తమాషా దేఖో 4

(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న నాగేశ్వరిి, ఆమె భర్త గోపాలరావు, వాళ్ళ బావగారు రవణరావు గారింట్లో ఉంటారు. గోపాలరావు కి ఆంధ్రాలో “అసలైన మనుషుల” జీవితాన్ని కళ్ళారా గమనించాలని కోరిక. అలా కృష్ణతో డంగలా దగ్గరకి వెళ్తారు గోపాలరావు, అతనికి పరిచితుడైన రాఘవరావు. రాఘవరావు కవి కూడా. అక్కడ ఆంజనేయవిగ్రహం దగ్గర సిందూరం బొట్టు పెట్టుకోవాలంటాడు కృష్ణ. రాఘవరావుకి అది నచ్చదు.వాళ్ళు డంగలాలో ఆదిబాబుని, జానీ ఎడ్విన్‌ ని, వాళ్ళ గురువు వస్తాదు అప్పలనారాయణనీ, కాకా హోటల్లో రుద్రమూర్తినీ కలుస్తారు. తరవాత క్రిష్ణతో బర్మా కోలనీలో సైటు మీదకి వెళ్తే అక్కడ ఎల్లమ్మ ఒక పాట పాడుతుంది. ఇక చదవండి.)

(కోటేశ్వర్రావు, వెనగ్గా సన్యాసిరావు ప్రవేశం. సన్యాసిరావు నడివయస్సు మనిషి. తెల్లటి కాటన్‌ చొక్కా తెల్లటి పేంట్‌ తొడుక్కుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని అందరికేసీ కులాసాగా నవ్వుతూ ఉంటాడు. చేతిలో లెదర్‌ బేగ్‌ ఉంటుంది.)

కోటి ఏటండీ మావోడి చేత ఇంగ్లీషు పాటలు పాడిస్తనారా?

సన్యా (కలగచేసుకుని) చూడండి…… కోడి గారూ ఔట్‌ డోర్‌ టీమూ షూటింగ్‌ కొస్తన్నారు. మనోడి దెగ్గిర మంచి ఫాస్ట్‌ సాంగ్స్‌ ఏవేనా ఉంటే చూడండి …… చెప్పిద్దాఁవు!

కోటి వీరు ప్రొఫెసర్‌ గోపాల్‌ ఫ్రం యూఎస్‌ అండ్‌ దిసీజ్‌ డాక్టర్‌ రాఘవా ఆర్‌ నీలం ఆల్సో ఫ్రం దీ యునైటెడ్‌ స్టేట్స్‌….మన ఎన్నారై నగర్‌ లో గానీ బే పొయింట్‌ ఎక్స్టెన్షన్‌ లో గానీ మంచి ప్రీమియం లొకేషన్లో ఉన్నాయి చూడమనీసి ఎడ్వైజ్‌ చేస్తనాఁవండి. మంచి లిటరేచరూ టేష్టూ అదీనండి సినిమా సాంగ్స్‌ లైక్‌ చెయ్యకపోవచ్చు….

సన్యా (ఇద్దరితో షేక్‌ హేండ్‌ చేసి, చనువుగా) తీస్సుకోండి కొని పడెస్తే మీ పేరుమీద పడుంటాది….ఇది మీ ఎన్నారైస్‌ కి స్పెషలండీ గేటెడ్‌ కమ్యూనిటీ స్విమ్మింగ్‌ పూల్‌ స్పా…..

ఎల్లమ్మ వొయికుంఠం నాగుంతాది బాబూ……నోపటి కెల్తే బయిటికి రాలేవు…..

తాతబాబు నోపటికి నిన్నెవుల్రానిస్తారు?

రాఁవు పొట్టప్పారావూ నీనూ ఎల్లమ్మె స్లాపులకి సున్నఁవల్ల కలిపేఁవు….నోపటికొచ్చి సూస్తాఁవంటె ఒద్దంటాడేటి బాబు….?

ముత్తేలు సెక్యూర్టీ తిరిగీ సూసుకో అకర్లేదు సార్‌…మిషను గేటు పెట్టించేరు బాబు. నోపట అరోవ్‌ మెంటంతా ఫారన్‌ లాగే ఉంటాది సార్‌…..కిచిన్సు బ్రీమ్సు కోళమ్సు గేరేజీసు ఇంట్ర కిటికీలు సవర్సు పిట్టింగ్సన్ని తమరికి స్టేట్‌ లోన ఏ పకారఁవుంతాయో ఇక్కడలాగ అచ్చు బొమ్మ దింపీసేఁవండి…. మీకేం తేడా లేదు….(సన్యాసి రావుతో) ప్రభావతమ్మాల అల్లుడొచ్చి చాలా ఏపీ అయిపోయేరు సార్‌ ! ‘అత్తమ్మా! ఏటి మీ ముత్తేలిక్కడ ఇండియాలోనే అమిరికా సెట్టింగు సూపించేడు……ఈ పాలరాయ మెటీరూ గిటీరూ సూస్తంటె నాకెనక్కెల్లా ల్లేదత్తమ్మా’ అంతారు. వారు శానా నైక్‌ చేసేరు సార్‌!

కోటి చిన్న కుర్రాడేనండి……….

సన్యా కుర్రాడయితే ఏఁవండి……..దేశంలోని సగం డబ్బు కుర్రాల కాడే ఉన్నాది………. క్లబ్‌ హౌస్‌ చూసొచ్చి ఎంటనే చెక్కు రాసిచ్చీసేడా కుర్రాడు. క్లాస్‌ లైకింగ్‌ వేరూ మాస్‌ లైకింగ్‌ వేరనుకోండి. (క్రిష్ణని చూసి) ఏంటి యంగ్‌ మేన్‌ సాంగాపీసేవు? డ్యూయెట్లు రాస్తావా చెప్పు మెడ్రాస్‌ ట్రిప్పెరేంజ్‌ చేస్తాను……

రాఘ ఏంటితను సినిమాలకి రాస్తున్నాడా?

క్రిష్ణ (కంగారుగా) అబ్బెబ్బే! లేదండీ..అప్పుడెప్పుడో ఒక సారి మా బావగార్రాయించేరు……..

సన్యా ఆ మధ్యన రాసేవని డైరెక్ట్రు గారికిమ్మనీసి పాటలు తెచ్చి చూపించేడు మీ బావ? ఏటదీ…? (జ్ఞాపకం చేసుకుని)
మెచ్చానే మెరుగుడూ నచ్చానే నలుగుడూ
లబులు గుబ్బా లవంగి దెబ్బా……?

(క్రిష్ణ ముఖం అటు తిప్పుకుని పని వాళ్ళకేసి నడవటం చూసి)

సన్యా టేలెంటుందండీ….టాప్‌ చెయ్యాలంతే! (గోపాల్‌ రాఘవతో) ఏంటండీ ఎప్పుడొచ్చేరూ enjoying yourself…? న్యూయార్కా కేలిఫోర్నియా సౌతా నార్తా ఈష్టా వెష్టా ఏంటి is everything comfortable here?…… ఊఁ…?

గో Very much so, thank you! …..ఈయన ఆరెగన్‌ నేను కాన్సస్‌……కంఫర్ట్‌ దేవుందండీ its always a pleasure to visit home!

