“ఉండండి ఆ మిగిల్నవి చూడ్ణియ్యండీ….అయ్యో ఈ సందులో పడీసేరేటండీ?” అని భాస్కర కుమార్ ఆత్రంగా ఆ పెయింటింగ్ చుట్టలు విప్పి చూడబోతే “అవెందుకండీ ఇప్పుడు ముందీ కార్డు సంగత్తేల్చండీ?” అని గద్దిస్తున్నాడు ఆతీ ప్రకాష్. ఇసక పంతులు గారు “కార్డు తేడానికేటింతసేపా?” అని సందులోకి తోసుకుంటూ వచ్చి ఆ పెయింటింగ్స్ చూస్తూ ఆశ్చర్యంగా నిలబడిపోయేడు. భాస్కర కుమార్ మేడ మెట్ల మీదికి తీసికెళ్ళి లోగొంతుకతోటి “అది కాదు! ఇంత మంచి ఆర్ట్..” అని అనబోతుంటే ఆతీ ప్రకాష్ బొటకన వేలితో నుదుటి మీద రాత అన్నట్టు గీసుకున్నాడు. “ఆర్టుంటే ఏటండీ?! ఇదుండాలండీ..!” అని కొట్టి పారీసేడు. భాస్కర కుమార్ కళ్ళల్లో ప్రశంస చూసి అతని కోపం యుద్ధ విన్యాసాలు అన్నీ సడలిపోతున్నాయి. డాబా మెట్ల గోడమీదకి వాలిపోయి “ఈ ఆర్టూ అవీ ఏవో చిన్నప్పుడు నాకు పిచ్చికొద్దీ నేర్చుకున్నవండీ! మా వాళ్ళు లైక్ చెయ్యరు ఇవేటి తిండి పెడతాయా? కాణీ సంపాదనా?! కలర్సుకీ పేపరుకీ అయిన్దాన్తోటి కూర ఖర్చైనా వొస్తాదని తీసిసెరిస్తుంది ఇంట్లో పెడితే! అందుకే ఇక్కడ దాచేను! అయినా టారస్ సెకెండ్ కస్పు నాకు సాటర్న్ సెవెనియర్స్ యెన్టగోనిష్టిగ్గా వున్నాడు సార్ ! టూ థౌజండ్ సిక్సు వరుకూ మనఁవేం మాటాడ్డానికి లేదు! టూ థౌజండ్ సిక్సు వరుకూ మీకు ఫ్రెండ్స్ కూడా ఎనిమీసైపోతారు! ఇంట్లోవోల్తోటీ అలాగే వుంది… మీ దొడ్డ గారు చూడండి ఎన్నేసి తిట్లు తిట్టెస్తందో…. ఊళ్ళోవోల్తోటీ అలాగే వున్నాది! మీరు నమ్మండి నమ్మకపొండి మన స్టార్సలాగుంటే ఎదటవాడ్ని అనుక్కుని ఇటీజే టైం వేష్టు…” అన్నాడు. భాస్కర కుమార్ అతను వారిస్తున్నా వినకుండా ఆ చుట్టల్లోంచి ఒక పెయింటింగ్ విప్పి చూస్తూ నిలబడ్డాడు. రైలు గేటు పక్కన రాతి కేబిన్ ముందు లూజు నేరెడు పండు నిక్కరు చొక్కా వేసుకుని తిలకం బొట్టు పెట్టుకుని బుర్రంతా పండిపోయి బింకంగా విజిల్ ఊదుతూ పచ్చ జెండా ఊపుతూ నిలబడిన ఒక గార్డు బొమ్మ. ఇసక పంతులు గారు పొడుగ్గా వంగి ఆ బొమ్మని మెచ్చికోలుగా చూస్తూ “అబ్బా నువ్వేసిందే? ఫాదరు బొమ్మ అచ్చు గుద్దీసేవ్వై?” అని