సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు

సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి? ప్రస్తుతం తెలుగు సాహిత్య విమర్శ యొక్క స్థితి ఎలా వుంది? తెలుగు సాహిత్య విమర్శ మెరుగుపడవలసిన అవసరం ఉందా? విమర్శ చేయడానికి కావలసిన ప్రతిభ, పరిజ్ఞానం ఏమిటి? ఇటువంటి పలు ప్రశ్నలకు సంబంధించి నా అభిప్రాయాలు, పరిశీలనలు, ఆకాంక్షలు ఈ వ్యాసంలో తెలియచేయాలనుకుంటున్నాను.

నేడు పత్రికలలో విమర్శ శీర్షిక క్రింద ప్రచురించబడే రచనలనూ, విమర్శా గ్రంథాల పేరుతో ప్రచురించబడే పుస్తకాలనూ పరిశీలించినపుడు ఎక్కువ భాగం రచనలు అసంతృప్తినే కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. చాలా విషయాలలో తెలుగు సాహిత్య విమర్శ మెరుగుపడవలసిన అవసరం ఉన్నట్లుగా తోస్తున్నదనీ ఒప్పుకోవాలి. అటువంటి కొన్ని విషయాలని గూర్చి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

సమకాలీన విమర్శలో అసంతృప్తి కలిగిస్తున్న అంశాలను ప్రస్తావించేముందు ఒక విషయం స్పష్టం చేస్తాను. క్రింద చెప్పుకోబోతున్న అంశాలు వర్తించని విమర్శకులు సమకాలీనులలో అసలు లేనేలేరని నా ఉద్దేశ్యం కాదు. సమకాలీనులలో మంచి విమర్శకులు కొందరు కచ్చితంగా వున్నారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నదన్నది, వారి నుండి వస్తున్న విమర్శల సంఖ్య కూడా తక్కువగానే ఉన్నదన్నది వాస్తవం.

మూసలో ఒదిగిపోవడం

నూతనమైనవిగా, విమర్శకుల స్వంతమైనవిగా తోచే పరిశీలనలు, అభిప్రాయాలు కనబడడం ప్రస్తుతం చాలా అరుదుగా జరుగుతోంది. చాలా రచనలు నాలుగు విమర్శలు చదివి అయిదోది వ్రాస్తున్నారేమో అనిపించేలా ఉంటున్నాయి. బహుశా సిద్ధాంతాలు ఏకరువు పెట్టడం, పడికట్టు పదాలు వాడడం అందుకు ఒక కారణం. విమర్శకులు తాము పరిశీలిస్తున్న రచన గురించి తమది అయిన యే క్రొత్త వ్యాఖ్యనీ చేయకపోవడం మరొక కారణం.

నేడు చాలా విమర్శలలో గణాంకాలు తప్ప మరేమీ వుండడం లేదు. ప్రఖ్యాత విమర్శకుల వ్యాసాలలో సైతం ఈ పుస్తకంలో మొత్తం ఇన్ని కథలు ఉన్నాయి, అందులో ఇన్ని కథలు ఫలానా విషయం మీద ఉన్నాయి అంటూ జాబితాలు ఇవ్వడం, కథా వస్తువులు ఏమిటో చెప్పుకుంటూ పోవడం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక విశ్లేషణ కానీ తార్కికమైన చర్చ కానీ ఉండడం లేదు. చివరికి సాహిత్యవిమర్శకిగాను ఉన్నతమైన పురస్కారాలు పొందిన గ్రంథాలలో కూడా ఇదే ధోరణి కనబడడం నిజంగా విచారకరం.

ఒక రచన యొక్క గుణదోషాలను గురించి విమర్శకులు తాము స్వంతంగా ఏవైనా ప్రతిపాదనలు/వ్యాఖ్యలు చేసినపుడు ఆ విమర్శలో తర్కము, విశ్లేషణ వంటివి ఉంటాయి. అందుకు భిన్నంగా స్వంత ప్రతిపాదనలేవీ లేకుండా అన్ని విమర్శలనీ ఒకే మూసలో వ్రాసుకుపోయినపుడు ఆ విమర్శలు పైపైన సాగుతాయి. వాటిలో లోతు ఉండదు.