సన్యా ఊఁ హుఁ! ప్లెజరంటే నిజఁవే లెండి గానీ…. అక్కడలవాటయిపోయేక ఇక్కడ కష్టం లెండి…

రాఘ (అనుమానంగా) Are you from the states??

సన్యా (చప్పట్టు కొట్టి) అమ్మా పోల్చీసేరేటండి? What makes you think so?

కోటి ఆ ‘ ఊఁ హూఁ ‘ బట్టి చెప్పీసుంటారండి. (రాఘవతో) ఏఁవండీ?

రాఘ Exactly….

కోటి మన వాళ్ళయితే ‘ఆహాఁ’ అంటారు ‘ఓహో’ అంటారు…..’ఊఁహూఁ’ అన్నాడంటే అమిరికా ఎళ్ళొచ్చినట్టే లెక్క. అమిరికా వోళ్ళని వాటం బట్టి చెప్పీయొచ్చండీ! మొన్నోరోజు మీ లిల్లీ నేను ఇంట్లోకెళ్ళ కుండానే గేటు మీంచి గెంతొచ్చి ఎగిరి నా భుజం మీద కూర్చుంది. దిగవే అంటే దిగదూ! ఎప్పుడొచ్చినా గుర్రుమని కరిచీలా ఫేస్‌ పెడుతుంది ఏట్రా ఇవాళ దీనికింత లవ్వు అని కూపీ లాగితే చివరికి ఏటో తెలుసండీ….?

తాత (కాఫీలు పంచుతూ) చంక ఫినాయిలు బాబూ! చంక ఫినాయిలు!! వోసన బట్టి చెప్పెస్తాది బేపి!!!

ముత్తేలు నువ్వు నోరు మూసుకో రబ్బాయ్‌ నీకక్కర్లేని సంగతి లేదు!

రాఁవు బెంద ముక్కలిమ్మన్నానా? బేపూసు నీకెందుకురా బాడుకోవ??

తాత కాపీ యివ్వకపోతే నువ్వూరుకుంతావా మేస్త్రమ్మా? ఈవలొట్టిపోయి సచ్చిపోవా….?

సన్యా Lily is an American all the way! దాని బ్రేక్‌ ఫాస్టేటో తెల్సండి? కార్న్‌ ఫ్లేక్స్‌ ….!డీయోడరంట్‌ ఏసుకున్నోడెవడైనా సరే! ప్రేమ!!….సెంటైతే ఇంక చెప్పేరా?! (రాఘవతో) యు అర్‌ రైట్‌ అన్‌ ద మనీ అండీ….మనం మిన్నెసోటా…నైన్‌ టీన్‌ సెవెంటీ సిక్సు….

గోపా ఏంటి వెనక్కొచ్చి సెటిలయిపోయేరా?

సన్యా అవునండీ ఏన్సెస్ట్రల్‌ ప్రోపర్టీసవీ ఇక్కడున్నాయీ! నాకు మన తిండీ గిండీ మన జనాలుండాలండీ…ఏదో మనకున్న మడిచెక్క మేనేజ్‌ చేసుకున్నంత ఉత్తం లేదు చూడండి…

రాఘ ఏం చేసేరండీ మిన్నెసోటాలో?

సన్యా ఎమ్మెస్‌ చేసేనండీ. పీ హెచ్‌ డీ రిజిస్ట్రయిపోయేను….ఇవతల మా మదరాళ్ళు పెళ్ళి చేస్సుకో ఇండియా వొచ్చీమని గొడవా! అప్పట్లో మీ స్టేట్స్‌ లో ఎన్విరానమెంట్ల మూవ్‌ మెంటు మాంచి ఊపు మీదున్నాది కదండీ….మా ఫాదరు గాంధీ భక్తుడు మనం కూడా యువక రక్తం అయిడియలిజం. పీ హెచ్‌డీ చేస్తే గాని దేశం రానన్నాను…అవొక రోజుల్లెండి….

రాఘ మరేం వెనక్కొచ్చీసేరు? అక్కడ నచ్చలేదా…?

సన్యా అదొక్కధ లెండి!

రాఘ కధయితే చెప్పండి మరి! అదుగో క్రిష్ణ చూడండి వింటున్నాడు……కధలంటే చెవి కోసుకుంటాడు!

సన్యా (క్రిష్ణతో) ఏటి రాసెస్తావా? (రాఘవతో) ఒద్దు లెండి మీరక్కడున్నారు కదా! మీకు సోషల్‌ వర్కంటే ఇష్టవంట కదా కోటీ గారు చెప్పేడు. మీకెందుకనవసరంగా మీ బుర్ర పాడు చెయ్యటం….వెంకటేశ్వర్లు గారనీసి మన గురువు గారున్నారిక్కడ. ఆయన్నీ మంగవేణ్ణీ చెట్ల పంతులు గార్నీ అలాటోల్ని కలవండి మీకు బెష్టు…..శివాలయంలో ఎవ్విరి సండే మీటవుతుంటారు. అలాటి మహానుబావుల్ని కలిసి ఆల కధలు వింటే మీకూ ఉషారుగా ఉంటాది……నా కధలూ మా కోటీ గారి కధలూ ఏటి వింటారు మేఁవు జనాల మజ్జిన తిరిగి తిరిగి దెబ్బల్తినీసి రాటుదేలిపోయున్నాఁవు! మా నోళ్ళు తిన్నగా రావు!! ఏం కోటీ గారు?!

కోటి ఈయనలాగంటారు గాని ఈయిందీ మీలాగే జాలి గుండేనండి. కార్తీక నెత్తాళ్ళకి ఈళ్ళింటి ముందు చూడాలి….కార్తీక మాసఁ వొచ్చిందంటే చేతికెముకే వుండదు గురువు గారికి!

గోపా ఎవరండీ వెంకటేశ్వర్లు గారూ…….ఆయన గురించి ఇద్దరు ముగ్గురు చెప్పేరు?

క్రిష్ణ మదీనా ఫౌండేషన్‌ డైరెక్టరు.

రాఘ పరవాలేదు చెప్పండీ…..We are always interested in stories like yours. అసలు నేనూ గోపాల్‌ గారే ఎనక్కొచ్చెద్దాఁవనుకుంటునాం? Thats why I’m asking! ఏం మీకు స్టేట్స్‌ లో నచ్చలేదా?

సన్యా నచ్చడవంటే…..ఆర్క్‌ అనీసి విన్నారా? ఆర్సెనిక్‌ రీసెర్చ్‌ సెంటరనీసి?

గోపా ఆఁ ఆఁ…?

సన్యా అది మా ప్రొఫెసర్‌ స్టార్ట్‌ చేసిందేనండి…ఎవడో కాదు మనోడే! రెండేళ్ళు డేటా అంతా గేదర్‌ చేసి గ్రేంట్లొచ్చీ వరుకూ మర్యాదగా వున్నాడు. ఓ రెండు మిలియన్‌ డాలర్‌ గ్రేంట్లందుకుని ఇంక ఎటూ ఎళ్ళలేఁవనుకున్నా డెప్పుడో ఎబ్యూజ్‌ చెయ్యడం మొదలెట్టేడు. మనఁవేదో సేవింగ్‌ ది ఎర్త్‌ ఇలాగనీసి మనఁవు! ఊఁ…?

