ఆంధ్రుల చరిత్రలో వెలుగుచూడని కొన్ని ఘట్టాలు 5: బుస్సీ దొర రాజ్యతంత్రజ్ఞత
ఔరంగాబాదు నగరము చేరగనే బుస్సీదొరగా రవలబించిన పద్ధతుల వలన అతడొకవంక సుబేదారుగారికి విశ్వాసపాత్రుడైన నెయ్యముగానుండి మరియొకవంక సుబేదారునిపైన సర్వాధికారములను పలుకుబడియు గల యజమానునివలె నుండుటకు వీలైన విధముగానుండెను. ఈ విషయమును మనస్సులోనుంచుకొని యతడు నగరమునకొకప్రక్క కొంచము దూరములో నగరమెల్ల తన ఫిరంగిబారులకు అందుబాటులో నుండువిధముగను, ఎత్తుగానున్న ఒక దుర్గమును తనకును, తన సైనికదళమునకును నివాసముగా నేర్పరచుకొనెను. అక్కడ తన ఫిరంగులను ఆ దుర్గపు బురుజులమీద నెక్కించి అవసరమునుబట్టి వానిని పేల్చుటకు సిద్ధముగానుంచెను.
బుస్సీగారు తన సైనికులను కఠినములైన కట్టుబాటులోనుంచెను. కొన్ని నిర్దిష్టములైన సమయములందు తప్ప వారు దుర్గమునుండి బయటకు పోవుటకు వీలులేదు. అప్పుడు కూడా వారు తమ సైనికాధికారియొద్ద లిఖితరూపమైన అనుమతిని పొంది బయటకు పోవలెను. క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించిన సైనికులకు కఠినములైన శిక్షలు విధించునట్లు బుస్సీగారు శాసించిరి. అందువలన సైనికులు చాలభయభక్తులతోనుండిరి. దీనివలన చాలలాభము కలిగెను. బుస్సీగారి సైనికులెవ్వరును త్రాగి నగరవీధులందు అల్లరిచేయుటగాని, ప్రజలతో పోరాడుటగాని, తగవులు పెట్టుకొనుటగాని జరుగుటకవకాశము లేకుండపోయెను. ఫ్రెంచి సైనికుల రక్షణ క్రింద చాల విలువగలిగిన అమూల్యములైన సరుకులు కూడా నిర్భయముగా బయటపెట్టుకొని క్రయవిక్రయములు జరుపుకొనుటకు జనులకు వీలుకలిగెను. ఔరంగాబాదులో నీసైనికులు ప్రదర్శించిన సత్ప్రవర్తన యొక్క ఫలితముగా వీరి శౌర్యమును చూచి అదివరకు కేవలము వీరిని భయముతో చూచుచుండిన ప్రజలు వీరి మర్యాదయూ, మంచితనమునూ చూచి, వీరిని మెచ్చుకొని వీరిని గౌరవింపసాగిరి.
సుబేదారుగారితోను, ఆయన దర్బారులోని ప్రభువులతోను జరిపిన రాజకీయ వ్యవహారములందు సైతము బుస్సీగారు చాలా శక్తిసామర్థ్యములను ప్రదర్శించెను.
