మూలం : Ernest Hemingway
‘Cat in the rain’.
Boston నుంచి ఇద్దరు దిగేరు. కిళ్ళీలు నములుకుంటూ ఒక జంట వరండాలో నిలబడి వాననీ సముద్రాన్నీ చూస్తున్నారు. వాళ్ళెవరో వీళ్ళకి తెలీదు. గ్రౌండ్ ఫ్లోర్ లో సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాది వాళ్ళ గది. మహానది బంగాళాఘాతంలో కలిసే చోట నీలాకుపచ్చ రంగు నీళ్ళల్లో అక్కడో ఓడా ఇక్కడో ఓడా నిశ్శబ్దంగా తేలుతున్నాయి. కిటికీ బయట పెద్ద పెద్ద పోకచెట్లు అరటిచెట్లు కొబ్బరిచెట్లూ కర్రబెంచీల చుట్టూ ఎవరూ లేకుండా తడుస్తూ. మామూలప్పుడయితే గోపాల్ పూర్ నుండి వచ్చిన ఆర్టిస్ట్ ఒకాయన గ్లాసునిండా పాలమీగడ పోసుకుని తింటూ సీస్కేప్ లు వేసుకుంటూ కూర్చుంటాడు. ఈ వానలో ఊరపిచ్చుకలు కూడా ఎక్కడో గప్ చిప్ అయిపోయేయి. సముద్రం మహానది ఆకాశం అన్నీ ఒక నీలిరంగు పొగలాగా కలిసి తడుస్తున్నాయి. దూరంగా ఒక మూల జెట్టీల మీద గంధకం కుప్పలు బొగ్గు కుప్పలు ఐరన్ ఓర్ కుప్పలూ రంగుల పర్వతాల్లాగా నిర్వికారంగా తడుస్తున్నాయి. బీచ్ రోడ్డు గేటు బయట చెట్టు కింద ఒక రిక్షా, మెడ టపటపా విదిలించుకుంటూ ఒక కాకి. నీలాంజన పట్నాయక్ కాఫీ కొట్టు రాటకి కట్టేసి అమాయకంగా ఒక మేక. కళింగా హిల్టన్ స్టెయిర్ వెల్ కంచుకప్ప వానలో తళతళా మెరుస్తోంది. స్విమ్మింగ్ పూల్ ఎదురుగా చోళా కఫె వరండాలో వెయిటర్ ఒకతను గడ్డం మోచేతుల్లో పెట్టుకుని ఆ కంచుగోపురం కేసి చూస్తున్నాడు.
Boston తెలుగమ్మాయి బేవిండో దగ్గర కర్టెన్లు పక్కకి తోసి ఈ చిత్రం లోకి చూస్తోంది. కిటికీ కిందనే బేస్ మెంట్ దగ్గర గచ్చపిక్కరంగు పిల్లిపిల్ల ఒకటి గుండ్రంగా ముడుచుకుని కూర్చుంది. సన్ షేడ్ మీంచి ఈదురుగాలి కొట్టి వానజల్లు దానిమీద పడినప్పుడల్లా మగతగా కళ్ళిప్పి మరింత లోపలికి ముడుచుకుంటూ.
“వెళ్ళి ఆ పిల్లిపిల్లని తెచ్చీనా?” అంది.
“నేను తెస్తానుండు” అన్నాడు అతను పుస్తకంలోంచి తలెత్తకుండానే.
“అబ్బా … I want that kitty. చూడు బుజ్జిది బెంచ్ కిందికి ఎలా దూరిపోతోందో ….!” పక్కన ఎవరూ లేనప్పుడు ఇలాగే ముద్దుగా మాట్లాడుతుంది …. అందులో పిల్లిపిల్ల సంగతి…..
అతను మంచం మీద కాళ్ళు ముడేసుకుని ఛాతీ కింద తలగడ పెట్టుకుని పుస్తకంలోకి దూరిపోయేడు. డోర్ చప్పుడైతే చప్పున తలెత్తి “తడిసిపోతావ్ జార్త” అని ఒక కాషన్ విసిరి.
ఆ అమ్మాయి లాంజ్ లోంచి పైకి నడుస్తుంటే మేనేజర్ వినయంగా లేచి నిలబడి విష్ చేసేడు. పెద్దాయన. ఆరడుగుల పైగా పొడుగ్గా. తెల్ల చొక్కా ఫార్మల్ గా టక్ చేసుకున్నాడు. site analysis . డెస్క్ మీద ‘అధికానంద గొడాయ్ B.A. ‘ అని.
నోరు సున్నాలా ముందుకు తెచ్చి అల్లరిగా లోలోపలే నవ్వుకుంటూ ‘ఒధికోనొందొ గోడోయ్ భొయొంకొరొ, ప్రొచ్చొన్నొ …. ‘ అనుకుంది పైకి సీరియస్ గా మొహం పెట్టి. ఈ మూడు వారాల్లో ఒడ్డియాస ఒచ్చీరానట్టు ప్రాక్టీస్ చేసిందంతా మేనేజర్ మీద వాడాలని ఉబలాటం.
