అంటు, అత్తగారు

” అమ్మాయీ! కాస్త ఆ అంటు చెయ్యి కడుక్కోని మరీ వడ్డించమ్మా, నీకు పుణ్యం వుంటుంది. నీ మైల కూడు తినలేక చస్తున్నాను, ఇదెక్కడి ఖర్మమోకానీ,” అని మా అత్తగారు మా ఆవిడ మీద విసుక్కుంటూంటే, నాకు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది.  మా అమ్మమ్మ మా అమ్మ మీద కూడా అల్లాగే చీదరించుకునేది. మా అమ్మ వెంటనే విస్తరి పక్క నున్న ఇత్తడి గిన్నెలో ఉన్న నీళ్ళల్లో కుడిచేతి వేళ్ళు ముంచి, ఆ వేళ్ళమీది నీళ్ళు వెటకారంగా పీటపక్కకి జల్లి, “అమ్మయ్య! ఇప్పుడు అంటు పోయిందా? ఏమిటో నీ చాదస్తం !” అంటూ తిరిగి తను విసుక్కునేది. చిన్నప్పుడు మాకు మా అమ్మమ్మ మా అమ్మ మీద అలా విసుక్కోటం, మా అమ్మ అమ్మమ్మమీద చీదరించుకోటం, చూడటానికి, వినడానికీ మహ సరదాగా ఉండేది. మా నాన్న పెద్దపీట మీద బాసీ పీఠం వేసుకోని కూచునే వాడు.  ఆయనగారికి అమ్మ అమ్మమ్మల వడ్డింపుల యుద్ధం మహదానందంగా ఉండి ఉండాలి. ఎందుకంటే, ఈ రోజువారీ జరిగే యుద్ధం మొదలవగానే, మాకేసి చూసి కన్ను గీటే వాడు. మా అమ్మని ఆయన ఏమీ అనలేడు, ఏమన్నా అంటే, అత్తగారికి, ఆవిడగారికీ కూడా కోపం వస్తుందేమోనని భయం. .  సరే! అమ్మమ్మని ఏమీ అనలేడు, అమ్మకి ఎక్కడ కోపం వస్తుందోనని భయం. అమ్మకి అసలే ముక్కు మీద కోపం.

అంటు, మైల  అంటే ఏమిటో నాకు అప్పుడూ తెలియదు; ఇప్పుడూ తెలియదు. అప్పుడు, అంటే చిన్నప్పుడు అర్థం అడిగితే ఎక్కడ “ఖస్సు” మని తిడతారో నని భయపడి అడగలేదు. అర్థం కాకండానే చిన్నప్పటి నుంచీ అలవాటు అయిపోయిందిగా! చిన్నప్పుడు, అంటు చెయ్యి కడుక్కోవడం, ఒక అసంకల్ప ప్రతీకార చర్య. ఎడమచేత్తో గరిటె పట్టుకొని కూర వడ్డించుకొని, అలా ఆ పుర్ర చేతి రెండువేళ్ళూ  చెంబులోముంచి తడివేళ్ళు అమ్మలాగే విదిలించి ఆ చేత్తోనే అన్నంగరిటెతో అన్నం వడ్డించుకోవడం, మళ్ళీ ఆ రెండువేళ్ళూ చెంబులో నీళ్ళకి అంటీ అంటనట్టు ముంచి, విదిలించి ఆ చేత్తోనే నెయ్యి వేసుకోవడం, ఇదంతా ఒక ఆచారంగా తయారయ్యింది.  ఇప్పుడు అర్థం కోసం పాకులాడటం అనవసరమే! ఒకవేళ అర్థం తెలుసుకొని, శాస్త్రీయంగా అంటు మైల గురించి విమర్శించి, రచ్చబండమీద కెక్కించడం, కత్తుల రత్తయ్య లాంటి వాళ్ళ మెదళ్ళకి మేతపెట్టి ఏడిపించడం కోసమే! అది చాలా సరదా అయిన విషయం కాదని అమెరికా తెలుగు వాడెవడూ అనలేడు.