గోపా కంప్లెయిన్‌ చెయ్యాల్సిందీ!

సన్యా ఏటి కంప్లెయింటండీ గురువు మీద దావాలూ తంటాలూ తెచ్చే కల్చరు మనకి తెలీదు కదండి. ఐనా మనకి అప్పట్లో అంత రాజకీయం తెలీదు లెండి…అసలు పొలిటికల్‌ ఏంగిలే తెలీదు! మా ఫాదరు సిటింగ్‌ ఎమ్మెల్యే మళ్ళీ!! పండిత పుత్రుడు సుంఠన్నట్టుగయ్యింది నా పని. మనకెంత సేపూ ఏదో థర్డ్‌ వరల్డ్‌ కంట్రీస్‌ లో నీళ్ళలోన ఆర్సెనిక్‌ తాగి దిక్కులేని జనం కాళ్ళు పోయీ కళ్ళు పోయీ ఏడుస్తనారు మనం ఇక్కడ చదివి ఇండియా ఎళిపోదాఁవు ఏదో చేసెద్దాఁవనీసే మనకెంతసేపూ…..

కోటి మన పిలక అవతలోడి చేతిలో టిక్కడిపోయేక ఇంక పీక్కో రావాలంటే అంతీజీ కాదండి.

రాఘ ఏంటి వెర్బల్‌గా ఏమన్నా అన్నాడా?

సన్యా అదీ ఉందనుకోండి….తిట్లూ బెదిరింపులు! ఇంక ప్రాణం విసుగేసి ఫ్రైడే ఈవెనింగొకరోజెళ్ళి పట్టుమీదున్నప్పుడు నిలదీసి అడిగీసేను. ‘ ఆర్సెనిక్కన్నావు ఇనిస్టూటన్నావు కుళ్ళు లఫడా రాజకీయం ఆడుతున్నావు ఏటి గురూ నీ సంగతని?’ ఏటన్నాడో తెలుసండీ? You know Sunny? When I was a naive son of a gun like you, I used to dream just like you – like I was going to slog my butt off and save this world! It doesn’t work thata-way…..This isn’t about Arsenic in some god forsaken back-waters of Bangladesh and India, this is about me! This is about us!! అన్నాడు. You’re a big boy now! Do I have to tell you everything? అన్నాడు. పోయింట్‌ బ్లేంక్‌ ! అంతే! ఇక్కడుండి నీ కాడ నేర్చుకునీ కంటే ఎళ్ళి మా డాడీ కాడే నేర్చుకుంటాన్రా రాజకీయం అని ఆ మర్నాడే ఫ్లైటెక్కొచ్చీసేనండి……ఏటి మీకు బోరెస్తనానా?

గోపా Just a bad apple….

సన్యా (గట్టిగా బొజ్జ కదిలేలా నవ్వుతాడు) ఏపిల్సు చూడ్డానికన్నీ ఒక్కలాగే ఉంటాయండి ఏ పండెలాటిదో పసిగట్టాలంటే మన కోటీ గార్లాటి దురంధరుడు గావాలండీ మీ లాటి నాలాటి ఆర్న్డరీ పీపుల్‌ వల్ల కాదు….

కోటి ఏటండి బాబూ మీ సుడి తెచ్చి నా పీక్కి చుట్టెస్తనారు….మంచి వాళ్ళే!

సన్యా అమ్మా కోపగించుకోకండి..మీరు చాణక్యా మేఁవు చంద్రగుప్త…..అదీ నేనన్నది!

రాఘ (ఆసక్తిగా) అదే మీరయితే ఏం చేస్తారు కోటీ గారూ?

కోటి తలుపులు మూసి కొడితే పిల్లి వంటిది తిరగబడుతుందండీ……సామ దాన బేధ దండోపాయాలని ఉపాయాలు నాలుగు రకాలు. ఈల గురువు గారెవరో ఆ సిట్యువేషనేటో మనకి తెలీకుండా ఏటి చెప్తాఁవండి…….రాయి కింద చెయ్యి పడిపోతే అలుకువగా మెలుకువగా చెయ్యి బైటికి తీసుకోవాలి…ఉక్రోషానికి పోతే మంచెయ్యే రక్కుకు పోతుంది………

సన్యా అతగాడి తప్పు లేదు లెండి. ఎవడి ఏంబిషన్‌ ఆడికుంటాది కదా! తెలివైనోడికి మరీ ఎక్కువగా ఉంటుంది. మా ఫాదరు సెనేట్‌ మెంబరుగున్నప్పుడు తిండీ తిప్పల్లేకుండా ఏ రాత్రనగో ఇంటికొచ్చి కర్రా కండువా ఉయ్యాలమీదిసిరీసి…..యూనివర్సిటీలో నడిచినంత వరష్టు పోల్టిక్స్‌ మన పార్టీలో కూడా లేదురా సన్ని బాబూ అనీవోడు …….ఈ దునియావే అలాగ నడుస్తంది. ఆడు ఎంత సేపూ పవర్‌ పవర్‌ అనీవోడండి నాకు అర్ధఁవయ్యీది కాదు……ఇప్పుడు వేరనుకోండి….రాటుదేలిపోయున్నాఁవు.

కోటి యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అన్నట్టుగా బెల్లమ్ముక్క వున్న చోటల్లా ఈగలు ఝుమ్మని తిరుగుతుంటాయి. పవరున్న చోటల్లా పోల్టిక్స్‌ ! యూనివర్సిటీలో జాయినవక ముందు యూనివర్సిటీ అంటే భయం భక్తీ ఉండీవండి. అన్ని కాలేజిలూ తిరిగి రెండెమ్మేలూ ఓ ఎమ్మెల్‌ చేస్సేక ఆ గుండు గొమ్ములనుమానం తీరిపోయింది! డబ్బూ చదువూ పవరూ ఈ మూడూ నిజానికి ఒకటేనండి, వేరే వేరే కావు. అందుకే తెల్లోడు నాలెడ్జీజ్‌ పవర్రా కుఁయ్యా అన్నాడు. నన్నడిగితే మనీ ఈజ్దీ నాలెడ్జ్‌ ఎండ్‌ పవర్రా అన్నా! గువ్వల చెన్నా!! అని రివర్స్‌ పీకేవాణ్ణి.

గోపా పవర్‌ అంటే అదొక అంటరాని వస్తువులాగ మాటాట్టం మనకి అలవాటయిపోయిందండీ. Power can be power to get something done…. మీరు బెల్లమ్ముక్కన్న్నారే….Thats called an agenda. Everybody in every situation has an agenda. When agendas clash you have a conflict. అందరికీ fairగా ఉండేలాగ conflict resolve చెయ్యడానికే పోల్టిక్సు…Politics అంటే working with people అండీ అంతకంటే ఏం లేదు.

క్రిష్ణ అయితే ఏ ఎజెండా లేని వాడికి ఇంక రాజకీయం అక్ఖల్లేదు?

కోటి ఏ ఎజెండా లేనిదెవరికి…..అప్పుడు పుట్టిన పిల్లడి దెగ్గిర్నుండి అందరికీ ఏదో వొకటి కావాల్నే ఉంటాయి రిక్వైర్‌ మెంట్సు.

