నా కోరిక, నా ప్రార్థన

1972లో, ఒక ప్రముఖ హిందీ నటుణ్ణి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ప్రసంగ పాఠమే ఇది. ఈ వ్యాసంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ చెక్కు చెదరని వాస్తవాలని నేననుకుంటున్నాను. అప్పటి పరిస్థితికంటే అధ్వాన్నంగా ఉంది నేడు. మన దేశంలో స్ఫూర్తినిచ్చే నాయకులు లేరు. నడిపించే వారు లేరు. సామాన్యుడి జీవితం రెండు ధృవాల మధ్యనే ఇరుక్కుపోయింది. ఒకటి రాజకీయం; రెండు సినిమాలు. దేశమూ, యువతా ఎటు వెళుతున్నాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామనిపిస్తోంది. ప్రతిభావంతుడికీ, పనికిరానివాడికీ వ్యత్యాసం లేకుండా పోతోందనిపిస్తోంది. మంచికీ, చెడుకీ భేదం చెరిగిపోతోందన్న సంశయం ఆవరించుకుంటోంది. ఇటువంటి సమాజంలో ఉన్న మనమందరం, కొన్ని క్షణాలు వెచ్చించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. ఈ ప్రసంగానికి నలభయ్యేళ్ళు దాటినా ఇందులో చాలా విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయని నేననుకుంటున్నాను.

ఎంతో స్ఫూర్తిదాయకమయిన ఆ ప్రసంగం చేసిన ప్రముఖ హిందీ నటుడి పేరు, బల్‌రాజ్ సాహని.


దాదాపు ఇరవయ్యేళ్ళ క్రిత్రం, దో బిఘా జమీన్ చిత్ర దర్శకులు బిమల్ రాయ్‌నీ, వారి బృందాన్నీ గౌరవపూర్వకంగా సత్కరించాలని కలకత్తా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం నిశ్చయించింది. అదొక ఇంపైన నిరాడంబరమైన వేడుక. ఆ సభలో పదునైన ప్రసంగాలు జరిగాయి. కానీ ప్రేక్షకులందరూ బిమల్ రాయ్ ప్రసంగం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేను బిమల్ రాయ్ పక్కనే తివాచీ మీద కూర్చున్నాను. బిమల్ దా వంతు రాగానే అతనిలో సభాకంపం గమనిస్తూనే ఉన్నాను. చేతులు నలుపుకోవడం చూస్తూనే ఉన్నాను. ఆయన వంతు వచ్చాక రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ -“నేను చెప్పదలుచుకున్నదంతా నా సినిమాల్లో చూపించాను. ఇంతకు మించి ఏమీ చెప్పడానికి లేదు,” అనేసి కూర్చుండిపోయారు.

ఆనాడు బిమల్ రాయ్ తన చర్యలో చెప్పకనే చాలా చెప్పారు. ఈనాడు, నేనూ ఆయన్ని అనుసరిద్దామని ఊగిసలాడాను. కానీ ఇంత గొప్ప విశ్వవిద్యాలయం మీద నాకున్న భక్తి ప్రపత్తుల వలన, అలాగే శ్రీ పి. సి. జోషీ పైన నాకున్న అపారమయిన గౌరవం వలన, నేను అలా చేయకూడదని అనుకున్నాను. ఆయనతో నాకున్న అనిర్వచనీయమైన సాంగత్యం ఎంతో ఋణపడేలా చేసింది. ఈ సభలో ప్రసంగించమని ఆయన నుండి పిలుపు వచ్చినప్పుడు కాదనలేకపోవడానికి ఇవే ముఖ్య కారణాలు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం శుభ్రపరచమని నన్ను పిలిచినా ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాణ్ణి. ఎందుకంటే, అదొక్కటే నాకున్న పెద్ద అర్హత.

దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఇక్కడ అణకువ, వినయమూ ప్రదర్శించడం లేదు. మీరు నేను చెప్పేదాంతో ఏకీభవించినా, లేకపోయినా, ఇటువంటి అపురూపమైన సందర్భంలో నేను ఆత్మసాక్షిగానే మాట్లాడుతున్నాను. గత పాతికేళ్ళుగా నేను ఈ విద్యాప్రపంచానికి దూరంగా ఉన్నానని మీకు తెలిసే ఉంటుంది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో నేనెప్పుడూ ప్రసంగించలేదు కూడా.

ఈ విద్యాప్రపంచానికి దూరంగా ఉండడం నా అంతట నేను కోరుకుని చేసినది కాదు. మన దేశంలో ప్రస్తుత సినిమా నిర్మాణ పరిస్థితుల వల్లే ఇలా జరిగింది. ఈ సినిమా ప్రపంచం నటులకి గోళ్ళు గిల్లుకుంటూ కాలక్షేపం చేయడమయినా ప్రసాదిస్తుంది లేదా బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయేటంతటి ఊపిరి సలపని పనైనా ఇస్తుంది. నటులు తమ వ్యక్తిగత జీవిత సుఖాలని త్యాగం చేయడమే కాదు, విజ్ఞాన సముపార్జననీ, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్నీ కూడా కోల్పోవలసి వస్తుంది. గత పాతికేళ్ళుగా సుమారు 125 పైగా సినిమాల్లో నటించి ఉంటాను. కానీ ఇదే కాలంలో పాశ్చాత్య నటులయితే ముప్ఫయ్యో లేదా ఆ పైన ఇంకో అయిదో, పదో ఎక్కువ సినిమాల్లో మాత్రమే నటించి వుంటారు. కొన్ని వందల పుస్తకాలు చదవాల్సిన నేను ఒక్కటీ ముట్టలేదు. ఎన్నో కార్యక్రమాలు చూస్తూండగానే దూరమయ్యాయి. ఒక్కోసారి ఇవన్నీ కోల్పోయానని నిరాశకు గురవుతాను. నేను నటించిన 125 సినిమాల్లో ఎన్ని ఉత్తమ చిత్రాలున్నాయని ఎంతో నిస్పృహతో నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇందులో ఎన్ని గుర్తుండిపోయే చిత్రాలు? ఏ కొద్దో ఉంటాయి. వేళ్ళ పైన లెక్కపెట్టవచ్చు. అవి కూడా మరుగున పడిపోయుండాలి లేదా త్వరలోనే పడిపోవచ్చు కూడా.

అందుకే నేను వినయం ప్రదర్శించడం లేదని చెప్పాను. ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని నిరాశపరిస్తే నన్ను క్షమించమని ముందే వేడుకుంటున్నాను. బిమల్ రాయ్ చెప్పింది అక్షర సత్యం. నటించడమే నటుడి ప్రపంచం! అందువల్ల నేను, నా నటనానుభవాలూ, నా పరిశీలనలూ మాత్రమే పంచుకుంటాను. మిగతావి ఏం చెప్పినా డాంబికమే అవుతుంది. నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. అది ఇప్పటికీ నా మనస్సులో స్థిరంగా ఉండిపోయింది. ఆనందంగా వేసవి శలవలు గడపాలని మా కుటుంబం రావల్పిండి నుండి కాశ్మీర్ వెళుతున్నాం. ముందురోజు రాత్రి భారీ వర్షం వలన కొండచరియలు కూలి, రహదారి కొట్టుకుపోయి, మేం మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. రహదారి ఎప్పుడు బాగుపడుతుందాని ఎంతో అసహనంగా ఎదురుచూస్తున్నాం. ఆ కొండచరియ కిరుపక్కలా దారిపొడవునా కార్లు, బస్సులు నిలిచిపోయాయి. పి.డబ్ల్యూ.డి పనివారికి ఆ రహదారి బాగుచెయ్యడం ఒక దుస్సాధ్యమైన విషయం. ఆ రోడ్డు బాగుపడడానికి కొన్ని రోజులు పట్టింది. తమ అసహనాన్నీ, నిరసననీ తెలియజేస్తూ అక్కడున్న డ్రైవర్లూ, ప్రయాణీకులూ ఆ పనిని మరింత దుర్భరం చేశారు. చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలు కూడా ఆ నగరవాసుల తలబిరుసుతనం చూసి చికాకు పడ్డారు.

