WhatsApp: నాలుగు కవితలు

1.

రెండు నీలం టిక్కులు
తెర మీద కనబడగానే
నల్ల మబ్బులు వీడిపోయి
నీలాకాశం సాక్షాత్కరించిన
అనుభూతి

నీ పేరు పక్కన
టైపింగ్ అని చూడగానే
అచ్చం ఆ మూడు చుక్కల్లాగే
మిణుకుమిణుకుమంటూ
నా హృదయం

2.

తెల్లారి లేస్తే
ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి
నీ ముంగిట్లో గుమ్మరించేస్తారు

కొద్దిపాటి మంచిని
చెత్తకుప్ప నుంచి
వేరు చేసుకోవడం
చెప్పనలవికానంత కష్టం

ఏది సత్యం? ఏదసత్యం?
ఉదయాన్నే శ్రీశ్రీ
మరింతగా గుర్తొస్తాడు

3.

నీ ప్రమేయం లేకుండానే
నిన్ను తమ గుంపులో
కలిపేసుకుంటారు

లెక్కలేనన్ని సమూహాల్లో
నిజంగా నువ్వు బతికున్నవెన్ని?

4.

ఎన్ని ఆవిష్కరణలొచ్చినా
చివరికి సొంతడబ్బా కోసమే

వందమందిని
ఒకేసారి చేరుతూ
నీ కొత్త కారు ఫొటో!


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...