అతని భుజం తట్టేడు. భాస్కర కుమార్ “ఫాదరా?” అంటే అవునన్నట్టు చిన్నతనంగా నవ్వి అది తీసుకుని మళ్ళీ చుట్టేస్తూ “మీకు ఆర్టదీ ఇంట్రష్టా ఏటండీ?” అనడిగేడు. “మీకాడ చాలా టేలెంటున్నాది….” అంటే ఏమీ బదులివ్వకుండానే అయినా గొప్ప సంతృప్తిగా మెరిసే కళ్ళతో నవ్వి “సరే పోనివ్వండి!” అన్నట్టు పెదాలు చప్పరించి చెయ్యి గాల్లోకి ఎగరేసుకుంటూ మెట్లు దిగిపోయేడు. అనుమానంగా మెట్ల సందులోకి వచ్చిన చిన్నమ్మలు యుద్ధం ఊసే మర్చిపోయిన వాడి లాగా “ఎందుకు సార్ ఇంటి గురించి వర్రీ అయిపోతారు? ఆవిడిల్లు మాకెందుకండీ…..” అని అంటున్నవాడ్ని అడ్డుకుని “ఏఁవిటి ఆవిడిల్లు మాకెందుకణ్ణీ ఇన్నిన్నిన్నీ పిన్నిన్నిన్నీ…?” అని నత్తిగా వెక్కిరిస్తూ నిలదీసింది. అతన్ని చెయ్యి పట్టుకుని మళ్ళీ నడివాకిట్లోకి తీసుకెళ్ళి చేతిలోని పోష్ట్ కార్డు తీసి అందరికీ ప్రదర్శిస్తూ “ఇతనో వెర్రి మాలోకం! ఆ వెధవ బొమ్మలు చూపిస్తే ఒళ్ళూ పయ్యీ తెలీదు! నేనూరుకుంటాననుకున్నావా? ఈ ఉత్తరం సంగతేఁవిటి? నన్ను తిట్టిన తిట్ల సంగతేఁవిటి?” అని గద్దించింది.
దొడ్డ మళ్ళీ కుర్చీలోంచి లేచి నడి వాకిట్లోకొచ్చి “ఆ పిల్లడి నోటంట ఖాళీ చేసి పోతాననీసి వొస్తుంటే నువ్వేఁవిటే శన్లాగ? నువ్వు నన్ను తిట్టిన తిట్ల మాటేఁవిటి? ఎన్ని పెట్టేను నీకు…మీ చెల్లికి పెళ్ళి చూపులంటే! నువ్వు లక్ష పసుపు నోము చేసుకుంటానంటే నీ వెనక చచ్చి బజార్లన్నీ తిరిగేను..! బూరుగు చెట్టు కాసిందే తడువు కాయలన్నీ దుళ్ళగొట్టీసి నీకు, మీ ఇంటిల్లిపాదికీ పత్తి దొబ్బుకుపోయేవు ఏకించిన డబ్బులేనా ఇద్దాఁవని నీకు చెయ్యి రాలేదు….! సన్నావాలు, చేనూలు నూనె, మినుగులు, పెసలు, గొడ్డ కందులు కొలిపించి పొట్టు తీయించుంచితే ఇదుగో చూడూ….”పిన్నీ నీవంటి మనిషి లేదు” అని పిస పిసలాడి పట్టుకుపోయి తిన్నారు! అంటే అన్నాదంటారు! ఏదో కోపమ్మీద నువ్వు నన్నే అన్నావో నిన్ను నేనే అన్నానో..