నడిచిన పుస్తకం మా నాన్నగారు

ఒక తహతహ

‘నడిచిన పుస్తకం మా నాన్నగారు’ అన్నాను ఒకసారి. ‘చదవడం కాక ఇంకేవైనా చేసేవారా అన్పిస్తుంది’ అన్నాను ఒకసారి.

జీవితం అత్యంత విలువైనదా? సాహిత్యం జీవితంకన్నా విలువైనదా? దానిమీద నా వుద్దేశాలు చాలాసార్లు మారేయి. మారుతూనే వున్నాయి. ఒక ఫైనల్ వ్యూ లేదు. కానీ మా నాన్నగారు సాహిత్యాన్ని జీవితంకన్నా విలువైనదిగా భావించినట్లు తోస్తుంది. చదవడం వచ్చిందగ్గర్నుంచీ కడదాకా చదువుతూనే వున్నారు. జ్ఞానతృష్ణ తీరినకొద్దీ తీరదనీ పెరుగుతూనే వుంటుందనీ విన్నాను. పుస్తకాల తహతహ మా నాన్నగారికి జీవితపర్యంతమూ వున్నది. ప్రతీ మనిషికీ తన తండ్రి ఒక హీరో ఒక స్థితిలో. కానీ అలాగే వుండదు పరిస్థితి. ఒక దశలో (తండ్రి) అన్నీ అస్తవ్యస్తంగా చేస్తున్నట్టు అన్పిస్తుంది. ఒకానొక సమయంలో ఆయన ఎంత గొప్పవాడో, ఆయనెంత మహానుభావుడో, ఏది ఎందుకు చేసేడో, చెయ్యలేదో తెలిసే సమయానికి ఆయన పక్కన వుండడు. ఎంత విలువైనది తను కోల్పోయాడో తెలిసేసరికి తెల్లవారుతుంది.

‘నాన్నగారు లేకుండా నేనొక్కణ్ణి ముందుకు సాగడం’ అని మా నాన్నగారు రాసిన వాక్యాలు కళ్ళకి కనిపిస్తాయి.

తన హీరో చెయ్యలేని పనులుంటాయని ఎవరూ అనుకోరు. అది అసాధ్యమైన పని అనిపిస్తుంది. అక్కడే వుంది అసలు సమస్య. మా ఇంట్లో వున్న వేలాది పుస్తకాల్లో ఒక దాంట్లో నేను చదివేను. బహుశా అది ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కథ. అతడు చాలా బ్రిలియంట్. చదువులో, కెరీర్లో, అన్నిట్లో. కానీ అతడి కొడుకు చదువులో కష్టపడుతూ వుంటాడు. ఇతను తన కొడుక్కి చదువు నేర్పడానికి చాలా ప్రయత్నిస్తూ వుంటాడు. కానీ ఎందుకో ఆ కుర్రాడు నేర్చుకోలేకపోతాడు. చివరికి ఇతను ఆ అబ్బాయిని తన కొలీగయిన మరో సైకాలజిస్ట్ దగ్గరకి తీసుకువెళతాడు. ఆ సైకాలజిస్ట్ ఆ కుర్రాణ్ణి పరీక్షించి కుర్రాడిలో లోపమేదీ లేదంటాడు. కానీ, నిన్ను కూడా పరీక్షించాలి. లోపం నీలో వుందేమో అన్నట్టు అంటాడు ఆ తండ్రితో. అతడు చిరాకుపడతాడు. అతనికి కోపం వస్తుంది. అప్పుడు ఆ కొలీగ్ ఇలా అంటాడు, “నువ్వు చాలా బ్రిలియంట్. నీ కొడుకూ తెలివైనవాడే. కానీ నీ లెవెల్లో కాదు. కానీ నువ్వు అతగాణ్ణి నీలాగే భావించి పుష్ చేస్తున్నావు. అందువలనే ఆ అబ్బాయి కన్‌ఫ్యూజ్ అయి ప్రాబ్లమ్స్‌లో పడుతున్నాడు. ట్రీట్‌మెంట్ నీకివ్వాలి అతడికి కాదు.”

ఇది చదివినపుడు ఆ క్లినికల్ సైకాలజిస్ట్‌కే కాదు నాకు కూడా ఆశ్చర్యంవేసింది. అలాగే ఆ తరువాత చాలా ఏళ్ళకి నేను మరొక పుస్తకం చదివేను. ఇది ఫెయిన్‌మన్ (Richard Feynman, Nobel Laureate in physics) కథ. ఇతగాడికి వాళ్ళ నాన్న హీరో చిన్నప్పుడు. ఆయన చెప్పే కథలూ కబుర్లూ వింటూ ఆరాధనతో పెరిగేడు. ఇతనికి ఎంతో ఇష్టమైన విషయాలూ, సులభంగా అర్థమయే, వచ్చే గణితమూ, గణిత సూత్రాలూ వాళ్ళ నాన్నగారికి ఏమీ అర్థంకాకపోవడం ఇతనికి అర్థమయేది కాదు. ఎందుకంటే ఆయనకి అర్థంకాకపోవడం అసాధ్యమని ఇతని అచంచల విశ్వాసం. తన తండ్రి చాలా మంచివాడనీ, చాలా మంచి తండ్రనీ, కానీ కొన్ని కొన్ని విషయాలు ఆయనకి సాధ్యం కావని తరువాతెప్పుడో తెలుసుకుంటాడు.

ఏవి నా తొలినాటి జ్ఞాపకాలు?

కొన్ని స్టిల్ చిత్రాలు

మేము మొట్టమొదట ఈ అనాసపురపువారి వీధిలోని కొత్త కోవెల దగ్గరకి వచ్చినపుడు, మా అమ్మ ఎటో వెళ్ళింది. ఏదో పని మీద. ఇంట్లో మా నాన్నగారూ, నేనూ… ఇంకెవరున్నారో స్పష్టంగా లేదు. ఆకలికి మేం నకనకలాడుతూ ఏం చెయ్యాలో తెలీకుండా వున్నాం. అప్పుడు వీధిలో ‘ఇడ్లీలు – ఇడ్లీల’ని అరుస్తూ ఇడ్లీలమ్మేవాడు వెళ్తున్నప్పటిది ఒక జ్ఞాపకం.

