ఆచార్య చేకూరి రామారావుగారిది విలక్షణ వ్యక్తిత్వం. ఇతరులను నొప్పించరాదు అనే మనస్తత్వం. సగటు మానవుడి ఆలోచనా ధోరణికి అద్దంపట్టే చిల్లర ఆలోచనలను పట్టించుకోనటువంటి మానసుడు. సూక్ష్మ గ్రాహ్యత అసీమిత ఆలోచన ఆయన స్వంతం. వీటన్నిటికీ మూలం వారి హేతుబద్ధ తార్కిక ఆలోచనా సరళి. ఇవన్నీ కలిసి తెలుగు భాషాశాస్త్ర విశ్లేషకుడిగా చేరా నిలువెత్తు చిత్రాన్ని మన కళ్ళముందు నిలిపాయి. చేరా తెలుగు భాషాశాస్త్ర పరిశోధనలో దిగ్గజం. తెలుగు భాషా విశ్లేషణను భాషాశాస్త్ర పరంగానూ సాహిత్యశాస్త్ర పరంగానూ కలనేతగా అల్లిన నేర్పు గల పనివాడు. ఆయన భాషాశాస్త్ర రచనల్లో రాజీపడని పరిశీలనా నిశితత్వం, వ్యాప్తి పరిపూర్ణత, అనిందాపరక సునిశిత విమర్శ కొట్టొచ్చినట్టు కనిపించేవి. పరిశోధనా విధాన ప్రక్రియే కాదు దానిని ప్రకటించే విధానం కూడా చాలా విలక్షణంగానూ శాస్త్ర పద్ధతికి ఒకింత గూడా తగ్గని పరిభాషలో చక్కని కథన కౌశలంతో నడుస్తాయి చేరా గారి భాషాశాస్త్ర రచనలు.
చేరా భాషాశాస్త్ర రచనలు
చేరాగారి రచనలు అన్నీ ఒకచోట అన్ని ఆధారాలతో దొరకవు. దానికి కారణం వాటిని గుదిగుచ్చి నేను ఇంత రాశాను అని చెప్పుకొని పొగిడిపోయే తత్త్వం కాదు ఆయనిది. చేరా అమెరికా నుండి తిరిగివచ్చాక ఆయన ఇంగ్లీషులో రాసిన ఒక తెలుగు గ్రామరు కాపీ ఐతే మేము కళ్ళారా చూశాం గానీ అది మళ్ళీ ఎవరో ప్రకటిస్తామని చెప్పి చేయకపోవటం మాకు కొంత నిరాశ కలిగించింది. అయితే చేరాగారి తెలుగు వాక్యం (1975), తెలుగులో వెలుగులు (1982), భాషానువర్తనం (2000), భాషాంతరంగం (2001), ఇంకా ఎన్నో వ్యాసాలూ ఆ పైన ఇంకో అముద్రిత తెలుగు భాషా వ్యాకరణం (ఇది ఇంగ్లీషులో త్వరలో ప్రచురణకు వస్తోంది) భాషాశాస్త్రజ్ఞులను ఆలోచింపచేసేవి. (ఈమాట భద్రిరాజు కృష్ణమూర్తి ప్రత్యేక సంచికలో చేరా భాషాపరివేషం (2003) ముందుమాట.) ఇవి వారి భాషాశాస్త్ర రచనలలో మచ్చుకు కొన్ని మాత్రమే. ఐతే వారి ప్రతిభకు రెండవ పార్శ్వం కూడా ఉంది. అది సాహితీ శ్రమజీవులను అబ్బురపరిచే విధంగా భాషాశాస్త్రాన్ని మేళవించి లక్షణ చర్చను రంగరించి తెలుగు ఛందోరీతుల సూత్రీకరణలు చేరావారి స్వంతం. ఐతే నేను చేరాగారి భాషాశాస్త్ర రచనలలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.
