గుప్పెడంత మనసు

కన్నీళ్ళు కార్చడం నేర్పామంటే
ప్రతి చిన్న కారణానికీ
కదిలి కదిలి ఏడుస్తుంది
నవ్వడం నేర్పామంటే
ప్రపంచంలో నవ్వదగిన
విషయాలు దొరకక
నిరాశ పడుతుంది

కాస్తంత చురుకుదనం నేర్పామంటే
చుక్కల్ని తాకి వస్తానని గొడవ చేస్తుంది
భరించలేక పరాకు నేర్పితే
పక్కనే వున్న ఆనందాన్ని కూడా
అందుకోలేని పిచ్చిదవుతుంది

ఆదర్శాలు నేర్పామంటే
అవనిలో మన బ్రతుకు
దుర్భరం చేస్తుంది
అవసరాలే తెలియచెప్తే
నరకంలో కూడా
మనకి చోటు లేకుండా చేస్తుంది

గుప్పెడంత మనసు..
దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టామా
బ్రతుకంతా దానికే సరిపోతుంది
ఎందుకొచ్చిన గోల అని
పట్టించుకోకుండా వదిలేసామా
బ్రతుకుకి అర్ధమే లేకుండా పోతుంది

టి. శ్రీవల్లీ రాధిక

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. \"రేవు చూడని నావ\" అనే కవితాసంపుటి, \"మహార్ణవం\", \"ఆలోచన అమృతం\" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి \"mitva\" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. \"నా స్నేహితుడు\" అనే కథకు 1994 లో \"కథ\" అవార్డు అందుకున్నారు ...