మరోటి- మేం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కణ్నుంచి వస్తున్నామో తెలీదు కాని ఒక రైల్వే జంక్షన్‌లో బెంచి మీద నేను కూర్చుని. అటువైపు నుంచి మరో ప్లాట్‌ఫారమ్ నుంచి నవ్వుతూ వస్తున్న నాన్నగారు.

మరోటి- ఢిల్లీ కంటోన్మెంట్‌లో గోపీనాథ్ బజార్‌కి దగ్గర్లో వున్న మిలిటరీ క్వార్టర్‌లో పెరట్లో ఒక పట్టెమంచం వేసుకుని పేపర్లో, పుస్తకాలో చదువుకుంటున్న నాన్నగారు. మార్కెట్ నుంచి మట్టి జాడీలో గులాబ్‌జామ్‌లు తెచ్చిన మా అమ్మా మరో జ్ఞాపకం.

ఆరోజుల్లో మా ఇంటికి ఒకవైపున కోవెల, మరోవైపున రెండిళ్ళు దాటితే వుండే సందు తిన్నగా వెనక వున్న పుచ్చల వీధికీ, పాత బస్టాండ్కీ దారితీసేది. అక్కణ్ణుంచి వస్తూ ఆ సందులో కనిపించే మా నాన్నగారు ఒక దృశ్యం.

విజయనగరంలో మా ఇంటికి దగ్గర్లోనే ‘గణపతి విలాస్’ అని ఒక చిన్న కాఫీ హోటల్ వుండేది. అక్కణ్ణుంచి ఇడ్లీలు పొట్లాం కట్టించుకురమ్మని నన్ను పంపేవారు. వాడిచ్చే కొబ్బరి చెట్నీ కాకుండా గట్టిగా వుండే గట్టి చెట్నీ తెమ్మని నాకు మరీ మరీ గుర్తుచేసేవారు మా నాన్నగారు. ఆయనకి ఆ గట్టి చెట్నీ ఇష్టం. వాడు కొన్నిసార్లు ఇచ్చేవాడు కాదు. గట్టి చెట్నీ తేలేదా అనేవారు. మేం ఇడ్లీలనే వాటిని మా నాన్నగారు ఇడ్డెను, ఇడ్డెన్లు అనేవారు.

మా ఇంట్లో వుండే ఇనప్పెట్టెల్లో కూడా పుస్తకాలు పూర్తిగా వుండేవి. వాట్లోనే ప్రతిభలూ, భారతులూ, ఆంధ్రపత్రికలూ, ప్రభలూ, పాత ఆంధ్రజ్యోతులు, తెలుగు స్వతంత్రలూ వుండేవి. వాటిలోనే ఎందరెందరో ఎవరెవ్వరో రాసిన ఉత్తరాలూ, మా నాన్నగారు రాసిన ఉత్తరాలు బౌండ్ చేయించినవి వుండేవి. తెలుగు సాహిత్యంలో తేజోమూర్తులెందరివో ఉత్తరాలు దాంట్లో వుండేవి. మా నాన్నగారు వాటిని సర్దడానికో, దేన్నో వెతకడానికో ఆ పెట్టెలు తెరిచి కూచున్నప్పుడు నేను పక్కనే నిల్చునో, కూర్చొనో ఏదో మాట్లాడుతూనే వుండేవాడిని. ఆ సమయంలో నేను వందలసార్లు నాన్నగారూ నాన్నగారూ అంటూ వుండేవాడినని ఆ తరువాత మాటల్లో చెప్పాడు మా తమ్ముడు. ఇది నాకు గుర్తులేదుగానీ ఆ పెట్టె విప్పి కూర్చోవడం గుర్తుంది. నేను సెలవులప్పుడు నాకు వీలయితే ఆ పెట్టె తెరవడానికి ప్రయత్నించేవాడిని.

అరవైల్లో ఢిల్లీ నుంచి బెంగుళూరుకి ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అరవై నాలుగులో ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేసారు. అరవైఆరులో సునాబెడాలో హెచ్ఎఎల్‌లో హాస్టల్ వార్డెన్‌గా చేరేలోపున ఇంట్లోనే వుండడం. ఒక్కరూ పేషెన్స్ ఆడడం నాకు గుర్తుంది. మా తమ్ముడికి అరిథ్‌మెటిక్ చెప్పడం కూడా గుర్తుంది. దస్తూరి బాగా వుండడం కోసం చేయించే కాపీ పుస్తకాల కోసం మామూలుగా వుండే రొటీన్ సామెతలు వగైరాలు కాకుండా తన సొంత వాక్యాలు అందంగా, అర్థవంతంగా కొత్తగా రాసేవారు. మా స్కూల్లో కొందరు టీచర్లు వాటికోసం ఎదురుచూస్తూ వుండేవారు.

ఎక్కడో నేను రాసినట్టు నేను మెల్లమెల్లగా ఆయన అభిప్రాయాల్ని అంగీకరించలేకపోయేవాణ్ణి, ఎందుకో ఒకందుకు విభేదించేవాణ్ణి. ఆ స్వతంత్రం ఇవ్వడం ఆయన గొప్పతనమే నిస్సందేహంగా.
ప్రపంచంలో వున్న పుస్తకాలన్నీ తన దగ్గర వుంచుకోవాలన్నట్టు వుండేది ఆయన ధోరణి. ఆ ధోరణిలో, ఆ అభిరుచిలో, ఆ వ్యసనంలో ఎన్నో పుస్తకాలు కొన్నారు. కొన్నిసార్లు కొన్నవే కొన్నారు. ఒక సామాన్యుడు వేలకొలది పుస్తకాలు కొనడం గొప్ప విషయమే. కానీ కష్టసాధ్యమైనది కూడా. ఆ ప్రక్రియలో ఆయన ఎన్నో ఇబ్బందులకి గురైయారు. అన్ని ఇబ్బందుల్లోకీ ఇబ్బందికరమైనది డబ్బుకి సంబంధించినదే. తిరిగి తిరిగి అదే అర్థరహితమైన ఆర్థిక సమస్యల్లో పడడం నాకు నచ్చేదికాదు. బహుశా ఇదే అత్యంత ముఖ్యమైనది అభిప్రాయభేదాలకి అన్పిస్తోంది ఇప్పుడాలోచిస్తే.

