రీ యూనియన్

అప్రయత్నంగా నో అతి ప్రయత్నం మీదో మళ్ళీ మనం కలుసుకుంటాం.
ఏటి మీదకు జారిన ఎర్రగన్నేరు పువ్వుల్లాంటి
అందమైన ఆ రోజుల్ని మళ్ళీ వడిసి పట్టుకోవాలని
కాలపు వడ్డు మీంచి జ్ఞాపకాల వలలని వృధాగా విసురుతాం
జీవన ప్రవాహంలో కొట్టుకుపోయిన స్నేహపు ఆనవాళ్ళు
కమిలిన పూరేకులై మన దోసిళ్ళలో అక్కడక్కడ నీరసంగా మెరుస్తాయి .

ఇన్నేళ్ళ తర్వాత ఏనాడో సగం గుచ్చి వదిలేసిన
ముత్యాల దండల్ని తిరిగి కూర్చటానికి మనిద్దరం ప్రయాస పడతాం
అతకని అల్లికలు వెలిసిన వర్ణాల తో మన పెదవులపై పదాలు వెలాతెలాపోతాయి
ఆనాడు అర్ధంతరంగా ఆపేసిన గీతాలన్నీ ఇన్నాళ్ళ తర్వాత
ఆలపించటానికి మళ్ళీ ఉత్సాహంగా గొంతులు సవరిస్తాం
అద్భుతమైన రాగాల బదులు అపశ్రుతుల కీచురాళ్ళు మనల్ని అప్రతిభులని చేస్తాయి

ఒకప్పుడు ఆశలు,ఆశయాలు,కలలు,కన్నీళ్ళు పంచుకుని
గాఢంగా పెనవేసుకున్న మన స్నేహలత ఇప్పుడు
గుర్తుపట్టలేని రెండు గుబురు పొదల మధ్య వడలి వ్రేలాడుతుంది
దాటలేని అగడ్తలా మన మధ్య విస్తరించిన కాలం
మన ప్రపంచాల్ని చెరో కొసనా నిర్దాక్షిణ్యంగా విసిరేస్తుంది.
ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం.


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...