గురువు

నిశ్శబ్దం గది నిండా పరచుకుంటుంది
జ్ఞానాన్ని ఆపోశన పట్టిన ఒక మస్తిష్కం
పాఠాన్ని పంచుకుంటుంది
అనేకానేక విత్తనాలను మదిమడులనిండా జల్లుతుంటుంది.

ఎక్కడా ఉగ్గు గిన్నెలూ, ఉద్ధరణిలూ ఉండవు
బాల్యాన్ని బతికించినట్టి పాల వాసనలూ కనిపించవు
కానీ, తన మస్తిష్కం నుండి మా మస్తిష్కాలకు ప్రవహిస్తూ
ఆ గంటసేపూ పాల లాంటి, ప్రాణవాయువు లాంటిదేదో
కిరణ జన్య సంయోగ క్రియా ఫలితాన్ని నింపేస్తుంది.

పాఠం పూర్తయ్యాక,
తరగతి గదిలో
పరాన్నజీవులు కనిపించకూడదని అతని తపన.
దేవున్ని నమ్మిన వాళ్ళకు
నమ్మని వాళ్ళకు కూడా
ఏదో సాక్షాత్కారం జరిగినట్టు ఉంటుంది.

నా సందేహాలో, ఒప్పుకోలులో, ప్రస్తావనలో
అసంకల్పిత వాక్యాలై
పాఠం తరువాతి కామాకి మరో కామాని చేరుస్తాయి.
గురువు చివరిలో ఫుల్స్టాప్ పెట్టాక
మది మొలకెత్తిన చేను అవుతుంది.

ఫలసాయమేదీ ఆశించని ఒక నిస్వార్ధమైన పాఠం
ఎప్పుడూ అలా సాగిపోతూనే ఉంటుంది
బీళ్ళని చేలుగా మొలకలెత్తిస్తూనే ఉంటుంది.

కలలోసైతం, గురువు గుర్తుకొచ్చిన ప్రతిసారి
నాలోని ఒక అంతర్గత మనిషి
దండలు కట్టుకుని వినమ్రంగా నిలబడి
వినటానికి సిద్ధపడటం
నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించని నిజం.


(ప్రొఫెసర్లు సూరి గారు, శాస్త్రి గారు మరియు మరికొందరు మహానుభావులకు నమస్సులతో)

రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...