‘చింకి చొక్కా ఐనా తొడుక్కో, కొత్త పుస్తకం కొనడం మానకు’ అన్నది గొప్ప వాక్యమే కావచ్చు. దాన్ని ఆయన అక్షరాలా పాటించారు, చీకూ చింతా లేకుండా. ఆఖర్లో ఒకసారి ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు ‘ఎందుకైనా మంచిది వుంచండి’ అని ఆయన జేబులో ఓ ఐదు వందలు వుంచాను.

మేం మా చిన్నప్పుడు వుండిన గోపీనాథ్ బజారు ప్రాంతం చూద్దామని, చూపిద్దామని తీసుకువెళ్ళాను. ఆ బజార్లో ఏదో ఓ బుక్ షాపులో అద్భుతమైన పుస్తకాలున్నాయని కొని నేనిచ్చినది కాస్త ఆయన అవగొట్టేశారు. ఆసరికి నేను ఇలాంటి విషయాలకి చిరాకుపడేవాణ్ణిగా లేను. పైగా తనకి నచ్చినది తనకిష్టమైన విధంగా ఖర్చు చేసుకున్నారులే అనే ఒక సర్దుబాటుకి వచ్చేశాను. కానీ ఇంటికి రాగానే మా అమ్మకి ఈ విషయం ఏమాత్రం రుచించలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇద్దరం ఇబ్బందిలో పడ్డాం. రానురానూ నేనీ విధమైన వ్యర్థ వ్యయ ప్రయాసలకి అలవాటు పడిపోయాను. కానీ ఒక సమయంలో తన సొమ్ముని తన ఇష్టం ప్రకారం ఖర్చు చేయడం ఆపలేకపోయినా ప్రయత్నాలు చేసేవాణ్ణి. ఈ అడ్డు ప్రయత్నాలకి ఏనాడూ చిరాకు పడలేదు. నన్నేమీ అనలేదు. అసలు ఆయన ఎవర్నీ ఏమీ అనలేదు. ఆయనని మర్యాద పురుషోత్తముడు అనవచ్చు. నేను రాసే రాతల్ని ఎంజాయ్ చేసేవారు. తనకి నచ్చినవి, హాస్యంగా వున్నట్టనిపించేవిగా తోచినపుడు ఆయన నవ్వే నవ్వు హృదయపూర్వకమైనది. పైగా అన్నిసార్లూ ఆ వాక్యాలు కంటబడ్డప్పుడు అంతే హాయిగా ఆయన నవ్వగలరు. మా అమ్మ ఫ్రెండ్, మా పక్కింటావిడకి మాటమాటకీ ‘దొబ్బుడాయి’ అండం అలవాటు. ఆవిడలా ‘దొబ్బుడాయి’ అన్నప్పుడల్లా ఈయన ఇక్కడ చిరునవ్వు నవ్వుతూ వుండేవారు. నేన్రాసిన ‘ట్రాన్సిస్టర్’ అనే చిన్న కథ చదివి, ‘అబ్బా ఎంత నవ్వేరో!’ అంది మా చెల్లెలు.

అల్ప సంతోషి. నిగర్వి. అన్ ఎస్క్యూమింగ్ పర్సన్. చిన్న చిన్న విషయాలకి సంతోషిస్తూ నవ్వుతూ వుండేవారు. సంతోషంతో అనడానికి బదులూ ‘షంతోషంతో’ అనేవారు. ‘షెర్మ గర్వభంగం’ అని ఒకచోటా, vanity అని మరోచోటా రాసేరు. ఆయన రచనలు ఇంటెన్స్‌లీ పర్సనల్, కొన్నికొన్ని చోట్ల చాలా Stylized. తన జీవితానికీ సాహిత్యానికీ దేనికి ఏది ఎక్స్‌టెన్షనో చెప్పడం కష్టం.

ప్రతి ఉదయం కొత్తగా మొదలుపెడతానని అన్నారు ఒకసారి. ఉదయాన్నే లేచి స్నానాదులు చేసి మల్లెపువ్వులా, కడిగిన ముత్యంలా మెరుస్తూ టిప్‌టాప్‌గా తయారయి పుస్తకం చేత్తో కనిపించేవారు. అందుకే ఒకసారి రాసేను- రాధాకృష్ణ పండితుడు రోజుకి 17 గంటలు పుస్తక పఠనంలో గడిపేవారంటే నాకాశ్చర్యం కలిగేది కాదు. నేను నిజంగానే అలా చదివిన మనిషిని నా అనుభవంలో చూశాను. మా నాన్నగారిలో- అని.

రస్సెల్ కూడా రోజుకి చాలా గంటలు పుస్తక పఠనంలో గడిపేవాడని చదివినపుడు, అతనికి వుద్యోగం చేయనవసరం లేదని చదివినపుడు మా నాన్నగారికి అలాంటి అవకాశం లేదని విచారం కలిగింది. ఆయన మిలిటరీ వుద్యోగంలో బహుశా ఆర్మీలో చేరిన ఒక సంవత్సరానికి ఆయన ఆంగ్లేయ బాసు పిలిచి ‘నీకిది సరియైన వుద్యోగం కాదు. వెళ్ళు. వెళ్ళి చదువుకో’ అని డిశ్చార్జి చేస్తే తిన్నగా వెళ్ళి మరో సర్వీసులో చేరిపోయానని చెప్పారు ఒకసారి. అప్పుడు సరే నేను లేను. నేను ఉన్న తర్వాత ఏం చేశానని నాకన్పిస్తూ వుంటుంది.

