ఈమాట సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం!


డా. చేకూరి రామారావు (1934 – 2014)

చేకూరి రామారావు (1 అక్టోబర్ 1934 – 24 జులై 2014): చేరాగా సుపరిచితమైన భాషాశాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు ఇక లేరు. నోమ్ చామ్‌స్కీ భాషాసిద్ధాంతాలని తెలుగు భాషకు అనువర్తించి చేసిన పరిశోధనలకు కార్నెల్ యూనివర్సిటీ నుండి భాషాశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్న చేరా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా తెలుగు వాక్యం, భాషాంతరంగం, తెలుగులో వెలుగులు, భాషాపరివేషం, వంటి ఎన్నో పుస్తకాలు వెలువరించారు. చేరాతలు శీర్షిక ద్వారా తెలుగులో ఎందరికో కవులుగా గౌరవం కల్పించారు. వచన పద్య లక్షణాలపై కోవెల సంపత్కుమారతో జరిపిన చర్చ ఎంతో ప్రసిద్ధమైంది. సాహిత్య విమర్శ, పరామర్శలలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న చేరా 2002లో రాసిన స్మృతికిణాంకం సంకలనానికి కేంద్రసాహిత్య ఎకాడమీ అవార్డు లభించింది.


బాపూ (1933 – 2014)

సత్తిరాజు లక్ష్మీనారాయణ (15 డిసెంబర్ 1933 – 31 ఆగస్ట్ 2014): బాపూ అన్న కలం పేరుతో తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న సత్తిరాజు లక్ష్మీనారాయణ తుది శ్వాస విడిచారు. సాక్షి, బాలరాజు కథ, ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, సీతాకళ్యాణం, అందాల రాముడు, త్యాగయ్య, వంశవృక్షం, పెళ్ళి పుస్తకం, శ్రీరామరాజ్యం వంటి సినిమాల దర్శకుడు, బాపూరమణల పడుగూపేకలో పేక; బుడుగు, సీగానపెసూనాంబ, రాధా గోపాళం – ఇలా రమణ అక్షరానికి రూపమిచ్చిన గీతగాడు, రామభక్తుడు, మితభాషి, ప్రపంచంలో అగ్రశ్రేణి లైన్‌డ్రాయింగ్ ఇలస్ట్రేషనిస్టుల సరసన ఠీవిగా కూర్చున్న కొంటెబొమ్మల బాపూ ఇక మనమధ్య లేకపోయినా, తన చేతిరాతతో మన గుండెలపై చేసిన బాపూ సంతకం మాత్రం శాశ్వతంగా మనతోనే ఉంటుంది.

ఈ సంచిక ఇలా ఇద్దరు ప్రముఖుల మరణాలతో, ఒక ఉజ్వలమైన తెలుగు తరం క్రమంగా అస్తమిస్తున్నదన్న చేదునిజంతో విడుదల చేయవలసి రావడం ఎంతో బాధ కలిగిస్తున్నది.


ఈ సంచికలో:

  • కవితలు: ఇంకో సాయంత్రం – కన్నెగంటి చంద్ర; ఉండు – కనకప్రసాద్; నిప్పులు – మానస చామర్తి; మంజుఘోష – సమవర్తి; ఎడబాటు – మామత.
  • కథలు: జ్ఞాపకాల వాసన – అరిపిరాల సత్యప్రసాద్; మనిషికెంతభూమి – ఆర్. శర్మ దంతుర్తి; కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు – సాయి బ్రహ్మానందం గొర్తి; అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు – శ్యామలాదేవి దశిగి.
  • వ్యాసాలు: తెలుగులో గ్రంథ పరిష్కరణ–కొన్ని ఆలోచనలు – వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్; మలయాళ ఛందస్సు–ఒక విహంగ వీక్షణము – జెజ్జాల కృష్ణ మోహన రావు; భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం – ఏల్చూరి మురళీధరరావు; ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం – గారపాటి ఉమామహేశ్వరరావు; కాళోజీ కవిత్వంలో మనిషి – కాత్యాయనీ విద్మహే.
  • పద్యసాహిత్యం: నాకు నచ్చిన పద్యం: నన్నయ తీర్చిన గడసరి సొగసరి – భైరవభట్ల కామేశ్వరరావు; పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము – కాశీనాధుని రాధ.
  • శబ్దతరంగాలు: అక్కరలేని సంగతుల – కనకప్రసాద్; దేశభక్తి గేయాలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.