కినిమా మాసపత్రిక: సేన్ గుప్తా వ్యాసం

మా నాన్న కుటుంబరావుగారు 1952-53 ప్రాంతాల చందమామతో బాటుగా నాగిరెడ్డిగారు ప్రచురించిన సినీ మాసపత్రిక కినిమాకు పేరులేని ఎడిటర్‌గా పనిచేసి, మొత్తం వ్యాసాలూ, ఇంటర్వ్యూలూ, వార్తలూ అన్నీ రాశారు. కొన్ని నెలల తరవాత ఆ పత్రిక ఆగిపోయింది. అందులో ట్రిక్‌ఫోటోగ్రఫీ దగ్గర్నుంచీ అనేక సాంకేతికవిషయాలూ, అప్పుడే పైకొస్తున్న సినీప్రముఖుల వివరాలూ అన్నీ ఉండేవి. ఆ తరవాత కొన్నేళ్ళకు మొదలైన విజయచిత్ర ఈ స్థాయికి రానందుకు నేనాశ్చర్యపడ్డాను కూడా.

ఆ కాలంలో నటనతో బిజీగా ఉన్న సంపాదకుడు రావి కొండలరావుగారు ఇటీవల పాత బంగారం పేరుతో సినిమాల చరిత్రను వ్యాసాలుగా రాసి, మంచిపని చేస్తున్నారు.

విజయా ప్రోసెసింగ్ లాబ్‌ను నిర్వహించిన సేన్‌గుప్తా ఇంగ్లీష్‌లో రాసిన తన ఆనాటి యాత్ర వివరాలకు కుటుంబరావుగారి అనువాదం ఇది. రాబోయే సంచికల్లో మరికొన్ని వ్యాసాలను అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాసం విజయాసంస్థ తమ నిపుణులను విదేశాలకు పంపి, కొత్తవిషయాలు నేర్చుకునేందుకు సహాయపడిందని తెలియజేస్తుంది. అలాగే మన దేశంలో తొలిసారిగా హేమండ్ ఆర్గన్ (Hammond Organ) వాయిద్యాన్ని తెప్పించినదికూడా విజయావారే. మాస్టర్ వేణు దాన్ని మొదటగా షావుకారు, మల్లీశ్వరి సినిమాల్లో ఉపయోగించినట్టుగా తెలుస్తోంది.

– కొడవటిగంటి రోహిణీప్రసాద్.