కేతన ఆంధ్ర భాషాభూషణము-6

క్రియలు

137వ పద్యం నుండి తెలుగు క్రియానిర్మాణాన్ని వివరించాడు కేతన. అయితే ఈ అధ్యాయంలో కేతన క్రియతో బాటు కృత్, తద్ధిత రూప ప్రత్యయాలను కూడా వివరించాడు. క్రియారూపాలనుండి నామరూపాలు నిష్పన్నమయ్యే ప్రక్రియ ఉండటం వల్ల బహుశః వాటిని ఈ ‘క్రియ’ విభాగం లోనే చేర్చాడని భావించాలి.

కాల, వచన బోధక ప్రత్యయాలు

క.
ఇల నొరుఁడు నీవు నేనును
నలిఁ జేసినపనులు క్రియలు నానావచనం
బులు కాలత్రితయంబున
నలవడి యీ క్రియలు చెల్లు నభినవదండీ. 138

ఇలన్ = ఈ భూమిమీద; ఒరుడు = మూడోవ్యక్తి; నీవు = శ్రోత; నేనును = వక్త; నలిన్ = ఎల్లప్పుడూ; చేసిన పనులు క్రియలు = చేసినటువంటి పనుల గురించి తెలిపేది క్రియలు; నానా వచనంబులు = రకరకాల వచనాలు; (ఒకటిని, ఒకటి కంటే ఎక్కువను తెలిపేది); కాల త్రితయంబున = మూడు కాలాలలో; అలవడి = అలవాటుగా; ఈ క్రియలు = ఈ క్రియారూపాలు; చెల్లున్ = ప్రవర్తిస్తాయి; అభినవదండీ = ‘అభినవదండి’ అనే బిరుదుగల కేతనా!

“ఈ భూమ్మీద ఇతరులు నువ్వు, నేను చేసిన పనులను తెలిపే క్రియాపదాలు వివిధ వచనాల్లో, మూడు కాలాలలో సాధారణంగా (అలవాటుగా) చెల్లుతాయి”.

వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. ఈ పద్యం చదివితే ఎంతో సామాన్యంగా ఇతరుడు (మరోవ్యక్తి), నువ్వు, నేను చేసే పనులు తెలిపేవి క్రియలు అని నిర్వచించాడు. సమాజమూ, ప్రపంచమూ కూడా ఈ ‘ముగ్గురి’ తోనే (తాత్వికంగా ఆలోచిస్తే) నిండి ఉంటుంది. ఇందులో ‘నేను’ వక్తను తెలియజేస్తుంది. దీనిని తర్వాత వ్యాకరణాల్లో సంస్కృత సంప్రదాయాన్ననుసరించి ‘ఉత్తమ పురుష’ అన్నారు. ‘నువ్వు’ శ్రోతకు సంబంధించింది; దీన్ని మధ్యమ పురుష అన్నారు; ‘ఒరుడు’ అంటే వక్త – శ్రోతలకు దూరంగా ఉన్న మరో (పరాయి) వ్యక్తి. అది పురుష/స్త్రీ నపుంసకాల్లో ఏదైనా కావచ్చు – దీనిని ప్రథమ పురుష అన్నారు. ఇలా నేను, నువ్వు – అతడు / ఆమె/ అది – అని మూడు పురుషలలో క్రియారూపం ఉంటుంది. ఈ పురుషలతోపాటు ఇది “నానావచనాల్లో” అంటే సంస్కృతంలో ఏక, ద్వి, బహు వచనాలుగానూ, తెలుగులో ఏక-బహు వచనాల లోనూ ఉంటుంది. అంతేకాకుండా “కాలత్రితయం” అంటే మూడు కాలాలైన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోనూ ఉంటుంది.

ఈ విధంగా ఒక చిన్న కంద పద్యంలో క్రియకు సంబంధించిన సమాచారాన్నంతా ఇచ్చాడు కేతన. అయితే ఈ “కాలత్రితయం” అని కేతన అన్న దానిపై దేవినేని సూరయ్య విభేదాన్ని వ్యక్తం చేశారు. ఈ పద్యంతో ప్రారంభించి కేతన తన కాలంలో కవులు కావ్యాలలో క్రియలు వాడిన విధానాలను వివరించినా, తర్వాత కావ్య భాషను అధ్యయనం చేసిన లాక్షణికులు చెప్పిన, అన్ని కాలాలకూ వర్తించే క్రియగా పేరు పెట్టిన “తద్ధర్మ” ను కేతన చెప్పలేదని సూరయ్య అభ్యంతరం వ్యక్తం చేసారు.

“వాడు నీవు నేను ప్రథమ, మధ్యమోత్తమ పురుషములు చేసిన పనుల క్రియలు, నానా విధములైన మాటలు (?), భూత, వర్తమాన, భవిష్యత్కాలములను మూడు కాలములు జేరి వర్తిలు చుండును. తద్ధర్మమును జెప్పియుండలేదు” (పు. 108).

పైన వివరణలో సూరయ్య కేతన చెప్పిన ‘వచనములు’ అన్న దానిని ‘మాటలు’ అన్నారు. కానీ అవి మాటలు కావు; ఆయన ఎలా పొరబడ్డారో కానీ క్రియను వివరించేందుకై అన్ని భాషల్లోనూ కనీసం ఏక, బహుత్వాలను తెలిపే రెండు ‘వచనాలూ’ (మూడు, నాలుగు ఉండే భాషలు కూడా ఉన్నాయి); రెండు లేక మూడు ‘పురుషలు’ (కొన్నిసార్లు మళ్ళీ స్త్రీ పురుష నపుంసక విభాగాలు); మూడు లేక అంతకంటే ఎక్కువగా (సంస్కృతంలో పది (10) రకాలు) కాలాలను సూచించే ప్రత్యయాలు ఉంటాయి. ఈ పదాలనన్నింటినీ కలిపి ఇంగ్లీషులో Paradigm అన్నారు.

పురుషలు = ఒరుడు (ప్రథమ); నీవు (మధ్యమ); నేను (ఉత్తమ); వచనాలు = ఏకవచనం, బహువచనం; కాలత్రితయం = భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం.

అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు. ఎందుకంటే కష్టంగా, క్లిష్టంగా కాకుండా ఇంత సులభంగా సూత్రాన్ని చెప్పడం ఎంతో అభిలషణీయమైన విషయం.

క.
ఎన్నఁగ భూతార్థమునెడ
నెన్నగు వర్తించునర్థ మెఱుఁగఁ బలుకుచో
నున్నగు భవిష్యదర్థము
నున్నంగాఁ బలుకుచోట నూతనదండీ. 139

ఎన్నఁగ = ఎంచి చూడగా; భూతార్థమున్ = గడిచిన (జరిగిపోయిన) కాలాన్ని తెలియజేసే; ఎడ = సందర్భంలో, అప్పుడు; ఎన్-అగు = ఎన్-అనే ప్రత్యయం వస్తుంది. వర్తించున్ + అర్థము = ప్రస్తుత కాలార్థాన్ని; ఎఱుఁగఁ బలుకుచోన్ = తెలిపేటప్పుడు; ఉన్న – అగు = ఉన్న ప్రత్యయం వస్తుంది; భవిష్యత్ అర్థమున్ = రాబోయే కాలం గురించి ; పలుకుచోటన్ = చెప్పేటప్పుడు; ఉన్నంగా (అగు) = ఉన్నంగా అనే ప్రత్యయం వస్తుంది; నూతనదండీ!

“భూతకాల అర్థంలో ‘ఎన్’ ప్రత్యయం, వర్తమానాన్ని తెలిపేటప్పుడు ‘ఉన్న’ ప్రత్యయం; భవిష్యత్ కాలాన్ని తెలియజేసేందుకు ‘ఉన్’ ప్రత్యయం చేరుతాయి”.