ఆర్నెల్ల అద్ది ఒదులుకుంటాం పొమ్మంటునాడు! ఇంకా….” అని మళ్ళీ పాత జ్ఞాపకాలు, దాన ధర్మాలు అన్నీ తవ్వి వాటిలో తనకి ప్రస్తుతం వెపన్స్‌గా ఉపయోగపడే వాటిని ఒక్కోటీ తీసి, తుడిచి ఉఫ్ ఉఫ్ మని ఊది, యుద్ధ విరమణ రేఖ మీద పోస్తోంది. అప్పుడు ఇసక పంతులు గారు, క్రిష్ణ బావ ఇద్దరూ ఒక్కసారే అడ్డం పడ్డారు. ఇసక పంతులు గారు తువ్వాల దులుపుకుంటూ దొడ్డ చెయ్యి పట్టుకుని “అమ్మా దొడ్డమ్మ గారు మీరుండండి! నన్ను మాటాడి సెటిల్మెంటు చేయించమని పిల్చేక మళ్ళీ మీరు మధ్యలోకొస్తారేటండీ?” అని నిలదీస్తే ఇసక పంతులు గారి పరాక్రమం మీది గౌరవం కొద్దీ దొడ్డ కొంచెం కూల్ డౌన్ అయ్యింది. క్రిష్ణ బావ అదే సరైన సమయం అని నిర్ణయం చేసుకుని బేగు లోంచి పెన్నూ కాయితం పైకి తీసి చిన్నమ్మల్తోటి “మీరు మళ్ళీ కోపగించుకోనంటే ఒక మాటంటాను వింటారా?” అనడిగేడు. ఇంకా బింకంగా చీర చెంగు బిగించుకునే “మర్యాదగా మప్పితంగా అడిగితే ఒకటి కాదు లక్ష చెప్పండి వింటాఁవు! మర్యాదకి ప్రాణం పెట్టెస్తాను….!” అని అనుమానంగానే చూస్తున్నాది చిన్నమ్మలు. అందుకు క్రిష్ణ బావ ఏమీ బదులివ్వకుండానే కుర్చీలో తటాల్న కూర్చుండిపోయి, ఒళ్ళో కాయితం పెట్టుకుని పెద్ద పెద్ద అక్షరాల్తోటి గబగబా రాసి ఆ కాయితం గోపాల్ చేతిలో పెట్టి “ఇదీ మీరే చదివియ్యండీ…!” అన్నాడు. నంద గోపాల్ మళ్ళీ పెదాలు విడకుండనే లేచి నవ్వుకుంటూ డ్రైవరు గారు, హైమవతి గారు, అక్కిరెడ్డిపాలెం కోరీ జట్లు, బేకుడు, ఆతీ గౌరీ శంకరు అందరూ ఆసక్తిగా వింటుంటే అది చదివి వినిపించేడు:
శ్రీ రామ
శ్రీ రస్తు చిరంజీవులైన ఆతీ ప్రకాషు, ఆతీ చిన్నమ్మలుకి
లోగడ నేను కొన్ని కారణాల వలన ఇల్లు ఖాళీ చేయించ వలిసిన తొందరలో మిమ్మల్ని అనకూడని విధంగా ఏమైనా మాటలు అన్నట్టు, అవి మీకు బాధ కలిగించిన విషయము నా దృష్టికి వచ్చింది. ఇందు మూలముగా ఈ మాటలు అన్నందుకు మిమ్మల్ని మనసు పూర్తిగా క్షమాపణ కోరుచున్నాను. మీరు అవేమీ మనసులో ఉంచుకోకుండా వెంటనే మీ వీలు చూసుకుని మా ఇల్లు ఖాళీ చేసి వెళిపోవలిసింది. మీవలన నాకు రావలిసిన ఆరు నెలల అద్ది, మూడ్నెల్ల అద్ది ఎడ్వాన్సు బకాయిలు ఇందు మూలముగా మాఫీ చేయుచున్నాను.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
అ. వెం. జోగులాంబ
