జగదేకవీరుని కథ సినిమాలో ’దేవకన్యలు రాత్రిపూట వచ్చి జలకాలాడే ఒక తటాకం’ అన్న చక్కని కల్పన ఉంది. బహుశా ఏ స్టూడియోలోనో ఆ తటాకపు సెట్టువేసి ‘ఏమి హాయిలే హలా’ అని ఆ పూల్‌గర్ల్స్‌తో పాడించి ఉంటారు. కానీ కె. వి. రెడ్డిగారు, మాధవపెద్ది గోఖలేగారూ ఈ వాదీదర్బత్ చూసి వుంటే ఆ సెట్టూ గిట్టూ ఆలోచన పెట్టుకోకుండా ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రించి ఉండేవారు.

మాతృత్వంలోని మాధుర్యం, తల్లిప్రేమ గొప్పతనం, అమ్మ అనిపించుకోవడం స్త్రీమూర్తికి గౌరవం అంటూ గొంతెత్తి అరుస్తున్న సమాజం నిజంగా తల్లుల పట్ల ఎలా ప్రవర్తిస్తోంది? ఒక స్త్రీ తల్లిగా మాత్రమే మిగిలిపోక ఒక మనిషిగా కూడా తన జీవితాన్ని మలచుకోవాలనుకుంటే? అసలు పిల్లలే వద్దనుకుంటే? అందరు మగవారు తండ్రి పాత్రలకు ఎలా సరిపోరో, ఆడవారు కూడానూ అందరూ తల్లి పాత్రలకు సరిపోరు అన్న వివేచన అసలు వస్తుందా?

అసలు దయ్యాలు, సైతానూ అన్నవే లేకపోతే, క్రీస్తుమతం పొడిపొడిగా రాలిపోతుంది; ఏళ్ళబట్టి అబద్ధాలూ పొరపాట్లతో, అసత్యాలతో, అద్భుతాలూ వింతలతో, రక్తపాతంతో, అగ్నిజ్వాలలతో, అనాగరిక ప్రపంచం నుండి ఎరువు తెచ్చుకున్న కల్పిత కథలతో మన పూర్వీకులు, పోపులు, ఫాదరీలు, వేదాంతులు, క్రైస్తవం పేరుతో నిర్మించిన భవనం నామరూపాలు లేకుండా కుప్పకూలిపోతుంది.

మూలఘటిక కేతన కవి, వ్యాకర్త, ధర్మశాస్త్రకర్త. తిక్కన మహాకవికి సమకాలికుడై ఆయనకు తన దశకుమారచరితము అనే దండి మహాకవి కావ్యపు తెలుగుసేతను అంకితమిచ్చి ఆయన మన్ననలు పొందిన కేతన ఇంత గట్టిగా తానే తెలుగుకు మొదటగా వ్యాకరణం రాస్తున్నాను అని చెప్పుకున్నాడు.

కర్నూలు నవాబగు గులాం రసూలుఖానుగారి కోటను తనిఖీచేయగా రహస్యాయుధాగారము బయల్పడెను. అంతట ఆయనను పట్టుకొని పదచ్యుతుని చేసి తిరుచినాపల్లిలో ఖైదుచేసిరి. ఆతడక్కడ ఇంగ్లీషువారి మెప్పుకై క్రైస్తవ దేవాలయములో ప్రార్థనలకు హాజరగుట ప్రారంభించెను. అప్పుడొక వాహబీ ఫకీరతనిని వధించెను.

ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. సినీ నేపథ్యగానమే గాక లలితసంగీతం లోనూ కృషి చేసి, సుందరకాండను పండిత పామర జనరంజకమైన గీతంగా అలతి పదాల్లో రాసి తానే బాణీ కట్టి ఆలపించిన ఆ గాయకుడు ఎమ్. ఎస్. రామారావుగా ప్రసిద్ది పొందిన మోపర్తి సీతారామారావు.