‘తెలుగు వాక్యం ఓ అయఃపిండ’మని అభియోగమున్నా దాన్ని చదివి అర్థంచేసుకొన్నవారే తెలుగు భాషాశాస్త్రజ్ఞు లని చెప్పాలనే నానుడీ ఉంది. తెలుగు వాక్యంలో కొత్తదనం తెలుగు వాక్య విశ్లేషణే అయినా పైకి కనిపించకుండా ఉత్పాదక పరివర్తన సిద్ధాంత ప్రక్రియ భావజాల పరిధిలో రాసిన తెలుగు వాక్య విశ్లేషణా దాని పరిభాషా కారణం కావచ్చు. కొన్ని సార్లు పరిశోధనా విషయంతోపాటు భవిష్యత్తులో భాషాశాస్త్ర విద్యార్థులు ఏయే విషయాలలో ఎంత లోతుగా పరిశోధన చేయాలో కూడా పేర్కొంటారు. ఉదాహరణకి, తెలుగు వాక్యంలో తెలుగు భాషపై క్రియాసహిత వాక్యాల గురించి చెబుతూ తెలుగు వాక్యనిర్మాణ రీతులను విశ్లేషించడానికి తెలుగులో క్రియల అర్థపరకమైన వర్గీకరణ జరగవలసి ఉంది అని చెబుతారు.
చేరా భాషాశాస్త్ర పరిశోధనలు
తెలుగులో బహువచనం మీద చేరా (1970,76) చేసిన పరిశోధన వారి విషయ విశ్లేషణకూ ఆపైన సూత్రీకరణకూ ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో తెలుపుతోంది. ముఖ్యంగా, ఇది వారి రాటుదేలిన పరిశోధనాపద్ధతికి గీటురాయి. ఇది ప్రపంచంలోనే అందరి మన్ననలందిన రెండు విశిష్ట సాంప్రదాయాల కలనేత. ఇది ప్రాచీన పాణినీయవ్యాకరణ పద్ధతినీ ఆధునిక పరివర్తనాత్మక ఉత్పాదక వ్యాకరణ ప్రక్రియనూ కలబోసి నిగ్గుదేల్చిన వంటకం. చేరాగారు బహువచనరూప నిష్పత్తికి (1970, 1982: 173-196) పదాంశ విధేయసూత్రాలు అనీ వర్ణవిధేయసూత్రాలు అనీ రెండు రకాల సూత్రాలను ప్రతిపాదిస్తారు. ఆ ప్రతిపాదనలో పదాంశ విధేయ సూత్రాలు సరైన సపదాంశ నిష్పాదనకు అవసరమైతే వర్ణ విధేయ సూత్రాలు వాటి ఉచ్చారణా రూపాలను నిష్పన్నం చేస్తాయి. వీటిలో 14 పదాంశ విధేయ సూత్రాలూ, 3 వర్ణ విధేయ సూత్రాలూ, (మూర్ధన్య కారక, స్వరసమీకరణ, వ్యంజనాలలోని అద్విరుక్తతా సాధక సూత్రాలు) ముఖ్యమైనవి. చేరాగారు పాణినీయవ్యాకరణ పద్ధతిలోని elsewhere నియమాన్ని పాటిస్తూ చేసిన ఈ ప్రతిపాదనలో కొన్ని అధికార సూత్రాలు అప్పటికే పదాంశ విధేయ సూత్రాల ద్వారా నిష్పన్న పదాలపై వర్తించి వ్యక్తరూపాలను సాధించడంద్వారా అపవాదాలను పరిహరిస్తారు. ఉదాహరణకు, స్వరపూర్వక రలనటడోపథలకు బహువచన ప్రత్యయంముందు లోపమూ ఆపైన మూర్ధన్యకారకసూత్ర ప్రవర్తనతో -ళ్ళు ఆదేశం.
చేరాగారి స్వరసమీకరణపై (1976) పరిశోధన నాకు ఇష్టమైన వర్ణశాస్త్ర పరిశోధనలలోకెల్లా ఉత్తమమైనది. అప్పటి వరకూ వచ్చిన తెలుగు స్వరసమీకరణపై వచ్చినవాటిని పరిశీలించి ప్రకటించిన పత్రం స్వరసమీకరణం. ఇందులో క్రియాపదాలూ నామపదాలూ రెండిటినీ కలిపి చేసిన సమగ్ర వర్ణన అది. అందులో స్వరసమీకరణ సామాన్య స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఈ కింది సూత్రాలను ప్రతిపాదిస్తారు.
