ఊరంతా
నేలంతా
వెదజల్లుతాను.