కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 3

సంధి

ప్రతి భాషలోనూ పదాల కలయిక వల్ల కానీ, త్వరిత ఉచ్చారణ వల్ల కానీ, పరిసర ధ్వనుల ప్రభావం వల్ల కానీ ధ్వనుల్లో మార్పులు ఏర్పడుతాయి. ఒకే పదంలో ఏర్పడే మార్పుల కన్నా రెండు పదాల కలయికతో ఏర్పడే మార్పులనే ప్రధానంగా భారతీయ సంప్రదాయంలో ‘సంధి’ అన్నారు. ఈ సంధిని కేతన అతి తేలికైన మాటలతో నిర్వచించాడు.

క.
మొదలిపదము తుదివర్ణము
వదలక పై పదము మొదలివర్ణముతోడం
గదియఁగ సంధులు నాఁ దగు
విదితపుఁదత్సంధు లెల్ల వివరింతుఁ దగన్. (43)

మొదలి = మొదటి; పదం = మాట; తుది = చివరి; వర్ణం = అక్షరం; వదలక = విడువకుండా; పై పదము = తర్వాతపదము; మొదలివర్ణముతోడన్ = మొదటి అక్షరంతో; కదియగ = కలవగా; సంధులు = పదాలకలయికలు; నాదగు = అనబడుతాయి; విదితపు = స్పష్టమైన; తత్ = ఆ సంధులు; ఎల్ల = అన్నీ; వివరింతున్ = వివరిస్తాను; తగన్ = చక్కగా.

మొదటి పదంలోని చివరి అక్షరం రెండవ పదంలోని మొదటి అక్షరంతో విడువకుండా కలిస్తే అలా ఏర్పడ్డ వాటిని సంధులు అంటారు. అలాంటి సంధుల గురించి స్పష్టంగా, చక్కగా వివరిస్తాను.

వర్ణం అంటే అచ్చు కావచ్చు. హల్లు కావచ్చు. కానీ చిన్నయసూరి ‘పూర్వ స్వరంబులకు పరస్వరంబు పరంబగునపుడు సంధియగు’ అని నిర్వచించిన సంధి సూత్రం కన్నా కేతన చెప్పిన నిర్వచనమే శాస్త్రీయంగా సరైనదని చెప్పవచ్చు.

ప్రాచీన భారతదేశ వ్యాకరణ సంప్రదాయంలో ‘సంధి’ గురించి చాలా విస్తృతమైన నిర్వచనాలు, వివరణలు, చర్చలు లభ్యమవుతున్నాయి. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు కూడా ఈ పారిభాషిక పదాన్ని ఇలాగే స్వీకరించారు. (చూ. Bloomfield 1933). కేతన కూడా సంస్కృత వ్యాకరణ సంప్రదాయం నుండే ఈ వ్యాకరణ పారిభాషిక పదాన్నీ, నిర్వచనాన్నీ, తీసుకొని తెలుగు సంధులను వివరించాడు. సంస్కృత సంధులు ఆ భాషా అధ్యయనంలో తెలుగువాళ్ళు నేర్చుకుంటారు, అందువల్ల కేతనలో తెలుగులో వాడే సంస్కృత సంధుల వివరాలు కనిపించవు.

కేతన సంధి సూత్రాలు

ఉత్వసంధి

క.
ఉత్వము క్రియల కినులపై
నిత్వము పెఱరూపు దాల్చు నీవే ననఁగా
సత్త్వముఁ గలిగెడి నూరి క
తిత్వరితము పొండు నాఁగఁ దెల్లం బగుచున్. (44)

ఉత్వము = ఉకారం; క్రియల = క్రియారూపాల; కినులపై = కి అనే చతుర్థి/షష్ఠి విభక్తి ప్రత్యయం పైన, ను అనే ద్వితీయపైనా లేదా ‘కిను’ లతో కూడిన పదాలపై; ఇత్వము = ఇకారం; పెఱరూపు = ‘పర’ రూపాన్ని; తాల్చున్ = పొందుతుంది; నీవేననఁగా = నీవ్ + ఏన్ + అనగా = నీవు నేను అన్నట్లు లేదా నీవే అన్నట్లు (సంధి చూపిస్తూ, ఉదాహరణ కోసం) సత్త్వమున్ = బలము; కలిగెడిని = కలుగుతుంది; ఊరికి = పల్లెకు; అతిత్వరితము = తొందరగా; పొండు = వెళ్ళండి. నాఁగన్ = వలె; తెల్లంబు = స్పష్టం; అగుచున్ = అవుతూ.

ఉకారాంత క్రియలపై వచ్చే కి, ను లపైని ఇత్వము రెండవ రూపాన్ని పొందుతుంది. ఎలాగంటే నీవు + న్ + నగా ‘నీవే ననగా’; సత్త్వము గలిగెడిని+రికి + తిత్వరితముపొండు అనే ఉదాహరణల్లో ఈ విషయం తేటతెల్లం అవుతోంది.

పైన చెప్పిన సూత్రానికి సంబంధించి అర్థంచేసుకోవాలంటే ఉదాహరణలను జాగ్రత్తగా గమనించాలి.

ఉత్వానికి:
(i) నీవు+ఏను (+అనఁగా) = నీవేననగా
ఇత్వానికి& కి షష్ఠి సంధికి:
ii) (సత్త్వము) కలిగెడిని+ ఊరికి + అతిత్వరితము (పొండు) = కలిగిడి నూరితి త్వరితము

పై ఉదాహరణలో ‘ఉ’కార సంధి ‘ఇ’కార సంధి, ‘కి’ షష్ఠి సంధి మూడింటికీ ఉదాహరణలు ఇచ్చాడు. ఒక మంచి విషయం చెప్తున్నట్లుగా ఉదాహరణ వాక్యాలను ఇవ్వడం కేతన ప్రత్యేకత. హరి శివకుమార్ గారి (1973) ప్రకారం కేతన మధ్యమ పురుష ‘ఇ’ కారానికి సంధి నిత్యముగా జరుగునని చెప్పి ‘సత్త్వము చెందితి రూరికతి త్వరితముగా’ అని రూపాంతరంతో ఉదాహరించినారు (పు. 109). బహుశా ఆయన దగ్గర ఉన్న వ్యాకరణంలో ఈ రూపాంతరం ఉండి ఉంటుంది.

క.
అచ్చుగ నఱ్ఱి ఱ్ఱుఱ్ఱును
నచ్చులె యంతమునఁ దెనుఁగుటభిధానములన్
విచ్చలవిడిఁ బలుకులఁ బెఱు
యచ్చులు చనుదెంచుమానవాఖ్యలయందున్. (45)

అచ్చుగన్ = తేటతెల్లంగా; అఱ్ఱు = అకారం; ఇఱ్ఱు = ఇకారం; ఉఱ్ఱు = ఉకారం; అను = అనే; అచ్చులె = అచ్చు అక్షరాలే (స్వరాలే); అంతమునన్ = చివరన; తెనుఁగు+అభిధానములన్ = తెలుగు పేర్లలో; విచ్చలవిడి = ఇష్టం వచ్చినట్లు; పల్కులన్ = పలకడం వల్ల; పెఱ యచ్చులు = వేరే అచ్చులు; చనుదెంచు = వచ్చి చేరు; మానవ + ఆఖ్యల + అందున్ = మనుష్యుల పేర్లయందు.

అకారాంత, ఇకారాంత, ఉకారాంత అచ్చులే తెలుగు పేర్ల చివర ఉంటాయి; ఇష్టంవచ్చినట్లు పలకడం వల్ల మనుష్యుల పేర్లలో వేరే అచ్చులు వచ్చి చేరుతాయి.

కేతన సంధిని వివరిస్తూ ఒక ముఖ్యమైన పరిశీలన చెప్పాడు. ఇది ఆధునిక భాషావేత్తలు చెప్పే విషయం. తెలుగు పదాలన్నీ అ-కారాంతాలు, ఇ-కారాంతాలు, ఉ-కారాంతాలుగా ఉంటాయి (ఎ, ఒ లతో అంతమయ్యే పదాలు చాలా అరుదు). సంధి జరిగినప్పుడు ఇవి పోయి, పక్క పదంలోని అచ్చులు వస్తాయి.

తెలుగులో అ, ఇ, ఉ, ఎ, ఒ అనే అయిదు హ్రస్వాచ్చులున్నప్పటికీ వీటిలో అ, ఇ, ఉ-లకున్న ప్రాచుర్యం ఎ, ఒ-లకు లేదని ఆధునిక భాషావేత్తలెందరో తెలియజేసారు. భాషాశాస్త్రంలో 80 దశకంలో వచ్చిన బలాబలాల సూచిక (స్కేలు) అనే సిద్ధాంతం (Strength/Weak, Foley, 1977) ఆధారంగా ఒక్కొక్క భాషలోని అచ్చులలో కొన్ని ఎంత బలహీనమైనవంటే అవి చేరడం, తొలగడం చాలా సామాన్య విషయంగా జరుగుతుంది. మరికొన్ని అంత తొందరగా మారవు (ఉషాదేవి, 1978 & 1981). అందువల్లనే ఏదైనా పరభాషా పదం ఆదానంగా తెచ్చుకొన్నప్పుడు ‘ఉ’ కారం చేర్చుకొని వాడుకొంటాం.

ఉదా: సాల్ట్ (ఉప్పు) = సాల్టు; బస్ = బస్సు; ఫ్యాన్ = ఫ్యాను

అలాగే వేగంగా మాట్లాడుతూ సంధి చేస్తే ముందుగా పోయేదీ ‘ఉ’ కారమే. దీని తర్వాత స్థానం ‘అ, ఇ’లది. ‘ఎ, ఒ’లకు బలం ఎక్కువ అందువల్ల మారవు; పైగా వాటితో రూపాలూ (మాటలు) తక్కువే. ఈ విషయాన్ని కేతన 13వ శతాబ్దంలోనే గుర్తించి తన పద్ధతిలో చెప్పాడు.

సంధి జరిగే విధాలు

వ.
తత్సంధి క్రమం బెట్టిదనిన.