ఓరోజు ఉదయం ఆ రహదారి బాగుపడిందని అక్కడున్న సూపర్వైజరు ప్రకటించాడు. డ్రైవర్లకి పచ్చ జెండా ఊపాడు. వింతగా, రోడ్డు కిరుపక్కలా ఉన్న ఏ డ్రైవరూ ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. అక్కడే నుంచుని రోడ్డు కావలివైపున ఉన్న వారిని చూస్తూ నిలబడ్డారు. ఆ ప్రత్యామ్నాయ రహదారి సురక్షితం కాదనడంలో సందేహం లేదు. ఒక పక్క పెద్ద కొండ; మరొక పక్క చిన్న ఇరుకుదారిని ఆనుకొని ప్రవహిస్తున్న నది – రెండూ భయాన్ని కలిగించేవే! ఆ సూపర్వైజరు ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో ఆ రహదార్ని పరీక్షించాకే పచ్చజెండా ఊపాడు. అంతకు ముందురోజు వరకూ ఆ పనివాళ్ళ తీరునీ, సోమరితనాన్నీ విమర్శిస్తూ వచ్చిన ప్రయాణీకులెవరూ ఆ సూపర్వైజరు మాటలని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా కదల్లేదు. ఇంతలో హఠాత్తుగా ఒక చిన్న స్పోర్ట్స్ కారు అటుగా వస్తూ చూశాం. దాన్ని ఒక ఆంగ్లేయుడు నడుపుతున్నాడు. ఆ కారులో అతనొక్కడే ఉన్నాడు. అక్కడ బొమ్మల్లా నిల్చున్న మమ్మల్నీ, దారి పొడవునా మొరాయించిన కార్లనీ చూసి ఆశ్చర్యపోయాడు. సూటూ, బూటులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నన్ను చూసి, ఏం జరిగిందని అడిగాడు.

జరిగినదంతా చెప్పాను. అతను గట్టిగా పగలబడి నవ్వి, హారన్ కొట్టుకుంటూ ఏమాత్రం సంకోచం లేకుండా ఆ చిన్నదారి గుండా వెళిపోయాడు. అంతే! అక్కడి పరిస్థితి తారుమారయ్యింది. ప్రతీ ఒక్కరూ తామే ముందు వెళ్ళాలన్న తొందరలో అక్కడి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యింది. కారు ఇంజన్ల మోతతోనూ, హారన్లతోనూ ఆ ప్రదేశం దద్దరిల్లిపోయింది.

స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన ఒక మనిషి ఆలోచనలకీ, దాస్యానికి గురైన మనిషి దృక్పథానికీ మధ్యనున్న తేడా అప్పుడు తెలిసింది. ఆ క్షణం నా కళ్ళు తెరుచుకున్నాయి. స్వేచ్ఛ ఉన్నవాడికి ఆలోచించి, నచ్చిన నిర్ణయం తీసుకునే శక్తి వుంటుంది. బానిసలకు అది వుండదు. ఎప్పుడూ పక్కవారి సలహాలపైనే ఆధారపడుతూ, డోలాయమానంగా నిర్ణయాలు స్వీకరిస్తూ, అందరూ వెళ్ళే దారిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సంఘటన నాకొక విలువైన పాఠం నేర్పింది. నా జీవితగమనాన్ని నిర్దేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంతోషంగా, నాకు నేనే నిర్ణయాలు తీసుకునేలా చేసింది. పరిపూర్ణ స్వేచ్ఛా వాయువులు పీల్చే అనుభవం నాకిచ్చింది. నేనొక స్వేచ్ఛాజీవిని అనుకున్నాను. నాలో ఆత్మవిశ్వాసం అచంచలంగా పెరిగింది. జీవితం అంటే ఏవిటో తెలిసి, అప్పటినుండీ జీవితాన్ని సంతోషంగా స్వీకరించడం మొదలుపెట్టాను.

