రైలు ప్రయాణం లో

ఇది కధ కాదు. ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు. కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

నాకు బాగా గుర్తు. వేసవి శెలవులు అయిపోయి కాలేజీలు తెరిచాక తిరిగి విశాఖ వెళ్ళాల్సి వచ్చినపుడు చాలా కష్టం గా ఉండేది. నిన్ననే కదా నెలరోజుల శెలవలలో చేయాల్సిన పనులు, చదవాల్సిన పుస్తకాలు, తిరగవలసిన ప్రదేశాలు, అమ్మతో చేయించుకోవాల్సిన వంటలు, నాన్నగారికి చెప్పవలసిన కబుర్లు లిస్ట్ గా రాసుకుని ఉత్సాహపు రెక్కలు కట్టుకుని ఇంటి ముందర వాలింది! అప్పుడేశెలవలు అయిపోయాయా అని ఉసూరుమనిపించేది. ఇంత హడావుడిగా పరిగెట్టే కాలం మీద, అంత లోనే కాలేజీలు తెరిచేసిన ప్రిన్సిపల్ మీద కోపం వచ్చేది. అమ్మ జాగ్రత్తగా అరవైనాలుగు కవర్లలో చుట్టిపెట్టిన ఆవకాయపచ్చడి సీసాలు, రకరకాల స్వీట్లు, పాకెట్లు సర్దుకుంటో పైకి మామూలుగా ఉన్నట్లు నటిస్తూ ఇల్లు వదలి వెళుతున్న దిగులును వ్యర్ధమైన విసుగు గా మార్చుకుని ప్రయాణానికి సిద్ధం కావటం ఇప్పటికీ గుర్తు.

వెన్నెలపులుగు లాంటి పావురాయి రెక్క లాంటి బాల్యం. తలచుకున్న కొద్దీ మరీ ప్రియమైనది బాల్యం. అమ్మా నాన్నల ప్రేమాభిమానాల రెక్కల క్రింద వెచ్చగా ఒదిగిన గువ్వ లాంటి బాల్యం!

ప్లాట్ఫాం మీద సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఇంకా రాని రైలు కోసం ఎదురుచూస్తూ, సీక్రెట్ గా ఈరోజు రైలు రాకపోతే బావుండు లేదా రైల్వే సమ్మెలు జరిగి కొన్నాళ్ళు రైల్వేలు పనిచేయకపోతే బావుండు లేదా ఏ విద్యార్ధి సంఘాలో సమ్మె చేసి కాలేజీలు మరో నెలలో తెరిస్తే బావుండు లాంటి ఉబుసుపోని ఆలోచనలు చేస్తూ ఉండగానే రాక్షసి లాంటి రైలు ఆరోజు మాత్రం టైముకి వచ్చి ఆగుతుంది.

మొదటంతా సామాను సర్దే ప్రకరణం, సీట్ వెతుక్కునే హడావుడి అవగానే అప్పటిదాకా ఆ కాసేపు వెనుకబడ్డ దిగులు మళ్ళీ వచ్చి హృదయవృక్షం మీద రెక్కలు విప్పుకుని వాలుతుంది. గొంతులో వెలక్కాయలాగా అడ్డుపడ్డ బెంగని కనురెప్పలని దాటుకుని రాకుండా జాగ్రత్త పడుతూ, బింకపు చిరునవ్వుని పెదవుల మీద బలవంతంగా అతికించుకుని తెచ్చిపెట్టుకున్న అతి ఉత్సాహంతో మా వాళ్ళందరికీ వీడ్కోలు పలుకుతుండగానే రైలు కదులుతుంది. కనుమరుగవుతున్న నా ఆప్తుల రూపాలతో పాటు కదులుతున్న రైలులోంచి, దూరంగా ప్లాట్ఫాం మీద గుల్మొహర్ చెట్టుకింద సిమెంట్ బెంచీ మీద నన్ను నేను మర్చిపోయిన భావన.

నా ఆలోచనలతో సంబంధం లేకుండా రైలు బద్ధకం లేని కొండచిలువలా మలుపులు తిరుగుతూ వెళుతోంది. వంతెన మీద నుంచి వెళుతున్నపుడు గగ్గోలు పడిన పిచ్చివాడి కేక లాంటి ప్రతిధ్వనితో బ్రిడ్జి ఆపాదమస్తకం వణికిపోతుంది. కిటికీ లోంచి బైటకు చూస్తే మనసుకు ఊరట ను కంటికి ఆనందాన్ని కలుగ చేస్తూ ఇరుపక్కలా పచ్చని పంట పొలాలు. రైలుసాగే కొద్దీ క్రమంగా ఇంటిని వదలిన దిగులు స్థానంలో అయిదేళ్ళుగా అలవాటైన విశాఖ లో వెళ్ళగానే చెయ్యాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలు, కలవ వలసిన స్నేహితుల వగైరా విషయాలు తాలూకు లిస్ట్ ఆక్రమిస్తుంది. కిటికీ లోంచి చూస్తే ప్రకృతి ఎంతో హృద్యంగా ఉంది. పచ్చని పైర్లు, అక్కడక్కడా నిలిచిన వాన నీళ్ళు, దాటిపోయే కరెంట్ తీగలు, రైల్వే క్వార్టర్స్ ముందు ఆకు కనిపించకుండా విరగబూసిన గుల్మొహర్ చెట్లు, దబ్బ పండు లాంటి బిడ్డను ఎత్తుకున్న బరువుతో కొద్దిగా వంగి నిల్చిన పడుచు తల్లిలా పండిన జీడిమామిడి పళ్ళ భారం తో గర్వంగా నేలకు వంగిన చెట్లు, తాపీగా బద్ధకంగా పచ్చిక మేస్తున్న ఆలమందలు ఒకదానితరువాత ఒకటిగా కిటికీ స్క్రీన్ మీద ప్రకృతి ప్రొజెక్ట్ చేస్తున్న స్లైడ్స్ లా కదులుతున్నాయి.