సలాబతుజంగుగారు చాలా మెత్తనివాడు. హైదరాబాదు రాజ్యపరిపాలనము ఢిల్లీ చక్రవర్తికి లోబడిన ప్రభుత్వమేయైనను, అది చాలవరకు పైవారి ప్రమేయము లేకుండ స్వతంత్రముగా జరుగు ప్రభుత్వముగానుండెను. అయితే, బలవంతుడైన చక్రవర్తి ఏ క్షణమునకైనను దక్కను సుబేదారును త్రోసిరాజనవచ్చును. అందువలన నీప్రభుత్వము సుస్థిరమైనదని చెప్పుటకు వీలులేదు. ఇదిగాక, ఇరుగుపొరుగుననున్న బలవంతులైన మహారాష్ట్రులు ఏ సమయముననైన నీరాజ్యముపైనబడి కొల్లగొట్టగలరు. ఈ రాజ్యపాలకుడు బలహీనుడైనగాని, నిలుకడ లేనివాడైనగాని, శక్తిసామర్థ్యములు, బుద్ధిబలము లేనివాడునైనగాని, అతడు కేవలము అదృష్టదేవత చేతి కీలుబొమ్మయగును, లేదా బుద్ధిబలముగలవాడెవ్వడైన అతనిని వశముచేసుకొన్నచో అతని చేతిలోని కీలుబొమ్మయగును. సలాబతుజంగుగారు స్వభావమునుబట్టి బలహీనుడు, అసమర్థుడు, నిలకడలేనివాడు, భోగలాలసుడునని బుస్సీగారు త్వరలోనే కనిపెట్టిరి. అంతట అతనికి సారథ్యముచేయు బుద్ధిబలముగల సలహాదారుయొక్క స్థానమును తానే ఆక్రమించుటకు నిశ్చయించెను. తనక్రిందనున్న సైనికబలముయొక్క సహాయమున తానాస్థానమును సులభముగా నాక్రమించుట కవకాశముండెను. అయితే పొరబాటుననైనను తన సైనికబలముయొక్క దంష్ట్రలను బయటకు ప్రదర్శించగూడదని బుస్సీగారు ఎరుగును. అందువలననే అతడు తన సైనికదళమునట్లు దుర్గమునందు మూసిపెట్టి మర్యాద, నెమ్మదిని ప్రదర్శించుటలో వారికి క్రమశిక్షణము నొసగెను. అందువలన నాసైన్యము యొక్క నైతికబలము పదిరెట్లు పెరిగెను. ఈ సైన్యము పైననెవ్వరికీ అనుమానము, అసహనము కలుగక పోవుటయేగాక, వారి సేనానాయకుని యాజమాన్యమున ఇంతవరకు వారెంత గొప్ప కార్యములను సాధించిరో ఇకముందుకూడా ఎంతటి గొప్ప కార్యములను సాధింపగలరో అతడొక్కమాట పలికినచో వారెంత సాహసకృత్యములను చేయగలరో అందరికినీ పూర్తిగా తెలిసెను. ఇంతటి శక్తిసామర్థ్యములు గల సైనికబలమును ఇంత కట్టుబాటులో నుంచగలిగిన సేనానాయకుడైన బుస్సీగారి శక్తికి ఆ సైన్యముయొక్క ఉనికియే మరింత బలము చేకూర్చెను.
బుస్సీగారు తన కార్యసాధన విధానమున కేవలం సైనికబలముపైననే ఆధారపడి యూరకుండలేదు. అది అతని పలుకుబడికిని అధికారమునకును పునాదియైనమాట నిజమే. అంత బలవత్తరమైన స్థానమును పొందిన మరియొక సామాన్యవ్యక్తియైనచో దానిని వృథాచేసి యుండెడివాడు. బుస్సీగారికీ విదేశీయుల స్వభావము, చిత్తవృత్తి బాగా తెలియును. అతడా ఎరుకవలన లాభమును పూర్తిగా వినియోగించుకొనదలచెను. అతడు సరసుడును ధారాళమైనవాడును, సౌమ్యుడునునైనప్పటికిని పట్టుదలయు, దూరదృష్టియుగల కార్యశూరుడు. భారతదేశములో చాలాకాలము నుండి ఉన్నవాడు. ఉత్తమవంశీయులైన భారతీయులతో కలసిమెలసి జీవించినందువలన వారి ప్రకృతిని స్వభావమును బాగుగా ఎరిగియుండెను. పైగా అతడు నిర్వహింపవలసిన కార్యముయొక్క విధానమతని కిదివరకే సిద్ధముగానుండెను. పాండుచేరి నుండి బయలు దేరినప్పుడే క్రొత్తసుబేదారుడైన ముజఫర్‌జంగ్‌తో వ్యవహరింపవలసిన పద్ధతిని డూప్లేగారు నిర్ణయించి అతనికి చెప్పియుండిరి. ముజఫర్‌జంగు స్థానమున అతనికన్న మెత్తనివాడైన సలాబతుజంగు సుబేదారుడైనందువలన డూప్లేగారు చెప్పిన పద్ధతులనెల్ల అతడిప్పుడింకను సులభముగా తు.చ. తప్పకుండా నిర్వహింపకలిగెను.