ఒక రచనని విమర్శించడానికి ఆ రచనా, ఆ రచన తనలో భాగంగా ఇముడ్చుకున్న విషయాలూ ప్రధాన ఆధారాలు కావాలి. అప్పుడే ఆ విమర్శలో ఉపజ్ఞ గోచరిస్తుంది. అది వున్న తర్వాత సులువు కోసమూ, మరికొంత మెరుగులుదిద్దడం కోసమూ విమర్శనారంగంలో వచ్చిన సిద్ధాంతాలనీ, మెళకువలనీ ఉపయోగించుకోవచ్చును. అలాకాక కేవలం విమర్శనాసూత్రాల మీద మాత్రమే ఆధారపడి విమర్శలు చేస్తే అవి యాంత్రికంగా, ‘ఈ రచనపై ఈ విమర్శకుడి నుంచి వచ్చే విమర్శ ఇలా వుంటుంది,’ అని విమర్శ చదవకముందే పాఠకులకి తెలిసిపోయేలా వుంటాయి. తరువాతి విభాగంలో ఈ విషయాన్ని మరికొంత వివరించే ప్రయత్నం చేస్తాను.

అనాలోచిత అనుకరణ

ప్రస్తుతం వస్తున్న విమర్శలను చూస్తుంటే కొందరు విమర్శకులు తాము నమ్మిన రాజకీయ సామాజిక సిద్ధాంతాలని, మరికొందరు విమర్శకులు విమర్శనా సూత్రాలని అనుసరిస్తున్నారు తప్ప అసలు ఒక రచన యొక్క ప్రత్యేకతని ఎవరైనా పట్టించుకుంటున్నారా, అందులో ఉన్న ఔచిత్యాన్ని అనౌచిత్యాన్ని బేరీజు వేస్తున్నారా అని సందేహం కలుగుతూ వుంటుంది.

సిద్ధాంతాన్ని తప్ప ఔచిత్యాన్ని పట్టించుకోకపోవడం అనేది ఒక నిర్దిష్ట భావజాలానికి కట్టుబడిన విమర్శకులలో కనిపిస్తే, గతంలో ప్రసిద్ధ విమర్శకులు చెప్పిన సూత్రాలని వాటి యొక్క నిజమైన సారాన్ని అర్థంచేసుకోకుండా ఉపయోగించడం మరికొందరు విమర్శకులలో కనిపిస్తున్నది. ఈ రెండవ విషయాన్ని మరికొంత వివరంగా చెప్పుకుందాము.

“వాచ్యంగా చెప్పడం కన్నా వ్యంగ్యంగా చెప్పడం ఎక్కువ రమణీయంగా వుంటుంది”; “ఒక విషయాన్ని కథకుడు నేరుగా చెప్పడం కన్నా సంఘటనల ద్వారా చూపించడం బాగుంటుంది” మొదలైనవి తరచుగా వినిపిస్తుండే కొన్ని సూత్రాలు. విమర్శకులు ఇటువంటి సూత్రాలను ఆధారం చేసుకున్నప్పటికీ వాటిని గుడ్డిగా అనుసరించకూడదు.

వాచ్యంగా చెప్పడం కన్నా వ్యంగ్యంగా చెప్పడం రమణీయంగా వుంటుంది అన్న సూత్రాన్నే తీసుకుంటే, ఇటువంటి సూత్రం ఒకటి వుంది కదా అని విమర్శకులు అన్నివేళలా వాచ్యంగా చెప్పడాన్ని కావ్యరచయిత యొక్క అసమర్థతగా భావించకూడదు. వాచ్యంగా చెప్పడం అనేదాన్ని రచయిత ఉద్దేశపూర్వకంగాను ఒకానొక వ్యూహంతోను చేసిన సందర్భాలలో ఆ విషయాన్ని గుర్తించాలి.