- [α high] -> [α back]/_+[ α back]
(ఇక్కడ α అంటే: + {ప్రత్యయాలూ , క్రియలలోనూ};
-{నామపదాలలోనూ}; +/- {సంఖ్యావాచక పదాలలోనూ}) - [+back,+high] -> [+low] /(C)VC_C+V[+low]
మొదటి సూత్రం గ్రాంథికభాషకూ ఆధునిక భాషకూ వర్తిస్తే రెండవసూత్రం మాత్రం ఆధునిక భాషలో వచ్చిన స్వరసమీకరణ మార్పును సూచిస్తోంది.
చేరాగారి పరిశోధనలలో వర్ణనలలోనూ సూత్రీకరణలలోనూ నిర్ణయాలు చేసేటప్పుడు వ్యాప్తిని గురించిన లక్షణ పరిశీలన అత్యావశ్యకమైనదిగా పరిగణించేవారు. వీలైనంతమేరకు దేశకాలావధులను విధిగా దాటిపోయేవారు. అప్పుడే ఆ భాషాంశాల తత్తం బోధపడుతుందనుకొనేవారు. ఉదాహరణకు, తెలుగు వాక్యాలలో క్రియాస్తి నాస్తి విచికిత్స లో తెలుగులో క్రియారహిత వాక్యాలు అనీ ద్విదళ వాక్యాలు అనీ చెప్పుకునే వాక్యాలలో అనుసంధాన క్రియ (ఉండు లేక అవ్వు/అగు) కొన్ని వ్యక్త నిర్మాణాలలో కనపడకపోవడం మరికొన్ని నిర్మాణాలలో కనిపించడం (ఉదా. ఆయన ప్రొఫెసరు, ఆయన ప్రొఫెసరు కాదు మొ.), దీన్ని అనేక సమాన లక్షణ భాషలలో పరిశీలించిన ఉద్దండ పరిశోధకులైన యమునా కచ్రూ గారి క్రియాకాలబోధ వాదం, ఇ. అన్నామలై గారి సోదరభాషా సాక్ష్యాధార వాదం, పేరి భాస్కరరావు గారి వికల్పప్రయోగ వాదం, జె. గ్రీన్ బర్గ్ గారి పదక్రమ వాదం మొదలైనవాదాలు సమర్థించే ప్రక్రియ, గుప్తనిర్మాణంలో అలాంటి క్రియను ప్రతిపాదించి కొన్ని వ్యక్త నిర్మాణాలలో దాన్ని లోపింపజేయడాన్ని చేరాగారు తెలుగునుండీ ఇంకా అనేక భాషలనుండీ పరిశోధనలనుండీ సేకరించిన ఎన్నో సాక్ష్యాధారాలతోనూ రుజువులతోనూ ప్రతికూలం చేసి ఓ కొత్త ప్రతిపాదన తీసుకురావడమేకాదు పరివర్తనాత్మక ఉత్పాదక వ్యాకరణ ప్రక్రియలలో, గుప్తనిర్మాణ ప్రతిపాదనలు ఫ్యాషన్ అయిపోయినప్పుడు చురకల్లాంటి సూచనలను చేశారు. ఈ ప్రతిపాదనలు ఉన్న చిక్కులను పరిష్కరించకపోగా లేని చిక్కులను తెచ్చిపెడుతున్నాయనీ, గుప్తనిర్మాణం కామధేనువూ కల్పతరువూ కాదనీ వాదించి భాషా నిర్మాణాన్ని ఉన్నది ఉన్నట్లే చేయాలిగానీ మనకు కావలసినట్లుగా లక్షణ నిర్మాణం చేయటం అశాస్త్రీయమూ, అవాస్తవమూ అంటూ క్రియారహిత వాక్యాలు స్థితిబోధకాలనీ గుప్తనిర్మాణంలో క్రియే లేదనీ లేనిదాన్ని వ్యక్తనిర్మాణంలో లోపించాల్సినపనే లేదని స్పష్ఠంచేశారు.