తత్ = ఆ, సంధిక్రమం = సంధి జరిగే విధం, ఎట్టిది అనినన్ = ఎలా ఉంటుందంటే. “ఆ సంధి జరిగే విధానం ఎలా ఉంటుందంటే”… (తెలియజేస్తాను)

సంధిని నిర్వచించి, చాలా సాధారణంగా వచ్చే ఉత్వసంధినీ, దానికి ఉదాహరణనీ చెప్పిన పిమ్మట కేతన మిగిలిన సంధులన్నింటినీ 49వ పద్యం నుండి వివరించాడు.

తే.
అవనినాథుఁడు దయఁ జూడ కనిపినాఁడు
రాజు దయ లేక యున్నాఁడు రమణియెడను
అలరు బంతిది మేల్బంతి యది యనంగ
నెల్లకృతులను మిక్కిలి చెల్లుఁ గాన. (47)

అవనినాథుఁడు = రాజు; దయన్ చూడక = కనికరం లేకుండా; అనిపినాఁడు = పంపించాడు; రాజు = రాజు; దయలేక ఉన్నాఁడు = కనికరం లేకుండా ఉన్నాడు; రమణియెడను = భార్య లేదా ప్రియురాలి పట్ల; అలరు బంతి + ఇది = ఇది పూలబంతి; మేల్ +బంతి+ అది = అది మంచి శ్రేష్ఠమైన బంతి; అనంగన్ = అనే విధంగా; ఎల్లకృతులను = అన్ని కావ్యాలలోను; మిక్కిలి = ఎక్కువగా; చెల్లున్ + కాన = చెల్లుతోంది కాబట్టి.

అవనినాథుడు దయజూడక + అనిపినాడు; రాజు దయలేక యున్నాడు రమణి యెడల; అలరుబంతిది, మేల్బంతి యది అని ఇలా అన్ని కావ్యాల్లోనూ చెల్లుతోంది కాబట్టి.

చిన్నయసూరి బాలవ్యాకరణం ఉదాహరణల్లో అంతటా రామాయణాన్ని మొదటినుండి చివరి వరకు వరుసక్రమంలో క్రమం చెడకుండా కథంతా చెప్పాడని బాలవ్యాకరణం గురించి మాట్లాడే పండితులంతా అంటూంటారు. అయితే ఏకవాక్యంలో కథను మొత్తం చెప్పడం కేతన రహస్య పద్ధతేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆయన ఇచ్చిన ఉదాహరణలను చూస్తే, ఈ పద్యంలో అవనినాథుడు దయజూడక + అనిపినాడు అని చెప్పిన వాక్యంలోని అంశం ఉత్తర రామాయణంలో రాముడు సీతను అడవికి నిర్దాక్షిణ్యంగా పంపివేయడం (ఈ కథను కావ్యంగా సమకాలికుడైన తిక్కన రాసాడు) అన్న ‘ధ్వని’ అంటే సూచన కనిపిస్తుంది. బహుశా ఈ వాక్యం ఆ కావ్యంనుండి గ్రహించిందేమో పరిశీలించాలి. ఈ పద్యంలో ఆశ్చర్యంగా ‘ఉన్నాడు’ క్రియ కనిపిస్తుంది. ఇలాంటి క్రియారూపాలను తిక్కన, కేతన తమ కావ్యాలలో వాడిన దాఖలాలున్నాయి.

క.
అచ్చుగఁ బెఱయచ్చుల పై
నచ్చు యకారంబుఁ దాల్చు నబలా యేలే
యిచ్చ యపూర్వమొకో యిది
యచ్చెరువై యునికి నా నుదాహరణంబుల్. (48)

అచ్చుగ = స్పష్టంగా; పెఱ అచ్చులపైన్ = ఇతర అచ్చుల మీద ఉన్న; అచ్చు అచ్చు (స్వరం); యకారంబున్ = ‘య’ కారాన్ని; తాల్చున్ = పొందుతుంది; అబలా = ఏలే = అబలాయేలే; ఇచ్చ + అపూర్వము + ఒకో = యిచ్చయపూర్వమొకో; ఇది + అచ్చెరువు + ఐ = యిది యచ్చెరువై (ఆశ్చర్యమై); ఉనికి = యునికి; నాన్ = అని; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

అచ్చులమీద వచ్చిన ఇతర అచ్చులు ‘య’ కారాన్ని పొందుతాయి. ఉదాహరణకు: ‘అబలా యేలే యిచ్చ యపూర్వమొకో యిది యచ్చెరువైయునికి’ అన్న విధంగా.

చిన్నయసూరి బాలవ్యాకరణంలో ‘సంధిలేని చోట స్వరంబుకంటెంబరంబయిన స్వరంబునకు యడాగమంబగు’ అని చెప్పాడు కానీ కేతన మాత్రం ‘య’ కారాగమాన్ని సంధి లేనిచోట అని ప్రత్యేకంగా చెప్పకుండానే ఏకవాక్య ఉదాహరణంలో సంధి లేని, సంధి రాని పదాలను చూపించాడు. ఇక్కడ కేతన ఇచ్చిన ఉదాహరణలో చారిత్రక కథనం ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఏ సామ్రాజ్యాన్ని పాలించినవాళ్ళు అయినా అందరూ పురుషులే. ఒకే ఒక్క మహిళ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అదీ తిక్కన – కేతనలకు సమకాలీనంగా. బహుశా కేతన దానినే ఈ ఉదాహరణలో పొందుపరిచినట్లు భావించడంలో తప్పులేదు. ‘అబలాయేలేయిచ్చ యపూర్వమొకోయిది యచ్చెరువై యునికి’ అని అన్నీ యకారాగమ రూపాలు ఉదాహరణలుగా ఇచ్చినా, దీనిలో ఒక స్త్రీ తన ఇష్టాపూర్తిగా ఏలిందనీ, అది అపూర్వం, ఆశ్చర్యకరం అనీ చేసిన వ్యాఖ్యానం వల్ల ఆ స్త్రీ తప్పకుండా రుద్రమదేవి అనే అనుకోక తప్పదు. [ఈమె కాక రజియా సుల్తానా ఢిల్లీని (హస్తినాపురాన్ని) పాలించింది తర్వాత చాలా కాలానికి.] ఈ చారిత్రక ఘట్టాన్నంతా ఏక వాక్య ఉదాహరణలో ఇచ్చాడు కేతన.

తే.
ఒనర నుఱ్ఱంత షష్ఠిపై నున్నయచ్చు
మొదలఁ బొల్లు న కారంబు గదిసి నిల్చు
కొడుకునా ల్గూఁతునొడమి నాఁ గూడుఁ గాని
కూఁతొడమి కొడుకా లనఁ గూడ దెందు. (49)

ఒనరన్ = విశదంగా, (స్పష్టంగా); ఉఱ్ + అంతషష్ఠి పైన్ = ఉకారాంత షష్ఠిమీద; ఉన్న అచ్చు = ఉన్నటువంటి అచ్చు; మొదలన్ = మొదట; పొల్లు న కారంబు = ‘న’ కార పొల్లు (న్); కదిసినిల్చు = చేరినిలుస్తుంది. కొడుకున్+ఆలు = కొడుకునాలు, కొడుకు యొక్క భార్య, కూతున్ + ఒడమి = కుమార్తె యొక్క అభిమానం (ప్రేమ); నాన్ = అంటే; కూడుగాని = సరిగ్గా ఉంటుంది కానీ; కూతు+ ఒడమి = కూతొడమి, కొడుకు+ ఆలు = కొడుకాలు; అనగూడదు = అనరాదు; ఎందున్ = ఎక్కడా కూడా.

షష్ఠి (తత్పురుష) సమాసంలో ఉకారాంతం చివర పొల్లు నకారం తప్పనిసరిగా వస్తుంది. కొడుకునాలు, కూతునొడమి అనడమే సరియైనవి తప్ప ఎక్కడా కూడా కూతొడమి, కొడుకాలు అని అనగూడదు.

కావ్య భాషకు సంబంధించి (వ్యవహారంలో కన్నా) ఈ సూత్రం ఎక్కువగా వర్తిస్తుంది. రెండు పదాలను కలిపినప్పుడు ఏర్పడే రూపాల్లో షష్ఠీ సంబంధమైన వాటిలో ఎప్పుడూ ‘న’ కారప్పొల్లు (న్) కలిసి వచ్చి నిలుస్తుంది. నకారం లేకుండా సంధి చేయరాదన్నమాట.

అందువల్ల కొడుకు+ఆలు = కొడుకునాలు అవుతుందే తప్ప ‘కొడుకాలు’ అని ఎక్కడా రాదు; అలాగే కూతు+ఒడమి = కూతునొడమి అని వస్తుందే తప్ప కూతొడమి అని అనరాదు. ఇట్లా చెప్పే విధానం – ఏది సమ్మతమైనదో ఏది అసమ్మతమైనదో – ఆధునిక కాలంలో నోమ్ చామ్‌స్కీ పరివర్తన వ్యాకరణం ద్వారా ప్రారంభమయిందని ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్తూ వ్యాకరణ, వ్యవహార అసమ్మతికి సంబంధించి చుక్క గుర్తు (*) పెడుతూ చూపిస్తారు; కానీ కేతన తెలుగుభాషకు సంబంధించినంత వరకూ దీనిని ప్రథమంగా వ్యాకరణంలో చూపించాడని చెప్పవచ్చు. దీనిని ఆధునిక పద్ధతిలో చెప్పాలంటే ఈ కింది విధంగా చెప్పాల్సి ఉంటుంది.

కొడుకు+ఆలు = కొడుకునాలు (*)కొడుకాలు
కూతు+ఒడమి = కూతునొడమి (*)కూతొడమి

అయితే షష్ఠి తత్పురుష సమాసంలో ‘ఋ’ కారానికి కూడా అచ్చుపరమైనప్పుడు ‘ను’ గాగమం వస్తుందని చిన్నయసూరి సూత్రీకరించాడు (బా.వ్యా. సంధి. సూ.34). దీనిని దేవినేని సూరయ్య కూడా ఎత్తి చూపాడు (పు. 54).