భారతదేశ పటమును చూచినవారికి ఫ్రెంచి రాజ్యనీతిజ్ఞులు ఆలోచించి వేసిన పథకము ఎంత సులభసాధ్యమో తెలియగలదు. అల్లకల్లోలములందు మునిగి యొక క్రమపద్ధతిలేని మొగలాయి సామ్రాజ్య ప్రభుత్వమునకును ఈ దక్షిణాపథమునకును మధ్య వింధ్యపర్వత పంక్తి యడ్డుగానుండెను. ఈ దక్షిణాపథ రాజ్యమునకు పరిపాలకుడైనవాడు దక్షిణదేశమునకంతకును ప్రభువగుటకు తగిన స్థానముననుండెను. అతనికి పెద్దసైన్యముండెను. యుద్ధము చేయగల జనములా రాజ్యముననున్నారు. ఇతడు కర్నాటక రాజ్యమునేలు నవాబుపైన అధికారముగల ప్రభువు. ఆ రాజ్యమునకు సంబంధించినంతవరకు మొగలాయి చక్రవర్తికున్నంత యధికారమతనికుండెను. అందువలన అతనికి అవసరమైన నైతికబలము, బలప్రయోగ అధికారము నుండుటయేగాక అట్టి బలప్రయోగమున కవసరమైన సైన్యము కూడ ఉండెను. ఆ కాలములో మొగలు చక్రవర్తి పేరునకుగల గౌరవమును, పలుకుబడియు అమితమైనవిగనుండెను. పాశ్చాత్యవర్తకులకా కాలమున వూరు పేరు లేదు. అందువలన నీరెండు విధములైన అధికారములును పలుకుబడియు కలిగియున్నవారికి అలవికాని కార్యములేదు. ఇట్టిపరిస్థితులలో ఈ అధికారమును పలుకుబడియుగల దక్కను సుబేదారుని తమ వలలో వేసికొనిన ఫ్రెంచివారు తమతో పోటీచేయు ఇంగ్లీషు వర్తక కంపెనీవారిని దేశమునుండి వెడలగొట్టవలెనని ప్రయత్నించినచో నాశ్చర్యమేమున్నది. దక్కను హైదరాబాదులోని జుమ్మా మసీదు బురుజులను వశముచేసుకొని కర్నాటకము స్వంతముగ చేసికొనినవారికి ఢిల్లీలోని నెమలి సింహాసనము కూడా కనుచూపుమేరలో కనబడి రాజ్యాక్రమణ మార్గమును చూపించి కార్యసాధనకు ప్రోత్సహించుటలో నాశ్చర్యమేమున్నది. ఫ్రెంచివారికి త్వరలోనే సామ్రాజ్య స్థాపనను గూర్చిన ఆలోచనలు కలిగినవి. ఈ ఆలోచనలలో నింకొక గొప్ప విశేషమేమనగా నిది సులభసాధ్యముగ కూడా కనపడెను.