నిజానికి సూత్రాలని అనుసరించడం కావ్యరచయిత సౌలభ్యానికి సంబంధించిన విషయం. కొన్ని కొన్ని అంశాలను అనుసరించడం ద్వారా కావ్యానికి అందాన్ని సులభంగా సాధించవచ్చునని తెలియచేసేవే సూత్రాలు. అయితే ఒక ప్రతిభావంతుడయిన రచయిత ఆ సూత్రాలని ఉపయోగించుకోకుండానే అందమైన కావ్యాన్ని పాఠకుడికి అందించగలిగితే అది గుణం అవుతుంది కానీ దోషం కాదు.

విమర్శకులు ఒక విమర్శనాసూత్రాన్ని ఎంచుకోవడానికీ, రచనలో దోషాన్ని నిర్ధారించడానికీ మధ్య మరొక ప్రక్రియ వుంది- ‘ఫలానా సూత్రం ప్రకారం నడవకపోవడం వలన రచనకి ఫలానా నష్టం జరిగింది,’ అని నిరూపించడం. ఆ ప్రక్రియని నిర్వహించడమే విమర్శకుల పని. అదే విమర్శ. ఆ పని చేయకుండా కేవలం ‘ఫలానా సూత్రాన్ని రచయిత పాటించలేదు’ అన్న విషయాన్నే ఒక దోషంగా పేర్కొనడం విమర్శ కాదు.

ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను. మనుచరిత్రలోని ‘అనిమేషస్థితి మాన్పె…’ అన్న పద్యాన్ని వివరిస్తూ విశ్వనాథ సత్యనారాయణగారు, ఆ పద్యంలో మొదటి రెండున్నర పాదాలలో వ్యంగ్యంగా చెప్పబడిన విషయాన్ని మిగతా ఒకటిన్నర పాదం లోనూ కవి మళ్ళీ వాచ్యంగా చెప్పడాన్ని ప్రస్తావిస్తారు (‘కావ్య పరీమళము’ అనే గ్రంథంలో). పెద్దన వంటి కవి అలా చేయడానికి కారణమేమిటో వివరిస్తారు. వివరించి, “పెద్దన ఇచట వ్యంగ్యము కన్న వాచ్యమే అధిక సుందరముగా భావించినట్లున్నది. ఆమాట నచ్చముగా కాదనుటకును వీలులేదు,” అంటారు.

ఈవిధంగా ఒకానొక సిద్ధాంతాన్ని రచయిత పాటించకపోవడం ఉద్దేశపూర్వకమయితే దానిని గ్రహించడము, ఆ సూత్రాన్ని పాటించకుండా కూడా (అంటే పెద్దలు చెప్పిన ఒకానొక సౌలభ్యాన్ని ఉపయోగించుకోకుండా కూడా) కావ్యానికి నష్టం జరగకుండా రచయిత కాపాడుకోగలిగితే, లేదా అలా పాటించకపోవడం ద్వారా మరేదైనా కొత్త ప్రయోజనాన్ని సాధించి వుంటే- ఆ విషయాలను కూడా గ్రహించి ప్రశంసించడము విమర్శకులు చేయవలసిన పని. ఇంత పనిని ప్రస్తుతం విమర్శకులు చేస్తున్నట్లు కనబడడం లేదు.

