కినిగె.కాం తో నా అనుభవాలు

కినిగె.కాం – ఆన్‌లైన్ స్టోర్ ఫర్ ఇండియన్ బుక్స్ : అంటుంది వెబ్సైట్ తెరవగానే. ఇంకా ‘భారతీయ’ వరకూ రాలేదు కానీ, ప్రస్తుతానికి తెలుగు పుస్తకాలతో, కొన్ని ఆంగ్ల పుస్తకాలతో, మొదలైన ఆన్‌లైన్ స్టోర్ ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఈ-బుక్స్ కొనుగోలు చేయవచ్చు /అద్దెకు తీసుకోవచ్చు. ఎందుకూ? పీ.డీ.ఎఫ్ లు దొరకవా? అంటారా? ఇక్కడ కాపీరైట్స్ ఇబ్బందులు లేకుండా పుస్తకాలు కొనుక్కోవచ్చు. ఆ తరువాత, ఒకరు కొని పదిమందికి కాపీ ఇచ్చేసుకోవడానికి వీలు లేకుండా అడోబి డిజిటల్ ఎడిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ పుస్తకాలు చదివే వీలు కల్పించారు. ఈ సాఫ్ట్‌వేర్ కాపీ చేస్కోవడానికి వీలు కల్పించదు (శతకోటి దరిద్రాలకి… అన్నట్లు : దీని కోడ్ బ్రేక్ చేసారని ఆమధ్య చదివాను. మామూలు పుస్తకాన్ని జిరాక్సు తీసినట్లు, కాపీ కొట్టాలి అని నిర్ణయించుకుంటే, మార్గాలు ఉన్నాయి. కానీ, నేను చర్చించను). ఒక పుస్తకం అద్దెకు తీసుకుంటే, నెల రోజుల తరువాత అది మన కంప్యూటర్ నుండి చదవడానికి ఇక వీలవకుండా చేయగల సాంకేతికత కినిగె లో ఉంది. మళ్ళీ అద్దె కడితే, మళ్ళీ చదువుకోవచ్చన్నమాట. టూకీగా కినిగె చేసే పని ఇదీ.

పుస్తకాల సంఖ్య: సంఖ్యా పరంగా, రోజు రోజుకీ పుస్తకాలు పెరుగుతున్నాయి. అయితే, నా అభిప్రాయంలో వైవిధ్యం కొంత తక్కువగా ఉంది ప్రస్తుతానికి. కాలక్రమేణా ఈ సంఖ్య, వైవిధ్యం పెరుగుతాయని ఆశిద్దాం. ప్రస్తుతానికి ఏవో కొన్ని తప్ప అన్నీ తెలుగు పుస్తకాలే ఉన్నాయి. ఏమైనా, పెట్టినవన్నీ కాపీరైట్ సమస్యలు లేకుండా పెడుతున్నాం అంటున్నారు కనుక, మంచి విషయమే!

ఫీచర్స్: పుస్తకాల కొనుగోలు, అకౌంట్ రీచార్జ్, పుస్తకం చదవడం, వ్యాఖ్యలు రాయడం – అన్నీ సూటిగా, పెద్ద ప్రహసనాలేవీ లేకుండా ఉన్నాయి. ఎటొచ్చీ, సైట్లో హెల్ప్ పేజీలు ఎక్కువగా కనిపించవు. ఏం జరుగుతుందో అర్థం కావడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి – ఒకటి కుస్తీ పట్టడం. రెండు, కినిగె బ్లాగులోకి వెళ్ళి వెదుక్కోవడం. రెండూ వినియోగదారులను దూరం చేస్తాయి. మరో విషయం – ఈ అడోబి డిజిటల్ ఎడిషన్ తక్కిన ఈబుక్ రీడర్లతో పని చేస్తుంది కానీ, కిన్డిల్ లో (Kindle) ఇంకా పని చేయట్లేదట!