క.
అది యిఱ్ఱంతము మీఁదన్
గదిసిన నాద్యచ్చుడుగు వికల్పముతోఁ గా
లిది కాలియది యనఁగఁ జే
తిది చేతియది యని పలుకఁ దెల్లం బగుచున్. (51)

అది = ‘అది’ అన్నది; ఇఱ్ + అంతము మీదను = ‘ఇ’కారాంతంపైన; కదిసినన్ = చేరితే; ఆది అచ్చు = మొదటి అచ్చు అక్షరం; ఉడుగు = లోపిస్తుంది; వికల్పముతో వికల్పంగా (వైకల్పికం అంటే ఒక్కొక్కసారి, అప్పుడప్పుడు); కాలిది = కాలి+అది = కాలిది; కాలియది = కాలి+అది = కాలికి చెందింది (యడాగమం); అనగ = అనేటటువంటి; చేతిది = చేతి+అది; చేతియది చేతి+అది = చేతికి చెందింది; అని = అనే విధంగా; పలుకన్ = మాట్లాడగా; తెల్లంబు అగుచున్ = స్పష్టం అవుతూ.

ఇకారాంతం పైన అది శబ్దం చేరితే మొదటి అచ్చు వైకల్పికంగా లోపిస్తుంది; కానీ ‘ఇది’ చేరితే సంధి జరుగుతుంది. ఉదా: “కాలిది, చేతిది. కానీ ‘అది’ చేరి కాలియది, చేతియది” అవుతుంది. ఇకారాంత పదాల పైన అది అని చేరినప్పుడు మొదటి అచ్చు వైకల్పికంగా లోపిస్తుంది అని కేతన సూత్రీకరించాడు. (చిన్నయసూరి కూడా ఈ విషయాన్ని ఇలాగే చెప్పాడు).

కాలి+అది = కాలిది
కాలి+అది = కాలియది
చేతి+అది = చేతిది
చేతి+అది = చేతియది

సంధి జరగనప్పుడు ఇంతకు పూర్వమే చెప్పిన సూత్రం ప్రకారం ‘య’కారం వచ్చి చేరుతోంది. అందువల్ల దీనిని ‘వికల్ప’ సంధి అన్నాడు కేతన.

క.
అచ్చుగఁ బై హల్లుండక
యచ్చుండినఁ దద్ద్వితీయ కంత్యనకారం
బచ్చోఁ బాయక నిల్చును
విచ్చలవిడిఁ బోవు నచ్చు వేఱొక టైనన్.

అచ్చుగన్ = స్పష్టంగా; పైన్ = మీద; హల్లుండక = హల్లు+ఉండక = వ్యంజనం ఉండకుండా; అచ్చుండినన్ = అచ్చు అంటే స్వరం ఉంటే; తత్ ద్వితీయకు ద్వితీయా విభక్తికి; అంత్యనకారంబు = చివర ఉండే ‘న’ కారం; అచ్చోన్ = ఆచోట; పాయక = వదలకుండా; నిల్చును = నిల్చి ఉంటుంది; విచ్చలవిడిన్ = ఇష్టానుసారంగా; పోవున్ = పోతుంది; అచ్చు = స్వరం; వేఱొకటైనన్ = వేరే ఇంకేదైనా (ద్వితీయ కాకుండా) అయినట్లయితే.

ద్వితీయావిభక్తి ప్రత్యయం తర్వాత హల్లు ఉండకుండా అచ్చు ఉన్నట్లయితే దాని (ద్వితీయ) చివర ఉండే నకారం అక్కడే తొలగిపోకుండా, విడవకుండా నిలిచి ఉంటుంది; కానీ వేరే ఇంకేదైనా (అచ్చుకానిది అంటే హల్లు) ఉన్నట్లయితే (ఆ నకారము) ఇష్టానుసారంగా పోతుంది.

ఈ పద్యంలో ద్వితీయా విభక్తికి చెందిన ‘న’ కారం (అర్థరహిత నకారం కాదు) ఆ విభక్తి ప్రత్యయం తర్వాత చేరే పదం అచ్చుతో ఉన్నట్లయితే ఆ విభక్తి న కారం నిలిచి ఉంటుంది; కానీ అచ్చు కాకుండా వేరే ఇంకేదైనా ఉన్నట్లయితే (అచ్చుకానిది = హల్లు) అది ఇష్టానుసారంగా పోతుంది.

నుగాగమ సంధి

క.
సుతు నడిగె సుతుని నడిగెను
సుతు ననిచె న్సుతుని ననిచె సుతునిం గెలిచెన్
సుతు గెలిచెఁ బోరిలోను
ద్ధతు డొకఁ డన వరుసతో నుదాహరణంబుల్. (52)

సుతునడిగె = సుతున్ + అడిగె = కొడుకును అడిగాడు; సుతనినడిగెను = సుతునిన్ + అడిగెను; సుతుననిచెన్ = సుతున్ + అనిచెన్ = కుమారుణ్ణి పంపించాడు; సుతునిననిచె = సుతునిన్ + అనిచె; సుతునిం గెలిచెన్ = కుమారుణ్ణి జయించాడు; సుతుగెలిచెన్; పోరిలోన్ = యుద్ధంలో; ఉద్ధతుడు = పరాక్రమవంతుడైన; ఒకడు = ఒక వ్యక్తి; అనన్ = అనేవి; వరుసతోన్ = క్రమంగా; ఉదాహరణంబుల్ = దృష్టాంతాలు.

(పై సూత్రానికి) ఉదాహరణలు వరుసగా – సుతునడిగె, సుతునినడిగె; సుతుననిచెన్, సుతునిననిచె; సుతునింగెలిచెన్, సుతుగెలిచె.

ద్వితీయా విభక్తికి సంబంధించి పైన 53వ పద్యంలో చెప్పిన సూత్రానికి ఈ పద్యంలో ఇచ్చినవన్నీ ఉదాహరణలు. పద్యపూరణ కోసమూ, ఔచిత్యంగా ఉంటుందనీ ‘ఉద్ధతుడొకడు’ అని ఒక కర్తను చేర్చాడు. ఎందుకంటే ఉదాహరణల్లో ద్వితీయ లన్నీ ‘కర్మ’కు చెందగా దానికి ‘సంధి’ జరిగింది, క్రియతో. కాబట్టి కర్మ, క్రియలను అన్వయిస్తూ ఒక కర్తను కూడా సృష్టించి, అర్థాన్ని పూరిస్తూ, ఒక కథనంవలె కేతన ఈ ఉదాహరణలిచ్చాడు. పై సూత్రం ప్రకారం

(i) హల్లు కాకుండా అచ్చు ఉన్నప్పుడు ఆ ద్వితీయలోని చివరి ‘న’ కారం పోకుండా, (నిశ్చలంగా) నిలుస్తుంది;

(ii) అచ్చుకానిదేదైనా (హల్లు) ఉన్నప్పుడు అది తన ‘ఇష్టానుసారం’ ఉంటుంది; లేదా పోతుంది.

ఉదాహరణలు:
(i) అచ్చు ఉండడంవల్ల నిలిచే ‘న’ కారం:
(అ) సుతున్+అడిగె = సుతునడిగె
సుతునిన్ + అడిగె = సుతునినడిగె

(ఆ) సుతున్+అనిచెన్ సుతుననిచెన్
సుతునిన్ + అనిచెన్ = సుతునిననిచెన్

(ii) అచ్చుకాని దాని (హల్లు) వల్ల ఇష్టానుసారం ఉండేది పోయేది:
(ఇ) సుతునిం+గెలిచెన్ = సుతునింగెలిచెన్
(ఈ) సుతు (నిన్) + గెలిచెన్ = సుతుగెలిచెన్

అన్ని రకాల రూపభేదాలను ఒకే పద్యం ఒకే కర్మ (కర్త కూడా) తో మూడు భిన్న క్రియలను అందులోనూ రెండు అచ్చుతోనూ, ఒకటి హల్లుతోనూ ఉన్నవాటిని తీసుకొని ఉదాహరించిన తీరు వ్యాకరణ సూత్రం, ఉదాహరణ నేర్చుకోవడంలో అనాసక్తతను తొలగించి ఉత్సాహం నింపే విధంగా ఉంది.

సరళాదేశసంధి

క.
నాంతం బైనపదంబుల
పొంతం బై నున్న శబ్దముల కచటతపల్
దొంతి గజడదబ లగు న
య్యంతనకార మగు సున్న యభినవదండీ. (53)

నాంతంబైన = ‘న’ కారంతో అంతమయ్యే; పదంబుల = మాటల; పొంతన్ = దగ్గర, వద్ద; పైనున్న శబ్దముల = పక్కనే ఉన్న మాటల; కచటతపల్ = క, చ, ట, త, ప అనేవి; దొంతిన్ = వరుసగా; గజడదబలు = గ, జ, డ, ద, బ అని; అగున్ = అవుతాయి; అయ్యంత = ఆ+అంత = ఆ చివరి; నకారము = ‘న’ కారం; అగు సున్న = సున్నా అవుతుంది; అభినవదండీ!

మొదటి పదం నకారాంతమై రెండవ పదం క, చ, ట, త, ప లలో ఒకదానితో మొదలైనట్లైతే ఆ కచటతపలు వరుసగా గజడదబలుగా మారుతాయి. అప్పుడు మొదటి పదంలోని నకారం లుప్తమౌతుంది (పోతుంది).

ఈ సంధి తెలుగులో లిఖిత భాషలోనే కాకుండా మౌఖిక భాషలోనూ ఎక్కువగానే కనిపిస్తుంది. కేతన నకారాంతమనే వాడినా తరువాతి కాలంలో లాక్షణికులు, వ్యాకర్తలు దీనిని ‘ద్రుతము’ (నకారంబు ద్రుతంబు బా. వ్యా. సూ. సంజ్ఞా-11) అన్నారు. దీని ఆధారంగానే తెలుగులోని మాటలన్నింటినీ రెండుగా విభజించి ద్రుత ప్రకృతికములు కళలు అని కూడా పేర్లు పెట్టారు. ఈ ‘న’ కారం. పూర్వపదం చివర ఉన్నప్పుడు ఉత్తర(తర్వాత) పదం ప్రారంభంలో ‘క, చ, ట, త, ప’ అనే వర్గాక్షరాలలో ప్రథమాక్షరం ఉన్నట్లయితే వాటి స్థానంలో వర్గాక్షర తృతీయాలైన ‘గ, జ, డ, ద, బ’ లు వరసగా వస్తాయన్న మాట. అంటే క > గ గా; చ > జ గా; ట > డ గా, త > ద గా, ప > బ గా మారుతాయి.