అంతే కాదు, విమర్శనాసూత్రాల విషయంలోనేకాక రచనకు ఆకర్షణ తెచ్చి పెడతాయనుకునే కొన్ని లక్షణాల విషయంలో కూడా ఇటువంటి పొరపాటును విమర్శకులు చేయడం కనిపిస్తుంటుంది. రచనకి ఉండవలసిన ప్రాధమిక లక్షణాలకీ, ఆ లక్షణాలని సాధించే ప్రయత్నంలో రచనలో ప్రవేశపెట్టబడే లక్షణాలకీ తేడా వుంది. ఉదాహరణకి పఠనీయత మొదటి తరహా లక్షణమయితే ఉత్కంఠ రెండవ తరహాకు చెందినది. కాబట్టి, ‘ఫలానా రచనలో ఉత్కంఠ చివరివరకూ కొనసాగలేదు,’ వంటి వ్యాఖ్యలు విమర్శలో చేర్చినట్లయితే, అలా ఉత్కంఠ కొనసాగకపోవడం వలన ఆ రచనకి జరిగిన నష్టం ఏమిటో చూపించగలిగినపుడు మాత్రమే ఆ వ్యాఖ్యకి విలువ వుంటుంది. ఎందుకంటే ఉత్కంఠ లేకపోవడమే రచనకి దోషం కాదు. ఉత్కంఠని ఉపయోగించుకుని దానిని పోషించడం ద్వారా కొందరు రచయితలు కొన్ని రచనలలో పఠనీయతను సాధించుకోవచ్చు, అది వారి విషయంలో ఒక సౌలభ్యం. అంతే. అందరు రచయితలూ అన్ని రచనలలోనూ పాటించి తీరవలసిన నియమం కాదు. అసలు ‘ఉత్కంఠ’ని రచనలో ప్రవేశపెట్టడం రచయిత ఉద్దేశ్యమే కానప్పుడు, ఉత్కంఠ లేనందువలన రచన యొక్కపఠనీయతకేమీ దెబ్బ తగలనపుడు, ఉత్కంఠతో నిమిత్తం లేకుండానే పాఠకులు రచనలో లీనమై చదవగలిగినపుడు, ఆ విషయాన్ని గ్రహించకుండా దానిని ఒక లోపంగా వ్యాఖ్యానించడం సరి అయిన విమర్శ కాదు.

పాఠకుడిగా విమర్శకుడిగా వ్యవహరించడంలో తడబాటు

విమర్శకుడు కేవలం పాఠకుడు కాదు, కానీ పాఠకుడు కూడా. విమర్శకుడికి పాఠకుడికన్నా కొన్ని ఎక్కువ బాధ్యతలు వుంటాయి. కొన్ని అర్హతలూ అధికంగా ఉంటాయి. బాధ్యతలని అతను అన్నివేళలా నిర్వహించి తీరాలి. కానీ అర్హతలని మాత్రం ఆచితూచి వాడాలి. మరికొంత వివరంగా చెప్పుకుందాము.

పాఠకుడు కొన్ని విషయాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తాడు, తనకి తెలియకుండానే. అలా పాఠకుడు ‘తనకి తెలియకుండానే’ ప్రాముఖ్యం యిచ్చే విషయాలన్నీ కావ్యానికి ఉండవలసిన కనీసపు గుణాలు. వాటికి విమర్శకుడూ విలువ ఇవ్వాలి. ఉదాహరణకి పఠనీయత వాటిలో ఒకటి. అటువంటి ప్రాథమిక విషయాలలో ఆ కావ్యం ఏ స్థాయి పాఠకుడిని ఉద్దేశించి వ్రాయబడినదో ఆ పాఠకుడి స్థాయిలోనే విమర్శకుడు కూడా (తన అర్హతలని పక్కన పెట్టి) ఆలోచించాలి.

అయితే పాఠకుడు కొన్ని లోపాలకు ‘సర్దుకు పోతాడు’. కావ్యంలో తనకి నచ్చిన విషయాలని మాత్రం తీసుకుని మిగతావి వదిలేస్తాడు. కొన్ని వైరుధ్యాలనీ అసమగ్రతలనీ పట్టించుకోడు. విమర్శకుడు ఆ పని చేయకూడదు. ‘సర్దుకుపోవడం’లో పాఠకుడిని అనుసరించకూడదు (తన బాధ్యతని వదిలేయకూడదు).