ఈ కాల బోధకాల గురించి, వాటికి కేతన ఇచ్చిన ప్రత్యయాల గురించి అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. అన్ని కాలాల, ప్రత్యయాల విషయంలో హరి శివకుమార్ చెప్పిన విషయాలను తరువాతి పద్యాల వివరణల్లో ఉటంకిస్తాను. కానీ సూరయ్య ఈ పద్యానికి ఇచ్చిన వివరణ ఇలా ఉంది: “క్రియలు వర్తమానార్థకము, భూతార్థకము, భవిష్యదర్థకము, తద్ధర్మార్థకము నని నాలుగు విధములు”. లక్షణమున (అంటే ఈ గ్రంథంలో) తద్ధర్మార్థకము తెలుపలేదు. జరిగిన కాలమును దెలుపునది భూతార్థకము. జరుగుచున్న కాలమును దెలుపునది వర్తమానార్థకము. జరుగబోవు కాలమును దెలుపునది భవిష్యదర్థకము. భూతార్థమున ‘ఎన్, ఎను’ అనునవియు, వర్తమానార్థమున “చున్న” అనునదియు, భవిష్యదర్థమున “కల” అనునదియు, తద్ధర్మాద్యర్థమున “దు, ఎడు, ఎడి” అనునవియు వచ్చును”. (పు. 109) అని చెప్పాడు. అయితే ఈ వాదనను అంగీకరిస్తే మనకు ఒక ప్రశ్న కలుగుతుంది. ఇలాంటి ‘లక్షణ’ గ్రంథాన్ని రాయటానికి పూనుకున్న కేతన క్రియారూపాలపై దృష్టిపెట్టలేదా? లేక కేతన కాలానికి తద్ధర్మార్థమని లేకుండా తర్వాత కాలంలో ఏర్పడిందా? ఏర్పడితే అది ఎప్పుడు పరిణామం చెంది నిర్ధారణగా “తద్ధర్మంగా” గుర్తింపబడింది? ఈ అంశాలపై బహుశా ఇంకా కొంత పరిశోధన జరగాల్సి ఉందేమోననిపిస్తుంది.

ప్రస్తుతానికి కేతన ఇచ్చిన ప్రత్యయాలలో కూడా ఒక సందిగ్ధత ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే వర్తమాన, భవిష్యత్ కాలాలలో చెప్పిన ‘పలుకుచోనున్నగు’ అనే మాటను రెండు రకాలుగా (సంధి చేసి నుగాగమంగానూ, కాకుండాను) విడదీయవచ్చు. ఎలాగంటే,

i) పలుకుచోన్ + ఉన్న + అగు. ii) పలుకుచో + నున్న + అగు.

అలాగే భవిష్యదర్థంలో కూడా:

i) భవిష్యదర్థమున్ + ఉన్న (o) + గా ii) భవిష్యదర్థము + నున్నం + గా

అని రెండు రకాలుగా చెప్పే అవకాశం కనిపిస్తోంది. వీటికి సంబంధించి కేతన ఇచ్చిన తర్వాతి ఉదాహరణలను పరిశీలిస్తే ఈ విషయంలో కొంత స్పష్టత ఏర్పడవచ్చు.

భూతకాలం

క.
ఒరులకు నెను నిరి యగును నె
దిరికిఁ దివితి కారములును దిరి యగుఁ దనకున్
బరువడిఁ దినియున్ దిమియున్
బొరయు నుభయవచనములకుభూతక్రియలన్. 140

ఒరులకున్ = ఇతరులకు అంటే మూడో వ్యక్తికి (ప్రథమ పురుష అని సాంకేతికంగా చెప్పేది); ఎను(న్) = ఎను ప్రత్యయం; ఇది = ఇరి ప్రత్యయం; అగును = అవుతాయి; ఎదిరికి = ఎదుటి వ్యక్తి అంటే శ్రోతకు (మధ్యమ పురుషకు); తివి, తి కారములును = -తివి, తి అనే ప్రత్యయాలు; తిరియగున్ = తిరి అనే ప్రత్యయం అవుతాయి; తనకున్ = మాట్లాడే వ్యక్తి, వక్తకు (ఉత్తమ పురుషకు); పరువడిన్ = వరుసగా; తినియున్, తిమియున్ = తిని, తిమి అనే ప్రత్యయాలు; పొరయున్ = అవుతాయి; ఉభయవచనములకు = రెండు వచనాలలో (ఏక, బహు); భూతక్రియలన్ = భూతకాల క్రియారూపాలలో.

“భూతకాల క్రియారూపాలలో ప్రథమ పురుష ఏక వచనానికి ‘ఎను’ ప్రత్యయం; బహువచనానికి ‘ఇరి’ ప్రత్యయం, మధ్యమపురుష ఏక వచనానికి ‘తివి’ కానీ ‘తి’ కానీ బహువచనానికి ‘తిరి’ వచ్చి చేరుతాయి. ఉత్తమ పురుషకు ఏక వచనంలో “తిని, బహువచనంలో ‘తిమి’ వస్తాయి”.

సాధారణంగా భాషలలో క్రియారూప సంయోజనలో (ప్రత్యయాలు చేర్చినప్పుడు) కాలబోధక, లింగ, వచన, పురుష ప్రత్యయాల క్రమం ఈ కింది విధంగా ఉంటుంది.

క్రియాధాతువు + కాలబోధకప్రత్యయం + వచన/పురుష/లింగ బోధక ప్రత్యయం.

Verb + Tense marker + Person+Number+Gender

అయితే కొన్ని భాషలలో ఈ అన్ని రూపాలు ఉండకపోవచ్చు.

పైన చెప్పిన ప్రకారం తెలుగులో కేతన రాసిన కావ్య భాషా లక్షణం కూడా ఇదే క్రమంలో ఉంది.

వీటిలో చివరిదైన పురుష, వచన ప్రత్యయాలను ఈ కింది పట్టిక ద్వారా చూపవచ్చు.

పురుషలు       ఏకవచనం      బహువచనం
ప్రథమ         -ఎను              -ఇరి
మధ్యమ     -తివి/-రి              -తిరి
ఉత్తమ        -తిని               -తిమి

అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఒకటుంది. భూతకాల ప్రత్యయంగా కేతన ఇచ్చిందీ, ప్రథమ పురుష ఏకవచనంగా ఇచ్చిందీ రెండూ ఒకే రూపాలు. ఇందులో మరో అంశం కూడా ఉంది. క్రియకు భూతకాల బోధకంగా ‘ఎన్’ చేర్చడం నిజంగా, అంటే అన్ని పురుషల్లోనూ, వచనాల్లోనూ లేదు. కనిపించదు. అంటే ప్రత్యేకంగా భూతకాల రూపం పూర్వపద్యంలో కేతన చెప్పినట్లు ‘భూతార్థమున ‘ఎన్’ అగు’ అనేది కలవడం లేదని గమనించాలి.

ఉదా: క్రియ+ఎను + ఎను అని కానీ, అలాగే క్రియ+ఎను+తివి/తి, తిని, ఇరి, తిరి, తిమి అని కానీ ప్రయోగాలు కావ్య భాషలో కనిపించవు. తర్వాత కేతన ఇచ్చిన ఉదాహరణ చూసినా మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. (చూ. పద్యం 142 కింద).

ఆధునిక తెలుగులో ప్రథమ పురుష లింగ భేదాలను సంతరించుకుంది. కానీ ప్రాచీన తెలుగులో లింగ భేదం కన్పించదు. గమనించండి!

       ప్రాచీనం                   ఆధునికం
        ఏక-బహు                  ఏక-బహు
   పలికెను-పలికిరి           పలికాడు-పలికారు
    పలికెను- పలికిరి        పలికింది-పలికారు
      పలికెను            పలికింది-పలికాయి

అంటే ఆధునిక తెలుగులో ఏకవచనంలో పుంలింగ-పుంలింగేతర భేదం ఉండగా, బహువచనంలో మనుష్య – మనుష్యేతర భేదం కనిపిస్తుంది.

