జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్

జీవితం: (1844-1889)

జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్ (Gerard Manley Hopkins) జననం జులై 28, 1844. తండ్రి మేన్లీ, మెరైన్ ఇన్‌స్యూరెన్స్ వ్యాపారంలో బాగా గడించాడు. కొంత కవిత్వం కూడా రాసి ప్రచురించాడు. తల్లి కేథరీన్. వారు ఆంగ్లికన్ చర్చి అనుయాయులు. వారికి హాప్కిన్స్ తొలి సంతానం. అతని తరువాత మరి ఎనిమిదిమంది కలిగారు వారికి. హాప్కిన్స్, విద్యాభ్యాసం ఆక్స్‌ఫర్డ్‌లోని బేలియల్ (Balliol) కాలేజిలో (1864). రోసెట్టి (D. G. Rossetti) లాగా చిత్రకారుడు కావాలనుకున్నాడు. కాని, అంతకంటే తీవ్రమైన ఆధ్యాత్మిక ఆర్తి అతన్ని ఆవేశించింది. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా ఆంగ్లికనిజమ్ నుండి రోమన్ కేథలిక్ మతానికి మారిన న్యూమన్ (John Henry Newman) అతడికి స్ఫూర్తినిచ్చాడు. హాప్కిన్స్ 1867లో ప్రాచీన సాహిత్యంలో ప్రథమశ్రేణిలో డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. 1868లో కేథలిక్ మతం స్వీకరించాడు. తానెన్నుకున్న, లేక తాను ఎన్నుకోబడిన, ధార్మిక విధులకు తన కవితావ్యవసాయం విరుద్ధమనిపించి (‘కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ అని స్మృతివాక్యము కూడా. క్రైస్తవస్మృతులలో కూడా అటువంటి నిషేధం ఉండవచ్చు.) అంతవరకు తాను రాసిన కవితలను అన్నిటిని తగలబెట్టాడు. 1872లో డన్స్ స్కోటస్ (Duns Scotus) రచనలు చదివి, ముఖ్యంగా inscape, instress గురించిన అతడి భావాలు, కవిత్వరచన అతని వృత్తికి విరోధం కాదని భావించి, వదిలేసిన ఏడు సంవత్సరాల తరువాత, తిరిగి కవితలు రాయాలని సంకల్పించాడు. అప్పుడు రాసిన మొదటి కవిత నౌకాభంగము (The Wreck of the Deutschland). ఇది అతని అన్ని కవితలకంటే పెద్దది, బృహత్త్వంలోను మహత్త్వంలోను. అందులో అతడు సృష్టించిన కొత్త ఛందోవిధానంలో విజయం సాధించాడు. అదే సంవత్సరం అతడు రాసిన సోనెట్ The Wind hover. ఈ రెండు కవితలు హాప్కిన్స్ రచనల్లో అత్యుత్తమమైనవని సాధారణ అభిప్రాయం. జెసూట్ (Jesuit) పూజారిగా, అనేక విద్యాలయాలలో ఆచార్యుడిగానూ, పనిచేశాడు. 1889 జూన్ 8న టైఫాయిడ్ జ్వరంతో, డబ్లిన్‌లో చనిపోయాడు.

అతడి జీవితకాలంలో అతని కవితలు ఒక సంకలనంగా రాలేదు. అతడికి అత్యంత సన్నిహితుడు అప్తుడు అయిన బ్రిజిస్ (Robert Bridges) యితడిని మిత్రుడిగా తప్ప కవిగా గుర్తించలేదు. (బ్రిజిస్ ఆ తరువాత బ్రిటన్ ఆస్థానకవి, Poet laureate కూడా అయ్యాడు.) నౌకాభంగమును (the Wreck of the Deutschland) పత్రికలు, కేథలిక్ పత్రికలు కూడా, ప్రచురించలేదు.