మా అత్తగారు మా ఆవిడమీద విసుక్కున్నదని అన్నాను కదూ! ఇది అమెరికాలో! మా అత్తగారికి సుమారు ఎనభై ఏళ్ళు. నిజం చెప్పాలంటే, ఎనభైకి అటే కానీ, ఇటుకాదు. మా అందరి బలవంతం మీదా అమెరికా వచ్చింది. అందరి బలవంతం అనడం సబబు కాదేమో. ముఖ్యంగా మా బావమరిది ప్రోద్బలంమీద వచ్చింది. మా బావమరిదికి అదేదో మందుల కంపెనీలో పెద్ద ఉద్యోగం. వాళ్ళ అమ్మకి తన డబ్బు, దర్జా చూపించాలని అతని మనసులో అసలు కోరిక. అలా అని పైకి చెప్పలేడులెండి. కానీ, మా బావమరిది భార్యమొహం లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ తెచ్చిపెట్టుకున్న దర్జా, దర్పం. నేను అంటూనే ఉన్నా, ఈ వయసులో ఆవిడని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని! ముప్ఫై దాటిం తరువాత అమెరికా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అమెరికాలో హాయిగా సుఖపడలేరు; అమెరికాని అనుభవించనూ లేరు.

ఏది ఏమయితేనే! మా అత్తగారు అమెరికా వచ్చారు.  వచ్చిన రెండో రోజునుంచీ ఆవిడకి మా ఆవిడ పద్ధతులు, ముఖ్యంగా వంటింట్లో భాగోతం ఏమీ నచ్చలేదు. మా ఆవిడ పొద్దున్నే తొమ్మిదికల్లా పనికెళ్ళాలి. మా అత్తగారికి పొద్దున్నే పది ఘంటలు కొట్టంగానే ఆత్మారాముడు అల్లరి మొదలెడతాడు. అది మా మామగారి మూలంగా వచ్చిన అలవాటు అయి ఉండాలి. ఆయనగారు పదికాకముందే భోజనంచేసి, తమలపాకుపట్టీలు వేసికోని కోర్టుకి వెళ్ళేవాడుట. ఆయన వెళ్ళగానే, అత్తగారు తన భోజనం పూర్తిచేసేసి కంచాలు గిన్నెలూ పనిమనిషి కోసం బయట పడేసి, హాయిగా కునుకు తీసేది. ఈ తతంగం, ఈ “రొటీను,” సుమారు అరవై ఏళ్ళుగా అలవాటయినది. ఇప్పుడు మారమంటే, మారుతారా?  అయినా, మారమని అడగటం తప్పు కాదూ?

మా ఆవిడ వాళ్ళ అమ్మకోసం పొద్దున్నే లేచి, అంత అన్నం, ఓ ఇగురు,ఇంతపప్పు, ఆ పప్పు మీద నించి నీళ్ళు తీసి కాస్త చింతపండు చారు దబదబ వండడం మొదలుపెట్టేది. వంట అవగానే, స్నానం చేసి పనికి వెళ్ళడానికి సిద్ధమయ్యేది. సరిగ్గా, ఇక్కడే వచ్చింది అసలు గొడవ, రాద్ధాంతం! ఇది మా అత్తగారికి ససేమిరా నచ్చలేదు. మైల గుడ్డలతో వంట చెయ్యటం ఆవిడకి సుతరామూ ఇష్టం లేదు. వెంటనే అందుకొని, “నిన్నేమన్నా పెద్దమడి కట్టుకొని వండమన్నానా? మీ నాన్న గారు పోయినప్పటినించీ, నాది ఒక్క పూట భోజనం! ఆ పట్టెడు మెతుకులూ కాస్త  శుచిగా తినే యోగ్యతే లేదాయె! ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పెద్దమడి కట్టుకొని వండడం మా హయాము లోనే తగలబడి పోయింది. ఈ వెధవ ఇంగిలీషు చదువులొచ్చాక, అసలు మడే తగలబడి పోయింది. కాస్త స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకోని, దేవుడికి దీపం పెట్టి, వంటా వార్పూ ఏడవ్వచ్చుగా,” అని నసగడం మొదలెట్టింది,జీడి మావిడికాయ నసలా!