క.
పలికెను బలికి రనంగాఁ
బలికితివి పలికితి మఱియుఁ బలికితి రనఁగాఁ
బలికితిని బలికితి మనఁగ
నలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్ 141

పలికెను = పలికాడు/పలికింది; పలికిరి = పలికారు; పలికితివి/పలికితి = పలికావు; మఱియు = ఇంకా; పలికితిరి = పలికారు; అనఁగ = అనే విధంగా; పలికితిని= పలికాను; పలికితిమి = పలికాము; అనఁగన్ అనే విధంగా; అలఘుమతీ = గొప్ప హృదయం కలవాడా (సహృదయుడా); వరుసతో = వరుసగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“పలికెను, పలికిరి, పలికితివి/ పలికితి, పలికితిరి, పలికితిని, పలికితిమి అని వరుసగా ఉదాహరణలు”

ఈ పద్యంలో ‘పలుకు’ అనే క్రియను (ధాతువును) తీసుకుని దానికి ఏక, బహువచనాలలో ప్రత్యయాలను చేర్చి ఉదాహరణలిచ్చాడు కేతన. ఇంతకుముందు పద్యం వివరణలోనే చెప్పినట్లు ‘సామాన్యలింగ భేదం’ నుండి పురుష – పురుషేతర అని ఏకవచనంలోనూ, మనుష్య – మనుష్యేతర అని బహువచనంలోనూ లింగభేదం పరిణామ క్రమంలో అభివృద్ధి చెందినట్లు పై ఉదాహరణను బట్టి అర్థం చేసుకోవచ్చు. వివరంగా తెలుసుకోవాలంటే ఇదే క్రియకు కావ్యభాషకు కేతన పైన ఇచ్చిన ఉదాహరణల పక్కనే ఆధునిక వ్యవహారంలో ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం…

కేతన ఉదాహరణలు:

                కావ్యభాష          
          ఏక         బహు             
ఉత్తమ    పలికితిని    పలికితిమి
మధ్యమ   పలికితివి    పలికితిరి 
ప్రథమ    పలికెను      పలికిరి

ఆధునిక వ్యవహారం:

       పలికాను         పలికాము
        పలికావు         పలికారు
    పలికాడు(పు.)        పలికారు (మనుష్య)
       పలికింది         పలికాయి
    (పుంలింగేతర)      (మనుష్యేతర)

కావ్యభాషలో ఉన్న మధ్యమ, ప్రథమ పురుష ప్రత్యయభేదం ఆధునిక భాషలో పోయిన విషయం కూడా ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. (మరికొన్ని వివరాలకు చూ: కృష్ణమూర్తి, భద్రిరాజు, 1961; 1981)

వర్తమానకాలం

వ.
డును దరు లొరులకు నెదిరికిఁ దనరంగా దు దవు దరులు తనకు దను దమున్ జను నేకబహువచనములు మనుసన్నిభ క్రియల వర్తమానార్థములన్. 142

డును, దరులు ఒరులకున్ = ఇతరులగురించి చెప్పేటప్పుడు ‘డును’, ‘దరు’ లనే ప్రత్యయాలు; ఎదిరికి = ఎదుటి వ్యక్తికి (వినేవారు/శ్రోత); తనరంగా = సరిపోయేటట్లుగా; దు, దవు, దరులు = దు లేదా దవు, దరు ప్రత్యయాలు; తనకు = మాట్లాడేవారికి, వక్తకు; దను, దమున్ = దను, దము ప్రత్యయాలు; చనున్ = వస్తాయి; ఏక, బహు వచనములు= ఏకవచన, బహువచనాలు; మనుసన్నిభ = మనువుతో సమానమైన వాడా!; క్రియల = ధాతువుల; వర్తమాన + అర్థములన్ = వర్తమానకాలాన్ని తెలియజేసేటప్పుడు.

“వర్తమానకాలంలో ఏక, బహువచనాలలో ప్రథమపురుషకు డును – దరులును; మధ్యమ పురుషకు దు/దవు – దరులును; ఉత్తమ పురుషకు దను – దములును వరుసగా వచ్చి చేరుతాయి”.

వర్తమాన కాలంగా కేతన చెప్పిన ఈ ప్రత్యయాలపై సూరయ్యకూ, ఇతరులకూ భేదాభిప్రాయం కనిపిస్తుంది. ఇది కింది పద్యంలో ఉదాహరణలప్పుడు చూద్దాం.

వర్తమాన కాలానికి చేరే ప్రత్యయాలు – కేతన ప్రకారం ఇవి.

            ఏక                 బహు
ప్రథమ      -డును            -దరు
మధ్యమ.   -దు/దవు          -దరు
ఉత్తమ      -దను            -దము
క.
అడిగెడు నడిగెద రనఁగా
నడిగె దడిగెదవు ధనంబు నడిగెద రనఁగా
నడిగెద నడిగెద మనఁబొ
ల్పడరంగా వరుసతో నుదాహరణంబుల్. 143

అడిగెడును = అడుగుతాడు/అడుగుతుంది; అడిగెదరు = అడుగుతారు; అనఁగా = అనే విధంగా; అడిగెదు/ అడిగెదవు = అడుగుతావు; ధనంబున్ = డబ్బును; అడిగెదరు= అడుగుతారు; అనఁగాన్ = అనే విధంగా; అడిగెదన్ = అడుగుతాను; అడిగెదము = అడుగుతాము; అనన్ = అనే విధంగానూ; పొల్పు+అడరంగా చక్కగా; వరుసతో = వరుసగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“అడిగెడును, అడిగెదరు, అడిగెదు/ అడిగెదవు, అడిగెదరు, అడిగెదను, అడిగెదము అని వరుసగా ఉదాహరణలు”

దేవినేని సూరయ్య “పై యుదాహరణంబులన్నియు వర్తమానార్థములుగా గేతన యుదాహరించినాడు. కాని యవి తద్ధర్మ కాలమును దెలుపునవై యున్నవి. వర్తమానార్థమున నీ దిగువ రూపములుదాహరింపబడుచున్నవి” (పు. 110). అంటూ “గ్రాంథికభాష” వ్యవహారాలుగా చూపించే ఈ కింది ఉదాహరణలిచ్చాడు:

               ఏక             బహు
ప్రథమ.  అడుగు చున్నాడు    అడుగుచున్నారు
మధ్యమ  అడుగుచున్నావు/   అడుగుచున్నారు/
          అడుగుచున్నాడవు      అడుగుచున్నారరు
ఉత్తమ  అడుగుచున్నాను/    అడుగుచున్నాము/
           అడుగుచున్నాడను   అడుగుచున్నారము (పు.110)

కేతన తన 140 వ పద్యంలో “వర్తించునర్థమెఱుంగ బలుకుచో నున్నగా” అని సూత్రీకరించిన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే “ఉన్న” అనేది వర్తమాన కాలబోధక ప్రత్యయంగా చెప్పిన కేతన ‘ఉన్న’ లేని ఈ విధమైన ఉదాహరణలు ఎందువల్ల ఇచ్చాడో తెలుసుకోవాలంటే నన్నయ, తిక్కన మొదలైన కవుల ప్రయోగాలను, పరిశీలించాల్సి ఉంటుంది. వీటిని గురించి హరిశివకుమార్ ఇలా అన్నారు.

“వీనికి (వర్తమాన, భవిష్యత్ కాలాలకు) కేతన యిచ్చిన యుదాహరణములను పరిశీలించినచో వర్తమాన కాలమునకును, భవిష్యత్కాలమునకును భేదము గోచరింపదు. అంతేకాక అవి తద్ధర్మ – ఆశీరర్థకములతోడను దగ్గర సామ్యమును గల్గియున్నవి. ఇట్టి యభేదము నన్నయకు పూర్వశాసనములలో నెక్కువగా గన్పట్టును (ప్రాజ్నన్నయ యుగము పు. 258). వర్తమాన కాల ప్రత్యయములుగా పేర్కొనినవి నన్నయ భారతమున నున్నవిగాని, యవియు భవిష్య దర్థస్ఫోరకములుగనే కన్పట్టుచున్నవి. (నన్నయభారతము 857 – 859). భూతకాల విషయమున మాత్రము భేదమేమియు గోచరింపదు. కాని యిట్టి రూపముల కంటెను, క్రియా జన్య విశేషణములపై సర్వనామములను జేర్చుట వలన కల్గిన భూతభవిష్యత్ వర్తమాన క్రియారూపములను నన్నయ బహుళముగ వాడినాడు. ఇట్టివి నన్నయకు పూర్వశాసనములలో గూడనున్నవి – ఱిచ్చినవాన్ఱు (ఇందకూరుశాస), రక్షించిన వానికి (నలజానంపాడు శాస). ఇట్టి ప్రయోగములలో భూతకాల క్రియా జన్య విశేషకమైన ‘ఇన’ ప్రత్యయము కన్పట్టుచున్నది. ఇట్లే నన్నయభారతమున ‘వచ్చినవాడవు’ ఇత్యాది ప్రయోగములలో గూడ ‘ఇన’ యనునదే క్రియాజన్యవిశేషక రూపముగా కన్పట్టుచున్నది. అందువలననే కర్త, కర్మ, క్రియల యందు ‘ఇన’ యనునది భూతార్థమును తెలుపునని చెప్పి ‘పండినవాడు, పొడిచినవాడు’ అనువాని నుదాహరించినాడు కేతన (ఆం.భా.భూ-179).”