తెలుగులో ఈ సంధి ఎంతో ఎక్కువగా రావడం వల్ల సి.పి. బ్రౌన్ లాంటి తెలుగు సాహిత్యం చదువుకుని, తెలుగు వ్యాకరణ, నిఘంటువులు రాసిన పండితుడు కూడా ‘తెలుగులో ఒకేమాట రెండు వర్గాక్షరాలతోనూ కనిపిస్తుందని’ భ్రమపడి వర్గాక్షరక్రమంలో తన తెలుగు ఇంగ్లీషు నిఘంటువు రూపొందించే నిర్ణయం తీసుకున్నాడు. (చూ. తెలుగు ఇంగ్లీషు నిఘంటువు సి.పి.బ్రౌన్ – 1857) ఈ నకారం (ద్రుతం) సంధి జరిగిన పిమ్మట పోతుందని కేతన చెప్పినప్పటికీ తెలుగుభాష లిఖిత సాహిత్యంలో దీని ఉనికిని తెలిపే అరసున్న వాడటం కూడా ఈ సంధి దశ నుండే బహుశా ప్రారంభమయిందని చెప్పవచ్చు.

ఆ.
వానిఁ గనియెఁ జేరె వానిఁ డక్కరిఁ జేసె
వానిదానిఁ దెగడెఁ వానిఁ బొగడె
ననఁగ వరుస నివి యుదాహరణంబులు
నుతగుణాభిరామ నూత్నదండి. (54)

వాని+గనియెఁ జేరె = వానిన్ + కనియెన్ + చేరెన్ = వాణ్ణి చూసాడు, దగ్గరగా వెళ్ళాడు; వానిఁడక్కరిఁజేసె = వానిన్+టక్కరిన్+చేసె = వాణ్ణి మాయ (మోసం) చేసాడు; వానిఁదానిఁదెగడె = వానిన్ +దానిన్ + తెగడె = వాణ్ణి, దాన్ని తిట్టాడు; వానిఁబొగడె = వానిన్ + పొగడెన్ = వాణ్ణి కీర్తించాడు (వానిఁబొదవె నని ఇంకో రూపం దీని అర్థం వాణ్ణి కౌగిలించుకున్నాడు అని); అనగ = అనే విధంగా; వరుసన్ = క్రమంగా; ఇవి = ఇవన్నీ; ఉదాహరణంబులు = దృష్టాంతాలు, ఉదాహరణలు. నుతగుణాభిరామ నూత్నదండి!

పైన చెప్పిన సూత్రానికి వానిఁగనియె, వానిఁజేరె, వానిఁడక్కరి (చేసె), వానిఁదానిఁదెగడె, వానిఁబొగడె అనే వన్నీ వరుసగా ఉదాహరణలు.

తెలుగు లాక్షణికులు దీనిని సరళాదేశసంధి అని పేర్కొన్నారు. ద్రుత సంధుల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఆధునిక భాషాశాస్త్రంలో దీనిని ‘అనునాసికాంతంలో చేరే శ్వాస స్పర్శాలు నాదస్పర్శాలుగా మారుతాయి’ అన్న సూత్రం ద్వారా వివరిస్తారు.

న్+క/చ/ట/త/ప = ఁగ/ఁజ/ఁడ/ఁద/ఁబ

‘న’కారం తర్వాత ఒక్కొక్క వర్గ ప్రథమాక్షరానికి వర్గ తృతీయాక్షరం వచ్చే ఉదాహరణలు వరుసగా:

i) వానిన్+కనియెన్ = వానిఁగనియెన్
ii) వానిన్+చేరెన్ = వానిఁ జేరెన్
iii) వానిన్+టక్కరిన్ + చేసి = వానిఁ డక్కరిఁ జేసె
iv) వానిన్+దానిన్+తెగడె = వానిఁ దానిఁ దెగడె
v) వానిన్+పొగడె/పొదివె = వానిఁ బొగడె/బొదివె.

ఆధునిక కాలంలో ఈ ద్రుతాంతాలు, కళలు అనే భేదం తెలియకపోవడంవల్లా, అరసున్నాల వాడకం పోవడం వల్లా ఈ సూత్రం తీరుతెన్నులు విద్యార్థులకు, తెలుగు నేర్చుకునేవారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

క.
కుఱుచల తుది హల్లులకున్
బిఱుఁద న్నెలకొన్న యట్టిబిందువు లెల్లన్
నెఱయఁగ నూఁదుచుఁ దేలుచు
నొఱుపై యిరుదెఱగుఁ జెల్లుచుండున్ గృతులన్. (55)

కుఱుచల = హ్వస్వాంతాలైన; తుది = చివరి; హల్లులకున్ = హల్లు (వ్యంజన)లకు; పిఱుఁదన్ = వెంట; నెలకొన్న యట్టి = ఉన్నటువంటి; బిందువులెల్లన్ = సున్నాలన్నీ; నెఱయగన్ = తరచుగా; అప్పుడప్పుడూ; ఊదుచున్ = ఊనికతో (ఊతం); తేలుచున్ = తేలిపోతూ; ఒఱపై (ఒఱపు + ఐ) = చక్కగా; ఇరుదెఱఁగున్ = రెండు విధాలుగా; చెల్లుచుండున్ = చెల్లుతాయి; కృతులన్ = కావ్యాలలో.

హ్రస్వాక్షరాలైన హల్లుల చివర వచ్చే సున్నాలు కొన్ని సార్లు (ఊనికతో) ఊదుచూ (పూర్ణ బిందువుగాను) మరికొన్నిసార్లు తేలుచూ (అర్ధ బిందువుగానూ) రెండు విధాలుగానూ కావ్యాలలో ఉంటాయి.

సున్న లేదా పూర్ణబిందువుగా రాసే రూపం నిజానికి వర్గాక్షరాలతో సమన్వయించి అనునాసికాలకు బదులుగా రాసే తటస్థమైనరూపం. అంటే:

క, గ – ఙ
చ, జ – ఞ
ట, డ – ణ
త, ద -న
ప, బ – మ

ఈ విధంగా అనునాసికాలు వాటితో ఉచ్చారణలో అలా ఏకరూపత ఉన్న స్పర్శాలతోనే కలిసి వస్తాయే తప్ప ఏ అనునాసికమైనా ఏ ఇతర స్పర్శంతోనైనా రాదు. అందుకే అనునాసికాలను కూడా వర్గాక్షరాలతో కలిపే ఐదక్షరాలుగా చెప్తారు. తరువాతి లాక్షణికులు “బిందు సంశ్లేషలు విభాషనగు’ (చి. సూరి. సూత్రం. సంధి – 17) అన్నప్పటికీ కేతన సంశ్లేష అంటే అనునాసికాక్షరంతో కూడిన వర్గాక్షర హల్లు (ఙ్క, ఙ్గ; ఞ్చ, ఞ్జ, ణ్ట, ; ణ్డ, న్త; న్ద; మ్ప, మ్బ – మహా ప్రాణాలతో కూడా ఇలాగే) గురించి ఈ వ్యాకరణంలో ఎక్కడా చెప్పలేదు.

హరి శివకుమార్ (1973) కూడా ‘సంశ్లేష’ గురించి కేతన చెప్పలేదనీ, చెప్పకపోవడానికి నన్నయని తన సూత్రాలకు లక్ష్యంగా కేతన ఎంచుకున్నాడనీ, నన్నయ ‘సంశ్లేష’ వాడలేదనీ, అందువల్ల బహుశా ‘సంశ్లేష’ అర్వాచీనమేమోననీ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘(నన్నయలో) సంశ్లేషరూప మొక్కటియు కనిపించదు. అందువల్ల సంశ్లేష రూపమర్వాచీనమనవలెను.’ (పు. 112)

‘హ్రస్వాంతముల పైనున్న బిందువు వికల్పముగా నొకపరి ఖండముగను మఱి యొకపరి పూర్ణముగను నుండును’ అని దేవినేని సూరయ్య గారి వ్యాఖ్య (పు. 59).

పూర్ణ, హ్రస్వ బిందువుల భేదం ఛందోనియతికి అవసరం. దీనివల్ల గణాల్లో తేడా వస్తుంది. అదెలాగో ఉదాహరణలను కింది పద్యంలో చూసినప్పుడు తెలుసుకుందాం.

క.
ననుఁగను నన్నుంగను దా
ఘనుఁడు ఘనుం డనఁగఁ జెల్లుఁ గవ్యనుమతిచేఁ
దను బోఁటి లోభివాఁ డితఁ
డన నిడుపులమీఁది బిందు లరబిందు లగున్. (56)

ననుఁగను = ననున్+కను = నన్ను చూస్తాడు/చూస్తుంది; (లేదా) నన్నుంగను; తా ఘనుఁడు = తాను గొప్పవాడు; (లేదా) ఘనుండు (ఘనుఁడు; ఘనుండు); అనగన్ = అనే విధంగా; చెల్లున్ = సరిపోతాయి; (వ్యవహరింపబడుతాయి); కవ్యనుమతిచే = కవి+ అనుమతిచే = కవులకు అంగీకార యోగ్యంగా; తనుబోఁటి = తనతో సమానమైన; లోభివాఁడితఁడు = లోభివాడు + ఇతడు = పిసినారి ఈయన; అనన్ = అనే విధంగా; నిడుపులమీది = దీర్ఘాల పైన; బిందులు = సున్నాలు; అరబిందు = అరసున్నలు; అగున్ = అవుతాయి.