ఆయన బొత్తిగా ఏంబిషన్ లేని వ్యక్తి. అది స్వతహాగా వచ్చిందో, ప్రయత్నించి సాధించేరో నాకు తెలీదు. మిలట్రీ వుద్యోగంలో చదువూ, క్వాలిఫికేషన్లూ లేకున్నా డిపార్ట్‌మెంటల్ పరీక్షలు పాసై ప్రమోషన్లు సాధించవచ్చు. ఇతరులు చాలామందిని, కనీసం కొంతమందిని అలా పరీక్షలకి తయారుచేయడం నాకు తెలుసు. కానీ ఈయన తన విషయంలో ఆ ప్రయత్నం చేసేవారు కాదు. అలాగే కొందరి ఆంగ్ల రచనల్ని ఇంప్రూవ్ చేయడం నాకు తెలుసు. మీరెందుకు ఆ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రాయరు? అని నేను ప్రశ్నించినపుడు తనకి ఆ రకమైన అదనపు బాధ్యతల ప్రమోషన్లు అక్కరలేదని, డ్యూటీ అయిపోగానే ఫ్రీ అయే వుద్యోగం ఇష్టమనీ అనేవారు. సహజంగా నాకు నచ్చేది కాదు, అప్పటికి ఆ ఫిలాసఫీ అర్ధంకాక.

తనెప్పుడూ లీస్ట్ రెసిస్టెన్స్ వున్న పాత్ లోనే పోతానని అనేవారు. ప్రైవేటుగా పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించాలనే యావ ఆయనకెప్పుడూ లేదు. చదివిన తన చదువుతో, సంపాదించిన అపరిమిత జ్ఞానంతో అత్యంత ఆనందాన్ని అనుభవించిన అదృష్టవంతుడు ఆయన. ఆర్ధికపరమైన సమస్యలు ఆయన్ని వేధించినా, అవి తాత్కాలికాలే.

తనకున్న భాషాజ్ఞానాన్ని వుపయోగించి అర్థసముపార్జన చేయడం తప్పుకాదని చేయవచ్చనీ నా వుద్దేశ్యం. ఆలోచించమని అంటూ వుండేవాణ్ణి. ఆలోచించారా అని అడుగుతూ వుండేవాణ్ణి. అవకాశం వచ్చినా రాకపోయినా ఈ ఆలోచన నాకు 1969 ప్రాంతంలో వచ్చింది. అప్పుడొకరు చేసే తెలుగు అనువాదాలు, ముఖ్యంగా ఫ్రెంచి కవి Baudelaire కవితల తెలుగు సేత ఆయనకి బొత్తిగా నచ్చేదికాదు. మీరు చెయ్యవచ్చుగా అనేవాణ్ణి. మీరైతే బాగా చేస్తారు. ఈ కవితలే కాదు. వచనం కూడా చెయ్యండి. అచ్చు వెయ్యండి. అర్జించండి. బాగానూ చెయ్యవచ్చు, బాగా సంపాదించనూ వచ్చు. మనకి వచ్చిన విద్యని వుపయోగించడం తప్పుకాదు అనేవాణ్ణి. ఇవే వాక్యాలూ, ఇదే భాష కాకపోయినా వుద్దేశాలు ఇవే. ‘దానికి కాన్ఫిడెన్స్ కావాలి’ అనేవారు. ఒకోసారి ‘నీకున్న కాన్ఫిడెన్స్ నాకు లేదు’ అనేవారు.

ఒకసారి ఆరుద్రగారు రాసిన ఒక ఉత్తరంలో విషయం నా నోటీస్‌కి వచ్చింది. ‘మీరు రాసినది రెండవసారి చదవకుండా ప్రచురణకి పంపండి’ అని రాసేడాయన అని. నేనాశ్చర్యపోయాను. ఇదేంటి ఇలా రాసేడీయన అని. అదే అన్నాను నాన్నగారితో.

ఏం? అన్నారాయన. ఈయన ఆంధ్రపత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాసిన వెంటనే ప్రచురించవద్దని కొంతకాలం ఆగమని రాసేడనీ, ఆ వ్యాసం కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు అని చెప్పేనో చూపించేనో. ఏమీ తెలీనివాడికుండే కాన్ఫిడెన్స్ ఎంతో తెలిసినవాడికి వుండదు. ఈ తెలివిడి నాకు లేదప్పుడు మరి. అలాగే ఆరుద్రగారు ఉత్తరంలో రాసిందానికీ, వ్యాసంలో చర్చించిన దానికీ వున్న తేడాకి కారణం స్థాయీ భేదమే. ఒక స్థాయి వ్యక్తులు తాత్సారం చేయరాదు. వేరొక స్థాయివాళ్ళు తొందరపడరాదు. ఈ విషయం నాకు తొందరగానే తెలిసిందిగాని క్రమంగా అర్థమైంది.

నాన్నగారికి తన స్నేహితులందరి మీద విపరీతమైన అభిమానం. అయినా అది ఒక్క మాటలో చెప్పవలసిందీ చెప్పగలిగేది కాదు. శ్రీశ్రీగారన్నా, ఆరుద్రగారన్నా చాలా అభిమానం. వాళ్ళిద్దరికీ గొడవలొచ్చినప్పుడు మా ఊళ్ళో అంతా ఒకవైపే చేరిపోయారు, శ్రీశ్రీగారి వైపుకాదు. కానీ ఈయన ఎంతకీ ఎప్పటికీ అలా చెయ్యలేకపోయారు. ఇద్దరూ తనకి ఇష్టమే. వాళ్ళ మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోవాలని ఆశించేవారు. శ్రీశ్రీగారంటే చాలా అభిమానమున్నా, ఆయన ఆరుద్ర గురించి, ‘అతగాడి ఇటీవలి ప్రరోచనాలు | అజీర్ణ సుఖ విరోచనాలు’ అన్నప్పుడూ, అప్పలస్వామిగార్ని ‘హైస్కూల్ కుర్రాళ్ళకి గ్రామర్ పాఠాలు చెప్పుకోండి మాస్టారూ’ అన్నప్పుడూ చాలా బాధపడిపోయారు. ఆరుద్రగారి చాలా పాటలు ఆయనకిష్టం. ఇంగ్లీషు పజిల్సూ, ఆరుద్రగారి గళ్ళ నుడికట్టూ, శ్రీశ్రీగారి పదబంద ప్రహేళికలు ఇష్టంగా పూరిస్తూ వుండేవారు. శ్రీశ్రీగారు రాసిన ఎన్నో కవితలని ఆయన స్వయంగా తనకి చదివి వినిపించేరని అభిమానంతోనూ, గర్వంగానూ చెప్పేవారు.

