మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా
రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు
న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో
ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్
ఏనుగు అరటి తోటలో పడిందంటే ఒక్కొక్కచెట్టునూ తొండంతో పెళ్ళగించి పారెయ్యకుండా వూరుకోదు. దానికి అరటి చెట్టంటే అంత వైరం ఎందుకో తెలుసుకోవాలని వుందా? వినండి.
అందమైన అమ్మాయి తొడలను ఏనుగు తొండంతోనూ, అరటిచెట్టు బోదెతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటు. ఇలాంటి అలవాట్లు చాలా వున్నాయి వారికి. వీటన్నిటికీ కవిసమయాలని ఒక ముద్దుపేరుంది. ఆడపిల్ల తొడలను కూడా వర్ణించాలా, మరీ చాదస్తం కాకపోతే, అని అనుకోనక్కర్లేదు. కాళిదాసంతటివాడే తొట్టతొలిసారిగా కవిత్వం చెబుతూ శ్యామలా దండకంలో అమ్మవారి బొడ్డునూ, నూగారునూ, తొడలనూ, ఒకటేమిటి, సర్వాంగాలనూ నూతన కవిసమయపు వర్ణనలతో ముంచి వేశాడు. ఇక తదాది మన కవులందరూ యథాశక్తి, యథాశక్తేమిటి శక్తికి మించే స్త్రీల కచ కుచ వర్ణన చేసిన వారే. అలా వర్ణనలు చేయడంలో ఎంత ఎత్తుకో, ఎంత దూరానికో, ఎంత లోతుకో పోయి కల్పనలు చేసి, చిలవలూ పలవలూ కల్పించి, అసలు కవిత్వమంటే ఈ చిలవల పలవల కల్పనల సాముగరిడీలే అనే దాకా పోయారు.
ఒక అందమైన అమ్మాయి వుంది. అరటి బోదెలతోనూ, ఏనుగు తొండంతోనూ ఆమె తొడలను మామూలుగానే పోలుస్తారు గదా. ఛీ, మేమేమిటి ఆ తొడలతో పోలిక రావడమేమిటి అని సిగ్గుపడ్డాయిట అవి. అరటి బోదెకు పైన ముదురు బెరడు, దుశ్చర్మముంటుంది. ఏనుగు తొండం కూడా పరిమాణానికి, ఆకారానికీ పోలిక కుదుర్తుంది కానీ, రంగూ, పొడలూ – వీనితో దానిదీ దుశ్చర్మమే కదా. అందుకని అవి తమ అనాకారపు చర్మాన్ని పోగొట్టుకుంటే తప్ప అమ్మాయి తొడల కాంతి వంటి కాంతిని పొందలేవు. అందుకోసం, కొంచెం నీటిని తాగి – పాథోలవ పూరిత ఉదరంబులై – బహుశా జలపాన దీక్షతో తపస్సు గావించాయి. కదళికి దేవతల దయ – మరుద్విభూతి – లభించింది. దుశ్చర్మము ఊడిపోయింది. మరుద్విభూతి అంటే వాయువు ఉపద్రవంతో అని కూడా అర్థం. గాలికి అరటి చెట్టు మీది బెరడు ఊడిపోయింది అని అర్థంతరం. మరుద్విభూతి అనే పదంలో అలాగా శ్లేష చమత్కారం. అరటికి దుశ్చర్మం పోయింది కానీ, ఏనుగు తొండం త్వగ్దోషాన్ని పోగొట్టుకోలేకపోయింది. ఎందుకంటే అరటి స్థిరంగా ఉండి ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసింది. ఏనుగు తొండానికి నిత్యమూ కదలడమే కదా. ఏకాగ్రత ఎక్కడా లేక – ఆ చంచలోద్ధత వల్ల – దాని తపస్సు ఫలించలేదు. తను సాధించలేని దానిని అరటి చెట్టు సాధించిందని కరిశుండానికి ఈసు. అదీ దాని వైరానికి కారణం.
ఇంతకూ పిండితార్థం ఏమిటంటారా? వడ్లగింజలో బియ్యపు గింజ. అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా, రంభాస్తంభాలకన్నా అందమైనవి. తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి.
ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక. ప్రసిద్ధమైన ఈ పద్యం వసుచరిత్రము అనే ప్రభంధం లోనిది. కవి రామరాజభూషణుడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. రామరాజభూషణుడు చాలా గొప్ప కవి. చూశారు గదా, పై పద్యంలో ఎంత ఊహని సాగదీశాడో. వసుచరిత్రములో చాలా పద్యాలు అలాంటి కల్పనలతో వుంటాయి. అంతెందుకు, ముక్కు తిమ్మన వ్రాశాడని ప్రచారంలో వున్న, నానా సూన వితాన వాసనల – అనే ముక్కు వర్ణన పద్యం వసుచరిత్రము లోనిదే. భట్టుమూర్తి వ్రాసినదే. నంది తిమ్మన వ్రాస్రే ఈయన ఆ పద్యాన్ని కొనుక్కొని తన కావ్యంలో పెట్టుకున్నాడని లోకులు అవాకులు పల్కుతారు గాని గొప్ప ప్రౌఢశైలితో వేల పద్యాలను అలవోకగా వ్రాసిన రామరాజ భూషణుడు ఇతరుల పద్యాన్ని తనదిగా చలామణీ చేసుకున్నాడనడం అవివేకం. పైగా ఆత్మగౌరవమున్న ఏ కవీ ఇతరుల పద్యాన్ని తనదిగా పెట్టుకోడు. భట్టుమూర్తి గొప్ప ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము వున్న కవి.
అల్లసాని పెద్దన తన మనుచరిత్రతో ఆంధ్ర వాఙ్మయంలో కొత్త పుంతలు తొక్కి సార్వభౌముని చేతనే పల్లకీ ఎత్తించుకొని, దుర్నిరీక్ష్యంగా వెలిగిపోతున్న కాలం. పెద్దన, తిమ్మన, రామకృష్ణయ్య, ధూర్జటి, మల్లన లాంటి బ్రాహ్మణ కవులు చెలరేగిపోతున్న కాలం. తాను బ్రాహ్మణేతరుడు. తనలాంటి వారు ఎలా వ్రాసినా ఒక చిన్నచూపు వుండనే వుంటుంది. అందుకని మనుచరిత్ర కంటే గొప్ప కావ్యాన్ని, దానికంటే ఎంతో గొప్పగా రచించాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమర్థత తనకున్నదని గాఢ విశ్వాసం కలిగినవాడు రామరాజభూషణుడు. అది మనుచరిత్ర కంటే గొప్పదా కాదా అనే సందేహం సరైనది కాదు. అసలు ఒకరి కవితను వేరొకరి కవితతో బేరీజు వేయడం వరకూ వాఙ్మయంలో అంగీకారమే గాని ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనడం అన్యాయం. ఎవరి శైలి వారికుంటుంది. తనది అని ఒక శైలిని స్థాపించుకున్న ఏ కవీ తక్కువ వాడు కాదు. వసుచరిత్రము తనంటదే ఒక మహా ప్రబంధం. భట్టుమూర్తి నిస్సందేహంగా గొప్ప కవి.
మరో విశేషం వుంది. రామరాజభూషణుడు గొప్ప సంగీతవేత్త. ఆ వేత్తత ఆయన కావ్యంలో బాగా కనిపిస్తుంది. తన కావ్యంలోని చాలా పద్యాలను గొప్ప సంగీతంగా వినిపించేటట్లు గానశైలిలో మలిచాడు. “ఒకచాయ ననపాయ పికగేయ సముదాయ మొకసీమ నానామ యూర నినద…, మందయానము నేర్పు నిందింది రాజీవ రాజీవ రాజన్మరాళ రాజి…” లాంటి పద్యాలు చదువుతుంటే ఎంతో శ్రవణసుఖదంగా వుంటాయి. భట్టుమూర్తి పద్యాలు నాకు నచ్చినవి చాలానే వున్నాయి. ఇక మన పద్యంలోకి వస్తే, భావం అర్థమైంది కనక అన్వయం పెద్ద కష్టమేం కాదు.
రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ — ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది.
భట్టుమూర్తి సామాన్యకవిమాత్రుడు కాడు. వసుచరిత్రము సామాన్య ప్రబంధమూ కాదు. వసుచరిత్రకారునికి మనుచరిత్రము గొప్ప ప్రేరణ. కానీ వసుచరిత్రము ఆతర్వాతి వారికెందరికో ప్రేరణై చాలా పిల్ల వసుచరిత్రాలను పుట్టించిదనే సంగతి మనం మర్చిపోరానిది.