కీట్స్‌ను సాధారణంగా విషయైక కవి (sensuous poet) అంటారు. ‘కీట్స్ పంచేంద్రియాలతో రాస్తాడు’ అన్నాడు కోలరిజ్. ప్రతి ఒక్కడు ఏదో ఒక యింద్రియంలో నపుంసకుడు అన్నాడు పౌండ్ (Ezra Pound). అందరికీ అన్ని యింద్రియాలు పనిచేయకపోవచ్చు. హాప్కిన్స్ పంచేద్రియాలతో ప్రకృతిని అనుభవిస్తాడు. అతడి కావ్యవిషయం ఇంద్రియాతీతమైన భగవత్తత్త్వం. ఈ రెంటినీ సమన్వయం చేయడమంటే తత్త్వాన్ని యింద్రియవిషయం చేయడమే. ఇది ఏమాత్రమూ సులభం కాదు, సాధారణమూ కాదు. ప్రతి యింద్రియవిషయాన్ని భగవత్తత్వస్ఫురణ కలిగేవిధంగా, కలిగేటంతగా, కలిగేవరకు, సునిశితంగా సానబెడుతూ పోవాలి. అప్పుడది యింద్రియవిషయంగా తన చరమరూపం పొందుతుంది. ఆ స్థితిలో తత్త్వం ఆ విషయరూపంలో ఆవిష్కరింపబడుతుంది, వస్తువు తత్త్వము ఏకమౌతాయి. తత్వం మరింత స్పష్టము, వస్తువు మరింత విషయైకము అవుతాయి. హాస్కిన్స్, విషయంలో తాత్త్విక కవి. విధానంలో విషయైక కవి. అతడు డన్ (John Donne) వంటి తాత్త్విక కవులలో (metaphysical poets) చేరడు, కీట్స్ వంటి విషయైక కవులలోనూ చేరడు. అతడి కవిత విలక్షణం.

హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు. వాస్తవంలో కవిత్వంలో ఆధునికత అంటే అదే కదా, ఏ యుగంలోనైనా?

హాప్కిన్స్ కవిత్వం వ్యతిరేకవ్యాఖ్యలను చాలానే సంపాదించుకొంది. రాబర్ట్ బ్రిజిస్ (Robert Bridges) (అతడు బ్రిటన్ ఆస్థానకవి) హాప్కిన్స్ కవితలను మొదటిసారి ఒక పుస్తకంగా తెచ్చినవాడు. ఆ సంకలనంలో ప్రారంభకవిత అయిన నౌకాభంగం (The Wreck of the Deutschland) గురించి ‘ముఖద్వారం వద్ద ముడుచుకుని ఉన్న డ్రేగన్ (dragon)’ అన్నాడు. నిజానికి యీ నిప్పులు కక్కే భయంకరజంతువు ముఖద్వారం వద్ద ముడుచుకొని పడుకోలేదు. సంకలనమంతా స్వేచ్ఛావిహారం చేస్తుంది. హాప్కిన్స్ వ్యాకరణాన్ని మెలితిప్పుతాడు. వాక్యాలను ముక్కలుగా విరిచేసి కుడి ఎడమలుగా విసిరేస్తాడు జరాసురలాగా. పదాలను మెలితిప్పి పిండుతాడు. భాషా విభాగాలను చెరిపేస్తాడు. కొన్ని ఉదాహరణలు: the just man justices: ‘ధార్మికుడు ధర్మిస్తాడు’ (ఈ ప్రయోగం ‘పెరిషి’స్తుందా?); Selves – goes itself: _myself it speaks and spells: ‘వ్యక్తులు – వెళుతుంది, నేనూ – పలుకుతుంది ప్రకటిస్తుంది.’; – a lonely began: (cf. ‘He sang his didn’t, he danced his did’) — from Anyone loved in a pretty how town? by E.C. Cummings.)

హాప్కిన్స్ కవితలలో ప్రధాన లక్షణం క్రియాపదబాహుళ్యం. అతడు అన్ని భాషావిభాగాల పదాలను సక్రియం చేస్తాడు. నామవాచకం, విశేషణం అవ్యయం – ప్రతిదీ క్రియారూపం పొందుతుంది. ధర్మం విశ్వాసం కాదు, ఆచరణ (ధర్మం చర), ధర్మం సక్రియం అని అడుగడుగున గుర్తుచేయడం యీ ప్రయోగంలో హాప్కిన్స్ ఆశయం. ధర్మం అంటే తెలిసి చేయడం.