ననుఁగను లేదా నన్నుంగను అనీ, తా ఘనుఁడు లేదా ఘనుండు అనీ, అరసున్న, సున్నలతో రెండు విధాలుగా వాడవచ్చు, అయితే కవుల అనుమతితో దీర్ఘాక్షరాల మీది అర్ధబిందువు లేదా సున్నాలు మాత్రం “తనుబోఁటి, లోభివాఁడు + ఇతడు” అనే విధంగా అరసున్నలు అవుతాయి.

ఇంతకుముందు పద్యంలో చెప్పిన సూత్రానికి ఉదాహరణలు ఇస్తూ దానికి సంబంధించే మరో సూత్రాన్ని, ఉదాహరణలనూ కూడా ఈ పద్యంలో ఇచ్చాడు కేతన. హ్రస్వాక్షరాల హల్లుల తర్వాత సున్న, అరసున్న ఏదైనా రావచ్చు. దీర్ఘాక్షరాల తర్వాత కవులు సాధారణంగా అరసున్నాలే ఎక్కువగా వాడుతారు అని చెప్తూ వాటన్నింటికీ రెండేసి ఉదాహరణలు ఇచ్చారు.

హ్రస్వాలకు :
i) ననుఁగను; నన్నుంగను
ii) (తా) ఘనుఁడు; ఘనుండు

దీర్ఘాలకు :
i) తను బోఁటి
ii) లోభి వాఁడు (ఇతడు)

ఈ రెండు పద్యాలకు సంబంధించి దేవినేని సూరయ్య కూడా ఇలా చెప్పారు: హ్రస్వముమీది అర్ధబిందువు ‘వైకల్పికము’గా పూర్ణబిందువగుఁగాని దీర్ఘము మీఁది అరసున్న అరసున్నగానే యుండును. వాఁడు అనినప్పుడు ‘వా’ దీర్ఘాక్షరముగాన వాఁడు అని యగును గాని వాండు అని కాదు. అట్లే తాఁజెప్పె, నేఁ జెప్పితి సరియగు రూపములనియు తాంజెప్పె, నేంజెప్పితి రూపములు తప్పనియుఁ దెలిసికొననగు. బహువచనమున మాత్రము కొన్ని యెడల నరసున్న నిండుసున్నగా మాఱును. వాండ్రు, వీండ్రు, తేంట్లు, పండ్లు మొ॥ (పు. 60)

దేవినేని సూరయ్య ఆధునిక వ్యాకరణ దృష్టితో కేతన వాడిన ‘ఊదుచు’, ‘తేలుచు’ అనే వాటికి బదులుగా ‘వైకల్పికముగా’ అనే పారిభాషిక పదాన్ని వాడాడు. దీర్ఘాల తర్వాత బిందువులు అరసున్న లవుతాయి అని మాత్రమే కేతన చెప్పగా, సూరయ్య ‘వాండ్రు, తేంట్లు’ అనే ప్రయోగాలను చూపుతూ కొత్త సూత్రాన్ని ‘బహువచనమున మాత్రము కొన్ని యెడల నిండుసున్నగా మాఱును’ అని చెప్పాడు. అయితే పైన కేతన చెప్పిన సూత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది.

శాసన కాలంనుండే నన్నయ, కేతన కాలాల వరకూ దీర్ఘాలమీద కూడా నిండు సున్నలు ఉపయోగించేవారని మనకు భాషలో చారిత్రక ఆధారాలున్నాయి. అవి క్రమక్రమంగా ‘అరసున్న’లతో మాత్రమే కవుల కావ్యాలలో ప్రయోగింపబడటం, నిండుసున్నల ప్రయోగం అప్పటికి పోవటం (ముఖ్యంగా కావ్యాల రచనల్లో) పరిగణనలోకి తీసుకొని కేతన ఈ సూత్రాన్ని చేసినట్లు మనం గ్రహించాలి. అందువల్ల వాండు అనే రూపం వాఁడుకన్నా ప్రాచీనమైనదనీ, వాఁడు రూపం కావ్యభాషలో (గ్రాంథికం) కనిపిస్తుందనీ, దీని ఆధునిక రూపం అర్ధబిందువులేని ‘వాడు’ అనీ గ్రహించాలి. (చూ. తెలుగుభాషా చరిత్ర, 1974). ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తించాలి. హ్రస్వంపైన బిందువు ఉంటే గురువవుతుంది; కానీ దీర్ఘమే గురువుకాబట్టి బిందువు ఉన్నా, లేకున్నా తేడా ఉండదు.

క.
కుఱుచలపై యరబిందులు
నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
నెఱయవు గద్యంబులలో
నెఱబిందువు లూఁదుబద్యనికరములోనన్. (57)

కుఱుచల పైన్ = హ్రస్వాక్షరాల మీద; అరబిందులు = అరసున్నలు; నెఱయఁగన్ = ఎక్కువగా; ఊదినన్ = ఊనిక పెట్టినా; చెల్లు = వ్యవహరింపబడవచ్చు; నిడుపులమీఁదన్ = దీర్ఘాక్షరాలమీద; నెఱయవు = చెల్లవు; గద్యంబులలో = వచనాలలో; నెఱబిందువులు = నిండు సున్నలు; ఊదున్ ఊనికతో; పద్యనికరములోనన్ = పద్య సమూహాలలో.

హ్రస్వాక్షరాల మీద అరసున్నలను నిండుసున్నలుగా పలికినా చెల్లుతాయి; కానీ దీర్ఘాక్షరాలమీద నిండుసున్నలు వచనాలలో చెల్లవు; పద్యాలలో మాత్రం చెల్లుతాయి.

ముందు పద్యాలలో చెప్పిన సూత్రాన్నే మరింతగా ఆలోచించి, కొద్దిగా మార్పు చేసి ఈ పద్యంలో హ్రస్వాక్షరాలమీది అరసున్నలను నిండు సున్నలుగా పలికినా చెల్లుతుందనీ, కానీ దీర్ఘాక్షరాల మీద నిండుసున్నలు వచనాలలో సరికాదనీ, పద్యాలలో ఉపయోగించవచ్చుననీ తెలియజెప్పాడు కేతన. అంటే ఈ సూత్రం ప్రకారం 10-11 శతాబ్దాల వరకూ వాడుకలో ఉన్నటువంటి ‘వాండు’ మొదలైన దీర్ఘాక్షరం తరువాత పూర్ణబిందువుల వాడుక క్రమంగా తగ్గి, అవి పద్య రచనల్లో కవులు వాడినా, గద్యాలలో మాత్రం వాడకూడదన్న సూత్రీకరణకు వచ్చిందంటే సూత్రం గద్యభాషలో (వచనంలో) నిలకడ పొందిందని అర్థం.

ఈ పద్యానికి అర్థాలను ఇవ్వడంతోపాటు వ్యాఖ్యానించిన దేవినేని సూరయ్య (హ్రస్వము మీది ఖండ బిందువు పూర్ణ బిందువగునని యర్థము) అని మొదటి సగం సూత్రాన్ని కుండలీకరణాల్లో చెప్పి, అన్ని అర్థాల చివర ‘అనగా వచనములలో దీర్ఘము మీదఁ బూర్ణబిందువుండ రాదనియుఁ బద్యములలో దీర్ఘముమీద బూర్ణబిందువు లుండవచ్చు ననియు దీని భావము. పద్యములలో దీర్ఘములమీది పూర్ణబిందువులు శివకవుల ప్రయోగము లందును, నేటికి వెలువడిన ప్రసిద్ధాంధ్రచ్ఛందో గ్రంథము లందును బ్రయోగింపబడి యున్నవి’ అని చెప్పారు (పు. 60-61). (అయితే దీని చివర (చూ. పీఠిక) అని ఉండటం వల్ల బహుశా ఇది సూరయ్యగారిది కాక దీనికి పీఠిక రాసిన వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారిదే ఈ అర్థవివరణ కావచ్చునేమో అని అనుకోవాల్సి వస్తుంది). ఈ సూత్రం గురించి హరి శివకుమార్ చర్చించలేదు.

క.
నన్నును నిన్నునుఁ దన్నును
న న్నందుల కునుల కినులయందును మును పై
నున్న నకారపుఁ బొల్లులు
పన్నుగఁ బోఁ జూపు నచ్చుపై నున్నయెడన్. (58)

నన్నును ఉత్తమ పురుష ఏకవచనం నేను కు ద్వితీయా విభక్తి; నిన్నును మధ్యమ పురుష ఏకవచనం నీవు/నువ్వు కు ద్వితీయా విభక్తి; తన్నున్ = ప్రథమ పురుష ఏకవచనం ద్వితీయకు; అన్నన్ = అనేటటువంటి; అందుల = వాటిలో; కునుల = ‘కు, ను’, అనే విభక్తి ప్రత్యయాలకు; కి, నిల = ‘కి ని’ల; అందును = వాటిలో; మును = పూర్వం, ముందు; పైనున్న = ముందు ఉన్నటువంటి; న కారపున్ పొల్లులు (ద్రుతాలు అన్ – చివరవచ్చేవి); పన్నుగన్ = స్పష్టంగా; పో జూపున్ = పోతాయి; అచ్చు పైన్ స్వరంమీద; ఉన్న యెడలన్ = ఉన్నట్లయితే.

ద్రుతాంతాలైన న కారపు పొల్లు దాని తర్వాత వచ్చే పదం అచ్చుతో ప్రారంభమై నట్లయితేను, కు ను, కి, ని అనే విభక్తి ప్రత్యయాలు కలిసినప్పుడూ (ఒక్కొక్కసారి) పోవడానికే చూస్తుంది.

ఆధునికంగా ద్వితీయా విభక్తిలో ఉపయోగించే నన్ను, నిన్ను, తన్ను అనే ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుష రూపాల చివర కావ్యభాషలో ద్రుతం అంటే ‘న కార పొల్లు’ ప్రయోగం ఉండేది. అంటే నన్నున్, నిన్నున్, తన్నున్ అనే విధంగా. వాటి తర్వాత పదం అచ్చుతో ప్రారంభమైనట్లయితే ఈ ద్రుతం జారిపోతుంది అని ఈ పద్యం చెప్తుంది. అలాగే విభక్తి ప్రత్యయాలైన ‘కు, ను’ గానీ ‘కి, ని’ గాని వచ్చినప్పుడు కూడా ఈ నకార పొల్లు పోవడానికే చూస్తుంది.