గోపా అవసరాలు వేరు కోరికలు వేరు. ఎంత కష్ట పడి గింజుకున్నా తిండీ గుడ్డా కూడా సరిగ్గా లేని వాళ్ళు ఏ దిక్కూ మొక్కూ లేని జనం కోట్ల కొద్దీ ఉన్నారు. వాళ్ళకి కడుపు మండితే ఎక్కడికి పోతారు ఎవరితో చెప్పుకుంటారు……..ఆయనయితే ఇక్కడ దన్నుంది కాబట్టి when he didn’t like it up there he could just walk away.

రాఘ Thats why the fundamental tenet of neo-progressive ideology is empathy. Not your pity but your empathy –

కోటి అవసరం తీరనంత వరుకేనండి. అది తీరిపోయేక ఇంకేదో కావాల్ని ఉంటాది. ఇదిగో మా ముత్తేలున్నాడు కదా! ఈ తాతబాబంతప్పుడు ఆళూర్నుంచి ఇక్కడికొచ్చి తుండూ నైఁ గుడ్డా నైఁ నెమ్మదిగా కోటలో పాగా ఏసేడు. ఇప్పుడీ చుట్టు పక్కల ఏడు జిల్లాలకి ఇతగాడే పెద్ద మేస్త్రి….వాడ బలిజి గృహ నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి! (చెయ్యి గాల్లోకి ఎత్తి) ఆర్నెల్లార్నెల్లకీ రేట్లు అలాగలాగలాగ రైజ్‌ చేసెస్తనాడు. ఇంక నాలుగేళ్ళాగితే ఇతన్నందుకో లేఁవు.

ముత్తేలు కింద నుండి పైకి రావలిసిన మనిసిని బాబూ నామీద్దయుంచండి….తెల్లార్లెగిస్తే మొకాలు మొకాలు చూసుకునేవాలం ఏఁవిండంటే ఏఁవిండనుకోవాల….మీకే మా మీద కన్నెర్రయితే మేం బతగ్గలవాఁ చార్‌!

కోటి (అల్లరిగా) కిందనుండి పైకే వొస్తావో పైనుండి కిందకే ఎల్తావో?!

సన్యా కబుర్లు బాగా నేర్చీసేవు. ఇంక పోల్టిక్స్‌ లోకి దిగిపో. ఈ నియోజక వర్గం మీవోల్దే కదా…..

ముత్తేలు తమ దయ వల్ల మనకంతాశి లేస్సార్‌ ! మీకాశుంతాది బాబూ మీకు రూపాయి కాడ రూపాయి శాన. నాకాశుంతాది బాబూ నాకు రూపాయి కాడద్దురూపాయి శాన. మన కోటి బాబు కాశుంతాది అయనుకి రూపాయికాడ ఎయ్యి రూపాయిలు కావాల. (ఆకాశం వేపు చూపించి) ఎవులాశలెలాగుంతాయో అదా బహువంతుడి నిర్ణాయకం బాబూ మంచేతులో వున్నాదా చెప్పండి…..

కోటి (రాఘవతో నెమ్మదిగా) మనం మొహం అటు తిప్పీసరికి సిమెంటు పాళ్ళు నప్పించెస్తాడు… ఈడి వైరాగ్యం చూడండి!

సన్యా ఆశుంటాది ముత్తేలూ హ్యూమన్‌ నేచరదీ! దానికి మనఁవేటి చెప్పలేం!!

కోటి పరిస్థితులు ఆశాజనకంగా వున్నాయీ అంటారు కదా. ఆశ లేకపోతే ప్రపంచఁవే లేదు. అమెరికా వోడు ఆడెకానమీ అంతా ఆశ మీదే బేస్‌ చేసి బిల్డప్‌ చేసేడు. మరివాళ ప్రపంచఁవల్లా ఆడి కాళ్ళ కాడికొచ్చి అద్దీ అద్దీ అని ఆడతనాఁవా లేదా!

గోపా ఏఁవండి కోటీ గారూ? Your philosophy is one hundred percent American! మీరు స్టేట్సొస్తే చాలా షైనవుతారు….

కోటి (పొంగిపోయి) ఫ్రెండ్సంతా అదే అంటుంటారండి. మన వాళ్ళు చాలా మందే ఉన్నారు కదండి. అక్కడ డబ్బుని ‘కే’ అంటార్ట కదూ? మరి మన లెవిలుకి తగ్గట్టుగ నెలకో హండ్రడ్‌ కే ఇచ్చినోడెవడేనా ఉంటే సెట్‌ చెయ్యండి సర్వ సంగ పరిత్యాగుల్లాగ అన్నీ ఒదులుకుని చిలకట్టెగ్గట్టీసి మీ యెనక విమానంలోనే దిగిపోతాను. పాస్‌ పోర్ట్‌ గట్టా రడీ పెట్టేను…గానీ…..! విజువల్‌ బేసిస్‌ అంటే ఏటండి? అది లేక పోతే అమిరికాలో నిలదొక్కుకో లేవు చిన్నానా కష్టం అన్నాడు మా దొడ్డ గారి మనవడు?

రాఘ నెలకి హండ్రడ్‌ గ్రాండా? డాలర్లే??

కోటి ఏం ఎక్కువడిగేనా? కొడితే ఏనుగు కుంభ స్థలం కొట్టాలి! నెలకి లక్షంటే ఇక్కడ ఏఁవీ కాదండీ. మీ అమిరికావోడే రంగం లోకి దిగి ఇక్కడంతా డాలరెకానమీ నడుపుతునాడు. స్టైలుగా ఉంటుందని కిన్నెరాలో మంగల్షాపుకెళ్ళి మర్దనా చేయించుకుంటే ‘ఫైవ్‌ డాలర్స్‌ ఎండ్‌ టిప్‌ ‘ అన్నాడా గుంటడు! హైడ్రాబాడ్‌ స్పైస్‌ ఆఫ్‌ దీ లైఫ్‌ లో ఇద్దరు భోంచేసి కిల్లీ ఏసుకుంటే ఆరువేలు బిల్లుటండి. రూపాయిల రోజులు పోయేయి……

గోపా (నవ్వి) రండి ఒచ్చెయ్యండయితే! మీ చిన్నప్పుడు టైపూ షార్ట్‌ హేండ్‌ ఎలాగో ఇప్పుడు విజువల్‌ బేసిక్‌ అలాగ! మీ లాటి ఘటికుడికి కొత్త విద్యలక్కర్లేదు. Yours is the grand daddy of all agendas!

క్రిష్ణ ఋషులనీ sages అనీ అంటారు కదా…..వాళ్ళకి ఏ ఎజెండాలూ ఉండవూ!

కోటి బలే వోడివే….బాల్‌ కే బచ్చా గాడివి కాషాయంలో కుషామత్తు నీకేటి తెలుసు? స్వామీజీలకి ఉన్నన్ని రిక్వయిర్మెంట్లూ మడత పేచీలు మానవ మాత్రుడికి లేవు. సాయి గురు దత్త పూర్ణానందా దెగ్గిరికిరా……రూపాయిల తులాభారం టేస్టేటో చూపిస్తాను…! కౌపీన వంతహా ఖలు భాగ్య వంతహా అన్నాడు.