దేశీయుల చిత్తవృత్తులను చక్కగానెరిగియున్న డూప్లేగారు ప్రస్తుతము దక్షిణాపథమునేలుచున్న సుబేదారుడు ఫ్రెంచివారిపట్ల కృతజ్ఞుడైయున్నప్పటికిని ఈ ఫ్రెంచివారికి గల శక్తిసామర్థ్యములును వారి బలాధిక్యతయు నతని కన్నులయెదుట సదా ప్రదర్శింపబడుచున్నగాని అతడిదియెల్ల త్వరగా మరచిపోగలడని కూడా డూప్లేగారికి తెలియును. అందువలననే కేవలము ముజఫర్‌జంగ్‌కు సహాయము చేయగలందులకేగాక దక్కను సుబేదారుని దర్బారులో ఫ్రెంచివారి బలమును, పలుకుబడిని స్థాపించియుంచుటకే డూప్లేగారు బుస్సీగారికి ఫ్రెంచి సైనికదళమునిచ్చి ముజఫరుజంగుతో పంపియుండిరి. యుద్ధకౌశలము రాజ్యతంత్ర నైపుణ్యము గల ఫ్రెంచియధికారి క్రింద ఫ్రెంచివారి సైన్యము సుబేదారుని రాజధాని నగరమున నుండుటవలన ఆ సుబేదారునియొక్క అధికారమునకు తోడ్పడుటయేగాక ఆ సుబేదారుడు తన పదవిని కాపాడుకొనుటకొరకు ఆ సైనిక బలముపైన నాధారపడు స్థితి సంభవించినచో చాలా లాభకరముగనుండునని డూప్లేగారికి తెలియును. ఇంతేగాక రాజ్యతంత్ర నిపుణుడైన సేనాధిపతి సమర్థుడును తెలివైనవాడునైనచో ఆ రాజ్యములోని పలుకుబడియంతయు తన క్రింద కేంద్రీకరింప జేసికొనగలుగును. రాజకీయ వ్యవహారములకు సూత్రధారుడుగ నుండును. నిజమునకు దక్కను సుబేదారుని కీలుబొమ్మగ చేసి రాజనగరునందు నియంతకాగలడు. డూప్లేగారి యధ్వర్యమున పంపబడిన బుస్సీదొరగారు సమర్థుడైన సేనాధిపతియు రాజ్యతంత్రజ్ఞుడునని చరిత్రప్రసిద్ధుడైనాడు.
నిజాం దర్బారు
ఈ పరిస్థితులలో ఘాజీయుద్దీన్ తీరుబడి చేసికొని ఢిల్లీనుండి దక్షిణాపథమువరకు తరలివచ్చెను. అంతట సలాబతుజంగు భయపడెను. అయితే ఘాజీయుద్దీను బాధ త్వరలో తీరిపోయెను. అతని సవతితమ్ముడైన నిజామలీగారి కన్నతల్లి ఘాజీయుద్దీను తన కుమారునికి అడ్డురాగలడని తలచి పైకి చాలాప్రేమను చూపి తాను వండిన వంటకమని చెప్పి ఘాజీయుద్దీనుకు విషము పెట్టగా నతడు 1752 అక్టోబరులో దుర్మరణము చెందెను. అంతట బుస్సీగారు అతనికిదివరకు స్నేహితులుగానున్న మహారాష్ట్రులకు సలాబతుజంగుగారిచేత కొంత రాజ్యభాగమిప్పించి రాజీ చేసెను.
మహారాష్ట్రులతో సంధిజరిగి దేశములో శాంతి యేర్పడిన పిమ్మట బుస్సీగారు అదివరకే ఫ్రెంచివారి స్వాధీనమందున్న మచిలీపట్టణము పరగణాకు దగ్గరలోనున్న కొండవీడు పరగణాను ఫ్రెంచివారి కివ్వవలసినదని కోరగా సుబేదారు ఇచ్చివేసెను. ఇది చాలా స్వల్పమైన బహుమతి అనియు ఇంక కొంత రాజ్యము నివ్వవలసినదనియు బుస్సీగారతని నడగదలచిరి కాని ఇంతలో మరల మహారాష్ట్రులు దండయాత్ర చేసి దేశమును కొల్లగొట్టిరి. బీరారు దగ్గరనున్న రాజ్యభాగమును రఘోజీకిచ్చి రాజీ పడవలసినదని బుస్సీగారు సుబేదారునికి సలహాచెప్పిరి. దీనివలన సుబేదారుగారి నౌకరులలో చాలామందికి జీతబత్తెములును లాభములును పోయినవి. అందువలన గొప్పప్రభువులైన షానవాజుఖాను మొదలగువారికి బుస్సీగారిపైన అసహ్యము కలిగెను. నిజాముల్‌ముల్కుగారి దివాను సయ్యదులష్కరుఖానుగారికిని ద్వేషము కలిగినది. అతడు చాలా తెలివైనవాడు సమర్థుడు. అతడు సుబేదారుగారి సైన్యమునకు అధికారి. నాజరుజంగుగారు అతని సలహా విననందువలననే అట్లు నాశనమైనాడని చాలామంది అభిప్రాయపడిరి.