మా ఆవిడ ఊరుకోవచ్చుగా. వాళ్ళ అమ్మని అమెరికన్‌ గా మార్చి పారేద్దామని ఒకటే తహతహ! “స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వంటలు వండితే, ఈ వంట వాసనలు ఒంటికి,జుట్టుకీ బట్టలకీ పట్టుకోని వదలవు. ఆ “మంచి” బట్టలతో పనికెళ్ళితే, మన ఇంగువ కంపు, తాలింపు కంపులూ మొత్తం ఆఫీసులో అందరికీ పట్టించాలి, మా ఆఫీసులో పనిచేసే గుజరాతీ ఆవిడలాగా! ఆవిడ గారి కోటు పక్కన ఎవ్వరూ వాళ్ళకోట్లు తగిలించరు, కంపు భయంతో! అందుకని, వంట పూర్తిచేసింతరువాత, స్నానం చేసి మంచి బట్టలు వేసుకోడం ఇక్కడి పద్ధతి,” అంటూ కస్సుమనేది. అదీ పాయంటే మరి! రోములో రోమనులా ఉండక, పాతచింతలపూడిలో పనిమనిషి పార్వతమ్మలా ఉంటారా?

ఇలా మా అత్తగారు పొద్దున్నే నసుక్కోవడం, మా ఆవిడ విసుక్కోవడం, సుమారు నెలరోజులు సాగింది. ఒక రోజున పరమేశం గారి ఇంటికి భోజనానికి పిలిచారు. అదేదో మంగళవారంట! పరమేశం గారి భార్య మా ఆవిడ ఈడుదే! ఆవిడకూడా ఏదో ఆఫీసులో పనిచేస్తుంది. సాయంకాలం ఏడు కల్లా వాళ్ళ ఇంటికెళ్ళాం. పరమేశం గారి భార్య, తలనీళ్ళు పోసుకున్నది కాబోలు, జుట్టుకి చిన్న గుడ్డ జడలా చుట్టి ముడివేసుకొని, వెండిరూపాయంత బొట్టు పెట్టుకొని అంచులేని గోధుమ రంగు పట్టుచీరె కట్టుకొని వండుతున్నది. గోధుమరంగు పట్టుచీరె ఎప్పుడూ మడి చీరే! అమెరికాలో “జీన్స్‌” లా! జీన్స్‌ వేసుకోని ఏ పనైనా చెయ్యొచ్చు, గడ్డి కొయ్యడం దగ్గిరనుంచి, గుడిలో పూజ దాకా!. పరమేశం గారి భార్యని “మడి” చీరెలో చూడగానే, మా అత్తగారికి ఎంతో ఆనందం అయ్యింది. అక్కడే మా ఆవిడని ఏమన్నా అంటుందేమోనని నాకు భయం వేసింది. ఆ పిట్స్‌ బర్గ్‌ బాలాజీ ధర్మవా అని, అలాంటిదేమీ జరగలే. మామూలుగా రాత్రుళ్ళు పస్తుండే మా అత్తగారు, ఆవేళ వాళ్ళ ఇంటిలో ఉప్మా కూడా తిన్నది, “అరుగుతుందో అరగదో,” అని కూనిరాగాలు తీస్తూ!

మా అత్తగారి సతాయింపులు కారణమో, పోనీ ఎందుకులే పాపం, అమ్మ మనసు బాధ పెట్టడం, అనే జాలి కారణమో, పరమేశం గారి భార్యే కారణమో, ఏమయితేనేం, మా ఆవిడ పొద్దున్నే లేచి “మడి” కట్టడం మొదలు పెట్టింది. మడి అంటే మడి కాదు లెండి. లేవగానే స్నానం చేసి, ఉతికిన చీరె కట్టుకొని, వాళ్ళ అమ్మకి వండిపెట్టడం మొదలు పెట్టింది. అయితే, అన్నం దింపిన చేతులు కడుక్కోకండానే, ఆవకాయ జాడీ ముట్టుకోవడం, చారుగిన్నె ముట్టుకున్న చేత్తోనే మంచినీళ్ళ గ్లాసు  పెట్టడం లాంటి అంట్ల పనులు మాత్రం మానలేదు. అత్తగారు చూసీచూడకండా సర్దిపెట్టుకొని,  “ఏదో గుడ్డిలో మెల్ల! ఎంతచేసుకున్న వాళ్ళకి అంతే మహాదేవ,” అని గొణుక్కుంటూ, పొద్దున్నే వండినవి తిని, రాత్రికి ఇంత మజ్జిగ తాగి పడుకునేది. ఆవిడకి, పగలు తినగా మిగిలినవి రాత్రికి పనికి రావు.