హాప్కిన్స్, సంగీతాత్మ అతని కవితనంతా వ్యాపించి ఉంటుంది. అది కేవలం అక్షరరమ్యత, శ్రవణసౌఖ్యము కాదు. అతడు సొంతం చేసుకున్న spring rhythm కూడా అతని సంగీతాత్మలో ఒక అంశమే. అనుప్రాస అర్థవితరణలో ప్రధానపాత్ర వహిస్తుంది. ‘నా కవిత్వం చదవవలసినది’ (అంటే మనసులో చదువుకొని మననం చేసుకునేది కాదు, ఉచ్చారణ ప్రధానమని భావం.) అతడి జీవితకాలంలో అది ఎవరూ చదవకుండానే ఉండిపోయింది, తను పోయిన నలభై సంవత్సరాల వరకు.


1. భగవద్వైభవం

సృష్టిసమస్తం భగవద్విభవప్రపూర్ణం.
లోహపత్రకంపనంలో జ్వాలాకీలికలా మెరుస్తుంది
ఒత్తిన సారంలా ఊరుతుంది సాంద్రఘనంగా.
ఎందుకు మరి మనుషులు లెక్కచెయ్యరు అతని దండాన్ని?
తరతరాల పాదాహతి, నిరంతర హతి హతి;
వర్తకంతో అంతా శుష్కించిపోయింది. శ్రమలో మసకలు మచ్చలు;
మనిషి మరకలు, చెమట వాసన ధరించింది భరించింది;
నేల యిప్పుడు నగ్నంగా ఉంది, రక్షితపాదాలకు స్పర్శ తెలియదు.
ఇంత జరిగినా అరగదు తరగదు;
సృష్టి అట్టడుగున చెరగని అమ్లానత సజీవం;
కాళపశ్చిమచరమదీపం జారిపోగా
ఓహ్! తూర్పుకొండకొనపై ఉషోదయం–

నమితవిశ్వంపై పరమాత్ముడు పొదిగినది,
నునువెచ్చని గుండెలతో,
ఆహా! ఉజ్జ్వలసువర్ణపర్ణాలతో!

1. God’s Grandeur

The world is charged with the grandeur of God.
It will flame out, like shining from shook foil;
It gathers to a greatness, like the ooze of oil
Crushed. Why do men then now not reck his rod?
Generations have trod, have trod, have trod;
And all is seared with trade; bleared, smeared with toil;
And wears man’s smudge and shares man’s smell: the soil
Is bare now, nor can foot feel, being shod.
And for all this, nature is never spent;
There lives the dearest freshness deep down things;
And though the last lights off the black West went
Oh, morning, at the brown brink eastward, springs -—
Because the Holy Ghost over the bent
World broods with warm breast and with ah! bright wings.

ఈ కవితలో మొదటిపాదం సంపూర్ణవిరామంతో (full stop) ముగుస్తున్నది. అది సృష్టిలో నిగూఢంగా ఉన్న భగవద్వైభవం గురించిన నిశ్చయాత్మకతను సూచిస్తుంది. Charged అన్న పదానికి అనేకార్థాలు. వాటిలో ప్రాచుర్యంలో ఉన్న అర్థం ‘విద్యుచ్ఛక్తినిండిన’. ఇక్కడ, కొలిమిలో కాల్చిన ఒక లోహపత్రాన్ని (foil) కదిలించినప్పుడు దానిలో నుండి ఒక జ్వాలాకీలికలా మెరుపు వస్తుంది. ఎండలో కదిల్చిన ఒక యినుపరేకులో కూడా అటువంటి సన్నని మంటవంటి మెరుపు మెరుస్తుంది.