ఇక్కడ కూడా మనకు మరొక సమస్య ఉంది. కాల బోధకంగా “చున్న” అని తీసుకోవాలా “ఉన్న” అని తీసుకోవాలా అన్నది. గ్రాంథిక భాషలో శత్రర్థకంగా చెప్పే చువర్ణం ఆధునిక భాషలో ‘తు’ వర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసమాపక క్రియల్లో వీటిని ముందుగా చూడాల్సి ఉంది.

    గ్రాంథికం              వ్యవహారం
    అడుగుచు             అడుగుతూ
    వచ్చుచు               వస్తూ
    పిలుచుచు             పిలుస్తూ

తెలుగులో అసమాపకక్రియ రూపొందే ప్రక్రియలో భిన్న ప్రాతిపదికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ‘వచ్చు’ అనే ధాతువుకు విధ్యర్థకంలో రా, రండి అనే రూపాలు వస్తాయి. వ్యతిరేక రూపాలు, భావార్థక రూపాలు మొదలైనవి దీనిపై వచ్చి చేరుతాయి. రాను, రాలేను, రావడం మొదలైనవి. అందువల్ల ‘ధాతువు’కు ప్రధానరూపంగా చెప్పుకునే రూపమే అన్ని సంయోజనాల్లోనూ, నిష్పన్నాలలోనూ ఉంటుందని సాధారణంగా భావిస్తాం. కానీ తెలుగు క్రియా నిర్మాణంలో ఏకరూపత లేదని దీనివల్ల తెలుస్తుంది.

ఏమైనప్పటికీ కేతన తానే చెప్పిన వర్తమాన కాలబోధక ప్రత్యయం ‘ఉన్న’ లేకుండానే ఇచ్చిన ఉదాహరణలు కింది పట్టికలో చూడవచ్చు.

              ఏక              బహు
ప్రథమ     అడిగెడును             అడిగెదరు
మధ్యమ  అడిగెదు/అడిగెదవు        అడిగెదరు
ఉత్తమ    అడిగెదను              అడిగెదము

కేతన ఇచ్చిన ఈ రూపాలను తర్వాత కాలంలో వివిధ అర్థాలలో కవులు వాడినట్లు కనిపిస్తుంది. కావ్య ప్రయోగాలను, వాటి సందర్భాలను తీసుకుని వివరంగా పరిశీలిస్తే తప్ప దీనిని గురించి ఇదమిత్థంగా తేల్చి చెప్పటం వీలుపడదని భావించవచ్చు.

భవిష్యత్కాలం

క.
ఉను దురు లొరులకుఁ జెప్పను
దనరఁగ దువు దురు లెదిరికిఁదనకు దును దుముల్
దనరఁగ నివి యేక బహువ
చనము లగు భవిష్యదర్థసంసూచకముల్. 144

ఉను దురులు = ఉను, దురు అనే ప్రత్యయాలు; ఒరులకున్ = ఇతరులకు; చెప్పను = చెప్పేటప్పుడు; తనరఁగ = స్పష్టంగా; దువు, దురులు = దువు, దురు అనే ప్రత్యయాలు; ఎదిరికి = ఎదుటి (వినే) వ్యక్తికీ; తనకు = మాట్లాడే వ్యక్తికి (వక్తకు); దును, దుముల్ = దును, దుము అనే ప్రత్యయాలు; తనరఁగన్ = చక్కగా; ఇవి =ఇవన్నీ; ఏకబహువచనములు= ఏక బహువచనాలు; అగు = అవుతాయి; భవిష్యత్ అర్థ భవిష్యత్కాలం అర్థంలో; సంసూచకముల్ = తెలియ జెప్పే గుర్తులు.

“ప్రథమ పురుషలో ఉను, దురు లనేవి, మధ్యమ పురుషలో దువు, దురు లనే ప్రత్యయాలూ, ఉత్తమ పురుషలో దును, దుము అనేవి ఏక, బహు వచనాల్లో భవిష్యత్కాలాన్ని తెలియజేస్తాయి”.

ఈ పద్యంలో కేతన చెప్పిన ప్రత్యయాలను ఈ కింది విధంగా పట్టికలో చూపించవచ్చు. అయితే పైనే చెప్పుకొన్నట్లు ఇవి నిజంగా భవిష్యత్కాల బోధకాలా అనే విషయంపై అభిప్రాయభేదాలున్నాయి.

                ఏక               బహు
• ప్రథమ     -ఉను            -దురు
మధ్యమ    -దువు           -దురు
ఉత్తమ      - దుము       - దును
క.
పలుకును బలుకుదు రనఁగాఁ
బలుకుదువు పలుకుదు రనఁగఁ బలుకుదు నర్థిన్
బలుకుదు మనఁగా నిన్నియు
నలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్. 145

పలుకును = పలుకుతాడు /పలుకుతుంది, పలుకుదురు = పలుకుతారు; అనఁగాన్ = అనే విధంగా; పలుకుదువు = పలుకుతావు; పలుకుదురు = పలుకుతారు; అనఁగన్ = అనే విధంగా; పలుకుదున్ = పలుకుతాను; అర్థిన్ కోరుతూ; పలుకుదుము = పలుకుతాము; అనఁగాన్ = అనే విధంగా; ఇన్నియున్ ఇవన్ని; అలఘుమతీ = గొప్ప మనస్సు గలవాడా; వరుసతోన్ = క్రమంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“భవిష్యత్కాలానికి సంబంధించి పలుకును, పలుకుదురు (ప్రథమ) అనీ, పలుకుదువు, పలుకుదురు (మధ్యమ) అనీ, పలుకుదును, పలుకుదుము (ఉత్తమ) అనీ వరుసగా ఏక, బహువచనాల్లో ఉదాహరణలు”.

ఇది కూడా ‘భవిష్యత్కాలానికి’ మాత్రమే చెందింది కాదనే వాదం ఉందని ముందే చెప్పుకున్నాం. దేవినేని సూరయ్య కూడా మళ్ళీ ఒకసారి “పై రూపములను భవిష్యదర్థమున, గేతన యిచ్చినాడు గాని యివియు దద్ధర్మార్థకములే యగు. భవిష్య దర్థమున నీ దిగువ రూపములు సరియగును”. (పు.112) అంటూ ఈ కింది విధంగా రూపాలు ‘కల’ ప్రత్యయంతో ఇచ్చాడు:

               ఏక             బహు
ప్ర           పలుకగలడు    పలుకగలరు
మ          పలుకగలవు     పలుకగలరు
ఉ          పలుకగలను     పలుకగలము

(పై పట్టికలో పలుకగలడు అని పుంలింగం ఇచ్చి, పలుకగలదు అని పుంలింగేతర పదం ఇవ్వలేదు)

కానీ ఈ ‘కల/గల’ ప్రత్యయం కూడా భవిష్యదర్థంలో కన్నా గూడా “సామర్థార్థం”లోనే ఎక్కువగా వాడటం ఉంది. పైన అర్థవివరణలో ఇచ్చిన ఆధునిక రూపాలకు కూడా కేవల భవిష్యదర్థం లేదు. పట్టిక రూపంలో ఈ ఆధునిక రూపాలను మళ్ళీ ఒకసారి చూద్దాం

          ఏక                బహు
ప్ర  పలుకుతాడు/పలుకుతుంది    పలుకుతారు
మ   పలుకుతావు             పలుకుతారు
ఉ   పలుకుతాను             పలుకుతాము

వీటిని కూడా ప్రయోగాలను బట్టి భవిష్యత్, తద్ధర్మ రూపాలలో ఒకటిగా గ్రహించాల్సి ఉంటుందే తప్ప ఇవి కూడా భవిష్యత్ కాల రూపాలు అని చెప్పడానికి లేదు.