దేవినేని సూరయ్య ఈ పద్యానికి ప్రతి పదార్థాలేమీ ఇవ్వకుండా వివరణ మాత్రమే అంటే ‘నన్నున్, నిన్నున్, తన్నున్ అనుశబ్దములపై నున్న నకారపుఁబొల్లులు అచ్చుపై నున్న యెడల ఉండును; పోవును. ఇట్లే కువర్ణక కివర్ణకముల పై నున్న ద్రుతము గూడ వికల్పముగ లోపించును’ (పు 61) – అని చెప్పారు.

హరి శివకుమార్ దీనిని ద్రుత సంధి కింద చూపించి, కేతన ద్రుతసంధిని నాల్గు భాగములుగా చేసెను అంటూ మూడవ భాగంలో ‘నన్ను, నిన్ను, తన్ను, కును, కిని – వీనిపై నున్న నకారము అచ్చు పరమగునపుడు వికల్పముగ లోపించును’ (పు. 111) అని చెప్పారు. ఈయన ఇంకా ‘ఈతడు (కేతన) నేను, తాను పదములలో ‘ను వర్ణకము’ ద్రుతమని భావించినట్లు కన్పించుచున్నది’ అని వ్యాఖ్యానించారు (పు. 112). కానీ ఇది నిజం కాదు. కేతన భావించిన ‘ను’ నన్నును, నిన్నును, తన్నును అని సర్వనామాంతాల ‘ను’ కారం తర్వాతి ‘ను’ కారాన్ని మాత్రమే అని మనం గుర్తించాలి.

క.
న న్నెఱుఁగు నన్ను నెఱుఁగున్
దన్నె ఱుఁగుచుఁ దన్ను నెఱుఁగుఁదత్త్వజ్ఞుఁడిలన్
ని న్నె ఱుఁగు నిను నెఱుంగును
నన్నం బరువడిగ నివి యుదాహరణంబుల్. (59)

నన్నెఱుఁగు = నన్నున్ + ఎఱుఁగు = నా గురించి తెలుసు; నన్ను నెఱుఁగున్ = నన్నున్ + ఎఱుఁగున్ (ఇది రూపాంతరం); తన్నెఱుఁగుచున్ = తన్ను + ఎఱుఁగుచున్ = తనను తెలుసుకుంటూ (లేదా) తన్నున్+ఎఱుఁగున్; తత్త్వజ్ఞుఁడిలన్ = తత్త్వజ్ఞుఁడు+ ఇలన్ = తాత్త్వికుడు ఈ భూమిలో; నిన్నెఱుఁగు = నిన్నున్ + ఎఱుఁగు = నువ్వు తెలుసు; (లేదా) నినున్ + ఎఱుంగును; అన్నన్ = అనేటటువంటివి; పరువడిగన్ = స్పష్టంగా; ఇవి = ఇట్లాంటివి; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

(పైన పేర్కొన్న సూత్రానికి) ఉదాహరణలు:
(1) నన్నెఱుగు/నన్నునెఱుగును;
(2) తన్నెఱుగు/తన్నునెఱుగు
(3) నిన్నెఱుగు/నిను నెఱుంగును.

ద్రుతం ఉండటం, ఉండకపోవటం అనే ఎంపిక వల్ల పైన పేర్కొన్న రెండేసి రూపాలలో అంటే నన్నెఱుగు లేదా నన్ను నెఱుగులలో ఏదైనా సాధ్యమే. అయితే ఇలాంటి ‘వికల్పాల’ వల్ల ఒక ‘మాత్ర’ ఉండటం, లేకపోవటం ఛందస్సు అవసరాలకు, గణాలకు దోహదపడుతుంది. అంటే నన్నెఱుగులో ఒక గురువు, మూడు లఘువులు ఉంటే, నన్ను నెఱుగులో ఒక గురువు 4 లఘువులుంటాయి. అలాగే నిన్నెఱుగులో ఒక గురువు మూడు లఘువులుంటే, నినునెఱుంగులో మూడు లఘువులు, ఒక గురువు, తరువాత ఒక లఘువు ఉంటాయి.

నన్నెఱుఁగు
UIII

నన్ను నెఱుఁగు
UI III

నిన్నెఱుఁగు
UIII

నినునెఱుంగు
IIIUI

అయితే ఈ పద్యంలో కూడా ఒక తాత్విక చింతనను ప్రదర్శించాడు కేతన. అదే ఏక వాక్యంలో ‘తన్నెఱుఁగుచుదన్ను నెఱుఁగు తత్త్వజ్ఞుఁడు ఇలన్’ అని ‘తాత్వికుడు తనను తాను తెలుసుకొంటాడు’ అని పూరించడం వల్ల ఆ ‘ఎరగటం అనే’ చింతన అవగాహనను తెలిపాడు. ‘అయితే ఉదాహరణలు పూర్తికానందువల్ల రెండో పద్యంలో కూడా కును, కినుల గురించిన ఉదాహరణలు చూపించాడు.

క.
తన కెనయె తనకు నెనయే
ముని కెనయే మునికి నెనయె మూర్ఖుం డనఁగాఁ
గునులకుఁ గినులకు జగతిన్
దనరంగా వరుసతో నుదాహరణంబుల్. (60)

తనకెనయె = తనకు+ఎనయె = ‘తనకుసాటియా?’ (లేదా) తనకున్+ఎనయే = తనకునెనయే; మునికెనయే = మునికి +ఎనయే = మునికిన్+ఎనయె = మునికి సాటి ఎవరు?; మూర్ఖుండు = తెలివి తక్కువవాడు; అనగాన్ = అన్నట్లు; కునులకు = కును ప్రత్యయం పైనా; కినులకు = కిని ప్రత్యయంపైనా; జగతిన్ = భూమిమీద; తనరంగా = చక్కగా; వరుసతో = క్రమంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

కును, కినులకు ఉదాహరణలు వరుసగా :
(1) తనకెనయె/తనకు నెనయే
(2) మునికెనయే/మునికినెనయె అనేవి.

పై పద్యంలో ‘తత్త్వజ్ఞుడు తనను తాను ఎఱుగును’ అని చెప్పిన కేతన ఈ ఉదాహరణల్లోనూ చిట్టి నీతి చెప్పాడు. ‘కిని’ ప్రత్యయం ‘ఇ’ కారాంతాలపై వస్తుంది కాబట్టి ‘ముని’ అనే ఇకారాంత పదాన్ని తీసుకుని మునికెనయే? లేదా మునికి నెనయె అని ఉదాహరణలు ఇచ్చి ఊరుకోకుండా ‘మూర్ఖుండు’ అని పూరణ పదంతో కలిపి ‘మూర్ఖుడు మునికి సాటి వస్తాడా?’ అనే అర్థం వచ్చేటట్లు చేసారు. ఇకారాంతంకాని ఇతరాలకు వచ్చే ‘కును’ ప్రత్యయానికి ఉదాహరణగా తనకెనయె/తనకు నెనయే! అన్న రూపాంతరాలతో కూడిన ఉదాహరణ ఇచ్చాడు. ఆధునిక భాషా శాస్త్రంలో వర్ణనాత్మక వ్యాకరణం పై రెండు రూపాలను కును, కినులను సపదాంశాలుగా గుర్తించి వాటి పరిసరాలను వర్ణిస్తుంది. అంటే ఇకారాంత పదాలపై ‘కు’ ‘కి’ గా మారుతుందని చెప్తుంది. దీనినే పరివర్తన వర్ణ సిద్ధాంతం మరో విధంగా ‘ధ్వని’ లక్షణాలతో ‘స్వర సమీకరణం’గా విశ్లేషించి వివరిస్తుంది. వాటి ప్రకారం సూత్రరచనలు ఇలా ఉంటాయి.

వర్ణనాత్మక వర్ణశాస్త్రంలో:
కు >కి/ & ను>ని /-‘ఇ’- కారాంత పదాల తర్వాత.
అంటే గది, పులి, పిల్లి, కాకి, ములికి మొ॥ఇలాంటి పదాలకు ‘కి’, ‘ని’ వస్తాయి. మిగిలిన అచ్చులున్న చోట్ల ‘కు’ వస్తుందని అర్థం.

పరివర్తన వర్ణశాస్త్రంలో:
అచ్చు > α అచ్చు/ α అచ్చు –
అంటే ఒక అచ్చు ఒకే ధ్వని లక్షణాలున్న మరో ధ్వని పరిసరాల్లో ఆ ధ్వని అచ్చుగా మారుతుంది అని.

గసడదవాదేశ సంధి

క.
పొసఁగం బల్కెడు నెడ బొ
ల్పెసగిన ప్రథమాంతములపయిం గదిసి కడున్
బసనారు కచటతపలను
గసడదవల్ ద్రోచి వచ్చుఁ గవిజనమిత్రా! (61)

పొసగన్ = చక్కగా (పొందికగా); పల్కెడునెడన్ = మాట్లాడేటప్పుడు; పొల్పు+ఎసగిన = మంచిగా ఉండే విధంగా; ప్రథమ+అంతముల పయిం = ప్రథమావిభక్తి చివరన; కదిసి = చేరి; కడున్ = ఎక్కువగా (మిక్కిలిగా); పసనారు = ప్రభావితంచేస్తూ (ప్రభావం చూపుతూ); కచటతపలను = శ్వాస వర్ణాలైన క, చ, ట, త, ప లను; గసడదవల్ = నాదాలైన గ, స, డ, ద, వ,లు; త్రోసి =తొలగించి; వచ్చున్ = వస్తాయి; కవిజనమిత్రా = కవులకు స్నేహితుడా.

మాట్లాడేటప్పుడు ప్రథమావిభక్తి ప్రత్యయాల చివరన శ్వాసవర్ణాలైన క, చ, ట, త, ప లు వచ్చినట్లయితే, అవి వరుసగా గ, స, డ, ద, వ లుగా మారుతాయి!