లోహపత్రకంపనంలో జ్వాలాకీలికలా మెరుస్తుంది: It will flame out, like shining from shook foil. ఈ ఆంగ్లమూలంలో ఒక అద్భుతమైన లోపం జరిగింది. సాధారణంగా యీ వాక్యం యిలా ఉంటుంది, It will flame out, like shining from a shook foil. కాని హాప్కిన్స్ ఉపపదం (a) వదిలేశాడు. (a shook foil అనలేదు. shook foil అన్నాడు.) ఆ ఉపపదం ఉండడంవలన ఏమిటి అర్థం, లోపించినందున ఏ అర్థం? ‘A shook foil’ అన్నప్పుడు ఒక రేకు, దాని కంపనం కనిపిస్తుంది. ఆ ‘A’ను తొలగించడం వలన, సమస్త సృష్టి ప్రకంపనము, దాని జ్వాలాకీలిక కనిపిస్తాయి. అంటే A (indefinite article) లుప్తమవడం వలన, కంపనం నిర్దిష్టం (definite) అయింది. అంటే భగవద్వైభవం సృష్టిలో సదా మెరుస్తూ ఉండదు. కంపించినపుడు మాత్రమే కనిపిస్తుంది. (Fear and Trembling by Kierkegaard. కిఎర్కగార్ ‘భయము కంపము’ లోని కంపము యిదే కావచ్చు. ప్రపంచం ఒక జ్వలత్ లోహపత్రం, కంపనంలో.)

కవితలో రెండవ ఉపమ, గానుగలో ఒత్తబడిన నూనె. (ఒత్తిన సారంలా ఊరుతుంది ఊరుతుంది సాంద్రఘనంగా: It gathers to a greatness, like the ooze of oil/Crushed.) నూనెకు అనేక ప్రయోజనాలు. ఆహారము, దీపారాధన, అభిషేకము (anointment, consecration, పవిత్రదీక్ష). ఈ సందర్భంలో హాప్కిన్స్ నూనెను రెండు ప్రయోజనాలకు వాడుకున్నాడు. నూనెకు రెండు గుణాలు, సారము సాంద్రత. ద్రవమే చెప్పదలిస్తే ద్రాక్షరసం చెప్పవచ్చు. కాని దానికి సారముంది కాని సాంద్రత లేదు. ‘సాంద్రఘనంగా’ (gathers to a greatness). కనుక నూనె ఉపమను గ్రహించాడు హాప్కిన్స్. నూనె బొట్టు బొట్టుగా కారుతుంది. సమృద్ధం అవుతూనే ఉంటుంది. సృష్టిలో యీ సమృద్ధిని సూచించాడు కవి. ఈ కవితలో నూనె ఉపమ ఆహారాన్ని, భౌతిక ఆధ్యాత్మిక పుష్టిని, చెబుతుంది.

ఈ పాదంలో ముఖ్యమైన పదం మరొకటి. ‘ఒత్తిన’ (Crushed). ఒత్తిడిలో నలిగినపుడుగాని భగవద్వైభవం అనుభవం కాదు. ఈ ఒత్తిడిని, యీ బాధను, క్రైస్తవ సంప్రదాయంలో Passion అంటారు, జీసస్ అనుభవించిన బాధవంటిది తిరిగి మనిషి అనుభవించినపుడుగాని ఆధ్యాత్మిక పునరుజ్జీవనం సాధ్యం కాదు.

‘ఎందుకు మరి మనుషులు లెక్కచెయ్యరు అతని దండాన్ని?’ (Crushed. Why do men then now not reck his rod?) మొదటి పద్యంలోని మొదటి మూడు పాదాలలో భగవద్వైభవం వర్ణించి, ప్రభుశక్తిని సమృద్ధిని చెప్పి, సర్వశక్తిమంతుడు పోషకుడు అయిన దైవం పట్ల మనిషికి ఎందుకు భయము భక్తి లేకుండా పోయాయి? అని ఆశ్చర్యపోతున్నాడు. ఈ ప్రశ్నతో మొదటి పద్యం ముగుస్తుంది.

రెండవ పద్యంలో సమాధానం చెబుతున్నాడు:

తరతరాల పాదాహతి, నిరంతర హతి హతి;
వర్తకంతో అంతా శుష్కించిపోయింది, శ్రమలో మసకలు మచ్చలు;
మనిషి మరకలు, చెమట వాసన ధరించింది భరించింది!
నేల యిప్పుడు నగ్నంగా ఉంది. రక్షితపాదాలకు స్పర్శ తెలియదు.