ఆయన ఫ్రెండ్లీగా నవ్వి ‘నొమొష్తే మాఁ… ‘ అన్నాడు.
‘నొమొష్టే ఒధికొ బాబూ… కేమిటి అఛొంతి? ‘
ఆయనంటే తనకి ఇష్టం. సర్వీస్ గురించి ఏ చిన్న కంప్లెయింట్ చేసినా డెడ్ సీరియస్ గా తీసుకుంటాడు, దవడలు బిగించుకుని. ఇలాటి రోయల్ టొబేకో కంపెనీ ఛైర్మన్ లాటి ఇనప డిగ్నిటీ అంటే ఇష్టం. తనని ఏదో దూరదేశం నుండి విజిట్ కి వచ్చిన యువరాణీ లాగా ట్రీట్ చేస్తాడు. ఇదంటే ఇష్టం. దగ్గరసా వెళ్తే కెయోకార్పిన్ ఆయిల్ వాసన వేస్తాడు చిన్ననాటి జ్ఞాపకాలని చివ్వుమని చిమ్ముతూ, ఈ వాసనంటే ఇష్టం. ఎప్పుడు పరదీప్ వచ్చినా కోణార్క్ శిల్పం లాగా స్థిరంగా తనకోసం పెద్దపెద్ద చేతులూపుకుంటూ ఈ డెస్క్ దగ్గరే …
ఇష్టంగా ఆయన్ని గురించి నవ్వుకుంటూ గ్లాస్ తలుపులు తీసి బైటికి చూసింది. వానజల్లు ఈదురుగాలి ఫెళ్ళుమని మొహంమీద కొట్టేయి. పచ్చరంగు రెయిన్ కోట్ వేసుకుని అల్యూమినం నిచ్చెన పట్టుకుని ఒకతను చప్పుడు చేసుకుంటూ వరండా లోంచి పరుగెట్టుకుంటూ పోయేడు. మెట్లు దిగుతుంటే వెనక నుంచి తలమీద నల్లగా పొడిగా విప్పుకుంది గొడుగు రూం సర్వీస్ బీహారీ పిల్ల
సువర్ణముఖి. ‘జోర్ రే బర్ సా హాఛీ’ అని నవ్వింది, కిళ్ళీ గార పట్టిన దానిమ్మ గింజలు ఎర్రటి పెదాల మధ్య విప్పుకుని. అలా కారణం లేకుండా నవ్వుతూనే ఉంటుంది … నవ్వుముఖి! అధికానంద గొడాయ్ పంపించేడు గొడుగు.
పనిపిల్ల గొడుగు పట్టుకుని వెనకే వస్తే పేంట్ పైకి ఎత్తి పట్టుకుని మెట్లుదిగి గోడ వారంట కిటికీ దగ్గరికి నడిచింది. బెంచీకీ గోడకీ మధ్య పొడి జాగాలో పిల్లిపిల్ల…… లేదు! నిరాశ జల్లు చల్లగా సూదిగా మొహంమీద కొట్టింది. సువర్ణముఖి ప్రశ్నార్థకంగా క్వశ్చన్ మార్క్ లాగ నిలబడి చూస్తున్నాది.
“బిల్లీ థీ… బిల్లీ!”
“బిల్లీ…?”
“హాఁ.. బిల్లీ!”
“బిల్లీఁ…? బర్ సాత్ మే..? ఇత్ నీ తూఫాన్ మే..?” మళ్ళీ కారణం లేని నవ్వులు నవ్వి గొడుగూ తనూ గాల్లోకి ఎగిరిపోకుండా రెండు చేతుల్తో గుంజి పట్టుకుంది.
“హాఁ.. హాఁ… బిల్లీ! యహాఁ.. పే..”
నిండా తడిసిపోయి సువర్ణముఖి మొహం పజిల్ లాగ పెట్టి “మేమ్ సాబ్ అని వానలో వణికిపోతున్నట్టు సంజ్ఞలు చేసి లోపలికి లాగుతోంది.
ఇసకలో క్రోటన్స్ పక్క నడుస్తూ కాఫీ రంగు వాన కాలవలో పిల్లలు వదిలిన కాయితం పడవలు దిగులుగా చూస్తూ సూర్యచక్రం చెక్కిన ద్వారం దగ్గరికి వచ్చి నిలబడింది. సువర్ణముఖి గొడుగు ముడిచి తలుపు తీసి పట్టుకుంది. లాంజ్ లో మేనేజర్ మళ్ళీ లేచి వంగి విష్ చేస్తే తనకి లోపల ఏదో ఉక్రోషంగా వెలితిగా ఒక మూల, ఎప్పటిలా రాయల్ గా ఆ చోళాకి ఈ మేర్చాకీ ఈ కళింగాకీ బోస్టన్ నుండి దిగిన రాణీ లాగ ఇంకో మూల. పరాగ్గా వెళ్ళి తలుపు తీసింది. రామ్ ఇంకా మోకాళ్ళేసుకుని బెడ్ మీద చదువుకుంటున్నాడు.
