విశ్వకవిత బ్రాడ్‌స్కీ

రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీ
బ్రాడ్‌స్కీ(194096)

కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో ఎంతో వేదన అనుభవించాడు బ్రాడ్‌స్కీ. ప్రభుత్వం “పరాన్నభుక్కు”గా జమకట్టి వెలివేస్తే అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు.పిన్న వయసులోనే నోబెల్‌వరించింది.మంచి రూపసి,మాటకారి,వక్త వెరసి పదహారణాల కవి.సకల సాహిత్య ప్రక్రియల్లో కవిత్వస్థానం పరమోతృష్ట మైనదని మనసా,వాచా,కర్మణా నమ్మినవాడు.తొలినాళ్ళలో ఇతని ప్రతిభని గుర్తించిన రష్యన్‌కవయిత్రి అన్నా అఖ్మతోవా,తర్వాత చేయూతనందించిన ఆంగ్లకవి ఆడెన్‌ఇతనికి ఆమరణాంతం బాసటగా నిలిచారు. కవిత్వం కంఠతా రావాలి అన్న పట్టుదల;అనువాదాలకు లొంగని ఇతని బందోబస్తు కవిత్వం ,కవిత్వతత్వాన్ని కరతలామలకం చేసే మొక్కవోని కలం, నిండైన విగ్రహం బ్రాడ్‌స్కీ ని తలచుకోగానే మనసులో కదులుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రతికినంత కాలం బ్రాడ్‌స్కీ సింహసదృశుడు.

                                         స్మృతి కి

నీ ఆలోచన వెనుదిరుగుతుంది రావద్దన్న పనిపిల్లలా.

కాదు! ఏవేవో నల్లని అక్షరాలతో రైలు స్టేషన్‌లా.

వికారముఖాలు గుమిగూడి, వణుకుతూ పెద్దగా.

ప్రపంచపటంలోకెక్కాయి,నిన్ననే ప్రదేశాలు కూడా,

శూన్యాన్ని నింపుతూ.మనమెవరూ సరిపోము.

విగ్రహాల హోదాకు,మన రక్తనాళాల్లో బహుశా

ఘనీభవింప చేసే ధాతువు తక్కువేమో,అన్నావొకసారి

“మన కుటుంబం ఈ ప్రపంచానికి జనరల్స్‌ నివ్వలేదు,

చల్లగా చూడనీతాత్వికులను కూడా” అంతే నెవా

మరో ఆలోచనకు తావీయలేదు,పొంగిపోతూ

కొడుకు ఎదుగుదలతో ముడివడిన దృష్టితో

ఇన్ని వంటగిన్నెలతో అమ్మకు మిగిలేదేమి?

అందుకే మంచు,పేదవాడి పాలరాయి,కండబలంలేదు

కరిగిపోతుంది, మట్టిబుర్రని తిట్టుకొంటూ,తెలివిలేమి

బంధిస్తుంది,నాగరికంగా ఉండలేనందుకు,బుగ్గలకు

పౌడర్‌ రాసి ఎలాగో నీవు కనిపించాలనుకొంటావే.

ఉన్నదల్లా కపాలాన్ని కాపాడుకోవడమే..చేయెత్తి

అన్నిటిమీదసొమరిచూపులు గొంతులు పెదాలు

ఎడతెగక “ఆమె మరణించింది ఆమె మరణించింది”

నగరాలు కంటిపొరను తొలగించుకొని

కిక్కిరిసి బిగ్గరగా వెనుదిరిగే డొల్లలా

                                        యురేనియాకు

ప్రతిదానికి పరిమితులున్నాయి,విషాదానిక్కూడా

కిటికీ రెక్క క్రీగంటిచూపు నాపుతుంది,వదలదు కుంపటి

ఆకును.ఒకడు తాళాలు గలగల్లాడిస్తాడు,కువకువమనే పిట్ట.

ఏకాంతం మనిషిని ఘనీభవింపచేస్తుంది యథేచ్చగా.

ఒంటె రైలుకమ్మీలను మొరటునాసికతో వాసనచూస్తుంది;

ఒక చూపు..శూన్యాన్ని లోతుగా,సమంగా మారుస్తుంది.

ఐనా శూన్యమనగా ఏమి ? ఎల్లెడలా

శరీర రాహిత్యమే కాకున్న

యురేనియా అందుకే పెద్దది తన సోదరికన్నా !

దినకాంతిలో,మసిబారిన లాంతరుతో,

నీకు తెలుసు ఏ జీవజాలం లేని విశ్వధృవం,

నీకు తెలుసు ఆమె ఏమి దాచదు తనలాగే.

అవి అక్కడే ,బ్లూ బెర్రీలతో నిండిన అరణ్యాలు,

జీవనదుల్లో వట్టిచేతులతో మట్టిగిడసలు పట్టేవారు

పట్టణాలలో బరువైన ఫోన్‌పుస్తకాలలో

అట్టే నీవుండవు ;అలాగే తూర్పుదిశలో పైకిపో

చామనఛాయ పర్వతశ్రేణులు పొడవు గడ్డినిమేసే

మేటి ఆడగుర్రాలు;దవడ ఎముకలు మరీ పసుపుగా

వాటిసంఖ్య పెరిగేకొద్దీ. అలాగే ఇంకా తూర్పుకు,

పొగలుకక్కే యుద్ధనౌకలు లేదా క్రూయిజర్లు,

సాగరం మరింత నీలంగా లోదుస్తుల బొందులా.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...