పైగా, నాకు కలిగిన సమస్యలు బ్లాగులో చర్చించారో లేదో, నాకైతే కనబడలేదు. ఉదాహరణకి, అడోబి డిజిటల్ ఎడిషన్ వాడుతున్నప్పుడు రెండు ఎంపికలు ఉంటాయి. ఒకటి – నా వివరాలు అడోబే వారికి నిర్థారణకు ఇవ్వడం. రెండోది – ఇవ్వకపోవడం. ఇవ్వడం వల్ల లాభం ఏమిటంటే, నేను ఇదే పుస్తకాన్ని మళ్ళీ మరో చోట కూడా దిగుమతి చేసుకోగలగడం. నా వివరాలు అడోబికి ఇవ్వకపోతే – నేను పుస్తకం కొన్నప్పటికీ, దాన్ని మరోసారి దిగుమతి చేసుకోడానికి కుదరదు. అయితే, సమస్య ఎక్కడ వచ్చిందంటే – నేను మొదట ఈ వివరాలు ఇవ్వకుండా ఒక పుస్తకం దిగుమతి చేస్కున్నాను. తరువాత, వివరాలు ఇచ్చేసాక, మరో పుస్తకం దిగుమతి చేసినపుడు, మొదటి పుస్తకం తుడిచి పెట్టుకుపోయింది.నేను తిరిగి కొనుక్కోవాల్సి వచ్చింది. ఈ విషయం కినిగె.కాం వారికి తెలియజేస్తే, దీనివల్ల నేను నష్టపోయిన మొత్తం నా ఖాతాలో మళ్ళీ వేసారు అనుకోండి. అది వేరే విషయం. అయితే, ఇటువంటిది ఒకటి జరిగితే, కినిగె వినియోగదారులలో ఖంగారు కలగడం సహజం కదా! ఏమి చేయాలో అర్థం కాకపోవచ్చు. అందువల్ల, అడోబి డిజిటల్ ఎడిషన్ సాఫ్ట్‌వేర్ గురించి కొంచెం అవగాహన కలిగించే విధంగా ఏదన్నా ఉండడం అవసరం, ఈ వెబ్సైటులో (అవన్నీ తెలిసిన వాళ్ళే ఈ సైటు వాడతారు అంటే ఏం చెప్పలేను!).

మరొక విషయం – ఇందులో పుస్తకాల ధర. వీరికి వ్యాపారపరమైన కారణాలు ఉండవచ్చును కానీ, ఉదాహరణకు – ‘మంచి పుస్తకం’ వారు ఇటీవలి కాలంలో ప్రచురించిన ‘అనార్కో’ పుస్తకం వెల మామూలుగా ఇరవైరెండు రూపాయలు. కానీ, కినిగె లో మాత్రం ముప్పై. అది ఎందుకంటే, కినిగె లో దేనికన్నా కనీస ధర ముప్పై కనుక! పైగా, ఒక ఈ-పుస్తకానికి, ప్రింటు పుస్తకానికి ఒకే ధర ఎందుకుండాలి? అన్నది నాకు అర్థం కాని విషయం (ఇక్కడే కాదు.. ఏ వెబ్సైట్లో అయినా!). ఈపుస్తకానికి ప్రింటు-రవాణా ఖర్చులు వగైరా ఉండనప్పుడు అదే ధర ఎందుకుండాలి? అన్న మీమాంసలో ఉన్నప్పుడు, ఇక్కడ ప్రింటు కంటే ధర ఎక్కువగా కూడా పెట్టాల్సి రావడం విచిత్రం. అలాగే, పది డాలర్ల రీచార్జ్ చేస్కుంటే నాలుగొందల రూపాయల బ్యాలన్స్ మాత్రమే రావడం కూడా. ఈ రెండింటికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు. కానీ, ఒక వినియోగదారుడి దృష్టిలో ఇవి కొంచెం ప్రతికూలత సృష్టిస్తాయనే చెప్పాలి.

మొత్తానికి నా అనుభవం చెబుతాను:

పుస్తకం కొనుగోలు, పఠనానుభవం – బాగున్నాయి. పైగా, లీగల్ గా కొంటున్నాం కనుక, ఆత్మసంతృప్తి కూడానూ! బయటి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే. అయితే, ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం. దీని గురించి, కినిగె వారి బ్లాగులో వివరాలు ఉన్నాయి. కానీ, కినిగె గురించిన పేజీలో కూడా బొత్తిగా ఏమీ లేదు, కొత్తగా వచ్చేవారికి కినిగె ఏమిటో అర్థమవడానికి. ఇది చూసాక కూడా, మామూలుగా కంప్యూటర్లను బ్రౌజింగ్ కోసం మాత్రమే ఉపయోగించేవారికి, కినిగె తో కొంతసేపు కుస్తీ తప్పదనుకుంటాను.

మొత్తానికి, అలవాటు పడే సమయాన్ని పక్కన పెడితే, నాకైతే, కినిగె.కాం ఉపయోగకరమైన ఆలోచన లాగానే అనిపిస్తోంది. కానీ, ఎంత మంది తెలుగువారు ఈ ఆలోచనని అంగీకరిస్తారు? ఎంతమంది వాడతారు? అన్నది నాకింకా అర్థం కావట్లేదు.