చేరాగారి భాషాశాస్త్ర రచనలలో మరో అసాధారణమైన పరిశోధన ‘అని చేసే పని’. అందులోనూ అనుకృతి. ‘భాషనుగురించి భాషలో చెప్పటానికి అనుమతించే సాధనం అనుకరణ’ అని నిర్వచిస్తారు. అప్పటికి ఈ అనుకరణ గురించి అంతగా పరిశోధన జరగలేదని చెబుతూ విశాలవిశ్వాన్నే గర్భీకృతం చేసుకోగల శక్తి అనుకరణకి ఉందనీ తెలుగులో అనుకరణానికి చాలా విస్తృతమైన ప్రణాళికే ఉందనీ ఈ పరిశోధన వల్ల భాషలో అనుకరణ తత్త్వాన్ని పరిశీలించటానికి పనికి వస్తుందంటారు. భాషకు దేశకాల నిరవధికత్వాన్ని ఆపాదిస్తుందనీ అంటారు. అనుకృతి సర్వభాషాసామాన్య లక్షణం అనీ ప్రత్యక్ష పరోక్షానుకృతులను వేరు చెయ్యడానికి అన్ని భాషలకూ వర్తించే కొలమానం సర్వనామాల మార్పు మాత్రమేనని ప్రతిపాదిస్తారు.
ఇలాంటివి ఎన్నో విలువైన ప్రతిపాదనలేకాక అత్యంత ఆసక్తికరమైన విశేషవిషయం సర్వనామాల మార్పు. ఐతే అది క్రియాన్వయాభాసానికి దారితీస్తోంది. ఉదాహరణకు, ప్రత్యక్షానుకృతిలోని వాక్యం ‘అతను (నాతో) నేను ఉంటాను అన్నాడు’ => పరోక్షానుకృతిలో ఉత్తమపురుషకు తన్వాదేశంతో ‘అతను (నాతో) తను ఉంటాను అన్నాడు’ ఔతోంది. దీన్ని పరిష్కరించటానికి అనేక ఎత్తుగడలను చేరా ఎన్నుకొన్నారు. చివరికి, ‘ఉత్తమపురుష పరివర్తిత సర్వనామం కర్తగా ఉన్న వాక్యాల్లో వర్తించరాదు’ అనే ఆంక్షను విధించి క్రియా విభక్తి సంధాన సూత్రాన్ని అణిచిపెట్టి సాధిస్తారు. కానీ ఈ ప్రక్రియ సూత్ర రచనపై అధికభారాన్ని మోపుతుందనీ ఐనా, ఈ ఆంక్ష భాషాసిద్ధాంతానికే అవసరం కావచ్చు కాబట్టీ చివరికి దీన్ని భాషా సిద్ధాంతంలో భాగంగా ప్రతిపాదిస్తారు. పైపెచ్చు, ఇంకా మేలైన విధానం దొరికేవరకు ఇదే మార్గం అని తలుస్తారు. ఈ విషయాన్ని కొంచెం పరిశోధించి 1989లో అనుకుంటా నేనూ నా సహాధ్యాయీ రమణయ్య కలిసి క్రియా విభక్తి సంధాన సూత్ర పరివర్తన నిలిపివేయబడటానికి ఓ కారణాన్ని ప్రతిపాదించాం. క్రియా విభక్తి సంధానంతో వాక్యార్థభంగం కలగవచ్చుననే నెపంతో క్రియాన్వయాభాసాన్ని భాష భరిస్తుందనీ అంటే వాక్యవిన్యాసం కంటే అర్థనిరూపణే బలవత్తరం (semantics overrides syntax) అని ఊహించాం. చేరాగారి ‘అనుకృతి అని చేసే పని’ తెలుగు భాషాశాస్త్రంలో ఒక ఉత్కృష్ట పరిశోధన, పరిశోధకులకు పెనుసవాలు.
