ఎవడో వచ్చి అప్పటివరకు ఉన్న బంధం మధ్యలో
రాజకీయం పెడతాడు.
అంతే, అటు ఇటూ నోర్లు పారేసుకుంటారు
నిర్దాక్షిణ్యంగా లేని పరాయితనాన్ని నెత్తికెత్తుకుంటారు.
చుట్టూ భజనరాయుళ్ళూ, పాటగాళ్ళూ
మంటని మరింత ఎగదోస్తారు
ముసిముసి నవ్వులతొ ఆజ్యాన్ని పోస్తూ
వెచ్చ వెచ్చగా చలి కాచుకుంటారు.
రాజకీయం పెట్టిన వాడు,
ఎవరికీ కనిపించకుండా లోలోపలి
గజ్జిని గోక్కుని ఆనందపడి పోతుంటాడు
వాడి అసలు ప్రయోజనాన్ని బయట పెట్టడు
ద్రోహులని బయట పెడతానని
అనేకానేక ఉదాహరణలు దట్టిస్తాడు.
అటువాళ్ళూ ఇటువీళ్ళూ బడుద్ధాయిలై
ఏకరవు పెడుతూ వుంటే
లోకపు కాకులు
భుజాలు చరచుకుంటాయి
చోద్యం చూస్తూ.
ఒకటేమిటీ,
గొడ్డు గోదా, ఆస్తీ పాస్తీ
ఇంట్లో విలువైన మనుషులూ
అందరి మీదకి ఆయుధాలు వచ్చేస్తాయి.
అహం వీరంగం చేస్తూ ఉంటే
రెండు వైపులా పవిత్రమైన కుటుంబీకులు
ఇంగితాలు మరచిన నోళ్ళల్లో పారేసుకోబడతారు.
అప్పుడెప్పుడో పశ్చాత్తాపం పడే అవకాశం వచ్చినా
మేకపోతు గాంభీర్యం కాళ్ళకు అడ్డు పడుతుంది.
మంట మండుతూనే వుంటుంది
గుంట నక్కలు ఆజ్యాన్ని పోస్తూనే ఉంటాయి.
రెండు వైపులా కళ్ళు మూసుకుపోతూనే వుంటాయి.