పరవాలేదు, ఏదో సాగిపోతూన్నది అని అనుకుంటూ ఉంటే, వాషింగ్టన్లో చదువుకుంటున్న మా అబ్బాయి, అట్లాంటా లో కాలేజీకి వెడుతూన్న మా అమ్మాయీ థాంక్స్‌ గివింగ్‌ శలవలకి వస్తున్నాం అని వార్నింగ్‌ ఇచ్చారు. మామూలు రోజుల్లో వాళ్ళు వస్తే, ఫ్రిజ్‌ లో మామూలుగా మనుషులు తినే పదార్థాలు మాయమవుతాయి . వాటికి బదులు, కోడిగుడ్డులు, కుక్కగొడుగులూ, చీజులు, సలామీలు, బర్గర్లూ, బలోనీలూ లాంటి పదార్థాలతో ఫ్రిజ్‌ నిండిపోతుంది. మా ఆవిడ పిల్లలకి వాళ్ళు రాకముందే హుకుం జారీ చేసింది అమ్మమ్మ మన ఇంట్లో ఉన్నన్నాళ్ళూ కూరగాయలు, మజ్జిగ, పెరుగూ తప్ప ఫ్రిజ్‌ లో ఇంకేమీ ఉండటానికి వీలు లేదని! ఇహ టర్కీ సంగతి సరే సరి; కలలోకూడా దాని విషయం ఎత్తక్కరలేదు!

మావాడు వస్తూ వస్తూ వాడి స్నేహితురాలిని, వెంటపెట్టుకో వచ్చాడు. వాడి గర్ల్‌ ఫ్రెండ్‌ ఓ తెల్ల పిల్ల.పేరు అనిత. మనవాళ్ళలాంటి పేరే!  మరి, మా అత్తగారికైతే కొత్తగానీ, మాకు రెండేళ్ళుగా తెలిసిన అమ్మాయే!  మా అత్తగారికి గుండె గతుక్కు మంది. మా ఆవిడకీ కాస్త కంగారే, చెప్పద్దూ! తెల్ల అమ్మాయి తెల్లదనం మా అత్తగారికే కాదు, ఇంట్లో అందరికీ కావలిసిందే! నిజం చెప్పాలంటే, తెల్లగా ఉన్న అమ్మాయి అక్కరలేదని  ఏ తెలుగువాడు అనగలడు, చెప్పండి?  అయితే, మా అత్తగారి భయం ఏమిటంటే ఈ తెల్ల అమ్మాయి వంట ఇంట్లో అవీ ఇవీ ముట్టేసుకొని, అంట్ల మంగలమే కాకండా అంతా మైల మంగలం చేస్తుందేమోనని!

అన్నంతపనీ అవనే అయ్యింది. గురువారం పొద్దున్నే మా ఆవిడ పెద్ద డేగిసాలో సాంబారు వండుతోంది, పొద్దున్నే ఇడ్లీలలోకి, మధ్యాన్నం అన్నంలోకీ కలిసొస్తుందని! అనిత పువ్వుల నైటుగౌన్‌ లో వయ్యారంగా మేడదిగి వంటింట్లోకి వచ్చి, ” హాయ్‌ వాట్‌ ఆర్‌ యు కుకింగ్‌” అంటూ, డేగిసాలో గరిటెపెట్టి, వేడివేడి సాంబారు రుచిచూసింది. రుచి చూసి ఊరుకున్నదా? మా ఆవిడ అడ్డుపడకముందే ఆ గరిటె మళ్ళీ డేగిసాలో పడేసింది. దేవుడి మందిరం దగ్గిర ఏదో గొణుగుతూ కూర్చున్న మా అత్తగారు, “నారాయణ నారాయణ! అంట్లమేళం, మైల మేళమే కాదు, ఎంగిలి మంగలం కూడాను,” అని చీదరించుకోని “అమ్మాయీ! ఆ పులుసు కుడితిలో పారెయ్యాలిసిందే, మీకు పనిమనుషులు కూడా లేరాయిరి,” అని, నిజం చెప్పొద్దూ! సాంబారంతా పారబోయించింది. అనితకి ఏమీ బోధపడక, “వై ఆర్‌ యౌ డమ్పింగ్‌ దట్‌ సూప్‌? డిడ్‌ ఐ డు సమ్థింగ్‌ రాంగ్‌?” అన్నది. మా ఆవిడ వెంటనే “నీకు తరవాత సావధానంగా చెపుతానులే.” అని అనితని లివింగ్‌ రూం లోకి పట్టుకో పోయింది. మరి మా ఆవిడ ఏం చెప్పిందో కానీ ఉన్న నాలుగు రోజులూ పాపం ఆ అమ్మాయి వంటగదికి ఆమడ దూరాన కూర్చుంది. మా అత్తగారిని చూసినప్పుడల్లా భయం భయంగా పళ్ళికిలిస్తూ దణ్ణం పెట్టడం నేర్చుకుంది!