సాధారణంగా భాషల్లో శ్వాసాలు నాదాలుగా మారే ప్రక్రియ ఉంది. ఆ ప్రకారం క, చ, ట, త, పలు. గ, జ, డ, ద, బ లుగా నాదాంతాలపై మారే అవకాశం అనేక భాషల్లో ఉంది. కానీ తెలుగులోని ఈ సంధి ప్రక్రియ దానికి భిన్నమైంది. ‘క, చ, ట, త, ప లు’ ‘గ, జ, డ, ద, బ లు’ గా మారినప్పుడు దానిని ‘సరళాదేశ సంధి’ అని తెలుగు వ్యాకర్తలు అన్నారు. కానీ ఈ సంధిని పూర్తి వర్ణాలతో కలిపి ‘గ స డ ద వాదేశ సంధి’ అన్నారు. రెండింటినీ పోల్చి చూస్తే నకారాంతాల పైనా, ప్రథమావిభక్తుల పైనా కూడా క, ట, తలు గ, డ, ద లుగా మారుతున్నట్లు, కానీ (చ, ప) లు మాత్రం నకారాంతాలపై ‘జ, బ’ లుగానూ, ప్రథమల పై స, వ లుగానూ మారుతున్నట్లు గుర్తించాలి.

ఈ రూపాలు శాసన కాలం నుంచీ కనిపిస్తాయి. ఈనాటి భాషలో కూడా జన వ్యవహారంలో ఈ సంధితో కూడిన రూపాలు వినిపిస్తాయి.

దీనిని గురించి హరిశివకుమార్ ‘(కేతన) ఇచట తెలుగు పదములని గాని, సంస్కృత పదములనిగాని, విశదముగా చెప్పక, అన్నిటికి సరిపోయినట్లు పద్యరచన గావించినాడు. చిన్నయసూరి ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగా విధించియు, తరువాతి సూత్రమున “తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రా” వని నిషేధించినాడు. కేతన మాత్రము ఎంతో జాగ్రత్తగా సూత్రించినాడు’ (పు. 113) అంటూ శాసనాల నుండీ, నన్నయ భారతం నుండి ఉదాహరణలు చూపించారు.

సూరయ్య ఈ పద్యానికి అర్థంకానీ వివరణగానీ రాయలేదు. దీనినీ దీనికింది పద్యాన్ని కలిపి ఒకే వివరణ ఇచ్చారు.

తే.
సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియె
సుతుఁడు డక్కరితోఁడఁదా జుట్ట మయ్యె
సుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు వుట్టె
ననఁగ నివి యుదాహరణంబు లయ్యెఁగృతుల. (62)

సుతుడు గడు = సుతుడు + కడు – సుతుడు = కుమారుడు; కడు = మిక్కిలి; వేగమున = త్వరగా; వచ్చెన్ = వచ్చాడు; సుతుడు సనియె = సుతుడు + చనియె = కొడుకు వెళ్ళాడు; సుతుడు డక్కరితోడ = సుతుడు + టక్కరితోడ = పుత్రుడు టక్కరివానితో; తాన్ = తాను; చుట్టమయ్యె = స్నేహం చేసాడు; సుతుడుదండ్రికి = కుమారుడు తండ్రికి; ప్రణమిల్లె = నమస్కరించాడు; సుతుడు + వుట్టెన్ = కొడుకు పుట్టాడు; అనగన్ = అనేటువంటి; ఇవి = ఇలాంటివి; ఉదాహరణంబులు+అయ్యెన్ = ఉదాహరణలయ్యాయి; కృతుల = కావ్యాలలో.

కావ్యాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. సుతుడు గడు వేగమునవచ్చె; సుతుడు సనియె; సుతుడు డక్కరితోడ దాజుట్టమయ్యె; సుతుడు దండ్రికి ప్రణమిల్లె; సుతుడు వుట్టె.

కేవలం పదాలను కాకుండా చిన్న చిన్న వాక్యాలను ఉదాహరణలుగా తీసుకునే ప్రత్యేకత కేతనది. అందువల్లనే గ, స, డ, ద, వలు ఏ విధంగా ఆదేశంగా వస్తాయో చూపడానికి ప్రథమావిభక్తి ‘డు’ కారాంత ప్రత్యయం చేరే ‘సుతుడు’ అనే మాటను తీసుకొని, దానికి వివిధ క్రియావిశేషణాలు, క్రియలు చేర్చి సంధి రూపాలను నిష్పన్నం చేసాడు:

  1. సుతుడు+కడువేగమున వచ్చె – సుతుడు గడు వేగమునవచ్చె (క > గ)
  2. సుతుడు+చనియె > సుతుడు సనియె (చ > స)
  3. సుతుడు+టక్కరితోడ దా జుట్టమయ్యె > సుతుడు డక్కరితోడ దా జుట్టమయ్యె (ట > డ)
  4. సుతుడు+తండ్రికి ప్రణమిల్లె > సుతుడు దండ్రికి బ్రణమిల్లె (త > ద)
  5. సుతుడు+పుట్టె , సుతుడువుట్టె (ప > వ)

పై ఉదాహరణలన్నీ కూడా సంస్కృత ప్రథమావిభక్తి శబ్దానికి తెలుగుమాటలు కలిసినప్పుడు ఏర్పడిన రూపాలే. అందువల్ల ఒక విధంగా చిన్నయసూరి సూత్రీకరణ కూడా(చిన్నయసూరి : సంధి – 13, 14 సూత్రాలు) సరియైనదే అనుకోవచ్చు.

కానీ శాసనాలలో ‘అరియవట్టనమున’ వంటివీ, నన్నయలో ‘పెద్దగాలంబు’ వంటివీ తెలుగుపై సంస్కృత శబ్దాలు సమసించగా ఏర్పడిన సంధిని చూపిస్తున్నాయి. అంటే అప్పటికే ఇలాంటి సంధి రూపాలు భాషలో స్థిరపడ్డాయని అనుకోవాల్సి ఉంటుంది.

క.
తెలుఁగులలో నచ్చంబులు
డులు రులు నులు పదముతుది నడుమఁ గలిగిన ని
మ్ముల దానిమీఁది యుత్వము
పొలుపుగ హల్లుండెనేనిఁ బోవు న్నిలుచున్. (63)

తెలుగులలోన్ = తెలుగుమాటలలో; అచ్చంబులు = అచ్చతెలుగు పదాలు; డులు, రులు, నులు = డు, రు, ను అనే వర్ణాలు; పదముతుది = పదాల చివరన; నడుమ = మధ్యలోను; కల్గినన్ = ఉన్నట్లయితే; ఇమ్ముల = సరిగా; దానిమీది = (పైన చెప్పినటువంటి) డు, రు, ను ల మీద ఉన్నటువంటి; ఉత్వము = ఉకారము; పొలుపుగ = చక్కగా; హల్లు-ఉండెనేని = హల్లు ఉన్నట్లయితే; పోవున్ నిలుచున్ = పోతుంది; ఉంటుంది.

తెలుగు మాటలలోని డు, రు, ను అనే వర్ణాల చివర ‘ఉ’కారం పదాల చివరనా, మధ్యనా కూడా హల్లు పరిసరాలలో కొన్నిసార్లు పోతుంది, (మరికొన్నిసార్లు) ఉంటుంది.

ఏ భాషలోనైనా అచ్చులు కానీ హల్లులు కానీ అన్నీ సమత్వం కలిగినవి కావు. వీటి ప్రవర్తనలను, వ్యవస్థలనూ, అధ్యయనం చేసిన వర్ణనిర్మాణశాస్త్రవేత్తలు (ఫొనాలజిస్టులు), ధ్వనిసామ్యం ఆధారంగా కొన్ని సైద్ధాంతిక సూత్రీకరణలు ప్రతిపాదించారు. అవి చాలా భాషలకు వర్తించాయి కూడా.

వీటిలో రెండు ప్రధాన సిద్ధాంతాలు :

(1) ప్రాగ్ (దేశ) భాషా శాస్త్రజ్ఞుడైన రోమన్ యాకబ్సన్ ద్వారా ప్రతిపాదితమై, ఇంగ్లీషు, ఇతర భాషల విషయాల ఆధారంగా నోమ్ చామ్‌స్కీ, హాల్ ( Halle) అనే పండితులు సముద్ధరించిన ప్రత్యేక – సామాన్య సిద్ధాంతం (Marked – Unmarked theory)

(2) ఫోలే (Foley) అన్న వర్ణ శాస్త్రవేత్త ప్రతిపాదించిన బలాబలాల (Strong vs Weak) సిద్ధాంతం. ఈ రెండింటిలోనూ కొన్ని పోలికలు, కొన్ని భేదాలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్ళకుండానే, తెలుగు భాషలోని ‘అచ్చుల’ గురించి ఈ సిద్ధాంతాల ఆధారంగా పైనచెప్పినట్లు తెలుగు భాషలో ‘ఉ’ అనే అచ్చు అతి సామాన్యమైనది లేదా అత్యంత బలహీనమైనది. అంటే హల్లుల మధ్యన, పదాల చివరన ఉంటే ఉంటుంది; లేదా లోపిస్తుంది. అన్య దేశ పదాన్ని ఆధారంగా తెచ్చుకున్నప్పుడు తెలుగుమాటగా మార్చేందుకు చివరన ఇదే ఎక్కువగా వచ్చి చేరుతుంది (ఉషాదేవి, ఎ. 1978; 1981).

(1) పదమధ్య లోపం:
పలుకు > పల్కు
చిలుక > చిల్క
(2) పదాంతలోపం:
వాడు + ఎక్కడ? – వాడెక్కడ?
నేను + అన్నాను – నేనన్నాను

(3) అన్యదేశ్యపదాల చివరలో ‘ఉ’ చేరిక:
బస్ >బస్సు
పెన్ > పెన్ను
మీటర్ > మీటరు

తెలుగులో ఉ కారాంత, ఇ కారాంత, అ కారాంత పదాలు ఉన్నట్లుగా ‘ఎ’ కారాంత, ‘ఒ’ కారాంత పదాలు చాలా తక్కువ. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వ సంధి వలె ‘ఎ’ త్వ సంధి, ‘ఒ’ త్వ సంధి జరుగవు. దీనిని వివరించేందుకై పై సిద్ధాంతాలు మనకు దోహదపడుతాయి. ఈ సూత్రానికి కేతన ఇచ్చిన ఉదాహరణలు కింది పద్యంలో ఉన్నాయి.