సన్యా ఏటండి కోటీ గారు ఈ మధ్యన శ్లోకాలు దంచెస్తనారు బీజేపీలో గట్టా జాయినయిపోయేరా కొంపదీసి?

కోటి మంచి పనే శ్లోకం చదివిన ప్రతీ వోడూ బీజేపీవోడి కింద లెక్ఖేనేటండి? మా నాన్నగారి కడుపున పుట్టినందుకు చాప చిరిగినా చదరంతని సమయా సమయాలొచ్చినప్పుడు మనకి జ్ఞాపకం వున్న ముక్కలు నాలుగూ వొదిల్తేనే కదండి చమక్‌!

గోపా రాజమండ్రి నుండొస్తుంటే యెల్లో రోబ్స్‌ గెడ్డాలతో పెద్ద పెద్ద కటింగ్స్‌ పెట్టేరూ?ఆయనా??

క్రిష్ణ ఆయన కాదండీ ఆయన సత్య ప్రేమ్‌ జీ యశ్‌ రాజ్‌ గిరి!

కోటి ఆయన వేరండీ….చూడ్డానికొక్కలాగే ఉంటారు గానీ ఆళ్ళిద్దరికీ కాంపిటీషను మంచి టకాఫోరు మీదున్నాది. బీసీలందరూ సత్య ప్రేంజీని లైక్‌ చేస్తనారు సార్‌ ఓసీలు సాయి గురు దత్తా సైడండి. కటౌట్ల విషయంలో సత్య ప్రేంజీ ఈజ్‌ దీ బెష్టు గానండి సాంస్క్రిట్‌ శ్లోకాలు కాయితమ్ముక్క చూడకుండా గడ గళ్ళాడి చదవాలంటే మటుకూ సాయి గురు దత్తా ఇంక న్నో క్కంపేరిజన్‌! క్లాస్‌ గురూ వెర్సస్‌ మాస్‌ గురూ అని న్యూస్‌ వీక్‌ లో వేసేడు చదవలేదా?

క్రిష్ణ మున్సపల్‌ స్టేడియంలో మీటింగున్నాది…..ఈ శని వారం…..గురు దత్త యజ్ఞం….

రాఁవు సాయి గురు దత్త మహారాజా బాబూ? ఆయిను శానా మహిమున్న స్వామి…. జ్యోతిర్లింగాకార పరమాత్మనీసన్నాడు కదా? (కళ్ళు మూసుకుని తన్మయంగా జపిస్తుంది) జ్యోతీ వోం! జ్యోతీ వోం!! జ్యోతీ వోం!!! ఆయన అనుగ్రహించితే బంగారం బీజాక్షరాలు రేకు పంపించుతాడు…అది నూటొక్క మంది చేత నూటొక్క రేకులు చేయించి మళ్ళీ వారికి పంపించితే రాజమండ్రి గోదావొరొడ్డున సహస్ర చండీ యాగవూఁ రస లింగ ప్రతిస్టకెల్తారు……మా ఈరకత్తెకిచ్చేరు! కలట్ర గారి పెళ్ళాఁవు మహా భక్తురాలు! ఆయమ్మక్కూడా ఇవ్వనేదు. ఆ దత్తనుగ్రం ఉండొద్దా బాబూ!

క్రిష్ణ పోజిటివ్‌ ఔరా ఉన్న వాళ్ళనే బీజాక్షరీకి సెలక్ట్‌ చేస్తారు. మీ వీరకత్తెది పోజిటివ్‌ ఔరా కావోలు!

గోపా (ఆశ్చర్యంగా) How come you know so much about all these swamijees?

కోటి అమ్మ బలే వోళ్ళే మావోడికీ నాకూ స్పిరిచ్యువల్‌ ఏస్పెక్ట్‌ మీద వుయార్‌ మేగ్జిమమ్‌ ఇంటరెస్టెడ్‌ సార్‌…! ఇదుగో గురుదత్త యజ్ఞం ఫ్లైయరు…మీ మిస్సెస్‌ గారికివ్వండి!

గోపా (తీసుకుని చూస్తూ) ఓహో! Seekers after truth…?!

రాఘ అందరి ఎజెండాల గురించీ చెప్తారు..మీ సంగచ్చెప్పండి కోటీ గారూ. What is your agenda?

కోటి మంది స్పిరిచ్యువల్‌ ఏంగిలండీ ఇన్ని తగువులెందుకూ ఒక్క ముక్కలో చెప్పమన్నారా?

గోపా చెప్పండి?

కోటి (గంభీరంగా) ఏం లేదండీ ఈ స్వామీజీలూ అవీ ఏదో ఉండబట్టక వెళ్తాఁవనుకోండి గాని టైం వేష్టండి! శుద్ధ దండుగ!!

రాఁవు నీకు నచ్చకపోతె ఒల్లకోరాదా సత్యం గలిగిన దేవుణ్ణి దండుగనిస్తావా బాబూ? పెచిక్ష కవిలాసం! అపశారం!!

కోటి నువ్వుండు నీది భక్తి మార్గం. ఇల్లిటరేట్‌ లేడీస్‌ కి మూఢ భక్తి బెష్టనుకోండి. కానీ…..(కళ్ళు మూసుకుని, గొంతు సవరించుకుని) ఏంలేదు సింపుల్‌…….. (ఆకాశంలోకి చూపించి) పూర్ణమదహ్‌ ! దటీజ్‌ ఫుల్లు?!

గోపా (ఆసక్తిగా) ఊఁ?

కోటి (గుండెమీదికి చూపించుకుని) పూర్ణ మిదమ్‌ ! దిసీజ్‌ ఫుల్లు!!

గోపా ఊఁ??

కోటి (చేతులు అంజలి ఘటించి) పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే! ఇఫ్‌ యూ ప్లీజ్‌ టేక్‌ ఫుల్‌ అవుటాఫ్‌ ఫుల్‌ దటీజాల్సో ఫుల్‌ లైక్‌ దిస్‌ ! ఇంతేనండి!! ఇంతకంటే ఏం లేదు. అన్ని శాస్త్రాలు పురాణాలు మేగ్జిమమ్‌ కాచి వడబోసి చివరికి తేల్చిందేటంటే……ఇటీజ్‌ జస్ట్‌ ఫుల్లు!! (నర్మ గర్భంగా) మీరర్ధం చేసుకుంటే మరి మా ఎజెండా మీ ఎజెండా అన్నెజెండాలూ అందులోనే ఉన్నాయి.

రాఘ (వినోదంగా) సింపుల్‌ గా తెగ్గొట్టేరు!

కోటి సింపుల్‌ అంటే…….అన్నేంగిల్స్‌ లోనూ థింక్‌ చేసేకే కదండి కరతలామలకం అన్నాడు!జ్ఞానఁవనంతం; కాలం బహు స్వల్పం; కనుక విషయఁవల్లా విని సారాంశాన్ని గ్రహించాలి!