వినకూడని మాటలు వింటున్నట్టు కళ్ళు చెవులు మూసుకుని దొడ్డ కుర్చీలోంచి తటాల్న లేచి వీధి గుమ్మంలోకి వెళ్ళిపోతే కంగారుగా వెనకాలే భాస్కర కుమార్ వెళ్ళి సంజాయిషీగా నిలబడ్డాడు. “నేనేదో తప్పు చేసిందాన్లాగ క్షమాపణలూ అవీ నేను సంతకం పెట్టను సుమీ! నేను పెట్టను ఏం చేసుకుంటుందో చేసుకోనీ! చెప్తునాను భాస్కరా ఇదీగోటి!” అని కళ్ళు, ముక్కు ఎర్రగా చేసుకుని నిలబడింది. నంద గోపాల్ , హైమవతి గారు, అక్కిరెడ్డిపాలెం జట్టు కొంచెం ఎడంగా నిలబడి వర్రీగా చూస్తుంటే తట్టుకోలేక మళ్ళీ “నాయినా మీరు బాగా చదువుకున్న వాళ్ళు! పెద్ద పెద్ద వ్యవహారాలూ అదీనూ! నీకెందుకు నా వలన మాట పడ్డం. నీ మానాన్నువ్వు హేపీగా ….. ప్రశాంతంగా…. ఈ ఉన్న నాల్ర్రోజులూ ఎంజాయ్ చేసుకుని వెళిపో! ఈ ఆతీ వాడూ పెళ్ళం…… దుర్మార్గుడు! … నేనేదో నా తంటాలు నేను పడతాను! నాన్నా?! నామూలాన్నువ్వు వర్రీ అవకూ! ఈ క్షమాపణాలూ అవీ నేను రాయన్సుమీ ఇదిగోటి! ” అని తన అభిజాత్యానికి నిష్టూరాలు మన్ననలు అద్ది సర్దిచెప్తోంది.
“దుర్మార్గుడు కాడు లేవే! మంచి వాడేలే…! దుర్మార్గులనీసి లేరు. పోనీ కాయితమ్ముక్కే కదా.. సంతకం పెట్టిద్దూ?!”
“అవును మీరందరూ మంచివాళ్ళేను! మంచి వాళ్ళేను… మీరు మర్యాదస్తులు! ఆర్నెల్లద్దీ ఎడ్వాన్సూ మింగీసి ఇంతలాగ దుఃఖపెడుతునారు వాడూ అదీ మర్యాదస్తులూ!! కడుప్మంటకి కార్డుముక్క రాసినట్టైనా నేనే… నేనేను చెడ్డదాన్ని! నా నోరే మంచిది కాదు! నా నోరేను… “అని వీధిగుమ్మంలో నిస్త్రాణగా కూర్చుండిపోయింది. “కొత్త కాలం యుద్ధాల మర్యాదలు తెలియని పాతకాలపు దాన్ని” అని నిస్పృహ అవమానపు నొప్పి నీళ్ళు నిండిన కళ్ళతో “నన్నూ అర్ధం చేసుకో” అన్నట్లు చూస్తూ
“అవును కానీ భాస్కరా పోనీగాని నాకు తెలీకడుగుతాను చెప్పు?” అన్నాది.
“ఊఁ అడుగు…”
“మీరు మీ స్నేహితులూ వాళ్ళూ పెద్ద పొజీషన్లలో ఉంటారు ఆఫీసర్లూ అదీను…”
“అబ్బా ఆ ముష్టి పొజీషన్ వాగుడు వొద్దన్నీకు లక్ష సార్లు మొత్తుకున్నాను. నీకు బుర్రకెక్కలేదు….”
“కోప్పడకురా చెప్పీది విను?!”
“ఊఁ….”
“కాదు మీకు ఇలాగ జట్టీలూ అవీ ఉండవురా?!”
