9.
మాస్లో విస్సన్న కాదు. ఆయన చెప్పిందే వేదం కాదు. ఆయన సిద్ధాంతం మీద ప్రబలమైన విమర్శ ఏమంటే అవసరాల్లో ఎగువ, దిగువ అని స్పష్టంగా ఉంటాయని ఋజువులేమీ లేవని. ఉదాహరణకు ప్రాధమికమైన అవసరాలు తీరకపోయినా సరే, దుర్భరమైన పేదరికాన్ని, అవిటితనాన్ని, కష్టాల్నీ అనుభవిస్తున్నా సరే అనివార్యంగా శాస్త్రజ్ఞులుగా, కళాకారులుగానే జీవించి, రాణించినవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ అభ్యంతరానికి సమాధానంగా మాస్లో జిజ్ఞాస, సృజనశీలత వంటివి తీవ్రమైన స్వభావాలుగా ఉన్నవాళ్ళు అవసరాల అనుక్రమాన్ని అతిక్రమించి జీవిస్తారని ముందుగానే ప్రతిపాదించేరు. అలాగే, ఇది అనుక్రమమైతే అవును గాని ఒక అవసరం కంటే, ప్రవృత్తి కంటే ఇంకొకటి ‘ఉన్నతమైనది’ అన్న సూచన – అంటే value judgment లేదు. సాహిత్యం గురించి గొప్పవీ తక్కువవీ అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా త్రిపుర ఈ విషయాన్ని నొక్కిచెప్తారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇదివరకటి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు మారిపోయేయన్న విషయాన్ని ఆయన చెప్పే పద్ధతి ‘అక్కడ్నుంచి ఇంకోచోటికి సాగిపోయేవు’ అని (“You have moved on”). ఇప్పటి మనఃస్థితి మునుపటికంటె ఎక్కువా, తక్కువా అన్న సూచన, ప్రస్తావన అనవసరం. ఎవరైనా రచయిత, సాహిత్యాభిమాని చూడ్డానికి వెళ్తే త్రిపుర వైఖరి ఎలా ఉంటుందంటే ముందు వచ్చింది ఒక మనిషి; అందునా సారస్వతం అంటే ఇష్టమున్నవాడు. ‘పెద్ద’ రచయితా, ‘చిన్న’ రచయితా అని కాకుండా ముందు అతనొక రచయిత! అదే ఒక విశేషం. ఎందుకంటే రాయటం అనేది మనుషులం సాధారణంగా చేసే పని కాదు. అదే ఒక అసాధారణమైన సంగతి, ఒక ‘గొప్ప’. అంచేత – ‘దా ఇలాగొచ్చీ! కూచో!’ – ఇదీ ఆయన రచయితలమని దగ్గరకొచ్చే వాళ్ళని స్వీకరించే పద్ధతి. రాసే ప్రవృత్తిని గురించి ఒక సంగతి ఆయన చెప్పినది. వాళ్ళ దూరపు బంధువుల్లో ఒకాయన – పెద్దవాడు, ఇంకెవరూ లేని ఒంటరివాడు, ఒక చిన్న గదిలో ఒక్కళ్ళే ఉండేవారు. ఆయన చేతికి ఏవి అందుబాటులో ఉంటే అవీ – ప్రార్ధన పుస్తకాలు, శ్లోకాలూ ఇలాటివి – చూసి మళ్ళీ తన నోట్ బుక్కులో అలా రోజంతా రాస్తూ పోయేవారు. ఆయన్ని కొంత కాలం గమనించి త్రిపుర అనుకున్నది ఏమంటే అలా రాసుకోవటం ఆయనకి ఏదో సాంత్వన. ‘ఎందుకు త్రిపుర? ‘ అంటే ‘ఇంకెన్నెన్నో ghastly acts అంటే ఘోర పాతకాలు చెయ్యగల వీలున్న ఆ చేతులకి, అలాగేమీ చేసీకుండా ఇదొక వ్యాపకం కదవై! ‘ అని. Boredomకు సారస్వత వ్యాసంగంతో ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి మంచి చర్చ ఉన్నాది.