జీవి నాడిని పట్టి జీవతత్త్వాన్ని ఒక డాక్టరు ఎట్లా గ్రహిస్తాడో చేరా తెలుగు భాషా తత్త్వాన్ని ఇంకా చెప్పాలంటే ద్రావిడ భాషా తత్త్వాన్ని నామ్నీకరణాలతో ఆవిష్కరిస్తారు. విభక్త్యర్థక నామ్నీకరణంలో ఏయే నామ విభక్తులు లోపించి ఏయే నామాలు సాధ్యమో నిరూపించే లోతైన పరిశోధన ఇది. నామ్నీకరణ ప్రక్రియల్లో నామ విభక్తుల లోపాన్నిబట్టి అంతరువులు ఉన్నాయని ఏడవ దశకంలోనే నిరూపించిన ఘనత ఆయనది. అలాగే ఇతర నామ్నీకరణాలు, భావార్థక, విషయార్థక, ఇత్యర్థక, విధ్యర్థక నామ్నీకరణం మొదలైనవి తెలుగు వాక్య విన్యాసంలో గణనీయమైన పాత్ర కలిగినవే.
నేటి సహజభాషా ప్రక్రియలలో అత్యవసరమైన పద్ధతి, విస్తృతమైన, లోతైన (breadth and depth) విశ్లేషణ చేరాగారి స్వంతం. వివిధ కారకాలను సాధ్యపరిచే కారకవిభక్తులనూ క్రియావ్యాపారాలతో వాటికి ఉన్న సంబంధాలనూ ఆ సంబంధాలకు ఆధారభూతమైన నామాల అర్థపరక విశ్లేషణ ప్రాచీనుల సత్తావాదాన్ని తెరపైకి తీసుకువస్తుంది. ఒక విధంగా ఇది ఆధునిక పరిశోధనలకు మార్గనిర్దేశనమే.
తెలుగు భాషకు సంబంధించిన అన్ని రంగాలపైనా చేరా పరిశోధనలు ఎంతో కొంత మేరకు ప్రభావం చూపించినవనే చెప్పుకోవాలి. అమెరికాలో మేడిసన్లోని విస్కాన్సిన్ ఆ తరువాత కార్నెల్ విశ్వవిద్యాలయలలో ఆచార్యులైన కెలీ గారిదగ్గర చేసిన శిష్యరికంలో ఆధునిక పశ్చిమ సంప్రదాయంలో తెలుగు భాషపై ప్రత్యేకంగా ఫొనాలజీ, మార్ఫాలజీ ఇంకా ప్రత్యేకంగా సింటాక్సు రంగాలలో విశేష కృషి చేశారు. ఈ రంగాలలో చేరాగారు ప్రకటించిన వ్యాసాలూ రాసిన గ్రంథాలూ వాటిపై ఆయనకు ఉన్న శ్రద్ధాసక్తులనేగాక ప్రావీణ్యాన్ని గూడా పట్టిచూపుతుంటాయి. ఇవి వారి రచనలలోనే గాక చేరాగారి విద్యార్థిగాకూడా నాకు అనుభవంలోకి వచ్చిన విషయాలే. తరగతిగదిలో కూడా ప్రత్యేకంగా ‘ఎనలైటికల్ టెక్నిక్స్’ క్లాసులో ఆయన ప్రవర్తన గంటన్నరసేపు ఊదరగొట్టే ఉపన్యాసంతో గాకుండా ఏ ‘లాజిక్’ క్లాసులోనో ‘మేథమాటిక్స్’ క్లాసులోనో ఉన్నట్టు ఉండేది. ఓ విదేశీ భాషలో ఓ సమస్యను ఇచ్చి మమ్మల్ని ఆలోచించమని చెప్పి పది నిమిషాలకు ఓసారి పది నిమిషాలపాటు దానిగురించిన గుప్తతత్త్వాన్ని వ్యక్తపరిచేవారు. అదీ చేరాగారి క్లాసు. ఆ వాక్యాలు చాలు మనని ఇంతగా ప్రభావితం చేయటానికి. నాకు ఇప్పటికీ గుర్తే కహ్ము అనే ఆస్ట్రోనేశియను భాషలో ఓ సమస్యను బోర్డుమీద రాసి పరిష్కరించమని (సాల్వుచేయమని) చెప్పి కూర్చున్నారు. నేనొక్కడినే దాన్ని పరిష్కరించినప్పుడు ఆయన నన్ను మెచ్చుకోవడమూ దానికి నేను ఉప్పొంగిపోవడమూ జరిగింది. ఇట్లాంటి అనుభవం నాకే కాదు మరెందరికో నాకంటే ముందూ తర్వాతా ఉందనీ ఉంటుందనీ తెలుసు.
