కొత్త సహస్రాబ్దికి “ఈ మాట” స్వాగత గీతికలు! ఈ సందర్భంగా “ఈ మాట” శ్రేయోభిలాషులందరికీ మా హార్దిక శుభాకాంక్షలు!
బహుశ మానవజాతి అంతా ఏకోన్ముఖంగా గుర్తిస్తున్న, ఉత్సాహంగా జరుపుకుంటున్న తొలి సహస్రాబ్ది తొలిరోజు ఇది! మిగిలిన విషయాలెలా వున్నా, కనీసం ఈ అంశంలోనైనా ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత వుంది.
మనుషులందర్నీ దగ్గర చెయ్యటం, అందరి గమ్యమూ ఒకటేననే దృఢవిశ్వాసం కలిగించటం, అందుకు తగ్గ విధంగా ఒకరి నొకరు పీడించుకోకుండా సుహృద్భావాల్తో కలిసి జీవించటం ఇవి మానవజాతి సాంఘిక లక్ష్యాలని దాదాపుగా అందరూ ఒప్పుకుంటారు. ఈ దిశలో పురోగమించటంలో గత కొద్ది దశాబ్దాల్లోనే ఎంతో సాధించాం.గత సహస్రాబ్దిలో మానవ ప్రవర్తనని తలుచుకుని ఆలోచిస్తే ఇప్పటికే ఎంత దూరం వచ్చామో అని ఆశ్చర్యం కలక్క తప్పదు. ఈ కొత్త సహస్రవత్సరారంభంలో ఆ గమనవేగం ఇంకా బాగా పెరిగి త్వరలోనే లక్ష్యం చేరగలమనే ఆశాభావం కలుగుతోంది.
ఇక “ఈ మాట” విషయమై కొన్నివిశేషాల గురించి ముచ్చటించాలి.
మొదటిది తెలుగు సాహితీ విమర్శకుడిగా, పరిశోధకుడిగా చిరకాలంగా లబ్ధప్రతిష్టుడైన శ్రీ ద్వానా శాస్త్రి “ఈ మాట” సంపాదక వర్గంలోకి చేరుతున్నారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం. శ్రీ శాస్త్రి గారు ఇండియాలో “ఈ మాట” కు సంపాదకుడిగా ఉంటారు. ఇండియా నుంచి రచనలు పంపే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని మా విశ్వాసం. వారు తమ రచనల్ని శాస్త్రి గారికి పంపితే ఆయన ప్రచురణ యోగ్యమైన వాటిని మాకు పంపుతారు. అలా కాకుండా నేరుగా మాకు పంపదలుచుకున్న వారు అలాగైనా చెయ్యొచ్చు ఏ పద్ధతి పాటించినా మాకు అభ్యంతరం లేదు.
శ్రీ శాస్త్రి గారి అడ్రస్ ఇది
డాక్టర్ డి. ఎన్. శాస్త్రి,
తెలుగు శాఖ రీడర్,
S.K.B.R. College ,
అమలాపురం 533 201
ఫోన్ 885633053
రెండో విశేషం ఈ సంచికతో “ఈమాట” శ్రవ్య పత్రికగా కూడా మారటం. శ్రీ కొడుకుల శివరాం గారు బాణీలు కట్టి పాడిన కొన్ని భాగవత పద్యాలను “ఈమాట” పాఠకులకు వినిపిస్తున్నాం. అమెరికాలో సంగీత రసికులకు శ్రీ శివరాం గారు చిరపరిచితులు. ఆయన గళంలో భాగవత పద్యాలు ఊపిరిపోసుకున్నాయని మా భావన. మీరు కూడా మాలాగే విని ఆనందిస్తారని ఆశిస్తున్నాం.
మూడో విశేషం “సంప్రదాయ కథా లహరి” అనే కొత్త శీర్షిక. చాలా మంది విద్యావంతులకు తెలుగు భాషంటే చిన్నచూపే కాకుండా “సంప్రదాయ తెలుగు సాహిత్యమంతా చెత్త; ఆడవాళ్ళ అంగాంగ వర్ణన తప్ప ఏముందక్కడ?” అన్న ప్రగాఢమైన అభిప్రాయం కూడా ఉంది. ఇలా అనేవాళ్ళలో ఎక్కువ భాగం వాళ్ళూ వీళ్ళూ అన్న మాటల్ని బట్టి తమ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు తప్ప స్వయంగా చదివి కాదు. ఐతే ప్రాచీన సాహిత్యాన్ని చదవటం కూడ అంత తేలికైన విషయం కాదు చాలా వాటిని మంచి వ్యాఖ్యానాలు లేకుండా పండితులే పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఈ కొత్త శీర్షిక ద్వారా మా ప్రయత్నం తేలికైన, సమకాలీనమైన తెలుగులో సంప్రదాయ సాహిత్యాన్ని మా పాఠకులకు అందించాలనేది. మూలాన్ని దగ్గరగా అనుసరించే ఈ “అనువాదాల్ని” చదివాక మన సంప్రదాయ సాహిత్యం పెంటకుప్ప మీదికే పనికొస్తుందో లేక అటక మీదనైనా ఉండదగిందో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు! ఈ సంచికలో పింగళి సూరన కావ్యం “ప్రభావతీ ప్రద్యుమ్నం” అందిస్తున్నాం. ముందు ముందు పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, భారతం, జైమినీ భారతం లాటి వాటిని కూడ అందించాలని మా ప్రయత్నం. ఇప్పటికే ఈ కావ్యాలకు ఎన్నో “అనువాదాలు” ఉన్నా, సామాన్యంగా వాటి భాష, శైలి, శిల్పం పాఠకుడికి విసుగెత్తించేలా ఉంటాయి. అలా కాకుండా రోజూ మాట్లాడుకునే భాష, చకచక నడిచే కథనంతో, నవలల శిల్పంతో మూలాన్ని అనుసరిస్తూ (అంటే సొంత కవిత్వానికి తావివ్వకుండా)ఉండే అనువాదాలు పాఠకులను చదివిస్తాయని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వారెవరైనా ఇలాటి అనువాదాలు చెయ్యదలుచుకుంటే వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రయత్నంలో వారు కోరితే మా చేతనైన సహాయం చెయ్యగలం కూడ.
రచయిత(త్రు)లు, పాఠకులు ఈ కొత్త సహస్రారంభాన్ని “ఈమాట” పురోగమనంలో మరపురాని విధంగా తీర్చిదిద్ద గలరని ఆశిస్తున్నాం. .