‘దా ఇలాగొచ్చీవై! ‘ పిమ్మట త్రిపురతో సంభాషణంతా ఒక కడిగి, తుడిచిపెట్టిన అద్దంతో మనం ఒక్కళ్ళమే చేస్తున్న సంభాషణలాగ ఉంటుంది. అది కేవలం వచ్చినవాడి ప్రతిబింబం; అంతకుమించి అక్కడ వచ్చినవాడి ఆలోచనలకు, అంచనాలకు ప్రతిగా ఆలోచనలు లేవు, అంచనాలు లేవు, ప్రతిపాదన లేవు. ఒప్పుకోలు, తిరస్కారం ఇలాగ ఏమీ లేవు. ముఖ్యంగా ‘త్రిపుర ఉవాచ!’ లేదు. రాయటం అనేది ఒక అసాధారణమైన ప్రవృత్తి, కాని దాన్ని ‘ఓహో సాహిత్యం బాబూ!’ అని ఊరికే విశేషంగా గౌరవించడం, సారస్వతం తక్కిన సమాజానికి ఏదో ఒరగబెడుతుందనీ లేదా ఉద్ధరిస్తుందని నమ్ముకోవడం, హడావిడి చెయ్యడాన్ని ఆయన ఒప్పుకోలేరు. ఆయన ఒక రచయిత అని, ఆయన రాసినవాటిని చర్చించాలనీ వచ్చే ప్రయత్నాల్ని త్రిపుర సున్నితంగా తిరస్కరిస్తారు, లేదంటే ఎదుటివాళ్ళు నొచ్చుకోకుండా సాంతం ఓపిగ్గా విని, కొంత చెప్పి, క్లుప్తంగా ముగిస్తారు. సంభాషణ ఎదుటివాళ్ళకి ఉపయోగపడుతుందని, లేదు ఊరటగా ఉందనీ అనిపిస్తే మాత్రం ‘ఊఁ’ కొడుతూ, సునిశితంగా పరిశీలిస్తూ కొనసాగనిస్తారు. కాని ఈపాటి సంభాషణనూ ఆయన నిర్వహించే పద్ధతి చాల సబబుగాను, సునిశితంగాను – అంటే reasonable గాను, insightful గాను ఉంటుంది. ఆయన మాటంటూ గనక మాట్లాడితే అది శస్త్ర నిపుణుడి కత్తివేటు లాగ సూటిగా, తను చెప్పదలచుకున్నది వింటున్నవాడికి స్పష్టం అయ్యేవరకూ ఏ మర్యాదా మప్పితం లేకుండా మొండితనంగానూ వస్తుంది. త్రిపురకిప్పుడు ఎనభైనాలుగేళ్ళు. కాని సంభాషణలో ఆయన చూపు, ఆలోచన, మాట ఎన్నేళ్ళనుండో ఒక్కలాగే స్థిరంగా వయస్సుకు అతీతంగా – timeless అంటారు, అలాగుంటాయి.
“Read anything I write for the pleasure of reading it. Whatever else you find will be the measure of what you brought to the reading.” అని హెమింగ్‌వే (Ernest Hemingway) తన సృజనల్ని గురించిన చర్చల్ని అయిష్టత ప్రకటించేరు. “It is hard enough to write… without being asked to explain them as well.” అని ఆయన నొచ్చుకున్నారు. త్రిపురతో ఆయన రచనల్ని గురించి ఒకటి రెండు సార్లు తప్ప ప్రస్తావించే సాహసం చెయ్యలేదు నేను. అది కూడా నైరూప్యమని, చైతన్య స్రవంతి అని వ్యవహరించే సృజన రూపాల్ని గురించి, వాటి స్వభావాల్ని గురించి నేనే ప్రస్తావించినప్పుడు. హెమింగ్వే ఒక ఇంటర్వ్యూ లోన జాయిస్ (James Joyce) గురించి చెప్తూ ఆయన తన సృజనల్ని గురించిన ప్రస్తావనను, చర్చను మిక్కిలి అసహ్యించుకొనేవారని, సహించేవారు కాదని అన్నారు: “In company with people of your own trade you ordinarily speak of other writers’ books. The better the writers the less they will speak about what they have written themselves. Joyce was a very great writer and he would only explain what he was doing to jerks. Other writers that he respected were supposed to be able to know what he was doing by reading it.”
‘ఉవాచ!’ అంటే assertion అనదగిన అభిప్రాయాల్ని, స్థిరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలంటే త్రిపురకి బొత్తిగా ఆసక్తి ఉండదు. ఔత్సాహికులు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా త్రిపురతో సంభాషణను ‘సాహితీ చర్చ’ గా, ప్రణాళికగా, అంచనాగా నిర్వహించలేక నిరాశ పడతారు. త్రిపురతో సంబంధం హాయిగా ఉంటుంది గాని సాహితీ సంబంధం ఎంతగా ఊది, ఎగదోసినా రాజుకోలేక చల్లారేపోతుంది. వ్యవహర్తకు, సంస్కర్తకు, మూల్యాంకనం స్వభావంగా ఉండే విమర్శకుడికి, బాలరామానుజన్‌కీ ఇది చాల దుర్భరంగా ఉంటుంది. బెల్లం కొట్టిన రాయి కూడ త్రిపురలాగే ఉంటుంది కదా! ఉన్నతమైన తెలుగు సాహిత్యం కోసం, అభ్యుదయకరమైన సమాజం కోసం తనవంతుగా ఏ సాహితీ కృషీ చెయ్యకుండా, పోనీ ఎవరైనా ఉత్సాహంగా ముందుకొస్తున్నా సరే కలిసిరాకుండా! ఈపాటి దానికి త్రిపుర ఎందుకు? బహుశ అందుకేనేమో త్రిపురతో సాహితీ సంబంధాలు రకరకాలుగా స్థిరపడే ప్రయత్నాలు చేసి చివరికి ఏ తోవా లేక, ఎలాంటి వెసులుబాటూ లేక ఆగిపోతాయి. సాహితీ ఔత్సాహికులు ‘రకరకాల ఆలోచనలతో’ వస్తారు. (“They come here with some idea or other.”) త్రిపురకి వాటితో పేచీ లేదు, ప్రేమా లేదు. వచ్చినవాళ్ళు ఆయన పద్ధతిని అర్ధం కాదని, లేదంటే ‘నిష్క్రియా పరత్వం’ అని, కాదంటే ‘ఆయన్దారి ఆయన్దీ మన్దారి మన్దీ!’ అనీ చిన్నబుచ్చుకుని వెళ్తారు. ఒక కాఫ్కా కలగజేసుకుంటే త్రిపురకి కూడా –
మెరుపులు ఝళిపించి
మెరికల్లాంటి కొండల్ని నిలువుగా చీల్చి
ముదురు పాదాల వృక్షాలన్నిట్నీ
కూకటి వేళ్ళతో సహా
భూమ్మీదికి పడగొట్టి ………యింకా యింకా చాలా
ప్రణాళికలున్నాయి
ఆలోచిస్తే
జాగర్తగా కలుగజేసుకుంటేఅంతా మొత్తంగా మాడాలని
మనిషి కుడా మారాలని
కలుగజేసుకోకపోతే
మహా ముప్పు ముంచుకొస్తుందని ………
కానీ
Assumption అనే మాటకి సరైన తెలుగు మాట తోచదు. అది అటు కేవలం ఊహ కాదు, అలాగని అపోహా కాదు. బాలరామానుజన్ త్రిపుర దగ్గరికి ఎన్నో అభిప్రాయాలతో, అంచనాలతో, ప్రణాళికలతో, ఉవాచలతో, ఆరోపణలతో వెళ్తాడు. త్రిపుర ఔదార్యమనే అద్దంలో ఇవన్నీ ఒకొక్కటి, ఒకొక్కటీ పైకొచ్చి ప్రతిఫలించి, వీటన్నిటికీ ప్రాతిపదికలుగా ఉన్న assumptionsకి ఎలాంటి ఆలంబనా దొరక్క క్రమంగా పట్లు సడలి వాటంతటవే నశించే అవకాశం ఉంది. ఈ దుంప నాశనమే త్రిపుర బాలరామానుజన్‌కు ‘చెప్పే’ మొదటి పాఠం. ఇలాగ అవాలని త్రిపురకి ఆశ లేదు, తను బోధిస్తున్నాననీ, సరిదిద్దుతున్నాననీ ఆయనకి స్పృహ లేదు. కాని ఆయన ఎదుటివాడి అంతరంగాన్నే ప్రతిబింబిస్తూ అనే కొద్ది మాటలు, చూపులు చాల నునిశితంగా, అందుకోగలిగితే సహాయంగాను, అంటే therapeuticగా ఉంటాయి. ఎందుకో వివరించి చెప్పాలంటే ఇదివరకు Cognitive Dissonance అన్నదాన్ని గురించి, అలాగే Cognitive Consonanceను గురించీ కొంత చెప్పుకోవాలి. ఏ విషయాన్ని గురించైనా మన పరిజ్ఞానానికి వాస్తవాలు, దృఢ నిశ్చయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సంశయాలు, అపోహలు వంటి మౌలికమైన పార్శ్వాలుంటాయి. సాంఘిక మనస్తత్వ శాస్త్రం చెప్పేది ఏమంటే మన అహానికి ప్రియమైన విషయాలపైనే మనకి బలమైన, స్థిరమైన అభిప్రాయాలుంటాయి. వాళ్ళు దీన్ని ego involvement అని అన్నారు.
The map of an individual’s attitudes about any given topic is a function of how ego involved that individual is about that topic. When an individual is highly ego involved with a topic, she or he believes that the issue is important, and the person typically holds an intense position. Because the topic is one that has personal significance to the individual, it is considered to be central to their sense of self – hence, she or he is ego-involved.
ఇది తప్పూ కాదు, ఒప్పూ కాదు. త్రిపుర ఔదార్యం దీన్ని, అంటే సారస్వతం పట్ల మనకున్న వాస్తవాలు, దృఢ నిశ్చయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సంశయాలు, అపోహల సంచయాన్ని సమస్తం ‘తప్పూ ఒప్పు’ అని తీర్చుకోకుండా పరిశీలనగా తరచి చూసుకొనేలా చేస్తుంది. ఉదాహరణకు సర్వ సాధారణమైన assumptions కొన్ని: తన దృష్టికి వచ్చిన ప్రతి రచననూ, రచయితనూ ఇది మంచిది, అది మంచిది కాదు, ఈ సృజనకి నావి ఇన్ని మార్కులు! అని నిర్ణయించి తీరాలన్న నమ్మకం. చర్చకు వచ్చిన అన్ని విషయాల మీదా, తనకూ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా ఇదమిద్ధం అని స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తీరాలన్న ఊహ. ‘గొప్ప ‘ రచయితగా ‘గుర్తింపు’ అని ఒకటి ఉంటుందనీ, ‘ప్రఖ్యాత’ కవిగా ప్రాచుర్యం అని ఉంటుందనీ, ఒకొక్క రచననూ వెలయిస్తూ, పుస్తకాలు తెస్తూ సాహితీ సామాజికులలో లబ్ధ ప్రతిష్టులైన పెద్దవారి మెప్పుకోలు ద్వారా దీన్ని సంపాదించుకోవటం కవులకు ఉచితమైన మర్యాద అని. ఈ ద్రవ్యం ఎంత ఎక్కువగా సంపాదించుకున్నారో వాళ్ళు అంతటి ‘గొప్ప’ కవులు. ఈ ప్రక్రియకు కావలసిన మూల్యాంకనాన్ని సమకూర్చటమే విమర్శకుని ప్రధానమైన బాధ్యత. దీన్ని నిర్వహించే వ్యవహర్తలే సాహితీ సేవకులు. ఈ పనిని ఎంత ఎక్కువగా, ఉత్సాహంగా చేస్తే అంత ఎక్కువ సాహితీ సేవ. ఉన్నతమైన తెలుగు సాహిత్యానికి కావలసింది ఇదే! ఇలాంటి వందలాది ఊహల్ని, ప్రతిపాదనల్నీ త్రిపుర తిరస్కరించరు, అంగీకరించరు. ఆసక్తి ఉంటే ఇవి లేవనెత్తే ప్రశ్నలు తప్పకుండా చర్చనీయాలే, కాని అవి undecidable అంటే ఇది ఇదే అని తొందరగా, బల్లగుద్ది నిర్ణయించేసేవి కావని ఆయన సూచన. వాటన్నిటికీ అనేక రకాలుగా, పోకడలుగా ఆవిష్కృతమయ్యే ఆస్కారం, వాటితో రకరకాలుగా సమాధానపడే ఆస్కారమూ – అంటే possibility ఉంది. త్రిపుర మాటల్లో “these are all possibilities.” ఈ ఊహల్ని ప్రతిపాదించడమే కాదు, ఊహిస్తున్నది, ప్రతిపాదిస్తున్నది ఎవరో, అతని సంకల్పాలు, అనుభవాలూ, ఆకాంక్షలూ ఏమిటో వాటిని కూడా పరికించి చూసుకోవచ్చు, ఆసక్తి ఉంటే. Undecidability అంటే అనిర్ణేయత అని డెరిడా (Jacques Derrida) ప్రతిపాదించిన పద్ధతిని త్రిపుర ఇష్టంగా సూచిస్తారు. అనిర్ణేయత ఎంతో గొప్ప పరిశ్రమతో, వివేకంతోనూ చేసిన మూల్యాంకనాలు, ‘ఉవాచ’లవి సైతం పునాదుల్ని కదలిస్తుంది, వాటి assumptionsను ఒక్కొక్కటే ప్రశ్నిస్తూ. కాని అది ఒక అనిశ్చిత స్థితీ, లేకుంటే ఉదాసీనతా కాదు.
సృజనల విషయంలోను, చర్చలోనూ తనకు అనాలని ఉన్న కొద్ది మాటల్లో మాత్రం త్రిపుర భాషను, ఆలోచననూ చాల సునిశితమైన, ఖచ్చితమైన తర్కంతో నిర్వహిస్తారు. ఎదుటివాడి వాక్యాల్నీ, వాక్యాల్లో అతను పొదుగుతున్న ఒక్కొక్క మాటనీ, అతని హావభావాల్నీ గ్రద్దలాగ ప్రస్ఫుటంగా పరిశీలిస్తారు. ఒక్కొక్క మాటకి ఉండవలసిన ఖచ్చితమైన అర్ధంలో ఏమాత్రం ఔచిత్యం లోపించినా వెంటనే ఎత్తిచూపిస్తారు. ప్రసక్తికి వచ్చింది ఒకవేళ ఆసక్తికరంగా ఉంటే మాత్రం శల్య పరీక్ష చేసి, విస్పష్టంగా తన అభ్యంతరాన్ని ఎత్తి చూపిస్తే గాని విడిచిపెట్టరు. అలాగే ఎప్పుడైనా అరుదుగా ఏదైనా సృజనను – అంటే కవితనో కధనో – పరీక్షించి చూసేటప్పుడు ప్రతి మాటను, పదబంధాన్నీ, వాక్యాన్నీ, మొత్తం సృజననీ పరీక్షిస్తూ, ఎక్కడ ఏది ఒప్పిందో, ఎక్కడ బాగాలేదో సృజన పాఠాన్నే ప్రాతిపదికగా సూక్ష్మాతిసూక్ష్మంగా విడమరిచి చెప్తారు. ఈ వివరణ సుదీర్ఘంగా ఉండదు. కాని ఆ సృజనకు మౌలికము, ముఖ్యమైన విషయాన్ని – అంటే essenceని ఎత్తిచూపిస్తుంది. ఉదాహరణకు ఒక సంగతి.
ఎమిలీ డికిన్సన్ (Emily Dickinson) కవిత ఒకటి I’m Nobody! Who are you? అని ఉంది. అది నేను తెలుగులోకి చేసింది త్రిపురకి ఉత్తరంతో పంపించేను.
ఎవల్తాలూకా? నీనెవర్నీ కాను.
మీరూ ఎవరూకారా?!
అయితే మనమిద్దరిఁవి – ఎక్కడా అనకండి!
నాకొళ్ళు తొక్కీరా?ఎవరో ఒకలం కావాలా
అవతలోణ్ణి మట్టీసి?
చివరికేటి చెయ్యాలి
చీరండ లాగ!
ఇది అయ్యింది కాని నాకేం నచ్చలేదు; ఏదో గుద్దుకున్నట్టుంది. ఎందుకో తోచలేదు. త్రిపుర తనకీ ఏదో ఇబ్బందిగా ఉంది, అడ్డం పడుతుంది అన్నారు. గొంతుతో (voice) ఇబ్బంది వచ్చింది అన్నారు. దాంతో నాకొచ్చిన ఇబ్బందీ అదే. గొంతు నా ‘స్వంత’ గొంతులా ఉందా? అంటే ఒకసారి చదువుకుంటే ఉన్నాదీ, మరోసారి చదువుకుంటే మరి లేదు. ‘నాకూ ఆ అభ్యంతరమే వచ్చింది, మీరు ఎలా పట్టుకున్నారో?!’ అని అన్నాను. ఆయన “‘Man is diction’ అన్నారు చూడు?!” అన్నారు! ఇలా అని పేటర్ (Walter Pater) కాబోలు అన్నారు. “Style is the man.” అని మాథ్యూ ఆర్నాల్డ్ (Matthew Arnold) అన్నారు. శైలి మనిషినే పట్టిస్తుంది.
ఇంకొక సందర్భంలో గొంతు గురించి మాట్లాడుకున్నాము. ప్రవాసులకి, రకరకాల దేశాలు, భాషలతో బతికేవాళ్ళకీ ‘ఇదే నాదీ!’ అని ఒక గొంతూ, ఒక భాషా, ‘ఇదే నా ఇల్లు!’ అని ఒక ఇల్లూ స్థిరపడే అవకాశం లేదు. నాకైతే అనుభవాల్లోని ఈ వైవిధ్యం మరీ విస్తారంగా ఉన్నాది. బ్రాహ్మర్ల ఇళ్ళలో వితంతువులు మాట్లాడుకునే భాషంటే నాకు అన్నింటికంటే ఎక్కువిష్టం – వాళ్ళ కష్టం తింటూ, వాళ్ళ మాటలు, పాటలూ వింటూ పెరిగేను కాబట్టి. అది కాకుండా కళింగాంధ్రలో రక రకాల శాఖల బ్రాహ్మల భాష, ఇంకా అక్కడి కొప్పల వెలమలు, తెలగాలు, శిష్టు కరణాలు, కింతల కాళింగులు, వడ్డి తెలుగువాళ్ళు, పట్నాయకులు, రెల్లి, మాల, మాదిగ, చచ్చడి వాళ్ళు, గవర కోమట్లు, కళింగ కోమట్లు, క్రిష్టియన్లు, కంసాల్లు, ఆ తరవాత వైజాగు రెల్లివీధి, జాలారిపేట, కంచరపాలెం ఏరియాల్లోను ఇంకా వైజాగంతా మాట్లాడే మాటలన్నీ నా చిన్నప్పటి భాషలే. ఆ అన్ని గొంతుకలతోనూ నేను కలిసిపోయి నాదని వేరే ఏం లేనట్టే మాట్లాడటం నాలోన అదో గొంతుక. వాళ్ళందరు బతికే జాగాలన్నీ నావే. అవి కాకుండా వేరేగా ఇది ‘నేను’, ఇదీ నా గొంతుకా అని ఒకటి ఎత్తి చెప్పుకోడానికి విడిగా నాకంటూ ఏమీ మిగల్లేదు, ఎంత వెతుక్కున్నా. ప్రవాసులకి ఇలాగవుతుంది కాబోలు. మరి ఆ తరవాత రక రకాల ప్రాంతాల్లో మనుషుల్తో బతికి ఆ భాషలన్నీ ఒంటబట్టించుకున్నాను కాని వాడిక లేక మరిచిపోతానని బెంగగా ఉంటుంది. ఇంతేకాక Man’s material condition determines his psyche అని మార్క్స్ (Karl Marx) తీర్మానించినది నిజమేనని అనుభవంలో తెలుస్తుంది. బీదవాళ్ళవీ గొప్పవాళ్ళవీ, అధికార్లవీ సామాన్యులవీ – వీళ్ళ బతుకుల్లోన, సంస్కృతుల్లోనా తేడాలున్నాయి. ఇవన్నీ వేషాలు వేస్కోని చూట్టమంటే నాకు చాలా ఆసక్తి. ఇప్పుడు నేను కధలూ కవిత్వాలూ గట్టా రాస్తే గనక అవి ‘జూటా’ కాకుండా ఉండాలంటే కొంతమటుక్కైనా ఇంగ్లీషులో నడవాలి, అందులోకి అమెరికన్లు, యూరోపియన్లు, ఇంకా ఈ అందరు జాతులవాళ్ళూ, బీదవాళ్ళూ గొప్పవాళ్ళూ, గొప్ప పండితులు, వెర్రోళ్ళు, లేబరు వీళ్ళందరూ దిగాలి. ఈ ఇన్ని గొంతుకల్లో మరి ఏది నా నిజం గొంతుక? ఇన్ని ఇళ్ళలోనూ ఏ ఇల్లు నా నిజం ఇల్లు? ఈ మండలాలన్నిట్లోకీ ఏ మండలానిది నా ‘మాండలీకం?’ ఇలాగని త్రిపురని అడిగితే ఆయన అన్నది ఏమంటే ‘నువ్వు ఏ భాషకి ఆ భాషలోనే అంతా నడిపీగలవు. ఈ భాషలన్నీ నీ భాషలేనువై.’ అని. అంటే – ‘These are all possibilities!’ ఆయనన్నది నిజమే. కాని గొంతు అనేది భాష కంటె లోతైనది. అది మనిషి జీవన తత్వంతో, అస్తిత్వంతో, అతను ఒంటబట్టించుకున్న నానారకాల సంస్కృతులన్నింటి అవశేషాల్తోటీ చాల లోతుగా ముడిపడి ఉండేది. Man is diction అన్నది నిజమే. ఎవరైనా రాసింది పది వాక్యాలు చదివి వాళ్ళ ప్రవృత్తిని, సంకల్పాన్నీ చాల వరకు అర్ధం చేసుకోవచ్చు. సృజనకు అలా పట్టిచ్చే శక్తి ఉంది. ఉదాహరణకు వేలూరి శివరామ శాస్త్రి గారి నాటిక సుల్తానీ అని ఉంది. దాన్లో తెలంగాణలో రకరకాల కులాలు, మతాల వాళ్ళ గొంతులన్నీ ఆయన గొప్పగా ప్రదర్శిస్తూ నిర్వహిస్తారు కాని, ఆ అన్నిటికీ అంతర్లీనంగా శాస్త్రిగారి గొంతుకేదో అది కూడా మనకి తెలిసిపోతుంది. అది ఒక దయామయుని గొంతు. అంచేత, ఈ గొంతులన్నిటికంటె అడుగున లోగొంతుక ఒకటున్నాది కాబోలు. పైన కవితలో మాట్లాడుతున్నవాడు సూచిస్తున్న తత్వానికీ, కవి లోగొంతుక్కీ ఎక్కడో ఎటాముటీ వచ్చింది కాబోలు. అది మహా అయితే ఒక ఆకాంక్ష, ‘వాస్తవం’ అంతా కాదు కాబోలు. అదేనేమో త్రిపురకి కూడా అడ్డం వచ్చింది. సృజనల్లో జూటాని పోల్చుకోటాన్ని గురించి హెమింగ్వే అంటున్నారు: “The most essential gift for a good writer is a built-in, shockproof, shit detector. This is the writer’s radar and all great writers have had it.” ఈ దిక్సూచినే అంజనం వేస్తున్నట్టు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు ప్రయోగించే తీరు చాల హృద్యంగా, తెలివితేటలుగాను, విమర్శకులకే మార్గ దర్శకంగా ఉంటుందని నేననుకుంటాను. ఆయన సృజనల్లో ‘సత్తెం’ అని, ‘రంగూ రుచీ వాసనా’ అని ఆశిస్తున్నదాన్ని పాశ్చాత్య విమర్శకులు verisimilitude అని అన్నారు. మరి దీనిమీదా చాలా ఉన్నాది…
10
రోమన్ చక్రవర్తుల విజయోత్సవాల్లోన ఉరేగింపుకి ముందు ఒక సేవకుడు Memento mori అని రాసున్న ఫలకాన్ని మోస్తూ చక్రవర్తికి ఎదురుగా నడిచేవాడట. ‘మృత్యువును మర్చిపోవద్దు!’ అని గుర్తుచేస్తూ. ఇంకా ‘ఒకసారి వెనుదిరిగి చూడు! నువ్వు కేవలం ఒక్క మనిషివి!’ (Respice post te! Hominem te memento!) అనీ. త్రిపుర కాఫ్కా కవితలు మొదటి పేజీలోన కాఫ్కా మాటలు ఉంటాయి: External reality is too small, too unambiguous and too truthful to contain what there is inside a single man… అని. త్రిపుర సృజనకు ఈ మాటలు దిక్సూచి లాంటివి. అంతరంగాన్ని మనం అనుభవించే తోవల్ని స్థూలంగా ఐదు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. లౌక్యుని తోవ, నాయకుని తోవ, శాస్త్రజ్ఞుడి తోవ, సృజన శీలి – అంటే కవి తోవ, యోగి తోవ. ఇది కాక ఉన్మత్తుని తోవ ఉంది; అది ఆరోగ్యప్రదమైంది కాదు కాని కవిని, యోగినీ అర్ధం చెసుకొవాలంటే వెర్రివాణ్ణి కొంతైనా అర్ధం చేసుకోవాలి.
(ఇంకా ఉంది)