ఇరవై యేళ్ళ పైమాటే

ఈ క్షణం
ఎన్ని కోట్ల సెల్ఫీ కన్నులు
స్వీయమోహాన్ని
బంధిస్తున్నాయో

ఈ క్షణం
ఎన్ని కోట్ల వృథా కబుర్లు
ఈ-తరంగాలుగా మారి
హద్దులు దాటుతున్నాయో

స్ట్రైకర్ కాలు
బంతిని తాకే క్షణంలో
ఎన్ని వేల కోట్లు
చేతులు మారుతున్నాయో

అంతా
పీకో సెకన్ల వ్యవహారం
తారా స్థాయిలో
కాళీ నృత్యం

ఆమె నల్లని
కురుల కొసలకి చిక్కుకుని
ఎగిరెగిరి పడుతుంటావు

కాలాన్ని
ఊహకందని ముక్కలుగా
నరికే క్రమంలో
నిన్ను నువ్వే
నరుక్కుంటావు

దేనికోసమైనా
ఒక్క క్షణం కూడా
నిరీక్షించలేని నీకు

ఇరవై యేళ్ళ పాటు
ఒక మొక్కని ప్రేమగా పెంచి
రేపటి పూలకోసం
ఓపిగ్గా ఎదురుచూసే మనుషులు
ఎలా అర్ధమౌతారు?

(ఈమాటకి అభినందనలతో)

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...