” Where’s the kitty?” అన్నాడు చదువుకుంటూనే.
“వెళిపోయింది”
“హుఁ ! ఎక్కడికెళ్ళింది చెప్మా..!” అన్నాడు పుస్తకం లోనే కళ్ళెగరేసి. విసురుగా కుర్చీలో కూలబడి “అబ్బా.. రాం I want that kitty” అంది.
” I don’t know why… I wanted that poor thing so … much. It isn’t fun to be a poor kitty out in the rain.”
రామ్ తదేకధ్యానంగా చదువుకుంటున్నాడు.
లేచి డ్రస్సింగ్ టేబిల్ ఎదురుగా బల్లమీద కూర్చుని హేండ్ మిర్రర్ లో మొహం చూసుకుంది, పరిశీలనగా. ముందు కళ్ళూ,ముక్కు, నోరు,… ఈ చెంప, ఆ చెంప, పెదాలు తడుపుకుని మళ్ళీ నోరు. తరవాత మెడనీ మెళ్ళో ముత్యాల గొలుసునీ జడ వచ్చి మెడ మీంచి గుండెల మీద పడటాన్నీ స్టడీ చేసింది. ఉన్నట్టుండి హెయిర్ క్లిప్ తీసి పడేసి జుట్టంతా విడిగా పరచుకుని మళ్ళీ అద్దంలోకి చూస్తూనే ఇటు తిరిగి ‘చూడు! ఈ hair style! ‘ అంది.
రామ్ క్షణం సేపు తలెత్తి చూసి ‘పాత జడే బావుంది లెద్దూ’ అన్నాడు.
“I get so tired of it. చూడు… ఇలా ఫోల్డ్ చేసి క్లిప్ చేస్తే బాగుండదూ…..?”
పైజమా సర్దుకుంటూ ఇటు తిరక్కుండానే “అబ్బా, పాతదే బావుందిలే లల్లూ..” అన్నాడు కొంచెం విసుగు తీగలా సాగుతుంటే “really” అని దాన్ని అదిమి పట్టి.
మిర్రర్ పక్కన పడేసి లేచి కిటికీ దగ్గరకి వెళ్ళి పైకి చూసింది.
మహానది సముద్రాన్ని కలిసే దగ్గర భూదిఙ్మండల రేఖ ఆవిరి లాగ అలుక్కుపోయి కళ్ళ నీళ్ళ పొరలోంచి అంతా ఒకే పెద్ద సముద్రంలా ఉంది. ఇంక చీకటి పడుతోంది.హెయిర్ పిన్ నోట్లో పెట్టుకుని వెనక్కి తిరిగి “ఇట్లా ఫోల్డ్ చేసుకుని క్లిప్ పెట్టుకుంటా…. That’s what I want to do …. and I want to have that kitty. I want it to sit in my lap and purr when I stroke him…. you know?!”
” O really?”
“చూడు ఆ వానలో… చెట్ల కిందకింద కూర్చుని చాయ్ తాగాల్నుంది. … వానలో తడుస్తూ పిల్లిపిల్లని పెట్టుకుని ఇలా బీచమ్మట నడుస్తూ … and I want new clothes…”
“అబ్బా…. ఏదో ఒక బుక్ చదువుకోవచ్చు కదా? Get something to read” అన్నాడు పుస్తకం లోంచి. హార్బర్ దీపాలు మినుకు మినుకుమని వానలో ఊగుతున్నాయి. బాగా చీకటి పడింది. పోకచెట్లు అరటి చెట్లు వాన పాటకి జీబూతాల్లాగా తలలూపుతున్నాయి.
“ఏయ్.. నాకా పిల్ పిల్ల కావాల్నాకు” అంది. ” I want it right now. If I cann’t have S-knot or a new dress or any fun, I can have a cat!”
రాం వినిపించుకోలేదు సరిగ్గా. బైట వరండాలో టార్చ్ లైట్ దీపం ఊపుకుంటూ ఎవరో. ఎవరో తలుపు కొట్టేరు. ‘ఖియే?’ అనరిచేడు తలుపుకేసి చూసి.
గుమ్మం బైట తడి బట్టల్లో సువర్ణముఖి నిలబడి ఉంది, లేత కనకాంబరం రంగు మచ్చల పిల్లిపిల్లని గుండెలకి హత్తుకుని. పిల్లిపిల్ల లలిత మొహంలోకి చూసి ‘ మియావ్ ఁ ‘ అని పలకరించింది.
“ఒధికో బాబూ అప్ ణోంకో పఁయి ఏ బిల్లీధా పఠిచొంతీ…”