మనకు తూర్పు కనుమలు, పడమటి కనుమలు బాగా తెలుసు. కానీ, సముద్రంలో ఉన్న కనుమల గురించి తెలుసా? ఈ సముద్రకనుమలు బారుగా ఒకదానికొకటి అంటుకొని సముద్రగర్భంలో భూమి చుట్టూ వడ్డాణపు గొలుసుల్లా పాకివున్నాయి. అన్నీ కలుపుకొని వీటి పొడవు 40వేల మైళ్ళు.

జాషువా మొదట్నించీ పద్యాన్ని పట్టుకోవాలి, పద్యాన్ని బాగా రాయాలి అన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. తను కవిత్వం రాసే కాలానికి పద్యం పాత పద్ధతుల్లో లేదని, పద్యాన్ని భావకవులు వచ్చి మాటల కూర్పు మీద, ఊహల పొందిక మీద దృష్టి పెట్టి పద్య స్వభావాన్ని మార్చేశారని జాషువా గుర్తించలేదు. ఆయనకు కావలసిందల్లా పాత పద్ధతుల్లో భావాన్ని ఛందస్సులో ఇమిడ్చి చెప్పడమే.

ఆ సముద్రతీరపు అల్‌బహ్రీ రోడ్డు మస్కట్‌ నగరానికి సరి అయిన కంఠాభరణమని మెల్లగా అర్థమయింది. ఎడమవేపున సాగర జలాలు, వాటిలో సీగల్స్- కుడివేపున ఏవేవో భవనాలు, ఆఫీసులు. పనిరోజు కావడంవల్లనేమో, పర్యాటకులు యాత్రికులు దాదాపు లేరు. అయినా అంత ఎండలో కొత్త బిచ్చగాళ్ళు తప్ప ఎవరొస్తారూ?

స్త్రీపర్వంలో పగ పరాకాష్ఠ చేరిన సన్నివేశం ప్రసిద్ధం. ఆ పగను ఊహించిన కృష్ణుడు (పగను ఊహించడానికి పరమాత్ముడే కానక్కరలేదు) ధృతరాష్ట్రుడికి ముందు ఉక్కుభీముణ్ణి ఉంచిన కథ తెలియని వాడుండడు భారతదేశంలో. పగ పగతో ఆరదు, ఎన్నటికీ తీరదు. ఉక్కు తీర్మానాలు కూడా తుక్కు కావలసిందే. ఇదే భారతం తీర్మానం. భారతం చెప్పిన పరిష్కారం ఏమిటి?

స్త్రీలు సృజనాత్మక పనులు చేయడం తప్పని భావించే సగటు మనస్తత్వాన్ని బర్నీ కొంతకాలం అధిగమించలేకపోయింది. అందుకే ఆమె తన తొలి రచనలన్నిటినీ కుప్పపోసి తగలబెట్టింది. ‘నా పుస్తకాలనైతే తగలబెట్టగలిగాను కానీ నా ఆలోచనలను తగలబెట్టలేకపోయాను’ అంది ఆమె ఆ తర్వాత.

హైదరాబాద్ జాడ్యములకు పుట్టినిల్లు. అక్కడ అవినీతి తప్ప మరేమియు వర్ధిల్లదు. ఆదేశము నందలి దురదృష్ట ప్రజలను తుపాకి సన్నీల (బాయొనెట్ల) వాడిమొనలను చూపి భయపెట్టియు, పదునైన ఖడ్గములను ఝుళిపించియు సొమ్ము వసూలు చేయుదురు. అక్కడి యన్యాయములకు అంతము లేదు.

ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.

సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.

కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.

చందులాల్‌గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి.

సంస్కృత సాహిత్య సంప్రదాయములపై ఆధారపడి తెలుగుకవులు తమ ప్రబంధాలలో పాటించిన కవిసమయములు, దోహదక్రియలు. సాలంకృతపద్మినీజాత్యంగనలు అకాలంలో తరులతాదులు పుష్పింపజేయుటకు చేయవలసిన క్రియలే దోహదక్రియలు. విజ్ఞానశాస్త్రముద్వారా సమర్థనీయము గాని ఈ సంప్రదాయమును పాటించి కవులు అత్యంతమనోరంజకమైన వర్ణనలు చేసినారు.