దొడ్డ ఇలాగంటుంటే భాస్కర కుమార్ కి ఆపుకోలేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ నవ్వొచ్చింది. వీధిలో డాబాల మీద కూరెళ్ళ జోగారావూ వాళ్ళూ, మిల్కినస్పెక్ట్రగారూ వాళ్ళూ, ఎమ్సెట్ పిల్లలూ అందరూ చూస్తుండగానే మర్యాదలూ అవీ ఏమీ లేకుండా నవ్వు. వీధి గుమ్మం చూరు పట్టుకుని నవ్వి నవ్వి ఇంక నవ్వలేక అలిసి పోయి “ఎందుకుండవే? బొల్లి మేస్త్రి గారు చెప్పినట్టుగున్నాదే నీ వెర్రి! ఎందుకుండదే….మర్యాదస్తులనీసి వేరేగా ఎవళ్ళూ లేరే దొడ్డా! మర్యాదలు పచ్చబద్ధాలు….అందరం ఫైటింగులాడుకుంటాఁవు..హయ్యో….?” అని దొడ్డనే వెక్కిరిస్తూ మళ్ళీ నవ్వులు. దొడ్డతో ఒకటున్నాది. ఎంత ఏడుపుల్లో ఉన్నా నవ్వితే నవ్వు కలపకుండా ఉండలేదు. “కాదురా నిజంగానే నాకు తెలీకడుగుతాను…మీరు “ఆష్ ఊష్ ఊషూష్ష్”మని ఎంతో నిమాను మనుషులూ సత్యమంతులు కార్రా నాయినా మీకు దెబలాటలుండవా అంటే నవ్వుతాడూ పిల్లడూ….అయ్యొ నీ నవ్వు బంగార్లావున్నాది….అయ్యొ…!” అని నవ్వేడుపుల్లోకి ఎత్తిపొడుపుల్లోకీ దిగుతూ.
“అంటే… అక్కడ ఇలాగుండవులే మన్లాగ! అంతా జెంటిల్మేనుగా మర్యాద మర్యాదగా ఉంటాయి……”
“ఎలాగ?”
నిటారుగా నిలబడి రెండు చేతులూ జోడించి ఇస్త్రీ నలగని చీరల చెంగులు చుట్టూ తిప్పుకుంటూ లిప్‌స్టిక్ తడికాకుండానూ సూట్లు మోచేతుల దగ్గర నలగకుండానూ “నెమెస్తే!” అని మూతి, కళ్ళు ఒద్దికగా అందంగా వంకర తిప్పి మర్యాదగా నమస్తేలు ఎలాగో అది ఏక్షన్ చేసి చూపించేడు. అంత అలకలోనీ దొడ్డ భళ్ళుమని నవ్వీసింది. అదే అదను అని భాస్కర కుమార్ గోపాల్ చేతిలోంచి క్షమాపణ పత్రం తీసుకుని “పంతానికి పోకు నా మాట విను ఇదుగో ఏదీ సంతకం పెట్టీ!” అని బతిమాలేడు. హైమవతి గారు కలగచేసుకుని “సైన్ చేసిచ్చీండి మామ్మ గారూ మీ ప్రోబ్లం సాల్వైపోతుంది కదా!” అని నచ్చచెప్పింది. నంద గోపాల్ పెదాలు విడకుండానే సంతకం పెట్టియ్యండి అన్నట్టు నవ్వుతుంటే, ఇసక పంతులు గారూ వొచ్చి లోగొంతుకతోటి “ఏదో మూగోడు అమ్మా అండఁవే సంబరం! సంతకం పెట్టీసిసిరియ్యమ్మా వెహవ కాయితఁమ్ముక్కా?!” అనీ బెల్లించేడు. బేకుడూ పొట్టప్పారావూ అక్కిరెడ్డిపాలెం జట్టూ కూడా ఇంకంతా ఈయమ్మ చేతిలోనే ఉందన్నట్టు ఉత్కంఠతో చూస్తుంటే దొడ్డ ఇంక తప్పనిసరై ఆ కాయితం తీసుకుని “శివా విఘ్నేసురుడా కార్య గణపతీ కార్యాలపతీ చల్లంతండీ” అని తన ఫ్రెండ్సందర్నీ పేరు పేరునా తల్చుకుంటూ సంతకం పెట్టి ఆ కాయితం ఇసక పంతులు గారి చేతిలో పెట్టీసింది. ఇంట్లోకి వంగి లోపల ఆతీ వాళ్ళందరికీ వినిపించేలాగ “ఇదిగో క్షమాపణా పత్రం! తల్లి సమానురాలిచేత చెయ్యంతప్పుకి క్షమాపణా రాయించుకున్నావు కదా నాయినా నీ మాటే చెల్లిందీ! మీ కళ్ళు చల్లబడ్డాయా?!” అని మళ్ళీ సింహనాదం చెయ్యబోతే హైమవతి గారు, బేకుడు తన చెరో చెయ్యి పట్టుకుని “అబ్బా ఇష్షూ!” అని వారిస్తూ దొడ్డని మళ్ళీ గుమ్మంలోకి లాక్కెళ్ళేరు.