ఈ స్పష్టత చాలామంది విమర్శకులకీ సృజనాత్మక రచయితలకీ కూడా లేదేమోననిపిస్తున్నది. ఈ ‘సర్దుకుపోవడం’ అనే విషయాన్ని విమర్శకుడికి ఉండదగినదిగా చెప్పిన ‘సహృదయత’ అనే లక్షణంతో ముడిపెట్టి మాట్లాడటం చాలా సందర్భాలలో కనిపిస్తున్నది.

నిష్పాక్షికంగా నిర్మోహంగా వ్రాయలేకపోవడం

నిజాయితీ, నిర్మోహం, సునిశితత్వం, స్పష్టత అనేవి బహుశా మంచి విమర్శకుడిలో ఉండవలసిన నాలుగు లక్షణాలు. నిజాయితీ, నిర్మోహం అనేవి విమర్శకుడి వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలయితే సునిశితత్వం, స్పష్టత అన్నవి విమర్శనా ప్రతిభకి సంబంధించిన విషయాలు. నిజాయితీకి నిర్మోహానికి తేడా వుంది. అన్ని విమర్శలకీ రెండు లక్షణాలూ అవసరమే అయినప్పటికీ తమ భావజాలానికి సరిపడని రచనని విమర్శిస్తున్నపుడు నిజాయితీ కొంచెం ఎక్కువగా అవసరమైతే, తమకి ఇష్టమైన భావజాలానికి సంబంధించిన రచనని విమర్శిస్తున్నపుడు నిర్మోహం కొంచెం ఎక్కువగా అవసరమవుతుంది.

సమకాలీన విమర్శకులు చాలామంది నిజాయితీని కొంతవరకు అలవరచుకుంటున్నప్పటికీ నిర్మోహాన్ని పెంపొందించుకోలేకపోతున్నారేమోనని అనిపిస్తున్నది. సునిశితంగా స్పష్టంగా విశ్లేషించగల తమ ప్రతిభని తమకి నచ్చని భావజాలం/దృక్పథం వున్న రచనలని విమర్శించేటపుడు చూపినంత చక్కగా తమకి యిష్టమైన భావజాలానికి చెందిన రచనలను విమర్శించే సందర్భాలలో చూపడం లేదని అనిపిస్తున్నది.

ధన్యత కోసం ప్రయత్నం

నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అంటారు. అటువంటి ‘ధన్యత’ కోసం ప్రయత్నం విమర్శకులలో పుష్కలంగా కనిపిస్తోంది. అందుకే విమర్శలో కచ్చితత్వం లోపిస్తోంది. అంతేకాదు అలా ఏ విషయాన్నీ కచ్చితంగా చెప్పకుండా వుండడాన్ని ఒక సుగుణంగా భావించడమూ జరుగుతోంది. దానికి ‘అవతలి వారిని (అంటే బహుశా పాఠకులనీ కావ్యరచయితలనీ) గౌరవించడం’ అనే పేరుపెట్టడం కూడా జరుగుతోంది. ఇది చాలా విడ్డూరమైన విషయం. తమ విలువైన సమయాన్ని వెచ్చించి చదివిన విమర్శలో ఏ విధమైన కచ్చితత్వాన్నీ విమర్శకులు పాటించకపోతే దానిని పాఠకులు అవమానంగానే భావిస్తారు కానీ గౌరవంగా కాదు. ఇటు పాఠకులకీ అటు కావ్యరచయితలకీ కూడా అటువంటి విమర్శల వలన ప్రయోజనం ఉండదు.

అయితే ఇందులో అచ్చంగా విమర్శకుల దోషం మాత్రమే వుందని చెప్పలేము. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో చాలామంది పాఠకులు, రచయితలు, వారి అభిమానులు–అందరూ కలిసి కల్పిస్తున్న పరిస్థితి ఇది.