ఉదా: రేపు చెప్తాడు (భవిష్యత్)
ఎప్పుడూ అదే చెప్తాడు (తద్ధర్మ)
ఇప్పుడే చెప్తాడు (వర్తమానం)

పై క్రియా రూపాల చర్చ సారాంశం ఏమంటే తెలుగు క్రియారూపాలగురించీ, ముఖ్యంగా ‘కాలబోధక’ ప్రత్యయాల గురించీ ఇంకా విస్తృత పరిశోధన జరగాల్సి ఉంది అని!

మనుష్య, మనుష్యేతర వచనాల్లో క్రియ

క.
స్థావర తిర్యక్ప్రతతుల
కేవెరవునఁ గ్రియలు పొందు నేకవచనమున్
దేవ మనుష్యాది క్రియ
భావింపఁగ నేకవచన బహువచనంబుల్. 146

స్థావర = కదలని వాటిని తిర్యక్ ప్రతతులకు = జంతు, పక్షి సముదాయాలకు; ఏ వెరవునన్ = ఏవిధంగానైనా; క్రియలు పొందున్ క్రియారూపాలు వస్తాయి; ఏకవచనమున్ = ఏక వచనంలో; దేవ మనుష్య +ఆది = దేవతలు, మానవులు మొదలైన వారి విషయంలో; క్రియ క్రియా రూపం; భావింపఁగన్ = ఆలోచిస్తే; ఏక వచన బహు వచనంబుల్ = ఏక, బహు వచనాలు రెండూ ఉంటాయి.

“దేవతలు, మనుష్యులు మొదలైన వారికి క్రియారూపాలు ఏక బహువచనాలు రెండిట్లో వస్తాయి, కానీ మను ష్యేతరమైన స్థావర తిర్యక్కులలో అంటే కదలనివైన చెట్లు, కొండలు మొదలైన వాటికీ, పశుపక్ష్యాదులకూ ఏకవచనంలోనే క్రియలు వస్తాయి”.

తెలుగుభాష క్రియా పరిణామం చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఇంతకుముందే గుర్తించాం. కావ్య భాష లేదా గ్రాంథిక భాషగా చెప్పే ప్రాచీన తెలుగు క్రియానిర్మాణానికి, ఆధునిక తెలుగు క్రియా నిర్మాణానికీ పరిణామక్రమంలో కొన్ని మౌలికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు తెలుసుకునేముందు మనం గుర్తించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. అది మొట్టమొదటి తెలుగు వ్యాకరణం తెలుగులో రాసిన కేతన క్రియ గురించి వివరిస్తున్నానంటూ ఒక వాక్య నిర్మాణ సూత్రాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు; అది కూడా ఎంతో తక్కువ మాటల్లో ఎంతో స్పష్టంగా. దీనికి మనం కేతన నిశిత దృష్టిని అభినందించక తప్పదు. దీనిని ‘నామ క్రియా సమ్మతి సూత్రం’ అంటే Noun-Verb Agreement Rule అని భాషాశాస్త్రంలో అంటారు. అంటే మామూలుగా భాషల్లో నామం ఏకవచనంలో ఉంటే క్రియా రూపం కూడా ఏక వచనంలోనూ; నామం బహు వచనంలో ఉంటే క్రియ కూడా బహు వచనంలోనూ ఉంటుంది. కానీ ప్రాచీన తెలుగులో నామం ఏకవచనంలో ఉన్నా, బహువచనంలో ఉన్నా, ఆ నామం గనక స్థావర, తిర్యక్కులకు అంటే దేవ మనుష్యేతర మైనదైతే క్రియారూపం రెంటికీ ఒక్క విధంగానే ఉంటుంది; అదే దేవ, మనుష్య నామాలకు ఏకవచనంలో క్రియ ఏకవచనంలోను నామం బహువచనంలో ఉంటే బహువచనంలోనూ ఉంటుంది.

(దేవినేని సూరయ్య దీనికింద “ ‘ఆది’ (దేవమనుష్య +ఆది) శబ్దముచే యక్ష రాక్షసాది శబ్దములు గ్రాహ్యములు” అని మాత్రమే వివరణ ఇచ్చాడు).

పై సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే కేతన ఇచ్చిన ఉదాహరణలను పరిశీలించాలి. (చూ. కింది పద్యం).

క.
శిల గదలె శిలలు గదలెను
బులి గటిచెం బులులు గటిచె బోటి చనియె బో
టులు చనిరి ముని యలరె మును
లలరిరి నా వరుసతో నుదాహరణంబుల్. 147

శిల + కదిలె = రాయి కదిలింది; శిలలు – కదిలెను = రాళ్ళు కదిలాయి; పులి + కటిచెన్ = పులి కరిచింది; పులులు + కటిచె = పులులు కరిచాయి; బోటి చనియె = వెళ్ళింది; బోటులు చనిరి = స్త్రీలు వెళ్ళారు; ముని – అలరె = ముని ఉన్నాడు; మునులు – అలరిరి = మునులు ఉన్నారు; నా = అ విధంగా; వరుసతోన్ = క్రమంగా, వరుసగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“శిలకదలె, శిలలు కదలెను; పులికటిచె, పులులు కటిచె; బోటి చనియె, బోటులు చనిరి; మునియలరె, మునులు అలరిరి అనేవి వరుసగా ఉదాహరణలు”.

పైన చెప్పిన సూత్రంలో కేతన మూడు విధాలుగా నామాలను వర్గీకరించాడు. ఒకటి స్థావరాలు అంటే కదలని వస్తువులు (చెట్లు, రాళ్ళు మొదలైనవి); రెండు తిర్యక్కులు అంటే పశుపక్ష్యాదులు (వాటిని అడ్డంగా నడిచేవి అని అన్నాడు దేవినేని సూరయ్య); మూడు దేవమనుష్యాదులు – అంటే మనుషులతోపాటు దేవతలు మొదలైన వారు (అందువల్లనే సూరయ్య యక్షులు, రాక్షసులు మొదలైనవారు అన్నాడు; కావ్యాలలో వచ్చే యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, అసుర ఇలా ఎన్నైనా చేర్చవచ్చు ఈ ‘ఆది’ అంటే మొదలైన అనేచోట). ఆవిధంగా;

1) స్థావర (కదలనివి):  శిల కదిలె (ఏక)
                 శిలలు కదిలె (బహు)

శిల - శిలలు రెంటికీ 'కదిలె' అనేదే క్రియ.


2) తిర్యక్కులు: పులి కటిచెన్ (ఏక)
           పులులు కటిచె (బహు)

3) మనుష్య (మొ॥) : బోటి చనియె (ఏక)
                 బోటులు చనిరి (బహు)

                  ముని అలరె (ఏక)
                  మునులు అలరిరి (బహు)


చనియె చనిరి; అలరె - అలరిరి అని ఏక బహు వచన భేదాలు కనిపిస్తాయి.