ఇసక పంతులు గారు ఆ కాయితాన్ని ఆతీ ప్రకాష్ చేతిలో పెట్టి “ఇదుగోటివై యెపాలజీ రాసిచ్చీసింది పెద్దావిడి! పాతవి ఇవ్వల్సిన అద్దిలు ఎడ్వాన్సులన్నీ మాఫీ! ఈ చీటీ తోటి మీరనుకున్న మాటా మాటా చెల్లూ! ఇంకెప్పుడెళిపోతావో తగు మనుషులందరూ ఉండగానే చెప్పియ్యండి?!” అని నిలదీసేడు. చిన్నమ్మలు ఆ కాయితం తటాల్న లాక్కుని తన చేతిలోని పోష్టు కార్డ్ పక్కనే పెట్టి దస్తూరి పోల్చి చూస్తూ “ఇదుగో చూడండి నా మాట నమ్మకపోతే ఆ దస్తూరీ ఈ దస్తూరీ ఒకటో కాదో నన్ను నమ్మకపోతే?!” అని రెట్టిస్తుంటే ఆతీ ప్రకాష్ “అబ్బ సర్లేవే!” అని వారించి, ఆ రెండు కాయితాల్ని మార్చి మార్చి చూస్తూ తనతో తనే అనుకుంటునట్టు “సరే ఎళిపోతాం లెండి!” అన్నాడు.
“ఎళిపోతార్లెండి! ఇంత గొడవా అయ్యి సెటిల్మెంటు చేస్సుకున్నాక వెళిపోక ఉండిపోతారన్నారేటి గాని…ఎప్పుడెళిపోతారు? రేపీపాటికి ఖాళీ చేసెస్తార?”
“రేపెలాగెళిపోతాఁవండీ?”
“మరందుకే మరి చెప్పండి?”
“వన్ వీక్ లోన….”
అప్పుడు ఇసక పంతులు గారు విజయగర్వంతో చైనాకళ్ళు మరింత చిన్నవి చేసుకుని పెదాలు విడకుండానే నవ్వుతూ గొంతులో ఇసక గర గరలాడుతుండగా అందరూ వినేలాగ “ఏవిండీ దొడ్డమ్మ గారు? ఏఁవిండి భాస్కరు రావయ్యా వోన్ర గారు?! రా! ఏయప్పారా వారికి రమ్మని పిలవై!” అని అక్కడున్న వాళ్ళనే లేనట్టు కేకేసి, “ఇదుగో ఇవాళ ఇరవయ్యొకటి ఆదివారం! ఇర్వయ్యెనిమిదీ ఆదివారం మళ్ళీ మాచేత అడిగిపించుకోకుండానే వారిల్లు కాళీ చేసి వారి తాళం వారికి తెచ్చిచ్చిస్తావు కదా?” అని నిలదీసేడు. ఆతీ ప్రకాష్ “అలాగే ఇంక వెళ్ళండి” అన్నట్టు తలూపుతున్నా అతని భుజమ్మీద బలంగా వేసిన చెయ్యి తియ్యకుండా.
(ఇంకా ఉంది)