తను సృష్టించుకున్న ఎండల్లో
తానే తిరిగి తిరిగి
ఎర్రగా కందిపోయిన సూర్యుడు
నాటకంలో తన పాత్రకోసం
తెరవెనక ఎదురుచూసే
నటుడిలా చంద్రుడు
ఉదయం తొడిగిన తెల్లని బట్టలు
సాయంత్రపు ఆటలో దుమ్ముకొట్టుకుపోగా
తల్లి పెట్టే చీవాట్లు తల్చుకుని
తల్లడిల్లే బాలుడిలా పడమటి ఆకాశం
దైనందిన జీవిత కోలాహలాన్ని సైతం
తమ రెక్కల్లో ముడుచుకుని
గూళ్ళను చేరుతున్న పక్షులు
ప్రశాంతమైన వెన్నెల రాత్రిని
ఆవిష్కరించేందుకు
సమాయత్తమౌతూ
సమస్త ప్రకృతి
ఆ దృశ్య కావ్యాన్ని
ఆమూలాగ్రం చదివినా
తీరని ఓ ప్రాచీన దాహంతో
మూర్తీభవించిన మౌనంలా నేను!