అయితే ఆధునిక తెలుగులో ప్రథమ పురుష క్రియా రూపాల్లో రెండు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి తెలుగులో ఏక వచనంలో ‘పురుష-పురుషేతర’ అనే భేదం క్రియల్లో కనిపిస్తుంది. అంటే పురుష ప్రత్యయం డు కాగా, స్త్రీ, మనుష్యేతరాలకు – ది ప్రత్యయం వస్తుంది. కానీ బహు వచనరూపాల్లో ఈ భేదం మారిపోయి మనుష్య – మనుష్యేతరగా మారుతుంది. ఈ విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే కేతన ఇచ్చిన ఉదాహరణలను ఆధునిక తెలుగులో రాయాలంటే ఈ కింది విధంగా ఉంటాయి;

            ఏక          బహు
     శిల కదిలింది        శిలలు కదిలాయి
     మునిఉన్నాడు      మునులు ఉన్నారు
     పులి కరిచింది       పులులు కరిచాయి
      స్త్రీ వెళ్ళింది           స్త్రీలు వెళ్ళారు

ఈ భేదం తెలుగులో ఎప్పుడు ఎలా ప్రారంభమయిందో పరిశోధించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తించాలి. క్రియారూప భేదాలు గ్రాంథిక, వ్యవహారాల్లో మొదటి నుంచీ ఉన్నాయేమో అన్న విషయం. దీనిని ఇంకా వివరంగా పరిశోధించాల్సి ఉంది. ఆధునికమాండలికాలలో కూడా క్రియారూప భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి.

5.2.1. భావార్థకం

క.
ఉటపరపదములె క్రియ లగు
చుటలొక్కెడ యుటలు వుటలు చుట్టంబులఁద్రో
వుట ద్రోయుట యన చుటలున్
బుటలును నగు సంస్కృతంబు పొందినచోటన్. 148

ఉట పరపదములు + ఎ = ఉట అనే ప్రత్యయానికి ముందు ఉన్న మాటలే; క్రియలు + అగు = క్రియలు అవుతాయి; చుటలు = చుట ప్రత్యయాలు; ఒక్కెడ = కొన్ని చోట్ల; యుటలు = యుట ప్రత్యయం (కొన్నిసార్లు); పుటలు = పుట ప్రత్యయం (మరికొన్ని సార్లు); చుట్టంబులన్ = బంధువులను; త్రోవుట/త్రోయుటయన = త్రోవుట లేదా త్రోయుట అనే విధంగా; చుటలున్, పుటలునున్ = చుట, పుటలు; అగు = వస్తాయి; సంస్కృతంబు = సంస్కృత పదాలు; పొందినచోటన్ = వచ్చి చేరిన సందర్భాలలో.

“ఉట అనే దానికి ముందున్న పదాలే క్రియలవుతాయి. కొన్నిసార్లు చుట అనే ప్రత్యయం కానీ యుట అని గానీ వుట అని గానీ త్రోవుట, లేదా త్రోయుట అనే విధంగా వస్తాయి. చుటలు, పుటలు సంస్కృత పదాలు వచ్చి చేరిన చోట కనిపిస్తాయి”.

క్రియారూపాలకు ఏదైనా ప్రత్యయం చేర్చడం వల్ల భావార్థకం నిష్పన్నమవుతోంది. అప్పుడు ఆ నిష్పన్న రూపానికి ముందున్నది ‘క్రియారూపమే’ నని కేతన చెప్తూ, ఈ ఉట ప్రత్యయం క్రియకు చేరడమే కాక అది కొన్నిసార్లు చుట అనీ, ఒక్కొక్కసారి యుట లేదా పుట అనే విధంగా వాడటం జరుగుతుందనీ, కానీ సంస్కృత పదాలకు మాత్రం చుట లేదా పుట అనే ప్రత్యయాలే వస్తాయని చెప్పాడు.

ఇది క్రియ నుండి భావార్థకం అయిన రూపం నిష్పన్నమయ్యే (Derivational) ప్రక్రియ. ఈ క్రియలకు కొన్ని ప్రత్యయాలు చేర్చడం ద్వారా వివిధ రూపాలైన ఇతర పదాలను రూపొందించవచ్చు. వాటిని తర్వాత వ్యాకర్తలు వేర్వేరుగా సంకేతించారు. సాధారణంగా ‘ఉట’ అనే ప్రత్యయరూపం చేర్చక/చేరక ముందు క్రియారూపమే ఉందనీ, తెలుగులో చుట, యుట, పుట ప్రత్యయాలుగా అది కొన్నిచోట్ల కనిపిస్తే, సంస్కృత పదాలు వాడే చోట చుట, పుట మాత్రమే వస్తాయనీ వర్ణించాడు కేతన. అంటే ఈ సూత్రంలో కూడా సంస్కృత, సంస్కృతేతర అని తెలుగు క్రియలను రెండుగా వర్గీకరించి, వాటికి చేర్చే ప్రత్యయ రూప భేదాలన్నింటినీ చూపించాడు కేతన. ఇంకో రకంగా చెప్పాలంటే కేతన చూసిన భేదాలన్నీ ‘ఉట’ ప్రత్యయాలేననీ, ఉట చేరినప్పుడు తెలుగు క్రియలలో ఒక్కొక్కసారి ‘చు’ కానీ, ‘యు’ కానీ ‘వు’ కానీ అదనంగా (Addition) చేరుతాయనీ, అలాగే సంస్కృత క్రియలకు ‘చు’, లేదా ‘పు’ ఆదేశంగా వచ్చి చేరుతాయనీ సాధారణీకరించవచ్చు. అయితే ఏవి ఎక్కడ ఎందుకు ఏ విధంగా వస్తాయో వివరించాల్సిన అవసరం ఉంటుంది.

కేతన ‘ఉట’ అన్న దానిని చిన్నయసూరి ‘ట’ ప్రత్యయంగా పేర్కొని ‘టవర్ణకంబు భావార్థంబునందగు’ అని సూత్రీకరించాడు. (క్రియ -35)

తెలుగు ఉదాహరణలు : త్రోయుట/త్రోవుట, చంపుట
తత్సమ క్రియారూపాలకు ‘ఇంచు’ తర్వాతే ‘ట’ చేరుతుంది.
సంస్కృత ఉదాహరణలు : భుజించుట,

సంస్కృత/ తత్సమ పదాలపై వచ్చే ‘ఇంచు’ కూ, తెలుగు మాటలపై చేరే ‘ఇంచుకూ అర్థంలోనూ వాక్య నిర్మాణ రీత్యా తేడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు భుజించు, శిక్షించు, రక్షించు మొదలైన వాటికీ, ‘చంపించు, రాయించు’ వంటి వాటికీ అర్థంలోనూ, ప్రయోగంలోనూ కనిపించే తేడాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ‘చుట’ ప్రత్యయం భావార్థంలో కన్నా ప్రేరణార్థంలో ఎక్కువగా చేరుతుంది. దీనిని కింద పద్యంలో వివరించాడు. హరి శివకుమార్ “నన్నయ అగుటయున్ (ఆది 2-154) చెప్పుటయున్ (ఆది 1-33) వంటి వానిని ప్రయోగించినాడు” (పు. 139) అని ఉదాహరణలిచ్చాడు.

ప్రేరణార్థకాలు

క.
పుటచేతనైన నొరుఁబం
పుట చుటచే నైన నొరులఁ బుత్తెంచుట చే
యుట యుటచే నగు ననియా
పటుమతి యగు నూత్నదండి ప్రకటముచేసెన్. 149

పుట చేతన్ అయిన = ‘పుట’ అనే ప్రత్యయం వాడటం వల్ల కానీ; ఒరున్ = ఇతరులను; పంపుట = పంపడం (వెళ్ళమని చెప్పడం); చుటచేన్ ఐనన్ = చుట ప్రత్యయం వల్ల అయినా; ఒరులన్ = ఇతరులను (మరొకరిని); పుత్తెంచుట = పంపించడం, చేయుట= చేయడం (అనే రూపం); యుట చేన్ = యుట అనే ప్రత్యయం చేరడం వల్ల; అగున్ అని= అవుతుందని; ఆ పటుమతి + అగు = ఆ గట్టి మనస్సు గలవాడైన; నూత్న దండి = నూతన (అభినవ) దండి అనే బిరుదుగల కేతన; ప్రకటము చేసెన్ = ప్రకటించాడు (తెలియజేసాడు).

”పుట’ అనే ప్రత్యయం ‘పంపుట’ వంటి వాటికీ, ‘చుట’ అనే ప్రత్యయం ‘పుత్తెంచుట’ వంటి క్రియలకూ, ‘యుట’ అనే ప్రత్యయం ‘చేయుట’ వంటి క్రియలకూ చేరుతాయి”.