శ్రీరంగం నారాయణబాబు గురించి రెండు ముక్కలు చెప్పాలి. నారాయణబాబుని తనకి పరిచయం చేసిందీ, ఆయన రచనలు చదవమని ఇచ్చిందీ శర్మగారే అని మానేపల్లి తన ‘అవగాహన’లో రాసేడు. ‘రుధిరజ్యోతి’ వచ్చిన రోజుల్లో దాని గురించి నాన్నగారు అప్పలస్వామిగారితో మాట్లాడ్డం లీలగా గుర్తుంది. శ్రీశ్రీదీ, నారాయణబాబుదీ కలిసి వున్న ఫొటో చిర్రావూరి శర్మగారి దగ్గర వుందనీ అడగమనీ ఆరుద్రగారు రాసిన ఉత్తరమూ, దానికి చాసోగారూ, అప్పలస్వామిగారూ రాసిన, అలాగే అన్న జవాబూ ‘నీ ఉత్తరం అందింది’లో వేసారు చాగంటి తులసిగారు. కాని ఆ ఫొటో కె.వి. రమణారెడ్డిగారికి ఆయన ఇచ్చేశారని, దొరకలేదని అన్నారు. ఇంచుమించు అదేరోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో వారం వారం తమకొచ్చిన కలల గురించి పాఠకులు రాసిన చిన్న చిన్న వ్యాసాల వంటివి వేసేవారు. ఆ శీర్షికలో “నారాయణం బోటుని నట్టేట ముంచకండి” అని అన్నీ బోల్డ్ లెటర్స్ లోనే తనకొచ్చిన కలలోని ఉదంతాన్ని ఈ శర్మగారు రాస్తే ఆ శర్మగారు (పురాణం) అచ్చు వేసారు. అవేవో స్మృతులన్న పేరుతో.

అప్పుడు నేను అడిగాను. నారాయణబాబుగారు కవిత్వం చదువుతూవుంటే, వినడానికి చాలా బాగుంటుందనీ, టెక్కలిలోనో, ఎక్కడో చదివినప్పటి విషయాలు మీకు తెలుసా? మీరు విన్నారా? అని. ఆయన విన్నారుగానీ తనని అంతగా కదిలించలేదని అన్నారు.

మానేపల్లి సత్యనారాయణ కాలేజీ కుర్రాడిగా వున్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ మా నాన్నగారితోనే కాదు మా అమ్మతో కూడా చనువుగా వుండేవాడు. తన ‘వెలిగించే దీపాలు’ మొదటి కవితా సంపుటం, కొన్ని కొన్ని చోట్ల కథల్లోనూ నాన్నగారి గురించి రాస్తూ, ఆయన పేరు మెన్షన్ చేస్తూ తనని శిష్య పరమాణువుగా అభివర్ణిస్తూ వచ్చాడు. శర్మగారూ, అప్పలస్వామి గారూ, చాసోగారూ (సాహిత్య త్రిమూర్తులు అన్నాడు అతను) లేని విజయనగరాన్ని ఊహించలేను అని రాసేడు డాక్టర్ మానేపల్లి.

బరంపురం కళ్ళికోట కాలేజీలో చదివిన మా నాన్నగారికి వాళ్ళ తెలుగు మాస్టారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారితో ప్రత్యేకమైన అనుబంధం వుండేది. శాస్త్రిగారికి కూడా నాన్నగారంటే చాలా ఇష్టం. ఆయన క్లాసులో చెప్పిన ‘ఫిరదౌసి’ పాఠం గురించీ, ఆయన పాళీ భాషలో నిష్ణాతులనిన్నూ చెబుతూ వుండేవారు. గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యవహారిక భాషోద్యమం పట్ల కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి వుండేవారు.

మొదట్నుంచీ చలంగారి రచనల పట్ల ఆకర్షణ, ఆ తరువాత చలం గారితో పరిచయం, సౌరీస్‌తో పరిచయమో, స్నేహమో వుండడం మొదలైనవి ఆయన మాటల్లోనూ, ఆ ప్రభావం కొంతవరకు ఆయన రచనల పైనా కన్పిస్తుంది. ‘ఒహ్హోహ్హో’ అనే కవిత చలం చదివాను చెడిపోయాను అని మొదలవుతుంది. ప్రేమలేఖలనే పేరుతో రాసిన కొన్ని కథలూ, కొన్ని ఎక్స్‌ప్రెషన్సూ కొంత పట్టిస్తాయి. ఒకచోట రాస్తారు. “చలంగారి భావాలు నవనవ అవయవాలు. జార్జెట్ చీర ధరిస్తాయి. వదులు జడ వేసుకుంటాయి.” చలంగారు రాసిన వుత్తరాలు చాలా వుండేవి ఆయన దగ్గర. ఒకసారి చలంగారు రాసేరు, “మీరు పెంకెవారు” అని. మీరు చూసేరా వెంకటచలంలో చంకలవెంట లేక అట్నుంచిటో వుందని రాసేరని. ఇది మానేపల్లి మళ్ళీ మళ్ళీ తలచుకునేవాడు.