ఉపయుక్తరచనలు
- ఉమామహేశ్వరరావు గారపాటి. 2005. బహువచనరూపాల సంగణనాత్మక విశ్లేషణ. మం.వే.రమణయ్య, క. తోమాసయ్య (సం.) తెలుగు భాష, సిద్ధాంతం-అనువర్తనం, 62-78.హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
- ఉమామహేశ్వరరావు గారపాటి, మం. వే. రమణయ్య. 1987. తెలుగులో అక్షర నిర్మాణం. తెలుగు. పునర్ముద్రణ, 2009.22-46. హైదరాబాదు: తెలుగు అకాడమీ.
- Uma Maheshwara Rao, G,. 2001. Syllable Parsing and Vowel Harmony in Telugu: A Non-Linear Analysis. In B. Vijayanarayana et al (Eds.) Language Matters, Papers in Honour of Prof. Chekuri Ramarao. Hyderabad: Booklinks Co.
- కృష్ణమూర్తి, భద్రిరాజు. 1977. ప్లూరల్ ఫార్మేషన్స్ ఇన్ తెలుగు (రాతప్రతి). ఉస్మానియా విశ్వవిద్యాలయం.
- కృష్ణమూర్తి, భద్రిరాజు, గ్విన్, జె.పి.ఎల్. 1985. ఎ గ్రామర్ ఆఫ్ మాడర్న్ తెలుగు. ఢిల్లీ:ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్.
- రామచంద్రరావు, సి. 1975. తెలుగు బహువచనం. తెలుగు 4, 44-51.పునర్ముద్రణ; తెలుగు వర్ణం. 31-49. హైదరాబాదు: చందనా ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్.
- రామారావు చేకూరి, 1970. తెలుగులో బహువచన రూప నిష్పత్తి. భారతి 476, 12-25. పునర్ముద్రణ: తెలుగు లో వెలుగులు. 1982. 173-196. హైదరాబాదు.
- Ramarao, C. 1975. Dravidian Evidence for Abstract Phonology. OPiL, 1:30-44.
- రామారావు చేకూరి, 1976. మరోసారి తెలుగు లో బహువచనం. భారతి 53.12. పునర్ముద్రణ: తెలుగు లో వెలుగులు. 1982. 197-208. హైదరాబాదు:ఆంధ్రసారస్వతి పరిషత్తు.
- రామారావు చేకూరి, 1976. Vowel Harmony in Telugu. Papers in Linguistic Analysis, vol.1.1:25-36.
- Ramarao, Chekuri, 1976. Rule Chase. Indian Linguistics, vol.39:183-8.
- Ramarao, Chekuri, 1986. The Treatment of Syntax in Bala and Proudha VyakaraNas. Osmania Papers in Linguistics, vol.12:23-35.
- రామారావు చేకూరి, 2000. భాషానువర్తనం (భాషా వ్యాసాలు). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
- రామారావు చేకూరి, 2001. భాషాంతరంగం (భాషా నిర్మాణ వ్యాసాలు). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
- రామారావు చేకూరి, 2002 (ప్రథమ పరిష్కరణ 1975, రెండవ పరిష్కరణ 1999). తెలుగు వాక్యం, పదవర్ణ సహితం. హైదరాబాదు:నవోదయ బుక్ హౌజ్.