సన్యా నన్నడగండీ నేన్చెపతాను. ఏ జెండా పవర్లో ఉంటే ఆ జెండా కి జెండా ఎత్తడఁవే కోటీ గారెజెండా! (అందరూ నవ్వుతారు)

కోటి మీ గురించిన విషయం నా మీద పెట్టి చెప్పెస్తనారు. నాదేటుందండి సింపుల్‌ ఎజెండా పెళ్ళం పిల్లల పేరుమీద చెరుకో కోటి రూపాయలూ చేసుకుని ముగ్గురు పిల్లలకీ మూడిళ్ళూ కార్లూ వ్యవహారం ఫైనలైజయిపోతే తరవాత ఈ భవ బంధ సాగరం ఇదెందుకండి వెధవది ముతక ఖద్దరు గుడ్డలూ, హవాయి చెప్పులూ ధార్మిక ప్రచారానికి ఒక సంచీ ఏసుకుని నేనూ మావోడూ ‘ఏక్‌ నిరంజన్‌ ‘ అని ప్రజా జీవితం లోకి దిగిపోతాఁవు…..మా సన్యాసిరావు గారి వంటి పెద్దల ఆశీర్వాద బలం ఉంటే చాలు…

సన్యా డ్రస్సేసుకోవాలని మా కోటీ గారికి చెడ్డ బులపాటంగా ఉందండీ!

కోటి అదీ ఆలోచించేఁవండీ. కాషాయం స్వామీజీలకి బుక్కయిపోయింది, వైటు కాంగ్రెస్‌ , బ్లాకు అయ్యప్పస్వామి, యెల్లో తెలుగు దేశం, ఆకుపచ్చ బాబా దర్గా, ఎరుపు బెజవాడ కనక దుర్గమ్మ, నీలం గరల్స్‌ కాన్వెంటు, ఖాకీ పోలీసోడు, వైలెట్‌ రైల్వే గేంగిమేన్‌ , బ్రౌను పోస్టుమేన్‌ ఇంక గులాబి రంగొకటి మిగిలిందండీ….చిత్ర విచిత్ర స్థల విక్రయానంద డం డం బాబా అని మా క్రిష్ణ నాకు పేరు కూడా పెట్టేడు. ఈ రియలెస్టేటు వ్యాపారం చూస్తే పడుకునీటట్టున్నాది ఇంక నేనూ మావోడూ గులాబి రంగు డ్రెస్సులేసుకుని ఆధ్యాత్మ రంగంలోకి దిగిపోతే బెష్టండి! తెల్లార్లెగిస్తే ధూప దీప నైవేద్యాలకేఁవీ లోటుండదు!!

క్రిష్ణ మీరు దిగండి నేనెందుకు…..

సన్యా నీ ఎజెండా ఏటమ్మ క్రిష్ణా? కవీశ్వరుడివైపోయి నోబుల్‌ ప్రైజు కొట్టీయాలనేనా?

క్రిష్ణ ఎల్లండి సార్‌ నేను స్టేట్స్‌ వెళ్ళి చదువుకుంటాను……రాఘవ రావు గార్లాగ.

రాఘ మీ వాడ్ని స్టేట్స్‌ తీస్కెళిపోతాఁవండీ!

కోటి అందుకు సందేహఁవా……మా క్రిష్ణ లాటి ఇంటలెక్చువల్‌ అనవసరంగా నీ ఎనక తిరిగి చెడిపోతున్నాడని మా అత్తగారు ఒకటే నస…ఆవిడి సణుగుడేనా తప్పుతుంది నాకు తీసుకుపొండి.

గోపా I think she is right…! You should study as much as you can.

కోటి మిమ్మల్ని మీటయిందెగ్గిర్నుండి జీఆర్యీ టోఫుల్‌ అని పాత పుస్తకాల షాపులోని బుక్కులల్లా కొనుక్కొచ్చి పిడి కొట్టుకుంటున్నాడు. లుగూబ్రస్‌ అంటే ఏటండి? మా చంటిదేడుస్తుంటే ఇతగాడు ‘ షటప్‌ లుగూబ్రస్‌ ‘ అనీ సరికి అంతటి రంపీ టప్మని నోరు మూసీసింది! తీసుకెళ్ళండి ఏమో ఎవడు చెప్పొచ్చేడు తొండే ముదిరితే ఊసరవిల్లి. ఇలాటి వాగుడుకాయి గుంట్నాకొడుకే హిందూ పేపరు రప్పించి మంచి పకడ్బందీగా ఇంగ్లీషు గట్టా నేర్చి అమిరికా వెళ్ళేడంటే ఆళ్ళమ్మ చెప్పినట్టుగ పెద్ద ఇంటలెక్చువల్‌ అయిపోక పోతాడా.

(ఒక పాప స్కూల్‌ యూనిఫాం లో పరుగెట్టుకుంటూ వచ్చి గోపాల్‌ తో అంటుంది)

పాప అంకుల్‌ ! మా డాడీ రమ్మంటున్నారు…..!

గోపా ఓహో నువ్వా…….పద పద….భోంచేసి మీ ఇంటికొస్తానన్నాఁవని చెప్పు.

పాప మా మమ్మీ భోజనానికొచ్చీ మని మరీ మరీ చెప్పమంది?!

గోపా భోజనానికా? (గోపాల్‌తో) సుబ్రమణ్యం వాళ్ళింట్లో లంచ్‌ ట? What do you say ?

రాఘ (పొట్ట తడుముకుని) I’ll take it and run! (నిష్క్రమిస్తారు.)

ఐదవ స్థలం.

(క్రిష్ణ మోహన్‌ వాళ్ళిల్లు నడి వాకలి. క్రిష్ణ, కోటేశ్వర్రావు భోంచేసి అరుగు మీద కూర్చుని ఉంటారు. ముత్తేలు భోజనం అయిపోయినా విస్తరి ముందునుండి లేవకుండా ఇష్టంగా మాగాయ టెంక చీకుతూ ఉంటాడు.)

పెదమామ్మ (ఎనభయ్యేళ్ళ వెధవావిడ. తెల్లటి పొత్తి పంచె తలమీంచి ముసుగుగా కట్టుకుని వడ్డిస్తూ నిలబడి ఉంటుంది. ఎకసెక్కంగా నవ్వుతూ) అయ్యో..ఇంకందులో ఏఁవీ లేదు ఆ టెంక పట్టుకు చప్పరించకురా! పాత మెంతికాయదే భాగ్యఁవా నీక్కావస్తే పొట్లం కట్టీసిస్తానూ……?! మొహమాటఁవేఁవిటి ముత్తేలూ నా దెగ్గిర?

ముత్తే (చీకుతూనే) మా ఊరమ్మవి కదా నీకాడ మొగమాటఁవా? సీకీసిన టెంకకున్న రుసి కొత్తూరగాయలో నేదు! (క్రిష్ణకేసి తిరిగి) అయితె కిష్ట బాబూ అమిరికా ఎలిపోతావా? అక్కడ నీకు అన్నమెవులు పెడతారండీ?

క్రిష్ణ అమెరికా వెళ్ళినా ఇంకా ఈ పాత మెంతికాయ టెంకే నాకుతారనుకుంట్నావా ఏఁవిటి? ఫాష్ట్‌ ఫుడ్‌ ఫాష్ట్‌ ఫుడ్‌ !

ముత్తే (పెదమామ్మతో) నీ మనవడికి అమిరికా వొచ్చీమంతనారండీ ఆ బాబు.