విమర్శకులు కావ్యంలోని ఒక దోషాన్ని కాస్త కచ్చితంగా చెప్తే, ‘ఒక రచనలోని దోషాలని ఎత్తి చూపి వాటిని ఎక్కువ వెలుగులోకి తీసుకువచ్చే కంటే అందులో ఏదైనా మంచి ఉంది అనిపిస్తే దానిని విశ్లేషించి మరింతగా పదిమందిలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది,’ అంటూ వ్యాఖ్యానించేవారు, ‘నాలోని రచయితని చంపేశారు,’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. కలాలు విసిరేసి, “ఇక మేము వ్రాయము,” అని బెదిరించేవాళ్ళు, ఆ విమర్శకి ‘దాడి, చీల్చి చెండాడడం’ వంటి పేర్లు పెట్టేవారు, ‘ఎందుకు నాయనా నీకీ గొడవ!’ అంటూ విమర్శకులకి హితబోధ చేసేవారు కొల్లలుగా వుంటారు. విమర్శకుడి ప్రతిభని గుర్తించి భుజం తట్టేవారు ఒక్కరూ ఉండరు. ఇది ఎంతటి ధీరులయిన విమర్శకులకయినా ఎంతో కొంత నిస్పృహని కలిగిస్తుంది, వారిని నిర్వీర్యమూ చేస్తుంది. అటువంటి సందర్భాలలో కావ్యరచయితలకి అందే సానుభూతి విమర్శకులకి అందదు.

అసలు విమర్శ అంటేనే ఒక కుత్సితమైన పని అని భావించడం వలన కావచ్చు, సునిశితంగా చేసిన ఒక విమర్శని ‘దాడి’ అంటూ రచయితలూ వారి అభిమానులూ దూషించినపుడు ఆ విమర్శకుడికి ఎవరూ తోడు రాకపోగా, ‘అవును మరి మొదట విమర్శ చేసింది మీరేగా!’ అనడము జరుగుతుంటుంది. ఈ ధోరణి మారనంతవరకు లోతైన విమర్శలు రావడం కష్టం.

ఇప్పటివరకు విమర్శలో వుండే ‘విషయానికి’ సంబంధించిన అంశాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ‘రూపం’ గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకుందాము. విమర్శలో ఏమి ఉండాలి అన్న విషయంతో పాటు విమర్శ ఎలా వుండాలి అన్న విషయం కూడా ప్రధానమే.

పఠనీయత: విమర్శకులు కావ్యంలో ఉండకూడని దశదోషాల గురించి చర్చిస్తారు. కానీ కావ్యంలోనే కాదు విమర్శలోను ‘పునరుక్తి’, ‘సంశయము’ వంటి దోషాలు ఉండకూడదు. కావ్యానికి ముఖ్యమైన పఠనీయత అనే లక్షణం విమర్శకీ ముఖ్యమే. కావ్యరచయితకి చక్కని వాగ్ధార ఉండవచ్చు, విమర్శకుడికి ఉండకపోవచ్చు. కానీ పాఠకుడికి ఆ తేడా తెలియనీయకూడదు. సరళంగా చెప్పదగిన వాక్యాలని కూడా క్లిష్టతరం చేయడం విమర్శలలో సాధారణంగా కనిపిస్తూ వుంటుంది. ఇంతకుమునుపు చెప్పుకున్నట్లు విమర్శకులకు ఉండవలసిన నాలుగు మంచి లక్షణాలలో ఒకటయిన స్పష్టత విమర్శలో ప్రతిబింబించవలసిన ముఖ్య లక్షణం.

మోటు మాటలు: అలాగే ప్రతి విషయంలోనూ సున్నితత్వానికి ప్రాముఖ్యాన్ని ఇస్తున్న నేటి కాలంలో కూడా విమర్శలలో ఎన్నో మోటు మాటలు కనిపిస్తున్నాయి. ఉదా: “అలాంటివారికి ఈ రచన ద్వారా రచయిత్రి బాగా గడ్డి పెట్టారు”; “ఈ రచన ఫలానా వాళ్ళకి చెంప పెట్టు”; “ఇది లోకంపై కసిగా ఉమ్మిన రచన”; “(రచయిత) మానవ సహజ ప్రవర్తనలని బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టేస్తాడు ఈ నవల్లో.”