దూరంగా పొలాల్లో పనిచేస్తున్న పల్లెపడుచులు. రంగు రంగుల దుస్తులతో అదోరకమైన వింత ఆకర్షణతో ఎర్రని చేనేత చీర, ఆకుపచ్చ రవిక, ముడిలో తురిమిన పచ్చని తంగేడు పూలు, నల్లని ముఖంలో తళుక్కుమనే తెల్లని పలువరస, రూపాయి కాసంత బొట్టు, చేతిలో వెదురు బుట్టని నడుముకు ఆనించుకుని కదిలిపోయే రైలుని చోద్యంగా చూస్తూనిలుచున్న ఓ పల్లె పడుచు! మూర్తీభవించిన తెలుగుతనంతో, అదోరకమైన అపాండిత్యపు జీరతో కూడిన ముగ్ధ సౌందర్యంతో తళతళా మెరిసే నండూరి వారి ఎంకిలా!!

పచ్చని పైర్లు, అక్కడక్కడా నిలిచిన వాన నీళ్ళు, దాటిపోయే కరెంట్ తీగలు, రైల్వే క్వార్టర్స్ ముందు ఆకు కనిపించకుండా విరగబూసిన గుల్మొహర్ చెట్లు, దబ్బ పండు లాంటి బిడ్డను ఎత్తుకున్న బరువుతో కొద్దిగా వంగి నిల్చిన పడుచు తల్లిలా పండిన జీడిమామిడి పళ్ళ భారం తో గర్వంగా నేలకు వంగిన చెట్లు, తాపీగా బద్ధకంగా పచ్చిక మేస్తున్న ఆలమందలు ఒకదానితరువాత ఒకటిగా కిటికీ స్క్రీన్ మీద ప్రకృతి ప్రొజెక్ట్ చేస్తున్న స్లైడ్స్ లా కదులుతున్నాయి.

మరికొంచెం దూరంలోభుజానికి వేలాడేపుస్తకాలసంచీలతో, చేతిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్సులతో పొలాల గట్ల వెంట చక చకా పరుగెడుతూ రైలు కనబడగానే ఆగిపోయి ఉత్సాహంగా చేతులూపే స్కూలు పిల్లలు! నీలం తెలుపు యూనిఫాం లో పాలపిట్టల్లా మెరిసిపోతూ!!

మనసు బాల్యం వెంట పరిగెడుతుంది. వెన్నెలపులుగు లాంటి పావురాయి రెక్క లాంటి బాల్యం! తలచుకున్న కొద్దీ మరీ ప్రియమైనది బాల్యం. బహుశా తిరిగి రానిది, పోగొట్టుకున్నది, గడచి పోయినది ఏదైనా ప్రియంగా అపురూపంగా ఉంటుందేమో!అమ్మా నాన్నల ప్రేమాభిమానాల రెక్కల క్రింద వెచ్చగా ఒదిగిన గువ్వ లాంటి బాల్యం!!

ఓపికగా పరిగెడుతున్న రైలు కిటికీ లోంచి చిలకాకుపచ్చ చీర కట్టుకున్న ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంది. అసలు ఏదైనా దూరం నుంచి చూస్తేనే అందంగా ఉంటుందేమో! మనుషులు కూడా అంతే. దగ్గరికి వెళ్ళే కొలదీ వాళ్ళ మనసుల లోని చీకటి నీడలు, ఊడల మర్రిలా వేళ్ళూనిన అసూయా వృక్షాలు చూపులలో దాచుకున్నా దాగని ఈర్ష్య క్రూరత్వం ఇవేమీ దూరంగా ఉంటే తెలియవేమో! మానవ మనస్తత్వమే విచిత్రమైనది. అకారణంగా బాధిస్తుంది, బాధ పడుతుంది. ఆత్రేయ గారు ఏదో పాటలో వ్రాసినట్లు, “ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో” అన్నట్లు మనసు చాలా విచిత్రమైనది.

నా ఆలోచనలతో సంబంధం లేకుండా నిర్వికారంగా తనవిధి నిర్వర్తిస్తూ తన గమ్యం వైపు రైలు అవిశ్రాంతంగా పరిగెడుతూ ఉంది. ఓరకం గా చూస్తే జీవన ప్రయాణం కూడా రైలుప్రయాణం లాంటిదే. ఎక్కే వారు, దిగేవారు, అనుకోకుండా తారస పడే ప్రియబాంధవులు, స్నేహితులు, పరిచయస్తులు. ఏ మజిలీ లో ఎవరు కలుస్తారో, ఎవరు ఎవరితో ఎంతవరకుకలసి ప్రయాణిస్తారో, ఎవరికీ తెలియని అందమైన రహస్యం. అయితే రైలు ప్రయాణంలో ఎవరి గమ్యం వారికి తెలిసినా, జీవనప్రయాణంలో మాత్రం గమ్యం తెలిసినట్లు భ్రమ కలిగించే మృగతృష్ణ. అందుకనేనేమో జీవనప్రయాణంలో అంతటి ఆకర్షణ, గొప్ప సౌందర్యం, అంతకుమించిన కవిత్వం దాగి ఉన్నాయి.


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...