పెద అవును! వెళిపోమను!! అది కలియుగ వైకుంఠంట నాన్నా ఏ దొరసానమ్మో ఇంత కడుపు చూసి పెట్టకపోదు… విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే అనీ. (క్రిష్ణతో) అవురా నాన్నా కిష్టప్పా ‘ఇంటలెక్చువ’ అంటే ఏఁవిటీ?

క్రిష్ణ (ఆశ్చర్యంగా) ఏంటే??

పెద ‘ఇంటలెక్చువ’ ?! (సందేహంగా) ఏఁవో నా నోరు తిన్నగా తిరిగింది కాదూ??

కోటి (దిద్దుతున్నట్టు) ఇంటలెక్చ్యువల్‌ !

క్రిష్ణ అది నువ్వెక్కడ విన్నావే? ఇంటలెక్చ్యువల్‌ అంటే మేధావి!

పెద అదేనూ! కిందటి మాటు మీ తాతయ్యేటివిళ్ళకి మాఁవయ్యొచ్చినప్పుడు వీడియా టేపు పెట్టేడు కాడూ? రవీంద్ర భారతి లోన ఎవరెవరో పెద్దలందరూ ఉపన్యాసాలకొచ్చి ‘ ఇతనివంటి ఇంటలెక్చువు ఇంతకు ముందు లేడు ఇహమీట రాడూ!’ అన్నారు…మీ అత్తనడిగితే ఆయన గారి ఠీకూ ఠాకూ నాకు తెలీవు ఆయన్నే అడగండి పొమ్మన్నాది! అయితే గాంధీ గార్లాగ గొప్పవాడు గావోలనుకున్నాను.

క్రిష్ణ నీకు ఎంత సేపూ నిత్య పూజా విధానం తాతయ్య పెన్షను కాయితాలూ అమృతాంజనం సీసా ఇవి తప్పించి ఇంకో ముక్క తెలీదు. గాంధీ గారు ఇంటలెక్చ్యువల్‌ ఎలాగవుతాడు?

ముత్తేలు (విస్తరి తీస్తూ) ఆయమ్మ కేఁవీ ధర్మాత్మురాలు! గాంధీ గారు ఆయమ్మ లాగేనండీ! పరమ రామ బక్తుడు!! రామ రామ హేరామనుకోనె సచ్చిపోయేడు కదా!

క్రిష్ణ గాంధీ గారు కాదు. మేధావులంటే సమ కాలీన సమస్యల్ని లోతుగా అధ్యయనం చేసి సమాధానాల కోసం వెతికే వాళ్ళు ఇంటలెక్చువల్స్‌ !

(కోదండ ప్రవేశం. పని మనిషి. బట్టలు తడిసిపోయి, జుట్టు తడిగా చెదిరిపోయి, కుంకం చెరిగి నీళ్ళూ చెమటా ఓడుతూ ఉంటుంది. విసురుగా తలుపు తీసి ఖాళీ సిలవరి బిందె పట్టుకుని కేకేసుకుంటూ లోపలికొచ్చి)

కోదండ బేపనమ్మగారూ? నా డబ్బులు పడీయమ్మా నానెల్లాల!

క్రిష్ణ (మామ్మతో) నీకర్ధఁవయ్యీటట్టు చెప్పాలంటే…..ఇప్పుడు నీళ్ళ సంగతే తీసుకో! ఇవాళ కొళాయిలు రాకపోతే పరిటీ వాళ్ళింటికెళ్ళి నీళ్ళు తోడి తెచ్చుకున్నావా లేదా?దటీజె ప్రోబ్లమ్‌ ! వాటర్‌ ప్రోబ్లమ్‌ !!

పెద (డబ్బు తెచ్చి కోదండకి ఇస్తూ) ఇంకెక్కడ పరిటీ వాళ్ళ నుయ్యి, వాళ్ళ నుయ్యెండిపోయింది ‘ అమ్మా మాకే నీళ్ళు లేవు పొమ్మ’న్నారు! సమయానికి కోదండ కనిపించి ధర్మాత్మురాలు గొల్లవీధిలో కొళాయిలొచ్చేయిట నాలుగు బిందిలు తెచ్చి పోసీసింది. (క్రిష్ణతో నిష్టూరంగా) దేవతార్చనకి గుళ్ళిచెంబుడు నీళ్ళేనా తెచ్చి పడీమని కాళ్ళా వేళ్ళా పడ్డాను తెచ్చేవూ? గొడ్డుని కోసిన గొడారి వెధవన్నా….?! నా వాటరు ప్రోబ్లం బుర్ర నేను కొట్టుకున్నాకానూ??

కోదండ (ఎగతాళిగా, ముద్దుగానూ పళ్ళు కొరుక్కుంటూ) ఈ బాబా? ఈ బాబు నీల్తెచ్చేడు నువ్వొండీసి మా యందరికీ సంతర్పం చేసిద్దుగాని (క్రిష్ణ బుగ్గమీద మోటుగా లాగి, హడావిడిగా వెళిపోతుంది.)

క్రిష్ణ (బుగ్గ తడుముకుంటూ) అబ్బా….గిల్లీసింది రాక్షసి. దాన్నోటితోటి సాల్లేం పోయింది పోనీ…..! (మామ్మతో) అబ్బా నీళ్ళ గురించి కాదే అది జష్టు ఎగ్జాంపిల్‌ ఉదాహరణ కింద ఇచ్చేను. నువ్వయితే నాలుగు బిందిలు నీళ్ళు పోయించుకుని ఓ గంగమ్మ తల్లీ రేపు రా తల్లీ అని కొళాయికి ఓ దండం పెట్టెస్తావు. మేధావులంటే అలాక్కాదు! అసలు చేపలగ్గురారంలో కొళాయిలు రాకపోవటం అనేది ఒక పై పై వాస్తవం. దీనికి మూలంలో ఉన్న సాంఘిక, ఆర్ధిక, చారిత్రక, సాంకేతిక, రాజకీయ, దార్శనిక, అధివాస్తవిక కారణాలేఁవిటి వాటి మూలాలేఁవిటి అని లోతుగా ఆలోచించ గలిగిన వాడే మేధావి. అయితే ఇప్పుడు దేశంలో ఆట్టే మేధావులు లేరులే ఉన్నవాళ్ళల్లా అమిరికా వెళిపోతునారు! బ్రెయిన్‌ డ్రెయిన్‌ అంటారు విన్నావా? నీకు చెప్పీ వేష్టు…

పెద అదుగో ఆ పెడసరఁవేఁ కూడదు. విద్య తెలిసిన కొద్దీ వరి వెన్ను వంగినట్టు వంగాలనీ వారు మీ తాతయ్య. నాలుగో క్లాసు వరుకూ చదువుకున్నా కానూ…..

కోటి (విచారంగా) నిజఁవేనమ్మా! ముదురు బుర్రలన్నీ అటెళిపోతునారు. మనం చచ్చూ పుచ్చూ ఇక్కడ టిక్కడిపోయేఁవు…..ముందున్న రోజులన్నీ బుర్రలో అయిడియా ఉన్న వాడివే.

ముత్తేలు మహాకవంతారు కదా….