విమర్శలలో ఇలాంటి వాక్యాలు ఎదురయినపుడు ఈ విధమైన పదజాలాన్ని మానుకోలేమా అనిపిస్తుంది. మొరటుదనాన్ని పరిహరించి కూడా తీవ్రతని అర్థం చేయించవచ్చు.

ఉదాహరణలు: విమర్శలో ప్రతిపాదించిన ప్రతి విషయానికీ ఉదాహరణలు తప్పకుండా ఇవ్వాలనీ, అప్పుడే ఆ విమర్శకి నిబద్ధత ఉంటుందనీ ఒక అభిప్రాయం స్థిరపడింది. అయితే అది అన్ని సందర్భాలలోనూ నిజం కాదు. విమర్శకుడి నిబద్ధతకీ ఉదాహరణలకీ సంబంధం లేదు. విమర్శకుడు చేసిన ప్రతిపాదనలు ఆరోపణలే అయినప్పటికీ కూడా అన్ని సందర్భాలలోనూ ఉదాహరణలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇపుడీ వ్యాసమే తీసుకుంటే ఈ వ్యాఖ్యలు ‘సమకాలీన తెలుగు విమర్శ’ గురించి అని మొదటే స్పష్టం చేశాక, చాలా కొద్దిమంది సమకాలీనులలో తప్ప మిగిలిన వారందరి విషయంలోనూ వీటిని గమనించడం జరుగుతోంది అని చెప్పాక, వ్యాసంలో పేర్కొన్న ఒక్కొక్క అంశానికీ మళ్ళీ ప్రత్యేకించి ఉదాహరణ ఇవ్వవలసిన అవసరం లేదు. అలా ఇవ్వకపోవడం వలన వ్యాసరచయిత నిబద్ధతకి వచ్చే కళంకం ఏమీ వుండదు.

ఇకపోతే స్పష్టత. ఉదాహరణల వలన ఒక్కొక్కసారి స్పష్టత పెరుగుతుంది నిజమే, కానీ చాలా సందర్భాలలో అసలు విషయం పక్కదారి పడుతుంది కూడా. నిజానికి చెప్పవలసిన విషయాన్ని ఉదాహరణ ఇవ్వకుండానే స్పష్టంగా చెప్పగలగడం ఎక్కువ ప్రతిభావంతమైన విషయం. అది గర్హించవలసిన అంశం కాదు గౌరవించవలసిన అంశం.

హాస్యం: విమర్శలో హాస్యాన్ని ఎలా వాడుకోవాలి అన్న విషయం కూడా ముఖ్యం. విమర్శలో హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ చొప్పించినపుడు అది తరచుగా అపహాస్యంగా ఉండడమే కనిపిస్తోంది. ఒక నొప్పించే విషయాన్ని సున్నితంగా మార్చేలా కాక బాధని మరింత తీవ్రం చేసేలా వుండడం కనిపిస్తోంది. ఇది వాంఛనీయం కాదు.

విమర్శకి సంబంధించిన ఇటువంటి అంశాలన్నిటిలోను మార్పు రావాలనీ, నిజాయితీగా నిర్మోహంగా వ్యవహరించే విమర్శకుల నుండి సునిశితమైన స్పష్టమైన విమర్శలు రావాలనీ, సునిశితమైన విమర్శని ఆమోదించే స్థితి తెలుగు సాహిత్య రంగంలో పెరగాలనీ, తద్వారా తెలుగు సృజనాత్మక సాహిత్యము మరింత నాణ్యతని పెంపొందించుకోవాలనీ ఆకాంక్షిస్తున్నాను.


టి. శ్రీవల్లీ రాధిక

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు ...