జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు!

“వాన లో కొందరు నడుస్తారు. మిగిలిన వాళ్ళు తడుస్తారు,” అంటాడు ఓ ఆంగ్ల కవి. కాని నేనంటాను – కొందరు మాత్రమే తడిసి తడిసి ముద్దవుతారని!ఆ ముత్యాల దారాల్ని గుండె స్వరాలుగా మార్చుకుంటారనీ! మండు టెండలకు ఎండిన నేల మీద చినుకు పడగానే విరజిమ్మే మట్టి పరిమళం అలా గుప్పుమంటుందో లేదో నాకు నా బాల్యం చప్పున గుర్తొచ్చేస్తుంది.

అప్పుడు. చిన్నప్పుడు స్కూల్ కెళ్ళేటప్పటి మాట! ఆకాశం నల్ల మబ్బేసుకోగానే మొదలై పోయేది ఆత్రం! ఒకటే తహ తహ. ఎప్పెడెప్పుడు బడి గంట కొడతారా అని! వర్షాకాలంలో అది రోజూ జరిగేదే అయినా ఏ రోజు కారోజే కొత్తగా దిగులు పడిపోయే వాళ్ళం బడికి సెలవీయరేమో నని!

మేము ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చేది..

మా మాష్టారు – చేతి వాచి చూసుకుంటూ “ఒరేయి, కొట్టరా గంట” అనే వారు. అంతే! గణగణమంటు ఆగకుండా ఓ నిముషం పాటు మోగి చివర్లో మూడు సార్లు ఆగి ఆగి ఠంగు ఠంగు ఠంగు మనేది, ఇక ఫొండి అంటున్నట్టుగా. ఆపాటికే శుభ్రంగా సర్దేసుకున్న పుస్తకాల సంచిని భుజాన కేసుకుని కదిలే వాళ్ళం. హెడ్ మాస్టారి భయం కొద్దీ గుమ్మం దాక ‘క్యూ’ లోనే వెళ్తున్నట్టుండేది కానీ, అబ్బే, ఒకళ్ళనొకళ్ళం నొక్కుకుంటూ, తోసుకుంటూ, నిలబడటం రాని వాళ్ళల్లే – ఆ వరస అలా వొంకరలు పోతూనే వుండేది. మెయిన్ గేట్ దాక వుగ్గ బట్టుకున్న నోరు అడుగు బయట పడగానే చూడాలీ – సంతలో జనంలా పెద్దగా మాట్లాడేసుకునే వాళ్ళం. ఒకటే అరుపులు. కేకలు. పిలుపులు. పరుగులు. నవ్వులు. అంతా గోల గోలగా జాతరై పోయేది వీధి వీధంతా!

పొలో మంటూ వీధిలోకొచ్చి పడ్డాక ముందు గుంపులు గుంపులుగా, తర్వాత జట్లు జట్లుగా, మెల్ల మెల్లగా నలుగురుగా, నలుగురు ఇద్దరుగా వీధి జంక్షన్లలో విడిపోయి చివరికి ఒకరుగా మిగిలిపోయి ఒంటరిగా ఇంటికి చేరే వాళ్ళం. వానాకాలంలో మబ్బేయడం ఆలస్యం! వాన కురవక ముందే బడి కట్టేసి మాస్టార్లు పిల్లల్ని ఇంటికి పంపించేసే వారు – పిల్లలం వర్షంలో తడవకూడదని కాబోలు! కాని, వాళ్ళకేం తెలుసు. మేము ఇంటి కెళ్ళేదే వానలో తడవడం కోసమనీ!?

స్కూల్ నుంచి ఇంటికి హాయిగా తడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత సంబరంగా వుండేదో! ఏమిటో ఆ వుత్సాహం ! ఎంత సంబరమేసేదంటే ఇంత అని చెప్పలేనంత!అది వాన వొస్తున్నందుకో, స్కూలుకి సెలవిచ్చినందుకో తెలీదు. ఎక్కడ వాళ్ళక్కడ ఇళ్ళకెళ్ళి పోతున్నా నాకు మాత్రం నడక సాగేది కాదు. ఎక్కడ నడిస్తే త్వరగా ఇల్లొచ్చేస్తుందో నని బెంగ! అందుకే ఒకో అడుగు పొదుపుగా వేసుకుంటూ నడిచేదాన్ని.

ఆ వాతావరణం ఎందుకో మనసుకి బాగుండేది. గాలికి వూగే పెద్ద పెద్ద కొమ్మలు. తుళ్ళుతూ రెపరెపలాడే లేత రెమ్మలు. ఊగుతూ పూలతీగలు కళ్ళకి నచ్చేవి. పెంకుటిళ్ళూ డాబా ఇళ్ళూ దట్టమైన మబ్బు నీడలలో వీధులన్నీ నిశ్శబ్దంగా, మలుపులో కుంచె తిప్పిన వంపు తిరిగితే ఒక చిత్తరువులా కనబడేది. మాకు మల్లేనే రక రకాల పిట్టలు, ఆకాశంలో ఎగురుతూ తొందర్లు పడి పోతూ గూడు చేరడం కోసం! గాలి జోరుకి ఆలయశిఖరం చిరు గంటలు కదలిన సవ్వడి – సన్నగా వినిపిస్తూ వుండేది. ఇంతలో గాలి విసురందుకునేది. నన్ను వెనక నుంచి ఎంత బలంగా నెట్టేదంటే నా ప్రయత్నం లేకుండానే రెండడుగులు ముందుకు పడిపోయేవి. నేనాగినప్పుడల్లా తోస్తూనే వుండేది వెనక నుంచి! ఇప్పటికీ నాకెంత గుర్తంటే ఆ స్పర్శ, నన్ను త్వరగా ఇంటికెళ్ళమని చెప్పడం కామోసు దాని భాష. ఇంతలో ఆకాశంలో మెరుపు మెరిసేది. తల పైకెత్తి చూస్తే మెరుపు వేగంతో మొహం మీదకొచ్చి తాకేది ముత్యంలా ఓ చినుకు. చల్లగా చెంపల మీంచి జారుతూ చుక్క గా మొదలైన వాన చిక్కని జల్లు లోకి మారిపోతూంటే అప్పుడు పరుగు పెట్టే దాన్ని ఇంటి వైపుకి.

పది అడుగుల్లో ఇల్లనగా వర్షం జోరై పోయేది. ముందు తల తడిసేది. ఆ తర్వాత నిలువునా స్నానమై పోయేదాన్ని. అమ్మ కోప్పడుతుందని కాని, లేకపోతే అలా ఎంత సేపైనా వానలో తడుస్తూ వుండాలనిపించేది. చలిగాలికేమీ అనిపించేది కాదు కానీ అదేమిటో, ఇంట్లోకి అడుగు పెట్టగానే వెన్ను లోంచి వొణుకు మొదలయ్యేది. పెదవులు అదురుతూ,పళ్ళు టకటకలాడుతూ భలేగా వుండేది. వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీరాజనాలే వుండేవి అమ్మతో. పొడి టవల్తో తల తుడిచి, బట్టలు మార్పించి, జడలు విప్పి ఫాన్ కింద కూర్చో పెట్టేది. వేడి పాలు తెచ్చి తాగించేది ‘అలా ఎలా తడిసిపోయావే’ అంటూ. అమ్మ చెప్పిందని అక్కడే కదలకుండా కూర్చున్నా నా చూపులన్నీ కిటికీల వైపే వుండేవి. ఇంటి కప్పు మీంచి జారి పడే వాన తీగల అందాలు చూడ్డం కోసం! తలుపులు సగం తీసి తొంగి చూసే వాళ్ళం వర్షానికి వాకిట్లో ఎన్ని నీళ్ళు నిల్చాయా అని.

కొంచెంగా వాన తెరిపీయగానే ఇక ‘వురుకుడే వురుకుడు’ వీధులు చూడ్డం కోసం! వీధులన్నీ నదులుగా మారి ప్రవహిస్తూ వుండేవి. వాన గుంటల్లో కాళ్ళు పెట్టి చిందులేసే వాళ్ళం. ఈ మూల నించి ఆ మూల దాకా పాదాల లోతు నీళ్ళల్లో నడిచే వాళ్ళం. కాగితం పడవలు చేసి వీధి కాలవల్లో వదిలి ఊపిరి బిగపెట్టి చూసే వళ్ళం. అవి వేగాన్నందుకోగానే కెవ్వు మంటూ కేరింతలు, ఈలలు, చప్పట్లు. నీళ్ళల్లో పడవలు మాయమై వెళ్ళిపోతే ఎంత దిగులేసేదో. మళ్ళీ పడవలు చేయడంలో బిజీ అయిపోయే వాళ్ళం. చెత్త కాగితాలన్నీ అలా చిత్తయిపోయేవి. మర్చిపోయా చెప్పడం! ఆ పడవలకూ పేర్లుండేవి. తెర చాప పడవనీ, కత్తి పడవనీ, చాకు పడవనీ, పెద్ద పెద్ద చేపల్ని కోసుకుంటూ ముందుకెళ్ళి పోతాయని కథలు చెప్పే వాళ్ళు. గుర్తే నాకు ఇప్పటికీ!

నీళ్ళకు కొట్టుకొచ్చి, గుంటల్లో నిలిచి పోయిన – చిట్టి చిట్టి చేపలు పట్టి బకెట్లో వేసే వాళ్ళం. పొట్టి కప్ప గంతులకు పడీ పడీ నవ్వే వాళ్ళం. వాట్ని మగ పిల్లలు అర చేతుల మీదకెక్కించుకుంటే ఒళ్ళంతా జలదరించేది కప్పల్ని ఎలా ముట్టుకుంటారో అని. ఎప్పుడైనా కాళ్ళ కిందకి కప్పొస్తే ఇక చెప్పనే వద్దు.

ఇంతలో పెరట్లోంచి పిలుపొచ్చేది రండహో అని. అక్కడేదో అద్భుతం జరిగి వుంటుందని ఒక్క పరుగు తీసే వాళ్ళం అక్కడికి! పిల్లలతో బాటు పెద్ద వాళ్ళు బావి చుట్టూ చేరి “అబ్భ! ఎన్ని నీళ్ళో! బావెంత పైకొచ్చిందో!” అనుకుంటూ వింతలు పోతూ కనిపించే వాళ్ళు. “చూడు, చూడు, దూరం నుంచి చూడు. హమ్మో! ఇంత పైకి ఎప్పుడూ రాలేదు కదూ! అవును. చెంబుతో ముంచుకోవచ్చు నీళ్ళని!” బావి లోకి మళ్ళీ మళ్ళీ తొంగి చూసేవాళ్ళు. నాకు నీళ్ళంటే భయం. బావి దగ్గర కెళ్తే లోపల పడిపోతానేమోనని నాలుగడుగుల దూరంలో చూస్తూ నిలబడే దాన్ని.

వాన కురిసి వెలిశాక చెట్లన్నీ వూగి వూగి అలసి పోయినట్టు కదలక మెదలక నిలబడి వుండేవి. మాలతి తీవెలు సొమ్మసిల్లి వాలి పోయేవి. కనకాంబరాల తలలొంగి పోయుండేవి.లేత మొక్కలు పక్కకి వొరిగి, తీగె పందిళ్ళు చెదరి, కొన్ని మొక్కలు మట్టి లోంచి వేళ్ళు బైట కేసుకునీ వుండేవి. ఇంటి ముందు పొగడపూలు రాలిపోయి నేలంతా తెల్లగా తివాచీలా కమ్మగా వాసనతో ఉండేది. పారిజాతాలూ అంతే. చూడంగానే ఏరుకుని వొడి నింపుకునేదాకా మనసూరుకునేది కాదు.

అలా సాయంత్రమై పోయేది. అసలే కరి మబ్బు చీకటి. అదింకా నల్లగా మారి రాత్రి అయిపోయేది. వర్షాకాలపు రాత్రిళ్ళు అమ్మ మాకోసం చేసి పెట్టే వంట. వంటింట్లో విసన కర్ర విసురుడుకి కుంపట్లోంచి రేగే అగ్గి రవ్వల చిట పట చప్పుళ్ళయ్యేవి. వేడి వేడి అన్నం, మొదటి ముద్దలో వేసుకునే కొత్తావకాయ ఎంత రుచిగా వుండేది! ఆవకాయ అప్పుడున్నంత బాగా ఇంకెప్పుడూ ఉండేది కాదు. నిప్పుల మీద కాల్చి, పేరినెయ్యి రాసిన ఎర్రటప్పడాలు, నేతి చుక్కేసి వేయించిన బూడిద గుమ్మడికాయ వడియాలు, కొత్తిమీరతో కాచి, ఇంగువ తాలింపుతో గుమ్మెత్తి పోతూ చారు – ఇవన్నీ మా ఎదురుగా కూర్చుని కంచాల్లో వడ్డిస్తూ మా అమ్మ! ఇప్పటికీ ఎప్పుడు గుర్తొచ్చినా కళ్ళు వానమబ్బులవుతాయి.

మళ్ళీ వర్షం మొదలై పోయేది. మంచం మీద దుప్పటి కప్పుకుని వాన చప్పుడు వింటూ కళ్ళు మూసుకునే దాన్ని. వర్షం కచేరి చేస్తూ వుంటే వురుములు, మెరుపులు, పిడుగులు పక్క వాయిద్యాలు వాయిస్తున్నట్టు… వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకునే దాన్ని.

ఆ మర్నాడు స్కూల్ కెళ్తే క్లాస్ రూం నిండా నీళ్ళే! కుర్చీలు, బల్లలు అన్నీ తడిసి ముద్దయి పోయేవి. ప్లే గ్రౌండ్ మధ్యలో కర్రకి కట్టిన జెండా జారి వుండ కట్టుకు నుండేది.
మా హెడ్ మాస్టార్ కంగారుగా వెళ్ళి ముందు జెండా పని పూర్తి చేసి కాని లోపల కొచ్చే వారు కాదు. ఆయన్ని చూసే మాకూ జాతీయ జెండా పట్ల గౌరవం అబ్బింది. చివరికి నానా కష్టాలు పడీ, గదుల్లో నీళ్ళు తోడి పారపోసి, బల్లలు తుడుచుకుని కూర్చునే వాళ్ళం. ఇదంతా అయ్యేసరికి ఏ పదో అయ్యేది.

గది చుట్టూ గోడల మీద రాసిన నీతి వాక్యాలు వానకు తడిసి చెరిగిపోవడంతో తమాషా అర్ధాలు పలికేవి. మాలో ఒకళ్ళకి నవ్వొస్తే చాలు అదో వైరస్ లా క్షణంలో పాకిపోయి అందరికీ నవ్వొచ్చేది. ‘చెరపకు రా చెడేవూ లో ‘రా’ చెరిగి పోతే అంత నవ్వాలా అని మాస్టారొచ్చి కోప్పడిపోయే వారు కానీ మేము నవ్వకుండా ఎవ్వరాపగలరు? అసలైనా, మా నవ్వులకి కారణాలు కావాలా ఏమిటీ! ఉత్తి పుణ్యానికి పక పకా నవ్వే వాళ్ళం. తెరలు తెరలుగా, నవ్వుకి నిఠారుగా కూర్చోలేక, ముందుకు వొంగి పోయి మరీ. సరే, పరిస్థితంతా కుదుట పడ్డాక మా క్లాస్ లీడర్ ఆ రోజు చెప్పబోయే పాఠాల టైం టేబుల్ చదివే వాడు. అంతే! అంత లోపే మళ్ళీ ముసురు పట్టేదు. ఇక అవాళ్టికి హమ్మయ్య అనిపించేది నాకు మళ్ళీ వర్షంలో తడిసే అవకాశం వస్తున్నందుకు.

అంత అద్భుతంగా ఎంత కాలమో జరగలేదు.

ఆ తర్వాత, పెరిగి పెద్దవుతున్న కొద్దీ పరిస్థితుల్లో, ఆలోచనల్లొ మార్పులొచ్చాయి. మబ్బులాకాశం, పిల్ల తెమ్మెరలు, వీచే గాలులు భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని రేపేవి. చూసినప్పుడల్లా ప్రియమైన వారి గుర్తులేవో మోసుకొస్తున్న భావన కలిగేది. చెట్టు మీంచి రాలి పడుతూ పొన్న పూవు ‘దిల్ బజ్ రహాహై కిస్ అజనబీ సే’ అంటూ నిశ్శబ్దంగా నవ్వినట్టనిపించేది. వానలో ఒంటరి గానే కాదు. జంటగా నడిచినప్పుడు కూడా బాగుండేది. చేతిలో చెయ్యేసుకుని, ఒకరి నడుమునొకరు చుట్టుకుని సూదిలా తాకే చినుకులకి ‘రిం ఝిం గిరె సావన్, సులగ్ సులగ్ జాయే మన్’ అని పాడుకుంటూ, ఎంత తడిసిపోయినా చలి అనేదే తెలియకుండా. వాన నీటికి వేడి సెగ పుట్టించే శక్తి వుండి అది ఆ ప్రేమికులకు ఇచ్చినట్టుగా ఉండేది. ఊహలన్నీ కవిత్వపు వానజల్లులయేవి.

కొండల పై నుంచి జారుతూ ఒకలా – జలపాతంలా
నదుల మీద నాట్యం చేస్తూ మరోలా – నర్తకిలా
సముద్రాన్ని కుదిపేస్తూ అదోలా – తాండవంలా
చెట్ల మీద కురుస్తూ పూలను ముద్దులో ముంచేస్తూ – అల్లరిలా
ప్రేమికులని కవ్విస్తూ సరసంగా – విరహంలా

నా జ్ఞాపకాల తోటలో కురిసే వాన పూల జల్లులు.


రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...