బరంపురం వాళ్ళయిన తాపీ ధర్మారావుగారి మీద, తాపీ చాణక్య మీద, ఉప్పల లక్ష్మణరావుగారి మీద ప్రత్యేకమైన అభిమానం వుండేది. తాపీ చాణక్యగారి ఆకస్మిక అకాల మరణానికి ధర్మారావుగారి గురించి ఆలోచిస్తూ బాధపడేవారు. లక్ష్మణరావుగారి ‘అతడు – ఆమె’లో ముఖ్యంగా అందులో ఆయన వర్ణించిన ఒకప్పటి వంటకాల గురించీ తిళ్ళ గురించీ చెబుతూ వుండేవారు. తన చిన్ననాటి బరంపురం స్నేహితుల గురించి అప్పుడప్పుడూ చెబుతూ వుండేవారు. అందరి మీద ఎంతో ప్రేమున్నా కొందరిపై చాలా చాలా అభిమానం. ఎట్టి పరిస్థితిలోనూ ఆ అభిప్రాయంలో మార్పు అసాధ్యం. అలాంటి అదృష్టానికి నోచుకున్న వాళ్ళలో ప్రథముడు జయంతి ధర్మతేజ అనే డాక్టర్ జె.డి. తేజ. ఈయన నాన్నగారి క్లాస్‌మేట్. ప్రియ స్నేహితుడు. చదువు సంధ్యల్లో, సంగీత సాహిత్యాల్లో, ప్రతిభాపాటవాల్లో బ్రిలియంట్, ఔట్ స్టాండింగ్ ఇలాంటి పదాలకు అర్హుడు. ఎందుకో మా నాన్నగారికి అతనికీ, నాకూ మధ్య సామ్యం కనబడేది.

సదా బాలకుడిగా, ఏ మలినమూ, కుత్సితమూ లేకుండా ఆకుపచ్చని అమాయకత్వంతో, వసివాడని పసివాడి క్యూరియాసిటీతో ఎనభై ఏళ్ళు జీవించడం ఎలా సాధ్యమో అర్ధంకావడంలేదు. ఇటువంటి ఒక మనిషి మన మధ్యనే జీవించాడని నమ్మడమూ కష్టమే. కొన్నికొన్నిసార్లు ఏదో ఒక పదబంధంలా, ఆరోగ్యరీత్యా ‘గాజుబొమ్మ’, ‘గాజుబొమ్మ’ అని ఆయన్ని గురించి అన్న నేను, అన్నివిధాలా ఒక విలువైన అమూల్యమైన గాజుబొమ్మగా గుర్తించి చూసుకున్నానా? కాపాడుకున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే సరియైన సమాధానం ఇవ్వలేననిపిస్తోంది.

ఇక మిగిలిన నాకు తెలిసిన తన చిన్ననాటి స్నేహితుల్లో యర్రమిల్లి రామచంద్రరావుగారు, బీరామ్ అనే బోడపాటి రామం, ఉత్కళ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఒక ఒరియా అతను (పేరు గుర్తు రావడంలేదు) పన్యాల రంగనాధరావు. ఈయన బరంపురంవాడే కానీ క్లాస్‌మేట్ అవునో కాదో నాకు తెలియదు. రామచంద్రరావు తనకన్నా పెద్దవాడనీ, ఒంటిమామిడి అగ్రహారానికి చెందినవాడనీ అనేవారు. “డబ్బుంటే ‘పని’కిరాడు” అని అనేవారు. అంటే యూజ్‌లెస్ అనికాదు అర్ధం. వీరి అబ్బాయి జగత్పతిగారు సునాబెడాలో పనిచేశారు. అంచేత అతనితో కూడా చాలా దగ్గరతనం స్నేహం ఏర్పడింది.

బీరామ్ అనే బోడపాటి రామం మరో దగ్గరి స్నేహితుడు. ఆఖరిదాకా చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా వున్నవాడు. నాకు తెలిసి నాన్నగారి మీద చాలా అభిమానం కలిగినవాడు. ఈయన ఆంధ్రా యూనివర్శిటీలో చదివే రోజుల్లో వాళ్ళ యూనివర్శిటీ మేగజైన్లో నాన్నగారు రాసిన ‘ఆదివారం వాక్యాలు’ అనే రచన అచ్చయింది. ఈయనే దాన్ని సబ్మిట్ చేసాడనుకుంటాను. నా దృష్టిలో నాన్నగారు రాసిన వాటిలో ఒక అతిచక్కని రచన అని నా అభిప్రాయం. అది Spontaneous Prose అని నా వుద్దేశం. ఆ విధమైన ప్రోజ్ రాయడం చాలా ఎర్లీగా ఆయన చేసేరని, ఎహెడ్ ఆఫ్ హిజ్ టైమ్ అని నేను భావిస్తాను. అది పింగళి లక్ష్మీకాంతంగారు (ఎడిటర్) వేసేరని ఆయన సంతోషంగా గొప్పగా చెప్పేవారు. ఈ రామంగారి రెండో అబ్బాయి ప్రతాప్ కొన్ని నెలలు నాన్నగారితో కలిసి వున్నాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక విధమైన ఆత్మీయత, స్నేహభావం ఏర్పడ్డాయి.

మా నాన్నగారికి పురాణం సీత పేరుతో పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు రాసిన ఇల్లాలి ముచ్చట్లూ, ఇతర రచనలూ బాగా నచ్చుతూ వుండేవి. నాక్కూడా. ఎవరీ నవీన పురాణం సీత అంటూ నాన్నగారు ఆంధ్రజ్యోతిలో ఉత్తరాల శీర్షికలో రాసేరు కూడా. దాన్ని ఇల్లాలి ముచ్చట్లు మొదటి ప్రచురణలో ప్రచురించేరు కూడా. పురాణం శర్మగారు కూడా ఢిల్లీలో వుండేవారు. పన్యాల రంగనాధరావుగారు చనిపోయినపుడు పురాణం రాసిన నివాళి, అందులో రీగల్ సినిమా పక్కన క్వాలిటీలోనో, గేలార్డ్ అయిస్ క్రీమ్ పార్లర్ లోనో అంటూ కాస్త ఢిల్లీ టోపోగ్రఫీ కన్‌ఫ్యూజ్ అయి రాసినపుడూ నాకు ఇదే గుర్తు వచ్చింది. పురాణం శర్మగారు రేసీ ప్రోజ్ రాస్తూ ఎవర్రాసిందైనా వాడి, ఒకటో అరో పదాలూ, కొంత వాక్య నిర్మాణం మార్చి మొత్తం విషయాన్ని సొంతం చేసుకోగలడు అని అతన్ని అభిమానించేవారు.