తమాషా ఏమిటంటే, ఈ ఎంగిలి తతంగం మా అబ్బాయికి గాని, మా అమ్మాయికి గానీ తెలియదు. శుక్రవారమో, శనివారమో, మా అమ్మాయి, అబ్బాయి, అనిత కలిసి మేటినీ ఆట చూడబోయారు. తిరిగి వస్తూ, ఏవో శాన్వ్డిచ్‌ లు, కోకులూ తెచ్చుకున్నారు. టీ వీ ముందు కూచోని, గట్టిగా నవ్వుకుంటూ  తెచ్చుకున్నవి తింటున్నారు. మా వాడు, తన శాన్వ్డిచ్‌ కొరికి ఒక చిన్న ముక్క తింటూ, ” యు వాన్ట్‌ ఎ బైట్‌?” అని చెల్లెలికి, అనితకీ తన శాన్వ్డిచ్‌ ఇచ్చాడు, రుచి చూడండంటూ! వాళ్ళు చెరోముక్కా కొరుక్కో తిని, మిగిలింది వాడికి ఇచ్చేశారు. ఈ తతంగం అంతా మా అత్తగారు చూసింది. వెంటనే, మా ఆవిడతో, “ఈ మైల కూడుతినడం, ఎంగిలికూడు తినడం నీ కొడుక్కి, కూతురికీ కూడా ఉంది. చిన్నప్పుడు చెప్పి అదుపులో పెడితేగా?” అని మా ఆవిడ పెంపకం మీద ఓ విసురు వేసింది. “నీ కూడు ముట్టుకోవటల్లేదుగా! వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనీ!నా పెంపకం మీద నీ విమర్శ ఎందుకులే?” అని విసురుకి పైవిసురు వేసింది. “అదీ నిజమేలే! నాకెందుకు మీగొడవ. నాలుగు రోజులుండి పోయేదాన్ని. నేను రా కూడదనే అనుకున్నా, నీ తమ్ముడు పోరిపోరి మరీ తీసుకొచ్చాడు. ఇంక ఎన్నాళ్ళులే తల్లీ! వారం రోజుల్లో వెళ్ళిపోతానుగా. ఆపైన నా సతాయింపు నీకు ఉండదులే,” అని మెటికలు విరిచింది. వాళ్ళ అమ్మ మీద కసురుకున్నందుకు మా ఆవిడకి మనసులో కాస్త బాధ అనిపించింది; పైకి మాత్రం బింకంగా మాట్లాడకుండా కూర్చుంది. అన్నట్టుగానే, మా అత్తగారు కొడుకు ఇంటికెళ్ళి అక్కడ ఒక నెలరోజులుండి, సంక్రాంతి పండగ వెళ్ళంగానే, హైదరాబాదు కి వెళ్ళిపోయింది.

ఆవిడ వెళ్ళి పోయింతరువాత, అంటు, మడి, మైల, ఎంగిలి మీద కాస్త పరిశోధన చేద్దామనిపించింది. అసలు కారణం ఏమిటంటే, నాకు కొంపలంటుకోపోయే పనేమీ లేదు. పైగా, మా అత్తగారికి నేనంటే మంచి గురి. మా ఊళ్ళో ఉన్నన్ని రోజులు, నాతోకూర్చొని, వీల్‌ ఆఫ్‌ ఫార్య్టూన్‌ చూసేది. “రండి రండి అల్లుడుగారూ, చక్రాలాట వచ్చింది,” అని మాటలు అర్థం కాకపోయినా ఆ ఆట చూస్తూ సంబరపడిపోయేది.

