తథాస్తు

“వెంకటేశన్ గారు ఉన్నారా?”

“ఇంకా ఆఫీసు నుంచి రాలేదే? లోపలికి రండి.” ఆహ్వానం పలికింది వెంకటేశన్ భార్య.

“పరవాలేదు. నేను తరువాత వస్తాను. పోయిన వారం నేను వచ్చి వెళ్ళిన విషయం చెప్పారా?”

“చెప్పాను. ఎలాగైనా ఈ నెలాఖరు లోపల ఇచ్చేస్తానని చెప్పమన్నారు. మీ మేనేజరు దగ్గర మీరే ఎలాగైనా కాస్త ఓపిక పట్టమని చెప్పండి.”

“ఆయన నమ్మరు. మీరు పది పదిహేను సార్లుగా ఇలాగే చెప్తూ వస్తున్నారు.”

“లేదండి. ఈ సారి మాత్రం ఎలాగైనా తప్పకుండా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక చోట టెంపరరీగా ఉద్యోగం దొరికింది. కాస్త దయచేసి ఓపిక పట్టమని చెప్పండి.”

నేను వీధిలోకి దిగి నడిచాను. వెంకటేశన్ భార్యను చూసినప్పుడల్లా చాలా జాలిగా అనిపిస్తుంది. ప్రతీసారీ ఆమే నాకు జవాబు చెబుతోంది. వెంకటేశన్ ఇంట్లో ఉన్నా కూడా లేదని అబద్ధం చెప్పిస్తున్నారు. ఆయన లేని సమయంలో కూడా ఆమె భర్త తరపున నా దగ్గర క్షమార్పణలు కోరుతోంది.

గోపాలన్ మా ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్. చాలా కఠినమైన వ్యక్తి. జీవితంలో ఒక్కొక్క మెట్టుగా ఎక్కి వచ్చిన మనిషి. అందువల్ల అందరూ అలాగే రావాలని అనుకునే వ్యక్తి. ప్రొద్దున్న తొమ్మిది గంటలకి ఆఫీసుకి వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వేరే ఆలోచనలు లేకుండా అన్నిటినీ మూటకట్టి పెట్టి ఆయనతో సమంగా పరుగెత్తాలి. మూడు నెలలకు ముందు గోపాలన్ నన్ను పిలిచారు.

“కూర్చో. నీతో కాస్త మాట్లాడాలి.” కూర్చున్నాను. వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. గోపాలన్ ముఖం ఇంత శాంతంగా ఉండటం ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు.

“నువ్వు క్రోం పేట నుంచి కదా వచ్చేది?”

“అవును సార్.”

“ఏం లేదూ, అక్కడ మూడో వీధి ఆరో నంబరు ఇంటిలో వెంకటేశన్ అని ఒకతను ఉన్నాడు. అతను నాకు ఓ ఐదు వందలు ఇవ్వాలి. చాలా రోజులుగా నాకు ఠోకరా ఇస్తున్నాడు. అతన్ని పోయి కలుస్తావా. మామూలుగా కాదు, అతన్ని గట్టిగానే అడగాలి. లేకపోతే నిన్ను కూడా తిప్పుతాడు. వదలకుండా వెళ్ళి అడుగుతూ ఉంటేనే ఇస్తాడు. అర్థమయ్యిందా?”

“సరే సార్. రేపే పోయి కలుస్తాను.”

ఆరోజు ప్రారంభించిన వసూలు తతంగం ఈ రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. వెంకటేశన్ చాలా రోజులుగా పనేదీ లేకుండా ఉన్న వ్యక్తి. ఒకవేళ ఎక్కడైనా పని దొరికినా అక్కడ మూడు నెలలకన్నా ఎక్కువగా ఆయన ఉండింది లేదు. ఊళ్ళో ఆయన అప్పు పెట్టని చోటు లేదు. రాత్రుళ్ళలో ఆలస్యంగానే ఇంటికి వచ్చి చేరుతారు. తనకోసం కాచుకొని ఉన్న అప్పుల వాళ్ళంతా విసిగి వేసారి తమ తమ ఇళ్ళకి వెళ్ళిన తరువాతే ఈయన వస్తారు. ఇంత వరకు నేను ఆయన్ని ఒక్కసారే చూడగలిగాను. ఆయన ఇంటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నేను గోపాలన్ దగ్గర చీవాట్లు తింటున్నాను. ఎదురు చెబితే నా ఉద్యోగం పోతుంది.

