అమ్మా, నాకేం పేరు పెడతావు?

అమ్మా, నేను…
నీ తలపు కుంచెలో రూపమై
నీ యెడద గుడిలో దీపమై
నీ కలల కడలిలో చేపనై
చివరకు
నీ ఒడలి కడలిలో పాపనయ్యాను

అమ్మా, ఇంకో ఐదారు నెలల్లో…
నీ ఒడిలో కూర్చుని నవ్వుతూ చందమామను పిలుస్తాను
నీ పక్కన పడుకొని పాలు తాగుతూ పరవశిస్తాను
నీ లాలి పాటను వింటూ కలల అలలపైన తేలిపోతాను
నీ ముద్దుల వానలో తడిసి మైమరచి పోతాను
నిన్ను, నాన్నను, అన్నయ్యను చూస్తూ మురిసిపోతాను

అమ్మా, నాకేం పేరు పెడతావు…
సుధ అంటావా, మధు అంటావా
నిధినా లేక నిశినా
రత్ననా, రశ్మినా
లలితనా, వాణినా
వెన్నెలనా, వీణనా
పోనీ సమతనా లేక మమతనా

అమ్మా…
వెలుగు చొరని ఈ నీ కడుపులో
ఎన్నాళ్ళే ఇలా ఇంకెన్నాళ్ళే
నీ చేతుల్లో, నీ ఒడిలో
ఎప్పుడు చేరుతానే

అమ్మా…
అబ్బా, ఇదేమిటి
ఎలాగో వుంది, ఏమో గుచ్చుకుంటుంది
చాలా బాధగా ఉందే
తొందరగా నన్ను కాపాడవూ

అమ్మా…
నాదొక తీరని కోరిక అయింది
నా కల కర్పూరంలా కరిగిపోయింది
నీ ఒడిలో ఆడలేని ఒక మాంసపు ముద్దను
అమ్మా, అమ్మా…