ఫ్రెంచివారికి సుబేదారుడిట్లు దాసోహముచేయుట ఆయనకు గిట్టకుండెను. బుస్సీగారికింత పలుకుబడియుండుటయు నతడు సహింపలేకుండెను. గాని పైకిమాత్రము చాల మర్యాదగానుండెను. అందువలననే అతనిని దివానుగా నియమింపుమని బుస్సీగారు సుబేదారుగారికి సిఫారసుచేసిరి. సయ్యదు లష్కరుఖాను దివానై అతని అధికారములు బలపడగానే యతడు తన నిజోద్దేశములను బయల్పరచెను. బుస్సీగారి సలహా ప్రకారము వ్యవహారములను జరిగింపక పోవుటయేగాక బుస్సీగారి సలహానుబట్టి సుబేదారుగారు జారీచేసినట్లు తనకు అనుమానము కలిగిన యే ఉత్తర్వులను కూడా సరిగా అమలుజరుపకుండెను. ఫ్రెంచివారి కోరికలు మితిమీరుచున్నట్లు అతనికితోచెను. అందువలన నతనికి వారిపైన ద్వేషము కలిగెను. బుస్సీగారికి 1753 ప్రారంభంలో జబ్బుచేసెను. అతడు జనవరి నెలలో తన సైన్యమునొక సహయోద్యొగిక్రింద నక్కడనుంచి తాను విశ్రాంతి తీసికొనుటకై సముద్రతీరముననున్న మచిలీపట్టణమునకు పోయెను. అతడక్కడ నుంచిన ఫ్రెంచియుద్యోగి సమర్థుడు కాడు. దర్బారులో జరుగు కుట్రలకు అతడు తట్టుకొనలేకపోయెను. సలాబతుజంగుకు తెలివితేటలును ధైర్యసాహసములును గూడా తక్కువగానేయుండెను. కుట్రదారులవలన అతనికేయపాయము కలుగకుండగను, శత్రువులవలన భయములేకుండగను ఫ్రెంచి సైనికులు అతనికి అంగరక్షకులుగానుండి అతనిని కాపాడుదురని బుస్సీగారతనికి మంచి నమ్మకము కలిగించియుండిరి. అందువలననే తన దగ్గరనుంచుకొనిన ఫ్రెంచి సైనికదళములకు తోడు 5వేల మంది దేశీయ సైనికులను కూడా బుస్సీగారక్కడ చేర్చియుండిరి. ఈ సేనను సుబేదారునికి దూరముగానుంచి అతనికి భయముతీర్చి వారిమీద నాధారపడు అలవాటును తప్పించవలెనని దివానుగారొక ఉపాయము నాలోచించిరి. ఆ సైన్యమునకు జీతబత్తెములు సరిగానివ్వక రాజ్యములోనుండి సొమ్ము సరిగా వసూలగుటలేదని చెప్పి కొన్నాళ్ళు కాలక్షేపము చేసి ఫ్రెంచి సైనికులనే పంపి శిస్తు బాకీలను వసూలుచేయుట తప్ప వేరుమార్గము లేదని సుబేదారునికి చెప్పి ఈ సేనలను వివిధ జిల్లాలలోనికి పంపవలసినదని ఆయన కోరెను.