Generations have trod, have trod, have trod;
And all is seared with trade: bleared, smeared with toil;
And wears man’s smudge and shares man’s smell: the soil
Is bare now, nor can foot feel, being shod.

తరతరాలుగా యీ నేలతల్లిని తొక్కుతూనే ఉన్నారు మనుషులు. వ్యాపారదృష్టి పెరిగింది, ధనదాహంతో ధరిత్రిని పిండుకున్నాడు మనిషి. పిండి పిండి, నేల శుష్కించిపోయింది, all is seared with trade. మనిషి చేసిన మచ్చలు, అతడి చెమట వాసన ధరించింది భరించింది. కాని పిండుకున్న మనిషికి ఎండుతున్న నేల స్పర్శ తెలియదు. అతడి పాదాలకు రక్షలు ధరించి తిరుగుతున్నాడు. ఇంత జరిగినా అరగదు తరగదు; సృష్టి అట్టడుగున చెరగని అమ్లానత సజీవం: And for all this, nature is never spent; There lives the dearest freshness deep down things.

ఇంతవరకు మనిషి స్వార్ధం చెప్పాడు కవి, కవిత ఉత్తరార్ధంలో భగవంతుని సమృద్ధిని తిరిగి గుర్తుచేస్తున్నాడు. మనిషి ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా తరగని నిధి నిక్షిప్తమై ఉంది సృష్టి అట్టడుగున. ఎంత వాడుకున్నా వాడని సంపద, అమ్లానత.

నిరాశకు చోటులేదు. భగవంతుని సృష్టిలో. ఈ కాళరాత్రికి అంతంలేదు అనుకుంటుండగానే.

కాళపశ్చిమచరమదీపం జారిపోగా
ఓహ్! తూర్పు కొండ కొనపై ఉషోదయం–

And though the last lights off the black West went
Oh. morning, at the brown brink castward, springs-

ఇక కవిత ఒక పరమాశ్చర్యంలో పర్యవసించింది. ఒక అద్భుత దృశ్యం!

నమిత విశ్వంపై పరమాత్ముడు పొదిగినది,
నునువెచ్చని గుండెలతో,
ఆహా! ఉజ్ఞ్యులసువర్ణపర్ణాలతో!

the Holy Ghost over the bent World broods with warm breast and with ah! bright wings…

రోజుకో బ్రహ్మాండాన్ని పొదుగుతాడు పరమాత్ముడు. Holy Ghostను ఒక పావురంగా భావించడం క్రైస్తవ సంప్రదాయం. పరమాత్ముడు ఒక మగ పావురం, ‘నమితవిశ్వం’ ఒక ఆడపావురం, (over the bent/World). ఈ పాదంలో గర్భాదానం అండోద్భవం పిండోద్భవం కూడా ఏకకాలంలో ఊహించుకోవలె. పరమాత్ముని వెచ్చని రెక్కలకింద అప్పుడే ఉద్భవిస్తున్న ఉజ్జ్వలసుపర్ణాల ఉషస్సు, (ah! bright wings). ఆ రెక్కలు యిద్దరివి. అండంపై వెచ్చగా ఆవరించి పొదుగుతున్న రెక్కలు, అండం నుండి ఆవిర్భవిస్తున్న నూత్న ‘ఉజ్జ్వల సువర్ణపర్ణాలు’. పొదుగుతున్న పక్షి రెక్కలు, పుట్టుకువస్తున్న పిల్ల రెక్కలు కూడా ఒకేసారిగ స్ఫురిస్తాయి.

భగవద్గీతలో ‘మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిస్ గర్భం దధామ్యహమ్’లో కూడా యిదే దృశ్యాన్ని మనం కల్పించుకోవచ్చు.

2. నీవు నిస్సంశయంగా న్యాయమూర్తివి, వివదిస్తే

(నీవు నిస్సంశయంగా న్యాయమూర్తివి, ప్రభూ, నేను వాదిస్తే; నేను నీకు ప్రతిగా వాదించినా, నా నిరసన వ్యక్తంచేస్తాను; ఎందుకు దుర్మార్గులు లోకంలో అభ్యున్నతినందుతారు? సామం, Psalm: 119.)