కోటి నువ్వుండు వాడ్ని చెప్పనీ! మహా కవంటే వేరూ. ఇప్పుడు నువ్వు మేస్తుర్లందర్లోకీ పెద్ద మేస్త్రివి ఎలాగో, అదే విధంగా కవులందర్లోకీ పోటుగాడ్ని ‘మహాకవీ’ అన్నారు. దటీజ్‌ డిఫరెంట్‌ ఎండ్‌ దిసీజ్‌ డిఫరెంట్‌……(క్రిష్ణతో) అవునువై మరి ఇంజినీరింగు చదువుతునావు ఈ వాటరు ప్రోబ్లంకి మీ మేధావులు చెప్పిన పరిష్కారం ఏఁవిటమ్మా?

క్రిష్ణ ఏఁవో నాకేం తెలుసును…పైపులప్పారావు తాగీసి డ్యూటీకి రాకుండా పడుకున్నాట్ట పంపు హవుస్‌ దగ్గిర ఆడవాళ్ళు జట్టీలాడుకుంటూ వాడ్ని శాపనార్ధాలు పెడుతున్నారు…!

కోటి (నిరసనగా) ఎహె అది కాదు! ఏదో డీప్‌ గా ఉండే ఉంటుంది….థీరీ తియ్యటానికి అమిరికావోడే మనోడు లాభం లేదు. అందుకే నువ్వబ్జర్వ్‌ చేసేవో లేదో ఓయెన్జీసీ నూతులు పేలిపోయినా వర్షాలు సరీగ్గా పడకపోయినా ఓ మంచొచ్చినా చెడ్డొచ్చినా అమిరికా వోడ్ని రప్పిస్తారు! అవకాశం వొచ్చిందంటే నువ్వు స్టేట్స్‌ వెళ్ళి స్టడీ చెయ్యి! గానీ….

క్రిష్ణ ఊఁ? గానీ….??

కోటి అక్కడుండీ సాధక బాధకాలు అక్కడుంటాయి సుమా….దూరపు కొండలు నునుపు! ఆ కాణో పరకో ఇక్కడే చేసుకుంటే బెష్టు…

క్రిష్ణ మీకెంతసేపూ కాణీ పరకా!

కోటి లేదులే నువ్వుట్టి అమాయకుడివి. అక్కడే అంత వైభోగంగా ఉంటే ఈ గోపాలు గారూ రాఘవ గారూ ఎంతసేపూ ఇక్కడ స్లమ్సులోకొచ్చెస్తాఁవని అగ్గగ్గలాడతారేఁవీ?? ఎంతయినా అది తెల్లోడి రాజ్యం కదా! మనకి ఆవాహనా విసర్జనా ఉంటాయంటావా? అడివిలో అబ్బా అంటే ఎవడికి పుట్టేవురా కొడకా అని…. రేప్పొద్దున్న అమిరికాలో నిన్ను పెళ్ళం కొట్టిందనుకో? ఎవడితో చెప్పుకుని ఏడుస్తావు?

(వాళ్ళు మాట్లాడుకుంటుండగా తెర పడుతుంది.)

మూడవ అంకం

ఒకటవ స్థలం

( శివాలయం. ఆదివారం సాయంత్రం, చీకటి పడే వేళ. గర్భగుడిలో మంత్రోచ్ఛారణ, గంట కొట్టిన చప్పుడు, బయట కార్లు స్కూటర్‌హారన్లు వినిపిస్తుంటాయి. కటకం వెంకటేశ్వర్లు గుడి మండపంలో చేతులు జోడించి నిలబడి మధ్య మధ్య వెనక్కి చూస్తుంటాడు. కొంచెం దూరంగా చెట్టుకింద నరసిమ్మూర్తి, పక్కన జానీ ఎడ్విన్‌ , విమల, చెట్ల పంతులు, రవి కుమార్‌, రాఘవ రావు, గోపాల్‌ కూర్చుని ఉంటారు. )

పూజారి గోత్రం పేరూ చెప్పండి?

వెంక పైడిపాల గోత్రం…కటకం వెంకటేశ్వర్లు…

పూజా పైడిపాల గోత్రస్య కటకం వెంకటేశ్వర్లు నామధేయస్య ధర్మ పత్నీ సమేతస్య సకల….

వెంక మా ఆవిడ లేదండీ పోయింది….

పూజా అయ్యో అలాగా బాబూ…..! సకల ఆయురారోగ్య ఐశ్వర్య సిద్య్ధర్థం………సమస్త పాప హరణమ్‌ సర్వ వ్యాధి నివారణమ్‌ శ్రీ భ్రమరాంబికా రామలింగేశ్వర స్వామి పాదోదకమ్‌ పావనమ్‌ శుభమ్‌ ! (పువ్వులు, కొబ్బరి చిప్ప, అరటి పండు ఇస్తాడు.)

వెంక (తనలో తనే స్తోత్రం ఒకటి చదువుకుంటూ వెనక్కి తిరిగి పిల్చి) రవి కుమార్‌ !ఇదుగో…అందరికీ ఇవ్వు!

రవి (ముప్ఫైల్లో ఉంటాడు. కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. ప్రసాదం అందుకుని అక్కడే నిలబడి) పైకి చదవండి….. నాకిష్టం!

వెంక (నవ్వి)
యద్యద్‌ కర్మ కరోమి తత్తదఖిలమ్‌
శంభో తవారాధనమ్‌
కర చరణ కృతంవా కాయజమ్‌ కర్మజమ్‌ వా
శ్రవణ నయనజమ్‌ వా మానసమ్‌ వాపరాధమ్‌
విహితమవిహితమ్‌ వా సర్వమేతత్‌ క్షమస్వ్త
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో…..
జయ జయ కరుణాబ్దే హర హర మహాదేవ శంభో…..

రవి (తన్మయంగా) పొయెట్రీ!

విమ (ఆరోపణగా) ఏయ్‌ అదా పొయెట్రీ? చివరికి ఎలా తయారయ్యేవ్‌ !

జానీ (ఆవులిస్తూ, నరసిమ్మూర్తితో) ఏంటి మేషారూ మమ్మల్ని మీటింగని పిలిచి మీరు రాసుకుంటూ కూచుంటారు?

నర (డబ్భయ్యేళ్ళ మనిషి. జర్నలిష్టు. ఒళ్ళో అట్ట పెట్టుకుని తదేకంగా రాసుకుంటున్నది ఆపి, తలెత్తి రోడ్డు వైపు చూస్తూ) ఉండు నీకు తలవగానే తాతకి పెళ్ళి. మంగవేణి రాలేదు…..ఒస్తానన్నాది? రాలేదూ……? (జానీ వైపు తిరిగి) I am a scribe! What do you expect? రాయటం నా ధర్మం. అందుకే రాస్తున్నాను……పెట్రోల్‌ కంపెనీ తగలబడి పోయింది కదా! పీటీఅయ్‌ వాడు కవర్‌ చేస్తే కాని వల్లకాదని కబురు మీద కబురు పెడుతున్నాడు.

విమ ఇంక రావాలి…..స్టేట్మెంట్‌ తీసుకు……(ద్వారం వైపు చూసి) అదుగో మాటల్లోకే వచ్చింది……

(ఆటోలోంచి హడావిడిగా మంగ వేణి, సిస్టర్‌ అసింతా, వెనగ్గా రుద్రమూర్తి దిగుతారు).

(ఇంకా ఉంది)