సలాబతుజంగు ఈ సైనికులను దూరమునకు పంపుటకు అంగీకరించువాడు కాదుగాని అక్కడ బుస్సీగారులేని కాలము నందీసైనికులలో క్రమశిక్షణము క్షీణించి నగర పరిసరములందు వారు అల్లరులు చేయుచుండిరి. దీనినిగూర్చి ప్రజలువచ్చి ఫిర్యాదులు చేసి తమకు న్యాయము కలిగింపుడని సుబేదారుగారి భవనద్వారమువద్ద మొరపెట్టుకొనసాగిరి. అందువలననే సైనికులను గ్రామాంతరములకు పంపుట కతడంగీకరించెను. ఈ సైనికులనిట్లు నలుదిక్కులకు పంపి సుబేదారుగారు హైదరాబాదు నుండి ఔరంగాబాదు పోవుట అవసరమని చెప్పి కొద్దిమంది ఫ్రెంచి సైనికులను మాత్రము వెంటబెట్టుకొని వెళ్ళి మిగిలినవారినందరిని గోలకొండలోనేయుంచి వారికి సరిగా జీతములివ్వవలదనియు వారినితరవిధములుగా నేడిపింపుమనియు గోలకొండలో కోటయొక్క పరిపాలకునితో దివానుగారు రహస్యముగా చెప్పియుండిరి. ఇట్లీ సైనికులను బాధలుపెట్టినచో వారు తమంతట తామే పనిమానుకొని పోవుదురని యతనియూహ. అంతట ఫ్రెంచి సైనికులును దేశీయ సిపాయిలును కూడా గోలపెట్టసాగిరి. ఫ్రెంచి సైనికోద్యోగులు మాత్రము ఎన్ని చిక్కులు కలిగినను తమ యుద్యోగ విధులను నిర్వర్తించుచు బుస్సీగారిని తక్షణమే బయలుదేరి రమ్మని ఉత్తరము వ్రాసిరి. బుస్సీగారి యారోగ్యమింకను కుదుటబడకున్నను అతడు జులైనెలలో తిరిగివచ్చెను. 500మంది ఫ్రెంచి సైనికులు 4000మంది దేశీయ సిపాయిలు హైదరాబాదు నగరములో బారులుతీర్చి నిలువబడిరి. బుస్సీగారు రాగానే గోలకొండ పరిపాలకుడు భయపడి సైనికులకివ్వవలసిన జీతబత్తెముల బకాయిని వెంటనే చెల్లించెదననెను. అయితే తనదగ్గర నప్పుడు సొమ్ములేదని జెప్పెను. అప్పుడు బుస్సీగారు తన పలుకుబడి వినియోగించి షావుకార్ల దగ్గర కొంతసొమ్ము ముందుగా సేకరించి తన దగ్గరున్న సొమ్మును దానికి చేర్చి సైనికుల అక్కరను తీర్చి అప్పటికి వారిని సంతృప్తిపరచి అల్లరి జరుగకుండాచేసిరి. తరువాత ముందు జరుగవలిసిన కర్తవ్యము నాలోచించిరి.
దివానుగారు తమతో ఔరంగాబాదుకు వచ్చిన చిన్న ఫ్రెంచి దళమునకు కూడా సరిగా జీతబత్తెములనివ్వక బాధించినారు. బుస్సీగారీసంగతి తెలిసికొని ఉపాయము నాలోచించెను. వర్షములు తగ్గగానే సెప్టెంబరులో తన యావత్తు సైన్యమును వెంటబెట్టుకొని ఔరంగాబాదు బయలుదేరి వెళ్ళుటకు నిశ్చయించిరి. గోలకొండకు ఔరంగాబాదుకు 300 మైళ్ళ దూరమున్నది. అతడు అక్టోబరులో బయలుదేరుటకు సన్నాహముచేసెను. దివాను సయ్యదు లష్కరుఖానుగారు బుస్సీగారిపట్ల విరోధించియున్నను ఔరంగాబాదులోని ప్రభువులు కొందరాయనపట్ల స్నేహభావము కలిగియుండిరి. సలాబతుజంగుగారా సమయమున తమ సైన్యమునకు బకాయిపడిరి. మహారాష్ట్రులు మరల వచ్చిపడుదురను భయమాతనికుండెను. బుస్సీగారిట్లు వచ్చుచున్నారను వార్త సుబేదారుని దర్బారులో గొప్ప అలజడి కలిగించెను. దివానుగారికి భయము కలిగినది. మొదట ఔరంగాబాదుకు ఎనిమిదిమైళ్ళ దూరమునగల దౌలతాబాదు కోటకుపోయి తలదాచుకొందమని అతడనుకొనెను. గాని తరువాత బుస్సీగారితో సఖ్యతపడుటయే మంచిదని అతనికి తోచెను. అంతట నతడాయనతో రాయబారము నడిపి తనయధికారముద్రలను బుస్సీగారి వశము చేసెదననియు ఆ పదవినింకెవ్వరికైన నిప్పించుమనియు తానతడు చెప్పినట్లు వినెదననియు దివానుగారు కబురంపిరి. బుస్సీగారిదియెల్ల నాటకమని గ్రహించిరి. నిజముగా నతనిని తొలగించినచో తాను అన్యాయము చేసినట్లు ఇతరులనుకొందురని అతడు ఎరుగును. తనజాతివారికి కావలసిన లాభము సంపాదించుటయే అతని ముఖ్యోద్దేశముగాని ఎవరికిని అపకారము చేయుట అతని యుద్దేశము కాదు. అందువలన తనకతనియందు విరోధభావము లేదనియు ఉభయులు కలసి అన్ని వ్యవహారములు సఖ్యతగా పరిష్కరించుకొనవచ్చుననియు కబురంపిరి. ఉభయులు కలసికొనునప్పుడు జరగవలసిన లాంఛనములు, మర్యాదలు కూడా బుస్సీగారు నిర్ణయించిరి.
బుస్సీగారు ఔరంగాబాదుకు వచ్చు దారిలో చాలా దినములు మకాముచేసిన పిమ్మట నానగరమునకు 8 మైళ్ళ దూరములోనుండగా 1753 నవంబరు 23వ తేదీన దివాను సయ్యదు లష్కరుఖానుగారు 21 మంది గొప్ప ప్రభువులతో ఏనుగులెక్కి తమ పరివారజనము వెంటరాగా బుస్సీగారికెదురుగా వచ్చిరి. ఈ వింత సమావేశమును చూచుటకు వచ్చిన చాలామంది పురజనుల సమక్షములో బుస్సీగారికి ముందుగా సలాముచేసిరి. అంతట అందరును ఏనుగులు దిగిరి. బుస్సీగారును ఏనుగునుండి కిందికి దిగి సయ్యదు లష్కరుఖానుగారిని కౌగలించుకొనిరి. తరువాత తక్కినవారిని కౌగలించుకొనిరి. అటుపిమ్మట అందరును మరల ఏనుగులెక్కి సైనికపద్ధతి వరుసలో సుబేదారుగారి సమక్షమునకు వెళ్ళిరి. ఆయన ఈ సందర్శన స్థలమునకు కొంతదూరముననే చాలామంది పరివారముతో నొకగుడారములో వేచియుండిరి. బుస్సీగారు రాగానే సుబేదారుగారాయనను కౌగలించుకొనిరి. అంతట వారి గౌరవార్థము ఫ్రెంచి ఫిరంగిదళములవారు ఫిరంగులను తుపాకులను ప్రేల్చిరి. గుడారమునందు ఆశీనులైన పిమ్మట బుస్సీగారు సుబేదారుగారికి నజరును సమర్పించిరి. అందులో చాలా ఏనుగులును కొన్ని గుర్రములును నగలును ఉండెను. ఆయన ఉద్యోగులు కూడా అట్లే సుబేదారుగారికి బంగారు మొహరీలను నజరుగా సమర్పించిరి. అటుపిమ్మట సుబేదారుగారు లేచి బుస్సీదొరగారి చెయ్యిపుచ్చుకొని గుడారము వెలుపలకువచ్చిరి. సుబేదారుగారు ఏనుగునెక్కుటలో బుస్సీగారు ఆసరానిచ్చి ఎక్కించిరి. తరువాత బుస్సీగారును తమ ఏనుగును ఎక్కిరి. అంతట అక్కడి ప్రభువులందరును తమతమ ఏనుగులనెక్కిరి.