నీవు నిస్సంశయంగా న్యాయమూర్తిని ప్రభూ, వివదిస్తే;
కాని స్వామీ, నా వాదం న్యాయ్యం.
పాపపుదారులలో ఎందుకు అభ్యున్నతి? ఎందుకు
నా సమస్తయత్నాలు నిరాశలో అస్తమిస్తాయి?

నీవు నా వైరివైనా, ఓ నా సౌహృదుడా,
ఇంతకంటే మిక్కిలిగా ఏమి పరాభవించగలవు,
నన్ను అవరోధించగలవు? ఓహ్ తాగుబోతులు బానిసలు
సోమరులు నాకంటే ప్రవర్ధమానులు.

స్వామీ జీవితం నీకంకితం. చూడు, యీ గట్టులు పొదలు
తిరిగి చిక్కని ఆకులు తొడిగి! అల్లుకున్న కొతిమెరతో
వాటిని చూడు చక్కటిగాలులలో తలలూపుతూ; పక్షులు కట్టుకుంటున్నాయి,
కాని కట్టడం లేదు నేను; అయినా కృషిస్తున్నాను
కాలంతో, నపుంసకుడిని. కాని సృష్టించను ఒక మొలకెత్తే మెలకువను కృతిని,
ఓ నా జీవనస్వామీ నా మూలాలను సేచనం చేయి.

2. Thou art indeed just, Lord, if I contend

Justus quidem tu es, Domine, si disputem tecum; verumtamen
justa loquar ad te: Quare via impiorum prosperatur &c.

(Thou art indeed just. Lord, if I contend; if I plead against thee, yet remonstrate with thee I must; why is it that the affairs of the wicked prosper.”Psalm 119.)

Thou art indeed just. Lord, if I contend
With thee; but, sir, so what I plead is just.
Why do sinners’ ways prosper? and why must
Disappointment all I endeavour end?
Wert thou my enemy, thou my friend,
How wouldst thou worse, I wonder than thou dost
Defeat, thwart me? Oh, the sots and thralls of lust
Do in spare hours more thrive than I that spend,
Sir, life upon thy cause. See, banks and brakes
Now, leaved how thick! laced they are again
With fretty chervil. look and fresh wind shakes
Them: birds build – but not I build; no, but strain,
Time’s eunuch, and not breed one work that wakes.
Mine, O thou lord of life, send my roots rain.

ఈ కవితలో ఒక న్యాయస్థానదృశ్యాన్ని ఆవిష్కరించాడు హాప్కిన్స్. శీర్షికలో (మొదటిపాదంలో) just, Lord, contend, plead, వంటి పదాలు కాక, sir అన్న సంబోధన (న్యాయవాది న్యాయమూర్తిని సంబోధించే పదం) కూడా న్యాయస్థాన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇందులో విషయం లోకంలో జరుగుతున్న అన్యాయం. తాగుబోతులు వ్యభిచారులు (the sots and thralls of lust) అభ్యున్నతి పొందుతున్నారు. జీవితం భగవంతునికి అంకితం చేసి సన్మార్గంలో ప్రవర్తిస్తున్న తనవంటివారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతున్నాయి. చేపట్టిన ప్రతిదీ విఫలమౌతోంది. (Why do sinners’ ways prosper? and why must /Disappointment all I endeavour end?) నీవు నా సుహృత్తువు, కాని నీవు నా శత్రువే అయినా యింతకంటే ఎక్కువ కష్టము నష్టము కలిగించలేవు, అంటున్నాడు కవి.