నిజానికి అటువంటి సందర్భాలు అరుదుగా ఎదురవుతాయి. నాలో ఆత్మవిశ్వాసం నశించి మరొకరి తెలివితేటలపైన ఆధారపడవలసిన సందర్భమే ఆ తరువాత రాలేదు. మధ్యతరగతి నుండి వచ్చిన నేను కుటుంబ విలువలు, ప్రమాణాలు పాటిస్తూనే స్వంత నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాను. ఏ మాత్రం కష్టం కలగకుండా చూసుకునేవాణ్ణి. దరిమిలా నేనొకలా ఆలోచిస్తూ, మరో విధంగా ప్రవర్తించేవాణ్ణి. అందువల్ల దేనికీ కొరగాకుండా పోతున్నానన్న భావన కలిగేది. కొన్ని నిర్ణయాలు చిన్న చిన్న సంతోషాలకు నష్టం కలిగించేవి. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడల్లా జీవితం భారంగా అనిపించేది.

ఇంతకు ముందు, మీకు ఒక ఆంగ్లేయుడి గురించి చెప్పాను. ఎందువల్లనంటే ఆ సమయంలో నాకు కలిగింది ఆత్మన్యూనతా భావం. అలా కాకుండా వుంటే సరిగ్గా ఆ ఏడాదిలోనే ఉరితీయబడ్డ సర్దార్ భగత్ సింగ్ గురించి చెప్పుండేవాణ్ణి. లేదా ఆత్మధైర్యం అధికంగా వున్న ఏ మహాత్మా గాంధీ గురించో ప్రస్తావించుండేవాణ్ణి.

కాలేజీ చదివే రోజుల్లో నాకింకా గుర్తు. సత్యము, అహింస వంటి ఆదర్శ సూత్రాలతో ఆంగ్లేయుల సార్వభౌమత్వాన్ని ఓడించవచ్చన్న గాంధీ ఆదర్శాలను చూసి మా వూళ్ళో ఎంతో మంది మేధావులు, పండితులు అదంతా ఒఠ్ఠి మూర్ఖత్వంగా భావించేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్న నమ్మకం మా వూళ్ళో ఒక శాతం జనాభాకి కూడా లేదు. కానీ గాంధీకి తనమీద నమ్మకముంది. దేశమ్మీద వుంది. ప్రజల మీద వుంది. మీరు నందలాల్ బోస్ చిత్రీకరించిన గాంధీ చిత్రపటాన్ని చూసే ఉంటారు. అది చిత్రపటం కాదు; ఆత్మవిశ్వాసానికీ, ఆత్మధైర్యానికీ నమూనా.

నేను కాలేజీలో చదివే రోజుల్లో మహత్మా గాంధీ వల్ల కానీ, భగత్ సింగ్ వల్ల కానీ ప్రభావితం కాలేదు. నేను పంజాబు లాహోర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏ. చేశాను. ప్రతిభావంతులైన విద్యార్థులకే అక్కడ సీటు లభించేది. దేశవిభజన జరిగాక నా సహాధ్యాయులందరూ ఇండియా, పాకిస్తాన్లలో అటు సమాజంలోనూ, ఇటు ప్రభుత్వ రంగంలోనూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ కాలేజీలో ప్రవేశానికి ముందు, మేము ఏ రకమయిన రాజకీయ ఉద్యమాల్లోనూ పాల్గొనమని మా చేత హామీ పత్రం రాయించుకునేవారు.