ఇట్లు ఏనుగులు గుర్రములనెక్కిపోవుచున్న వారి వరుసలో గొప్ప ప్రభువులు సేనాధిపతులు మొదలైన అధికారులు ఇతర సైనికులును వారివెనుక హిందూస్థానములోనికెల్ల గొప్ప నగరమైన ఔరంగాబాదులోని పురప్రముఖులును కలిసి నదియొక గొప్ప ఉత్సవపుటూరేగింపు వలెనుండెను. వీరందరునిట్లు మహావైభవముతో ఔరంగాబాదు కోట చేరులోపల వీరి గౌరవార్థము ఫ్రెంచి ఫిరంగిదళమువారు మరలమరల ఫిరంగులు పేల్చసాగిరి. సుబేదారుగారు దర్బారుతీర్చి తమ మస్నదుపైన ఆసీనులు కాగానే తమకు బుస్సీగారిదివరకిచ్చిన బహుమతులవంటివే తాము మరల ఆయనకిచ్చి గౌరవించిరి.
తరువాత దర్బారును చాలించిరి.
అటుపిమ్మట బుస్సీగారు సయ్యదు లష్కరుఖానుగారింటికి వెళ్ళి తమ రాజీషరతులన్నింటిని వివరింపగా నతడు వానికన్నిటికీ నంగీకరించి వానిని సక్రమముగా జరిగింతునని ప్రమాణము చేసెను. ముస్తఫా నగరము, ఏలూరు, రాజమహేంద్రవరము, చికాకోలు సర్కారులను సుబేదారువారు ఫ్రెంచివారి సైన్యముయొక్క పోషణవ్యయమునకై యొసగునట్లును ఆ సర్కారులకప్పుడు పరిపాలకుడుగా నుండిన జఫరలీఖాను ఆ పరగణాలలో అప్పటికి వసూలుచేసిన సొమ్మును ఫ్రెంచివారికి చెల్లించుటలో జాగుచేసినచో సుబేదారుగారి ఖజానాలోనుండి ఆ సొమ్ము భర్తీచేయుదుమని దివానుగారు వాగ్దానము చేసిరి. ఫ్రెంచి సైన్యములు పూర్వమువలె సుబేదారుగారి సంరక్షణము నిమిత్తముపయోగింపబడుటకు అంగీకరించిరి. ఆర్కాటు పరగణా వ్యవహారములందు సుబేదారుగారి దివానుగారు జోక్యము కలిగించుకొనకుండుటకు అంగీకరించిరి. ఇతర వ్యవహారములన్నియు బుస్సీగారి సలహాతో జరిగించుచుండుటకును అంగీకరించిరి. దీనికి ప్రతిఫలముగా బుస్సీగారు సయ్యదు లష్కరుఖానుగారి దివానుగిరీ అధికారములను బలపరచుటకు ప్రమాణముచేసిరి.
అనుకున్న ప్రకారము నాలుగు సర్కారులకును పట్టాలను వెంటనే తయారుచేసి బుస్సీగారికి సమర్పించగా బుస్సీగారు వానిని మచిలీపట్టణములోనున్న ఫ్రెంచి అధికారియైన మొరాసీనుగారికి పంపించిరి.
(ఆంధ్రప్రభ సెప్టెంబరు 1968-ఫిబ్రవరి 1969)