ఒక రోజు వెంకటేశన్‌ని పూర్తిగా తెల్లవారక ముందే పట్టుకున్నాను.

“రండి. లోపలికి రండి.” అంటూ నోరారా ఆహ్వానించారు. నేను అయిష్టంగానే లోపలికే ప్రవేశించాను. ఆయన కూతుళ్ళు, కొడుకులూ హాల్లో వరుసగా రాబోయే రోజు గురించి ఏ చింతా లేకుండా లేకుండా నిద్ర పోతున్నారు. నాకు మాట ఎత్తడానికే కష్టంగా అనిపించింది. వెంకటేశన్ కొంచం కూడా సంశయించకుండా, “చెప్పండి,” అన్నారు.

“ఏమీ లేదు. మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను. గోపాలన్ నన్ను కోప్పడుతున్నారు.”

“పాపం! ఆయన చాలా మంచి మనిషి. తగిన సమయంలో డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఈ డబ్బు ఆయన దగ్గర నుంచి ఎందు కోసం తీసుకున్నానో తెలుసా మీకు?”

తలెత్తి ఆయన వైపు చూశాను.

“నా భార్యకి ప్రసవ సమయం. చేతిలో చిల్లి గవ్వ లేదు. చాలా కష్టపడ్డాను. గోపాలన్ గారిని వెళ్ళి కలిశాను. వెంటనే డబ్బు ఇచ్చి సాయం చేశారు. ఒక సంవత్సరం అయిపోయింది. అదిగో ఆ చివరన పడుకుని ఉందే చంటిది, తనే నా ఆఖరు కూతురు. బంగారం లాంటి మనిషి.”

“కానీ రోజూ నన్ను ఆఫీసులో సార్ కోపగించుకుంటున్నారు.”

“నేనేం చేయను చెప్పండి? నాకు పర్మనెంటుగా ఏ ఉద్యోగమూ లేదు. ఒక్కొక్క రోజూ గడవడమే చాలా కష్టంగా ఉంది. చూడండి, నిన్న పిల్లలు ఎవరూ తిండి తినలేదు. నేను వచ్చేటప్పుడు పది ఇడ్లీలు పొట్లం కట్టించుకొని వచ్చాను. అందరూ కాకుల్లాగా పీక్కుని తిన్నారు. చూడ్డానికే చాలా కష్టంగా అనిపించింది. ఒక కాలంలో మా తాతగారు బాగా ఉన్నవాళ్ళు. ఒక్కొక్క రోజూ కనీసం పదిమంది వేరే ఊళ్ళవాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మా నాన్నగారు నాకు చాలా ఆర్భాటంగా పెళ్ళి చేశారు. నా భార్య వచ్చి ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు. ఒక రోజు నన్ను అడిగింది. “ఇదేమన్నా సత్రమా? ఊళ్ళో ఉన్న బిచ్చగాళ్ళందరికీ అన్నం పెట్టడానికి?” అంతే! ఇప్పుడు మేమే అన్నార్తులం అయిపోయాము. అంత పొలమూ, ఆస్తి ఎలా పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు బిచ్చగాడిలాగా తిరుగుతున్నాను. మీ మేనేజర్ నాకు ఎలా తెలుసో మీకు తెలుసా? అతని నాన్నగారు ఊళ్ళో మా పొలాలను పర్యవేక్షణ చేస్తుండేవారు. ఇప్పుడు గోపాలన్ పెద్ద మనిషి అయిపోయాడు. నా కష్టం అతనికి బాగా తెలుసు. అయినా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు.”

జవాబు చెప్పలేక పోయాను. ఆ పిల్లలని ఒకసారి తిరిగి చూశాను. ప్రొద్దున్న లేవగానే మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది. నాన్నను పీక్కు తింటారు.

“సార్! మీరేమీ అనుకోకపోతే నేనొక మాట చెప్పనా?”

“చెప్పండి.”

“ఈ రోజు మీ భార్యను, పిల్లల్ని పిలుచుకొని మా ఇంటికి భోజనానికి రాగలరా?”

“వద్దు. మీకెందుకు శ్రమ?”

“పరవాలేదు సార్. ఎందుకో నాకు మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే తృప్తిగా ఉంటుందనిపిస్తోంది.”

“సరే. వస్తాను.”

“ఈ రోజే వస్తారు కదా.”

“వస్తాను.”