ఈ పద్యం ఇప్పటివరకూ కేతన చెప్పిన విధానానికి భిన్నమైనది, విలక్షణమైనది. ఇక్కడ ప్రత్యయం దాని పక్కనే ఒక ఉదాహరణ ఇస్తూ తెలుగు క్రియలలో మూడు రకాల ప్రత్యయాలు ‘పుట, చుట, యుట’ అనేవి వచ్చి చేరుతాయనీ, అవి వరుసగా ‘పుట’ అంటే ‘పంపుట’ వంటి క్రియలలో చేరేదనీ, ‘చుట’ ప్రత్యయం పుత్తెంచుట వంటి వాటికీ, ‘యుట’ ప్రత్యయం చేయుట వంటిక్రియలకూ వచ్చి చేరుతాయని ఇస్తూ, ఒకే పద్యంలో ప్రత్యయభేదం, దాని ఉదాహరణ పక్కపక్కనే ఇచ్చాడు. అలాగే తన పద్ధతిలోనే ఉదాహరణకు ముందు వాక్య పూరకంగా, అర్థస్ఫోరకంగా ఉండేలా ‘ఒరులన్’ అని చేర్చాడు. అంటే ‘పంపడం’ అనే క్రియతో ‘ఇతరులను’ అనే పదం చేర్చడం వల్ల కర్త (ఎవరు అనే విషయం) అవసరం లేకుండానే వాక్యార్థస్ఫూర్తి కలుగుతుంది. అలాగే ‘చుట’ అనే ప్రత్యయానికి ‘పుత్తెంచుట’ అనే ఉదాహరణ చూపుతూ దీనికి కూడా ‘ఇతరులను (ఒక పనిమీద) పంపించటం’ అనే వాక్యార్థాన్నిచ్చేలా ‘ఒరులన్ పుత్తెంచుట’ అని ఉదాహరణనిస్తూ, ‘చుట’ ఇలాంటి వాటికి చేరుతుందని వివరించాడు. అలాగే ‘యుట’ అనే ప్రత్యయంతో ‘చేయుట’ ఏర్పడుతుందని కూడా ఈ క్రమంలోనే చేర్చాడు.

ఈ పద్యం రెండు మూడు విధాలుగా ప్రత్యేకతను కలిగి ఉందనిపిస్తుంది. ఇంతకు పూర్వం కేతన సూత్రాన్ని, ఉదాహరణలను విడివిడిగా చూపించాడు. విడివిడిగా అంటే విడివిడి పద్యాలలో కానీ, ఒకే పద్యంలో మొదటిభాగం ‘సూత్రం రెండో భాగంలో ఉదాహరణ ఇవ్వడం అనే విధంగా కానీ అని అర్థం. కానీ ఈ పద్యంలో దానికి భిన్నంగా ప్రత్యయం వెంటనే ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మూడూ భాషా సాధారణ (సామాన్య) సూత్రాలు కావు. ఇవి అపవాదాలు (exceptions), అంటే తిను, కొను, అమ్ము, మాట్లాడు, పలుకు వంటి అనేక క్రియలకు ఈ ప్రత్యయాలు చేరవు. ప్రేరణార్థంలో (కావ్య భాషలో) వచ్చి చేరే ‘చుట’ గురించి దీని కింది పద్యంలో వివరణ ఉంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. అసలు ప్రత్యయం ఏమిటి? అన్నది. ఎందుకంటే ఈ మూడింటిలోనూ (-ట) అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు (-ట)ని సాధారణ ప్రత్యయంగా తీసుకుంటే, అన్ని తెలుగు క్రియా రూపాలూ తినుట, కొనుట, అమ్ముట, మాట్లాడుట కూడా సాధించవచ్చు; అలాగే పంపుటలో- పుటను, పుత్తెంచుటలో-చుటను, చేయుటలో – యుటను విడదీస్తే మనకు మిగిలేవి పం-; పుత్తెం; చే- మాత్రమే. అయితే ఇవి క్రియా రూపాలుగా గ్రహించలేం. అందువల్ల కేతన చెప్పిన ఈ సూత్రం వ్యాకరణ రీత్యానూ, భాషా శాస్త్రరీత్యానూ సమ్మతమైందిగా అనిపించదు. మరో విషయం చిన్నయసూరి బాలవ్యాకరణంలో వీటిని ఈ విధమైన ప్రత్యయాలుగా గ్రహించలేదు, సూచించలేదు అన్న సంగతి. అయితే 151 పద్యం (కింద)లో కేతన ఇచ్చిన ఉదాహరణలు చూస్తే ఆయన -ట ప్రత్యయాన్నే సామాన్య ప్రత్యయంగా గుర్తించినట్లు తెలుస్తుంది.

క.
పలుకుట పలికించుటయును
నలుగుట యలిగించుటయును నబలలు మదిలో
వలచుట వలపించుటయును
తలఁచుట తలపించుటయు నుదాహరణంబుల్. 150

అబలలు =పలుకుట, పలికించుట యును = మాట్లాడటం, మాట్లాడించటం; అలుగుట, అలిగించుట యును = అలక (కోపం) చెందటం లేదా మరొకర్ని అలిగేలా చేయడం, = స్త్రీలు; మదిలో = మనస్సులో; వలచుట, వలపించుటయును = ఇష్టపడటం, ఇష్టపడేలా చేసుకోవడం; తలచుట, తలపించుట = అనుకోవడం, అనుకునేలా చేయడం; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“పలుకుట, పలికించుట; అలుగుట, అలిగించుట; వలచుట, వలపించుట; తలచుట, తలపించుట అనేవి ఉదాహరణలు”.

150వ పద్యానికి, 151వ పద్యానికి మధ్య అనుసంధానంగా ఉండాల్సిన అంశాలు లోపించినట్లు దీని ద్వారా అనుమానం కలుగుతోంది. కానీ 148 పద్య సూత్రం లోని ఉట కూడా తీసుకుంటే మొత్తం సరిగ్గానే ఉన్నట్లు గమనించ వచ్చు. కేతన తర్వాత కాలంలోని వ్యాకర్తలు -ట ప్రత్యయాన్ని భావార్థక ప్రత్యయం అనీ, ప్రేరణాత్మక ప్రత్యయం (-ఇంచు) అనీ పేర్కొన్నారు. వారి ప్రకారం సకర్మక, ప్రేరణ క్రియల ప్రత్యయాలు ధాతువులకు అంటే క్రియాప్రాతిపదికలకు (verb roots or stems) చేరే ప్రక్రియ ఈ కింది విధంగా ఉంటుంది.

     ధాతువు          సకర్మక            ప్రేరణ
     పలుకు           పలుకుట     పలికించుట
     అలుగు          అలుగుట     అలిగించుట
     వలచు/వలపు  వలచుట     వలపించుట
      తలచు          తలచుట     తలపించుట

(కేతన ఇచ్చిన (ప్రత్యయం) (-ఉట); (ఇతరులు – ట))
(కేతన : (చుట); ఇతరులు (ఇంచు))

కేతన ప్రకారం తీసుకుంటే ఆయన -ట ప్రత్యయాన్ని సకర్మక క్రియ భావార్థకంగా చెప్పకుండా – ఉటను తీసుకొని ఉదాహరిస్తూ వాటికి ప్రేరణార్థక ప్రత్యామ్నాయాలుగా -చుట రూపాలుగా పలికించుట, అలిగించుట, వలపించుట, తలపించుట ఉదాహరణలుగా ఇచ్చాడు. అయితే ధాతురూపానికీ, -చుట ప్రత్యయానికీ మధ్యన కనిపించే ‘-ఇన్’ ఏమిటో దానిని ఎలా అర్థం చేసుకోవాలో వివరించలేదు కేతన. అందువల్లనే చిన్నయసూరి ‘-ఇంచు’ ప్రత్యయాన్ని ప్రేరణార్థకంగా పేర్కొన్నాడు.