ముందుగా అంటుకోసం నిఘంటువులు చూడటం మొదలెట్టా! అంటు అంటే స్పృశించడం, తాకడం! వ్యావహారికంలో, వండటం చేత “అపరిశుద్ధమైన పాత్రలు” అంట్లు అంటారు. మరో భావం మొక్కలకి అంటు కట్టడం. చేమకూరవారు సారంగధర చరిత్రలో ఈ అంటు వేరొక సున్నితమైన శృంగారరస పరంగా వాడాడు. “నన్నంటగ చెల్లునే జనకునంటిన పిమ్మట నంటివైన నీ యంటున నంటుగామి నెటులంటును గెంటక మేన ప్రాణముల్‌”  ఈ భావం ఇక్కడ అప్రస్తుతమే! అయినా, చెప్పాలనిపించింది; చెప్పాను. మనకి ముఖ్యం, అంటుబట్ట, అంటుచెయ్యి, అంటుగిన్నె. అంటుపడటం అంటే, మైల పడటం. మైల పడటం అంటే… మడికట్టుకున్న వాళ్ళని, మడికట్టుకోని వాళ్ళు  ముట్టుకోవడం అన్న మాట. అంటే, అంటుకోవడం అన్న మాట! అప్పుడు, వాళ్ళ బట్టలు మైల బట్టలౌతాయి.

ఈ మైలబట్టల సాంప్రదాయం, మనకి భారత కాలం నించీ ఉన్నట్టున్నది. ఒకరోజున శర్మిష్ఠ, దేవయానితోటి, మరో వెయ్యిమంది సహచారిణులతో సహా, ఓ తోటకి పోయింది. అక్కడ ఒక సరోవరం పక్కనే బట్టలు వలిచిపెట్టి శర్మిష్ఠ, దేవయాని జలక్రీడలు ఆడారు. అప్పట్లో ఎంత చిన్న రాజులకయినా, ఇళ్ళల్లో, జకూజీలు, స్విమ్మింగ్‌ పూళ్ళు వుండేవి కావు కాబోలు! నీళ్ళల్లోనుంచి పైకొచ్చి, దేవయాని చీర శర్మిష్ఠ కట్టుకుంది. ఇక్కడ ఇంద్రుడు చేసిన మోసం మతలబూ కాస్తో కూస్తో ఉన్నదనుకో! అది మన అంటుకథకి అనవసరం. దేవయాని, శర్మిష్ఠ కట్టి విడిచిన బట్ట కట్టుకోక, కోపం వచ్చి, “లోకోత్తర చరితుండగు నాకావ్యు తనూజ నీకు నారాధ్యను నే ప్రాకట భూసురకన్యక, నీకట్టిన మైల కట్టనేర్తునే…” అన్నది. అంటే, కవి అనబడే ఋషి పుత్రుడు, శుక్రుని కూతురిని నేను; బ్రాహ్మణ కన్యని, నువ్వు నాకు దణ్ణం పెట్టి ఆరాధించాలిసింది పోయి, నన్ను నీ కట్టివిడిచిన బట్ట కట్టమంటే నేను ఎట్లా కడతాను? అని అర్థం!  దాంతో, శర్మిష్ఠకి వళ్ళు మండిపోయి, ” మా అయ్యకు పాయక పనిసేయుచు దీవించి ప్రియము సేయుచు నుండున్‌ మీ అయ్య వెండిమహిమలు, నా యొద్దనపలుక నీకు ఆనయు లేదే.” అని చెప్పింది. అంటే, అర్థం : మీనాన్న మా నాన్న దగ్గిర “ఊడిగం” చేస్తూ, అట్లా ఇట్లా పొగడుతూ మంచిమాటలు చెప్పుతూ బ్రతుకుతున్నాడు. మీ నాన్న గొప్పలు నాకు చెప్పుతావా? నేను కట్టుకున్న బట్టలు నీకు పనికి రాలేదా? అని అంటూ, కోపంగా దేవయానిని పక్కనే ఉన్న నూతిలోకి తోసి పడేసి, తనతో వచ్చిన వెయ్యిమంది పరిచారికలతో  ఇంటికి పోయింది. అది రాచపిల్లయ్యె; ప్రభువుల కూతురాయె. దానికి కోపం తెప్పిస్తే యెల్లా? ఈ కథలో నీతి ఏమిటయ్యా అంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ చుట్టాలతో వైరం పెట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటున అల్లాంటి వైరం పెట్టుకుంటే, మీగతి నుయ్యో, లేకపోతే గొయ్యో!