అభిరుచి ఎలా ఏర్పడుతుంది? నిజమైన అభిరుచులు అందరికీ వుంటాయా? అలా వున్నట్టు తమని తాము నమ్మించుకుంటారా? RAS అనే రోణంకి అప్పలస్వామిగారు అత్యంత ప్రియమైన స్నేహితుడు. ఆయన బహుభాషా కోవిదుడు. Polyglot. ఎన్నో భాషల సాహిత్య లోతుల్లోకి వెళ్ళే ఆసక్తీ వెళ్ళగలిగే ఆ శక్తీ ఆయన సొంతం. ఆయన కబుర్లు ఆసాంతం శాంతంగా వినే ఓపిక, సహనం ఈయన (నాన్నగారి) సొంతం. అందువలనేనా వారి మధ్య ఆ స్నేహం? నాకు తెలిసి ప్రతిరోజూ సాయంత్రం మా ఇంటికి రోజూ, కొన్ని సంవత్సరాలు వచ్చిన మనిషి. కొన్నికొన్నిసార్లు ఆయనతో కూడా వచ్చేవారు చాసో అనబడే చాగంటి సోమయాజులుగారు. RAS గార్ని అందరం మాష్టారు అనేవాళ్ళం. ఈయన మా నాన్నగారికి 1940ల నుంచి తెలుసు. ఎప్పుడు ఎలా పరిచయమైనదీ నాకు తెలీదు. ‘మా పెళ్ళికి కూడా వచ్చేరు’ అనేది మా అమ్మ. మా అమ్మతో కూడా చనువుగా మాట్లాడుతూ, ‘నేను బ్రాహ్మణద్వేషినండీ. నన్ను ఇంట్లోకి రానీయకూడదు మీరు’ అనేవారు నవ్వుతూ. అలాంటి ద్వేషాలేమీ ఆయనకు లేవు. కానీ సరదాగా అలా అంటూ వుండేవారు.

ఆయన కళా కళలూ, ఇష్టాయిష్టాలు జగద్విదితాలు. ఆయన భాస్వరం వంటివాడు. ఎంత మెరుపుల వెలుగులో అంతగానూ కొండొకచో మండిన మండును. ఆ మంట ఎక్కువసేపు వుండకపోవచ్చును గానీ తీవ్రత మాత్రం అత్యంతం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య అంతకాలం ఎంతమాత్రమూ భేదాలు రాకపోవడానికి నాకు తెలిసి ఒక కారణం వుంది. అది మా నాన్నగారికి ఆయన పట్ల గల అడ్మిరేషనే అనుకుంటాను.

అప్పలస్వామిగారితో కూడా వచ్చే చాసోగారు మా నాన్నగారికి ఎప్పట్నించి పరిచయమో నాకు తెలీదు. మా ఇంట్లో అన్ని శుభకార్యాలకీ విజయనగరంలో జరిగిన అన్ని పెళ్ళిళ్ళకీ ఆయన వచ్చారు. ఒకసారి ఆయన రచనల మీద నాన్నగారి అభిప్రాయం అడిగేను. ఆయన “లేడీ కరుణాకరం” కథ ఎలా రాసేరో అన్నారు నాన్నగారు. అప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్, అబ్బ ఎంత కష్టం అన్నట్టనిపించింది నాకు. ఆ తరువాతెప్పుడో ఆ కష్టం ఏమిటో అర్ధమయింది. ఎందుకన్నారో తెలియదుగాని ఒకసారి చాసో, “మీ నాన్నకి తిక్కయ్యా” అన్నారు.

మా నాన్నగారి స్నేహితులలో వయసులో చిన్నవాడైన ద్వారం దుర్గాప్రసాద్గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయనకి నాన్నగారి మీద వున్న గౌరవం, అభిమానం, ప్రేమా ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. మేం చదువుకునే రోజుల్లో ఆయన మా ఇంటికి రిక్షాలో వచ్చి వున్నన్ని గంటలూ రిక్షావాణ్ణి బయటే వుంచేవారు. ఆయన తక్కువ మాట్లాడేవారు. నాన్నగారు కూడా మరీ ఎక్కువ మాట్లాడరు. మా అమ్మ ఇద్దరూ మాట్లాడకుండా అలాగే కూచుంటారు అని ఆశ్చర్యపోయేది.

సినిమా సరదాలు నాన్నగారికి ముందు నుంచీ వుండేవి. సినిమాల రివ్యూలు, సమీక్షలూ రాసేవారు. నాకు వాట్లో ముఖ్యంగా నచ్చిన ఒక అంశం. సినిమా అయిపోగానే నలుగురూ మాట్లాడుకొనే చోటికి పరిగెట్టాను అంటూ ప్రజాభిప్రాయ సేకరణకి చేసిన ప్రయత్నం. కెమెరా ఏంగిల్స్ గురించీ, టెంపో, మాంటేజ్ వంటి టెక్నికల్ అంశాల మీద రాసిన వ్యాసాల గురించి ఆలోచిస్తే వీటి గురించి ఎక్కడ చదివి వుంటారు అనే ఆలోచన వచ్చేది నాకు. సినీ సంగీతంలో హిందీకి అంధానుకరణ సరియైనది కాదని రాసేరు ఒకచోట. సినిమా వేరే ఒక సెపరేట్ మీడియమనీ, అది నాటకానికి ఎక్స్‌టెన్షన్ కాదనీ, దాంట్లో సంభాషణ ద్వారా కాకుండా కెమెరా ద్వారా మాట్లాడాలనీ ఆయన రాసిన వ్యాసాల్లో వుండడం నాకైతే ఆశ్చర్యంగా వుండేది. ఎందుకంటే అవి రాసిన సమయం, 1938 ప్రాంతాలు కావడం.