ఆఫీసుకు వెళ్ళగానే అకౌంటెంట్ దగ్గర ఐదు వందలు అడ్వాన్స్ కోసం అప్లికేషన్ రాసి ఇచ్చాను. వెంటనే ఇచ్చేశారు. డబ్బు తీసుకొని నేరుగా గోపాలన్ రూముకి వెళ్ళాను.

“ఏమైంది? వెంకటేశన్ కలిశాడా?”

“కలిశాను సార్. ఇచ్చేశారు.”

“ఏమిటీ? డబ్బా?”

“అవును సార్.” పాకెట్ నుంచి ఐదు వందలు తీసి ఆయన బల్ల మీద పెట్టాను. గోపాలన్ గారికి చెప్పలేనంత ఆశ్చర్యం!

“ఎలా ఇచ్చాడు? ఏమైనా చెప్పాడా? పాపం! మంచివాడే. అతనికి ఇప్పుడు మంచి రోజులు కావు. వాళ్ళ కుటుంబం అందరికీ దానం ఇచ్చే నాశనమై పోయింది. అతని నాన్నగారు తన పొలంలో సరిగా పంట పండక పోయినా అప్పు చేసి మరీ దానం చేసేవారు. అందుకని మనమూ అలాగే ఉండగలమా? తరువాత ఈ వెంకటేశన్ లాగా నడి రోడ్డు మీద నిలబడాల్సిందే.” అంటూ రూపాయలను తీసి జేబులో భద్రంగా పెట్టుకున్నారు.

ఆ రోజు రాత్రి వెంకటేశన్ తన కుటుంబంతో సహా మా ఇంటికి భోజనానికి వచ్చారు. నా భార్య లలిత దాదాపు ఒక విందు లాగా హడావిడి చేసింది. భోజనాలయ్యాక వాళ్ళని సాగనంపడానికి బయటికి వచ్చినప్పుడు వెంకటేశన్ తో అసలు విషయం చెప్పాను.

“మీకు ఎప్పుడు వీలుపడితే అప్పుడు నాకు ఇవ్వండి చాలు. మీ ఇంటికి చీటికి మాటికి వచ్చి మీకు ఇబ్బంది కలిగించడం నాకూ కష్టంగా ఉంది. అందువల్ల ఆఫీసులో నేనే అడ్వాన్స్ తీసుకుని ఇచ్చేశాను. మీరే డబ్బులు ఇచ్చేసినట్లు ఆయనతో చెప్పాను. ఆయన్ని ఎప్పుడైనా చూశారంటే దీని గురించి ప్రస్తావించకండి. మరి నేను ఉండనా!”

వెంకటేశన్ కాళ్ళు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా ఏదేదో అనబోయారు. ఆయన గొంతు పూడుకుపోయింది. ఆయన్ని సమాధానపరిచి ఇంట్లోకి వచ్చేసరికి పెద్ద ప్రయత్నమై పోయింది. నాకు చాలా సంతోషంగా అనిపించిది. ఏదో నేను కూడా ఇంకొకరికి సహాయ పడగలను అన్న నమ్మకంతో ఒళ్ళు పులకరించింది. లోపలి వచ్చి భోజనానికి కూర్చున్నాను.

“ఏమైయ్యింది లలితా? మౌనంగా ఉన్నావెందుకు? ఇలా ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెడితే సంతోషంగా అనిపించడం లేదూ?”

“ఊఁ.”

“ఏంటీ? ఉత్సాహం లేకుండా ఉన్నావే?’”

“సంతోషమే. కాని ఏదో ఒక సారి పెడితే సరే. తరువాత ఇదే అలవాటు అయిపోతుంది.”

“నువ్వనేదేమిటి?”

“వీళ్ళంతా పరాన్నజీవులలాగా ఎవరైనా దొరక్కపోతారా అని కాచుకొని ఉంటారు. మీ లాగా ఒక్కరు దొరికితే చాలు. అలాగే అంటుకు పోతారు. మనమేమైనా సత్రం కట్టి పెట్టామా? ఊళ్ళో అన్నార్తులుగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి విందు భోజనం పెట్టడానికి?”

పెళ్ళైన ఈ రెండేళ్ళలో ఆరోజే మొదటి సారిగా నా భార్యను చెయ్యి చాచి కొట్టాను.

[మూలం: “ఇన్రు నిజం” కథాసంకలనం, సుబ్రమణ్యరాజు (1948- 1987). నర్మద పబ్లికేషన్స్, జులై 1985.]