ఒక రకంగా చూస్తే, ఎంగిలి కూడా, మైలే, మరి. ఎంగిలి అంటే, ఉచ్ఛిష్టము, అంటే తినగా మిగిలినది. లెఫ్టోవర్స్‌ అన్నమాట. నోటికి తగిలి అపవిత్రమైనది, మైల పడినది ఎంగిలి.  ఎంగిలి లేనిది సతి మోవి, అన్నాడు కవి. అంతే కాదు; ఆవులకి కూడా ఎంగిలి లేదట! మహాభారతంలో,  గోవులకు కపిలత్వం ఎల్లా సిద్ధించిందో చెపుతూ, తిక్కన గారు అంటారు :   ….”గోవుల కెంగిలి లేదిందు డెట్టు లమృత మొసగు నట్టుల గోవులొసగు దుగ్ధంబుల…” అని. ఎంగిలికూడు తింటున్నాడు అనే ఎత్తిపొడుపు మనకి భారతకాలం నుంచీ ఉన్నదే! “ఎంగిళుల కూడు గుడిచి క్రొవ్వున, పొంగిన మెయితోడ గర్వమున తిరుగుచు నాకుం గలదె ఎందునెదురు విహంగమపతి నైన గెలుతునని మును దలతున్‌,” అని కాకి హంసల కథ చెప్పుతూ, శల్యుడు, కర్ణున్ని, “కౌరవుల ఎంగిలి కూడు తింటున్నావు,” అంటూ ఎత్తి పొడుస్తాడు. మన తెలుగు వాళ్ళు అందరూ చెప్పుకుంటారు, శబరి శ్రీరాముడికి కొరికి,రుచిచూసి, ఎంగిలి పండ్లు పెట్టిందని! వాల్మీకి గారు అలా అన్నట్టు లేదు. ఎంగిలిని ప్రేమ, ఆప్యాయతలకి ప్రతీకగా అత్యద్భుతంగా, వాడుకున్నవాడు, ధూర్జటిగారి తిన్నడు. తిన్నడు తిన్నగా ఉండకుండా, బార్బిక్యూ చేసిన వేట మాంసం శివుడిచేత తినిపించి, తనూ తిన్నాడు. పాపం! ఆ గుడిలో ఊడిగం చేస్తున్న  వెర్రి బ్రాహ్మణుడు, పరితపించి పోయాడు అంతా “ఎంగిలి మంగలం” అయ్యిందని.

“కులదైవంబని, అల్కి, పూసి, గడిమ్రుగ్గుల్‌ పెట్టి, కైసేయ, లో
పలి కిట్లెంగిలి మంగలంబులగు దొప్పల్‌ రా గతం బేమి? ని
ర్మల తోయస్నపనం బొనర్చిన శరీరం బేటికి న్నీరు వ
ట్టులు గట్టెం? భవదాత్మశుద్ధి కిది గూడుంగా మహా హేయముల్‌”

అలికి, ముగ్గులు పెట్టి, శుభ్రంచేస్తే, ఈ ఎంగిలి దొప్పలన్నీ గర్భగుడి లోపలికి ఎట్లా వచ్చాయి? ఏమిటి స్వామీ ఇది, అని వాపోయాడు, బ్రాహ్మణుడు; తిన్నడి గురించి తెలియని తెలివితక్కువ బ్రాహ్మణుడు! ఎల్లవేళలా, ఎల్లప్పుడూ, ఎంగిలి మైలే! ఒక్క తిన్నడి విషయంలో, ఎంగిలి మైలకాదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది!

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, అంటు, మడి, మైల, ఎంగిలి, ఇవన్నీ మన సాంప్రదాయంలో కొరగానివేమీ కాదు. అవి అన్నీ అవసరమైనవే! అయితే, మనవాళ్ళు, మన పాత సాంప్రదాయాల్లో అసలు విశేషం మరిచిపోయి, అన్నింటా అతి చేస్తారు! అతి సర్వత్ర వర్జయేత్‌ అని కదూ అంట! ఈ విషయాలన్నీ మా అత్తగారికి సావకాశంగా చెప్పుదామని నేను ఎంతో ఆశ పడ్డాను.

మా అత్తగారు ఈ మధ్యనే పోయారు. నా ఈ అంటు, మైల వగైరా ఎంగిలి పరిశోధన అంతా, నేనూ ఆ పైకి పోయినప్పుడు తప్పకుండా ఆవిడని కలిసి, ఆవిడకి చెప్పాలి. ఆవిడకి నేనంటే ఎంతో గురి అని ఇదివరకే చెప్పాను కదూ!!