ఈ ప్రత్యయాలు చేరినప్పుడు జరిగే అర్థ సంబంధమైన మార్పుల్ని ఆధునిక భాషా శాస్త్రవేత్తలే తెలిపారు. ‘తలపించు’ అనే క్రియారూపానికి ‘తలచు’ అనే క్రియారూపానికీ అర్థంలో సామ్యం లేకపోగా ఎంతో భేదం ఉందని అంగీకరించక తప్పదు. పైన చర్చించిన విషయాల గురించి దేవినేని సూరయ్య ఏమీ చెప్పలేదు. కేవలం “వివరణ: పుటకు ఉదాహరణము పంపుట; చుటకు – పుత్తెంచుట, యుటకు – చేయుట మొ||” (పు. 114) అని మాత్రమే వివరించాడు.

హరిశివకుమార్ ఈ విషయాన్ని అసమాపక క్రియలు అనే శీర్షిక కింద చర్చిస్తూ “(1) ‘ఉట’ అనునది అంతమందు గల పదములు క్రియలగును (ఆం.భా. భూ-148) అని చెప్పాడు. కానీ 148 వ పద్యంలో ఈ అర్థం కనిపించదు. తర్వాత చిన్నయసూరి కూడా “ట వర్ణంబు భావంబునందగు భావం బనగా ధాత్వర్థంబు” అని చెప్పి ‘ట’ వర్ణాంత ధాతువులను చెప్పినాడు (పు. 139). అలాగే “(2) ప్రేరణంబున ‘చుట’ అనునది క్రియల చివర చేరును (ఆ.భా. భూ. 149)” అని చెప్తూ శివకుమార్ శాసనాలలోని నన్నయలోని ప్రయోగాలు ఉదాహరించాడు. కానీ ఉట-టల భేదాల గురించి గానీ, చుట, ఇంచుట భేదాల గురించి కానీ ఏమీ చెప్పలేదు. వీటి గురించి కూడా విస్తృత పరిశోధన జరగాల్సి ఉంది.

క.
అసమస్త లఘుద్వ్యక్షర
లసితము లగు తత్సమంబులం జెప్పెడిచో
పొసఁగు నియించుటయున్ గ్రియ
లసదృశ యించుటయె క్రియల నగు పెఱయెడలన్. 151

అసమస్త= కొన్ని; లఘు =హ్రస్వ; ద్వి+అక్షర (=ద్వ్యక్షర) రెండక్షరాల; లసితములగు= ఉండేటటువంటి (అంటే రెండు లఘు అక్షరాలతో కూడిన); తత్సమంబులన్ తత్సమ పదాల గురించి; చెప్పెడి చో = చెప్పేచోట; పొసగున్ = ఒప్పుతుంది; సరిపోతుంది; ఇయించుటయున్ = ‘ఇయించు’ అనే ప్రత్యయం కూడా; క్రియల = క్రియలందు; అసదృశ = సాటిలేని వాడా! యించుటయె = ‘ఇంచుట’ మాత్రమే; క్రియలన్ + అగు = క్రియలలో చేరుతుంది; పెఱయెడలన్ = ఇతరచోట్లలో. “కొన్ని తత్సమ పద క్రియారూపాలలో రెండు హ్రస్వాక్షరాలు ఉన్నప్పుడు ‘ఇయించుట’ అనే ప్రత్యయం చేరుతోంది, మిగిలిన అన్నిచోట్ల ‘ఇంచుట’ ప్రత్యయమే క్రియారూపాలలో చేరుతుంది”.

ఈ పద్యంలోని సూత్రం ద్వారా కేతన ‘ఇంచుట’ ప్రత్యయాన్ని సరిగ్గా చెప్పాడు. అన్ని క్రియలకూ ‘ఇంచుట’ ప్రత్యయమే వచ్చి చేరుతుందనీ, కేవలం రెండు హ్రస్వాక్షరాలు (లఘు అక్షరాలు (హ్రస్వ = భాషా ధ్వనిలో వాడేది; లఘు = ఛందస్సులో వాడేది) ఉన్న తత్సమ క్రియలపై మాత్రమే ‘ఇయించుట’, అనే ప్రత్యయం వస్తుందని చెప్పడం ద్వారా కేతన ‘చుట’ అన్నప్పుడు ‘ఇన్’ ప్రస్తావన చేయని విషయాన్ని గుర్తించినట్లు భావించాలి. లేదా 150, 151 పద్యాలలో చెప్పిన వాటిని అపవాదాలుగానూ 152లో చెప్పిన సూత్రాన్ని సామాన్య సూత్రంగానూ పరిగణించడం సరియైన విధంగా కేతనను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని అనుకోవాలి. అప్పుడు ఈ ప్రత్యయానికి సంబంధించిన అన్ని సపదాంశాలనూ (allomorphs) కేతన “వర్ణనాత్మక భాషా శాస్త్ర పద్ధతి”లో వర్ణించాడని గుర్తించక తప్పదు.

దేవినేని సూరయ్య; “దీర్ఘాక్షరములు కాని కొన్ని ధాతువులకు ‘ఇంచు’ పరంబగునప్పుడు ‘ఇయ’ అనునది వికల్పముగా పూర్వభాగమున వచ్చుననియు, దీర్ఘాక్షరములగు ధాతువుల మీదనున్న ఇంచు అనుదానికి పూర్వమున ‘ఇయ’ అనునది రాదని యెఱుగ వలయు” (పు. 115) అని చెప్పాడు.

హరి శివకుమార్ “ఈ ‘ఇంచు’గాగమమునకు బదులు కొన్నిచోట్ల ‘ఇయుంచుట’ (ఇయుడాగమము) అనునదియు వచ్చును; (వరించుట- వరియించుట ఆం. భా. భూ. 150). కేతన దానిని సంస్కృత ధాతువుల పైన విధించగా, సూరి దీనిని ‘నగించు’ వంటి తెలుగు ధాతువులపైన కూడా విధించినాడు (బాల. క్రియా. 50). నన్నయలో తెనుగు ధాతువులమీద ఇయుడాగమము కన్పట్టదు. కేతన చూపిన యుదాహరణములు కూడా సంస్కృత ధాతువుల పైన కలిగినవే యగుట గమనార్హము” (139). అని చెప్పి, కేతన చాలా జాగ్రత్తగా నన్నయ ప్రయోగాల ఆధారంగా తన వ్యాకరణాన్ని రూపొందించినట్లు స్పష్టం చేసాడు.

క.
వరియించుటయు వరించుట
తిరముగ నుతియించుటయు నుతించుట బలిమిన్
బరు భంజించుటయును సం
హరించుటయు వరుసతో నుదాహరణంబుల్. 152

వరియించుటయు వరించుట = ఇయించుతో వరియించుట (వర అనే రెండు హ్రస్వాక్షరాలు కలిగిన తత్సమ ధాతువుకు) అనీ; వరించుట = వరించుట అని ‘ఇంచుట’ తో కూడా; తిరముగ = స్థిరంగా; నుతియించుటయు = నుతి + ఇయించుట (నుతి = రెండు లఘు అక్షరాలు) = పొగుడుట; ప్రార్థించుట; నుతించుట = నుతి + ఇంచుట; బలిమిన్ = బలంతో (శక్తితో); పరు = ఇతరులన్; భంజించుటయును భంజ్ + ఇంచుట = విరుచుట; సంహరించుటయు = చంపడం; వరుసతో = క్రమంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“వరియించుట, వరించుట, నుతియించుట, నుతించుట, భంజించుట, సంహరించుట మొదలైనవి వరుసగా ఉదాహరణలు”. రెండులఘు అక్షరాలు కలిగిన తత్సమ ధాతువులకు ఉదాహరణగా వర, నుతి అనే రెండు అక్షరాల పదాలను తీసుకుని వాటికి రెండు ప్రత్యయరూపాలూ – ఇయించుట, ఇంచుట చేరడాన్ని ఉదాహరిస్తూ, భంజించుట, సంహరించుట అనే రెండు లఘు అక్షరాలు కాని వాటికి ఉదాహరణలుగా తీసుకుని ‘ఇంచుట’ మాత్రమే చేరడానికి ఉదాహరణగా ఇచ్చాడు.


అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...