ట్రంబుల్ స్టిక్నీ(Trumbull Stickney: 1874 – 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో పెరిగాడు.హార్వర్డ్,పారిస్ లలో విద్యాభ్యాసం. సకల శాస్త్రాలను,సాహిత్యాలను పుక్కిటపట్టాడు. ప్రత్యేకించి గ్రీకు, ఫ్రెంచి అధ్యయనంలో దిట్ట. శాంతాయన అంతటివాడు ఇతని గుణగణాలను శ్లాఘించాడు. ఎవరూ పొందని గౌరవాలను పొందాడు. స్వమతం ఇతన్ని ఆకట్టు కోలేదు. ఇతని విద్వత్త ఉన్నచోట నిలువనీయలేదు. భారతీయ చింతన వైపు మొగ్గుచూపాడు. భగవద్గీతను అనువదించాడు. పారిస్ చదువు ముగించుకొని హార్వర్డ్ లో గ్రీకు బోధించాడు. ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యాడు. మెదడులో కణితిగా తేల్చారు వైద్యులు. క్రమేణా, కంటి చూపు పోయింది. హఠాత్తుగా ఒకనాడు కాలం చేశాడు.
స్టిక్నీ కవితలు Live Blindly, On Some Shells Found Inland అనువాదాలు:
గుడ్డిగా బ్రతుకు
మూలం: Live Blindly
గుడ్డిగా బ్రతుకు,ఎప్పటికప్పుడు. విధి,
ఏనాడో మరణించింది,అదే భవిష్యత్.
జ్ఞానం అదే గతం .. స్ఖాలిత్యం.పో,
అభాగ్యుడా!నిన్ను నీవు అసహ్యించుకోకు.
నీ భూమిచుట్టూ సూర్యుని రెక్కల పవనాలు వీస్తాయి
గ్రహాలు భ్రమిస్తాయి; రాలే చుక్క ఖడ్గాన్ని దూస్తుంది;
ఆ హరివిల్లు తన సప్తవర్ణచాపాన్ని వేలారుస్తుంది.
పొడవాటి చారికల వెండినది ప్రవహిస్తుంది :
మేలుకో! మమేకమైపో, రసమయ ఘడియల్లో.
గ్రోలి అధరాన్ని, వేగం అందుకో నీ స్వప్నాన్ని
పెళుసు అపరంజి గాలి తీగల మీదుగా.
నీవు దివ్యాంశ సంభూతుడివే, వెనుకట
దేవత అపోలో ఎదిగి విరాజిల్లినట్టు, అతని
దీవి పూవులతో అలరారినట్టు, జీవిస్తావు!
నత్తగుల్లలు
మూలం: On Some Shells Found Inland
మెత్తగా ఘోషించే నా నత్తగుల్లలివి
కొత్తగానే స్వరం, ఎంతో కాలం గతించినా
పెదాలను తడిపి, తీరును సవరించిన కెరటం
వదిలిపోయింది, కనిపించని కడలి ఉరవడితో
నీలిమధ్యాన్నం, ఎగసే, విరిగే, అతి
వేల తరంగం వెళిపోయింది; కటికనేలపై
గానం చేస్తాయి నా నత్తగుల్లలు; విలుప్తం కాలేదు
వెనుకటి లయ, హోరుఅనుపమ దర్పం!
ఏ హస్తం వీటిని సముద్రాన్ని చేర్చగలదు?
అహరహం తలచుకొంటాయి, అంతా గతించాక,
గొప్పలు నశించాక,ప్రపంచం నిలువక
ఇప్పటికైనా తప్పును సవరించడమే దయ
నేలకేసి కొట్టి, కాలితో నలగ దొక్కి
ధూళిగా మార్చు, వాటి యక్షగీతాన్ని