ఆయన దృక్పథమూ, భావాలూ అభ్యుదయమే అయినా అవి సంప్రదాయంతో సమ్మిశ్రితాలు. శ్రీపాద అనుభవాలూ, జ్ఞాపకాలూనూ, మల్లాది కృష్ణాతీరం రెండూ చాలా ఇష్టం. విశ్వనాథ అంధభిక్షువు, కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలూ ఇష్టం. దిండు సుఖం పోక సుఖం. దిండు క్రింద పోక చెక్క సుఖం కాదు వ్యధ. విశ్వనాధలోని పండితుడు పండుతూ పండుతూ పోయేడని రాసేరు, ‘సౌజన్య’ పత్రికలో. ఆకాశమంత ఎత్తులోంచి గంభీరంగా చెప్పడమనే విశ్వనాథ ఆత్మవిశ్వాసం, సహజంగా చాలా మోడెస్ట్ అయిన ఆయనకి నచ్చలేదనుకుంటాను. Anagrams, Alliterations లు చాలా ఇష్టమైనప్పటికీ, ‘కవిత్వమంటే మాటలు కాదు’ అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తరువాత కాలంలో గుల్జార్ రాసిన చిన్న చిన్న కవితల వంటివి లేక కవితల్లాంటి వాక్యాలు కాస్త ముందుగానే రాసేరు.

డెబ్బెయ్‌లలో పోలిష్ పోయిట్రీ పట్ల చాలా ఇష్టం కలిగి చిన్న చిన్న కవితలు చాలా అనువదించేరు. ఆ అనువాదాల్లో బ్రివిటీకి, బ్యూటీకి ఒరిజినల్‌లో వున్న ప్రాధాన్యం కాపాడే తపన కనబడేది.
ఆయన రచనలన్నిటినీ ఓ కొత్త అభివ్యక్తి అనో న్యూ ఎక్స్‌ప్రెషన్స్ అనో అనవచ్చు.

ఫోన్‌లో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. దూరదూరంగా వుంటే దూరమైపోతానేమో అని అనుకుంటూ అంటూ వుండేవారు. నేను ఏదో తృష్ణతో ఎందుకూ కొరగాని మృగతృష్ణల వెనక పరుగులో నిజంగానే దూరమయానా అన్నది జవాబు లేని ప్రశ్న.

తన ఆరోగ్యం పట్ల చాలా గర్వంగా వుండేవారు. వెన్నెల్లో కూడా తనకి స్పష్టంగా కనబడేదనీ, చదవగలిగేవాణ్ణనీ అనేవారు. చాలా జబ్బుగా వున్నప్పుడు కూడా చిత్రంగా పూర్తిగా కోలుకున్నారు. ఆఖరిసారి విశాఖపట్నం నుంచి బండిలో తీసుకువచ్చినప్పుడు కూడా హుషారుగా కబుర్లు చెప్పేరు. మనస్సెంత హుషారుగా హుందాగా వున్నా శరీరం మాత్రం ఇబ్బంది పడుతున్నట్టు అన్పించింది. తనే అడిగారు నన్ను, ‘ఇలా ఎన్నాళ్ళు?’ అని.

చివరికి ఆఖరి క్షణం రానే వచ్చింది. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా వీలున్నంత త్వరగా వచ్చేను. బాధలన్నీ తీరిపోయి, మనస్సంతా నిండి వున్న వెలుగులన్నీ మొహంమీదికి పాకినట్టున్నాయి. ‘చూస్తూ చూస్తూ వుండగా ముఖమంతా తేజస్సుతో వెలిగిపోయింది’ అంది మా చెల్లెలు. చేయవలసినవన్నీ చేసి చూస్తూ వుండగా ఆయనతోనే ఆ వేలకి మించిన పుస్తకాలూ, ఆ జ్ఞానమూ, అనుభవాలూ, అన్నీ వెళ్ళిపోయినట్టూ, అసలు ఈ ప్రపంచంలోని జ్ఞానమంతా వెళ్ళిపోయినట్టు అన్పించింది.

నా కళ్ళల్లో ఒక్క బొట్టు నీటిచుక్క కూడా లేదు.

అప్పుడు రాని కన్నీళ్ళు ఇప్పటి దాకా ఆయన రాసినవి గాని, ఆయన గురించి రాసినవి గాని చదివినా ఆలోచించినా చిప్పిల్లుతూనే వున్నాయి. ఎటువంటి అనుభవాలైనా, గురుతులైనా చివరికి అందమైన జ్ఞాపకాలుగానే మారిపోతాయి.

నేనే రాసినట్టు, మానవ జీవితంలోని ఎసెన్సు అందమైన రెమినిసెన్సు. నిజంగానే మా నాన్నగారు అందమైన రెమినిసెన్సు.

(నడిచిన పుస్తకం: చిర్రావూరి సర్వేశ్వర శర్మ అన్న పుస్తకంలోని వ్యాసపు సంగ్రహరూపం.)


పేరు: నడిచిన పుస్తకం: చిర్రావూరి సర్వేశ్వర శర్మ
ముద్రణ: అస్మిత ప్రింటర్స్, హైద్రాబాద్. 2021.
వెల: 400రూ.
ప్రతులకు: సి. వల్లీ శ్యామల, ఫోన్: 9346821416.


రచయిత మెడికో శ్యామ్ గురించి: డా. చిర్రావూరి శ్యామ్ ఎం.బి.బి.ఎస్. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలోను, ఎం.డి. (మెడిసిన్) ఢిల్లీ ఎ.ఐ.ఐ.ఎం.ఎలోనూ చేశారు. డాక్టర్‍గా పలు హోదాల్లో ఢిల్లీలో మూడు దశాబ్దాలు పనిచేశారు. యు.ఎస్.లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎపిడమియాలజీ) మరియు హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ చేశారు. కథా రచయిత. ‘శ్యామ్ యానా’, ‘సరాగమాల’ మెడికో శ్యామ్ కథలుగా వెలువడ్డాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి (ఇంగ్లీషు, హిందీ) అనువదించబడ్డాయి. ప్రస్తుతం యు.ఎస్.లో వుంటున్నారు. ...