సృష్టిలోని వైషమ్యాలను ఎత్తిచూపి భగవంతుని ప్రశ్నించడం వింత ఏమీ కాదు. మీరా అంటుంది: మూరఖ్ కో రాజ్ దియత, పండిత ఫిరత బిఖారీ. మూర్ఖుడిని రాజును చేశావు, పండితుడు బిచ్చగాడై తిరుగుతున్నాడు. తనకు కలిగిన కష్టాలకు భగవంతుని తిట్టిన సందర్భాలు మనకు తెలిసినవే: ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు’ అని నిలదీశాడు రామదాసు. తన అంతస్సంఘర్షణలో భగవంతుని న్యాయస్థానాన్ని ఆశ్రయంచడమూ అరుదు కాదు: ‘దేవ యీ తగవు దీర్చవయా, వేవేలకు నిది విన్నపమయ్యా’ అంటాడు అన్నమయ్య. హాప్కిన్స్, తనకు కలిగిన కష్టమేమిటో చెప్పుకోడు. ఒకటి చెప్పబోయి, దానిని దాచి మరొకటి చెబుతున్నాడా? అతడు ఎన్నుకున్న ఉపమానం జీవసృష్టి. ప్రతి మొక్క తిరిగి చిగురిస్తుంది. గట్లు పొదలు తిరిగి ఆకులు తొడిగి (leaved) పచ్చబడ్డాయి: (See, banks and brakes / Now, leaved how thick!). పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. తననుండి మాత్రం ఎటువంటి పునరుజ్జీవనమూ లేదు. (birds build – but not I build), తనకు గూడు లేదు, ఒంటరి జీవితం. (‘ఆలుబిడ్డలు లేరు ఒంటివాడ’ – మహాభారతంలో భీష్ముడు.)

హాప్కిన్స్ యీ కవితలో దైవాన్ని తప్పుపడుతున్నా కూడా, నీవు నా శత్రువు అనడం లేదు. ‘నా సుహృత్తువు’ అనే అంటున్నాడు. అతడి బాధ, అంతటి సౌహృదుడు, న్యాయమూర్తి తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అన్నది తనకు ఎందుకు అర్థం కావడం లేదు? భగవంతుని కాఠిన్యం మన లోహాన్ని కాల్ని శుద్ధి చేయడానికి అన్న ఎరుక ఉన్నది. కనుకనే, ‘ఓ నా సౌహృదుడా’ అంటున్నాడు. భగవంతుడితో వాదిస్తున్నా, తాను భగవంతుడి పక్షమే. న్యాయమూర్తి మీద నమ్మకం లేని న్యాయవాది ఎందుకు వాదిస్తాడు? ఏమి వాదిస్తాడు?

కాలంతో తానెంత కృషిచేస్తున్నా, తన పురుష ప్రయత్నం నపుంసకకృషిలాగా దేనినీ సృష్టించడం లేదు. ప్రాణం పోయలేదు. తన కృషికి ఏదీ మొలకెత్తదు. (but strain, /Time’s eunuch. and not breed one work that wakes.) తనను ప్రియకాంతగా భావించి, తన ప్రియుడైన క్రీస్తును, ప్రార్థిస్తున్నాడు: ‘ఓ నా జీవనస్వామి నా మూలాలను సేచనం చేయి.’ (Mine, O thou lord of life, send my roots rain.) ‘నా జీవితం తిరిగి చిగురించనీ! ఒక కవిత మొలకెత్తనీ!’ అంటున్నాడు హాప్కిన్స్.

కవితాకన్య తనను వరించడం లేదని కవులు పరితపించడం సామాన్యమే. మిల్టన్‌కూ యీ నిస్పృహ కలిగింది:

How soon hath Time the subtle thief of youth
Stoln on his wing my three and twentieth year!
My hasting days fly on with full career,
But my late spring no bud or blossom shew’th.
(On Arriving at the Age of Twenty-Three: Milton)

కోలరిజ్ కూడా అనుభవించాడు:

My genial spirits fail;
And what can these avail
To lift the smothering weight from off my breast?
(Dejection: An Ode)

ఈ కవిత రాసిన కొన్ని నెలలకే హాప్కిన్స్ టైఫాయిడ్ జ్వరంతో డబ్లిన్‌లో చనిపోయాడు, తన 44వ ఏట. తిరిగి ఎక్కడ కవితై మొలకెత్తాడో?!


పేరు: జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్ – నౌకాభంగము, మరికొన్ని కవితలు (2021).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 295 రూ. (25$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com