‘అచ్చ తెలుగు పదములలోఁ బదమధ్యమునను, బదాంతమునను ఉండు డు, రు, ను అను నక్షరముల పైనున్న కొమ్ము హల్లు పరంబగునపుడు వికల్పముగా లోపించును – అని భావము’ అని సూరయ్య వివరణ. (పు. 65).

ఆ.
మారుమండఁ జొచ్చె మార్మండె వ్రేల్మట్టె
వ్రేలు మట్టె వేడ్క వేడు కయ్యె
కాఱుకాల మనఁగఁ గాఱ్కాల మనఁ గాన్పు
కానుపనఁగ నెలకడలఁ జెల్లు (64)

మారుమండన్ చొచ్చె మార్మండె = వేరే కొమ్మలో దూరాడు; వ్రేల్మట్టె – వ్రేలు మట్టె = వేలుకు తొడిగే ఆభరణం, మట్టెలు; వేడ్క- వేడుక అయ్యె = వేడ్క నే ‘వేడుక’ అవుతుంది. కాఱుకాలము = వర్షాకాలం; అనగ = అన్నా; కాఱ్కాలము (ఱు+కా= ఱ్కా) అని కలిపి అన్నా; కాన్పు-కానుపు ప్రసవానికి రెండు రూపాంతరాలు; అనగన్ = అంటే; ఎల్లకడల = అన్ని చోట్లా; చెల్లు = చెల్లుతుంది.

మారుమండనే మార్మండ అనీ; వ్రేల్మట్టె – వ్రేలు మట్టె అనీ; వేడ్కనే వేడుక అనీ; కాఱుకాలమే కాఱ్కాలమనీ; కాన్పు అనేమాటే కానుపు అనీ – ఈ రూపభేదాలన్నీ అన్నిచోట్లా కూడా చెల్లుతాయి.

పైన 64వ పద్యంలో చెప్పిన డు, రు, ను, లు లకు ఉదాహరణలు ఈ పద్యంలో చూపించాడు:

పదాంతం:
వ్రేలుమట్టె > వ్రేల్మట్టె
వేడుక > వేడ్క

పదమధ్యం:
మారుమండ > మార్మండ
కానుపు > కాన్పు

ఈ రూపాంతర భేదాలు కూడా కావ్య రచనలో గణాల కోసం అవసరం. వేడుక, కానుపు అనే మాటలు ఒక గురువు, రెండు లఘువులతో భగణం కాగా, వేడ్క, కాన్పు అనే రూపాలు ‘గలం’ లేదా ‘హగణం’ అవుతాయి. ఇలాంటి రూపాంతరాలను మనం మాట్లాడే భాషలో కూడా చూస్తాం.

ఆ.వె.
ఏకపదము నడిమియిత్వ మొక్కొకతటి
నచ్చ తెనుఁగులోన నడఁగుఁ బొడముఁ
గూర్మి తాల్మి యనఁగఁ గూరిమి తాలిమి
యనఁగఁ గృతులఁ జెల్లు చునికిఁ జేసి. (65)

ఏకపదము = ఒక పదం (మాట)లోని; నడిమి = మధ్యలోని; యిత్వము = ‘ఇ’కారం; ఒక్కొక తటిన్ = ఒక్కొక్కసారి; అచ్చ తెలుగులోనన్ = తెలుగు మాటలలో; అడఁగు = పోతుంది; పొడము = (వస్తుంది) కనిపిస్తుంది. కూర్మి = స్నేహం, మంచితనం; తాల్మి = ఓరిమి, ఓపిక; అనఁగ = అన్నా, (లేక) కూరిమి, తాలిమి; అనఁగ = అన్నా; కృతులన్ = కావ్యాలలో; చెల్లుచు = ఉపయోగించటం; ఉనికి జేసి = ఉండటం వల్ల.

‘ఇ’ కారాంతం మధ్యలో ఉన్న పదాలలోని ‘ఇ’ వర్ణం కూడా ఒక్కొక్కసారి పోతుంది; ఒక్కొక్కసారి వస్తుంది. వీటిని కావ్యాలలో రెండు రూపాలతోనూ, అంటే కూరిమి – కూర్మి అనీ, తాల్మి – తాలిమి అనీ ఉపయోగించడం ఉంది కాబట్టి (రెండూ సరియైనవే).

‘ఉ’కారం పద మధ్య పదాంతాలలో ఉండటం, పోవడం చేస్తే ‘ఇ’కారం మాత్రం పద మధ్యంలోనే పోతుంది; లేదా ఉంటుంది. ఇలాంటి రెండు రూపాల ప్రయోగాలూ కావ్యాలలో విరివిగా కనిపిస్తాయి. అందువల్ల కూర్మి, తాల్మి అని ‘గురు-లఘువు’ల జంటగానైనా వాడవచ్చు లేదా కూరిమి, తాలిమి అని గురువు – లఘువు – లఘువులుగా కూడా వాడవచ్చు. ఈ వెసులుబాటు గణాలకు, పద్య నిర్మాణానికి చాలా దోహదం చేస్తుంది.

క.
అఱ్ఱి ఱ్ఱంతంబులపై
యుఱ్ఱగు నన్నయును దల్లియును ననుక్రియ నా
యుఱ్ఱంత మొందుచోటుల
నుఱ్ఱగు మనుమఁడును నందనుండును ననఁగన్. (66)

అఱ్ఱు, ఇఱ్ఱు అంతంబులపై = అకార, ఇకారాల చివరన; యుఱ్ఱు+అగు = ‘యు’ కారం వస్తుంది; అన్నయును, తల్లియును = అన్నా, తల్లీ అనకుండా అన్న’యు’ను, తల్లి’యు’ను; అనుక్రియన్ = అనే విధంగా; ఆ ‘యుఱ్ఱు = ఆ ‘యు’ వర్ణం; అంతమొందుచోటులన్ = చివరన వచ్చినప్పుడు; నుఱ్ఱు, అగు = న కారంత కూడిన ‘ఉ’ కారం అవుతుంది. మనుమడును, నందనుండునున్ = మనుమడును; నందనుండును; అనఁగన్ = అనే విధంగా.

అకారాంత, ఇకారాంత తెలుగు మాటలపై ‘యు’ వర్ణకం వస్తుంది. అన్నయు, తల్లియు అనే విధంగా. అయితే ఉకారాంతాల చివరను న్+ఉ వర్ణకం వస్తుంది. మనుమడును నందనుండును అన్నట్లుగా.

ఇక్కడ కేతన చేరుతుందని చెప్పిన అ, ఇ ల చివర వచ్చే ‘యు’ వర్ణకం కానీ, ఉ కారాంతాల చివరన వచ్చే ను వర్ణకం కానీ కేవల వర్ణకాలు కావు. అవి సపదాంశాలై, ఒకే అర్థాన్నిచ్చే ఒకే పదాంశం. ‘మరియు’ అనే అర్థంలో వాడబడే ఈ పదాంశాన్ని కూడా కేతన సంధిలో చేర్చాడు. అన్న, బల్ల మొ॥ అకారాంతాలకూ, తల్లి, పిల్లి, పులి మొ॥ ఇకారాంతాలకు, ‘యు’ చేరుతుంది. కానీ మనుమడు, బాలుడు మొ॥ ఉకారాంతాలకు ‘ను’ (న్+ఉ) చేరుతుంది.; అంటే ఉ చేరడానికి ముందు ద్రుతం కలుస్తుంది. మనుమడు+ఉ~ మను డున్+ఉ~ మనుమడును

‘సముచ్చయార్థమున అ, ఇ అంతమందుగల పదములకు యు వర్ణమును, ఉకారమంత మందు గల పదములకు ను వర్ణమును వచ్చును’ అని సూరయ్య వివరణ (పు. 67).

ఇదే విషయాన్ని ఆధునిక పద్ధతిలో ఇలా చెప్పవచ్చు:
[యు] – ‘అ, ఇ’ చివర గల మాటలకు
[ను] – ‘ఉ’ తో అంతమయ్యే మాటలకు.

కేతన వర్ణించిన ఈ సంధి సూత్రాలూ, ఉదాహరణలే తర్వాతి వ్యాకర్తలందరి లోనూ కనిపిస్తుంది. కేతన చెప్పిన సంధి సూత్రాలు ఆనాటి భాషను కూడా పూర్తిగా వివరించేవి కావు, కానీ ఆయన చెప్పిన మేరకు అవి ఆ కాలపు కావ్య భాషలోని అనేక తెలుగు సంధులను ఉదాహరణలతో సూత్రీకరించిన తీరు లోని సరళత ఆధునిక వ్యాకర్తలకు, భాషా శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం కావాలి.


గ్రంథసూచి

  1. Bloomfield,L. 1933. Language. New York: Holt, Reinhart and Winston.
  2. Chinnayasuri, Paravastu. 1858. BalavyakaraNamu.
  3. Chomsky, Noam and Morris Halle. 1968. The Sound Patterns of English. Harper and Row.
  4. Foley, James. 1977. Foundations of Theoretical Phonology. Cambridge: Cambridge University press.
  5. Shivakumar, Hari. 1973. Ketana ( in Telugu). Warangal: Srikrishna prachuraNalu.
  6. Surayya, Devineni. 1953. Andhra Bhasha bhushaNamu. Ketana kavi krutamu. Divya prabha vivaraNa sahitamu. Tenali: Kalaakrishnula Kaavyamaala. No.3.
  7. Usha Devi, A. 1978. A Typological Study of Morphophonemics. Unpublished M. Phil. Dissertation. Osmania University.
  8. Usha Devi, A. 1981. On Certain Phonological Processes in South Dravidian II. In South Asian Languages: Structure, Convergence and Diglossia.eds. Bh. Krishnamurti, Collin Masica and Anjani Sinha.New Delhi: Motilal Banarsidas

అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...