ఈమాట సెప్టెంబర్ 2015 సంచికకు స్వాగతం!

తాము చేసే పని మీద శ్రద్ధాసక్తులు, తమ పనితనం పట్ల గౌరవము, గర్వము, అభిమానమూ లేనివారి పని ఫలితాలు ఎంత నాసిరకంగా ఉంటాయో చెప్పడానికి మన తెలుగు ప్రచురణారంగం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగులో ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా మనం గర్వంగా చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు; నాణ్యతకు ఉదాహరణగా చూపించగలిగే పుస్తకాలు బహుకొద్ది. విషయం ఏదైనా పుస్తకం కూడ ఒక వస్తువే. దానికీ నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రచురణ అంటే కేవలం అచ్చేయడం కాదనీ, ఒక మంచి పుస్తకం అనేది శ్రద్ధతో అభిమానంతో రూపు దిద్దితేనే సాధ్యమనీ, అవి లేకపోవడమే మన ప్రచురణ సంస్థల ప్రస్తుత పరిస్థితికి కారణమనీ, తమ వ్యాసం తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలులో శ్రీనివాస్, నాగరాజు, నారాయణరావు తమ అభిప్రాయాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు, ప్రస్తుతం తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే ఔత్సాహికులకు ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలో వివరిస్తున్నారు కూడా.

తెలుగు గ్రంథాలలో అత్యంతకఠినమైనవాటిలో అగ్రగణ్యంగా, వసుచరిత్రం కంటే దుర్లభమైనదిగా పరిగణించబడే గ్రంథం, 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానాన్నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు, రామరాజభూషణునికి సమకాలికుడు అయిన సురభి మాధవరాయలు రచించిన చంద్రికాపరిణయముఅనే మహాప్రబంధం. ఈ గ్రంథానికి కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు వ్రాసిన టీకాతాత్పర్యసహితవ్యాఖ్యానంతో కూడిన ప్రతి ఆఖరిముద్రణ 1928లో. ఆ ప్రతి ఇప్పుడు అలభ్యం. అపురూపమైన ఆ ప్రతి సాధించుకుని, షుమారు ఏడు వందల పేజీలు అక్షరం అక్షరమూ అచ్చుతప్పులు దిద్దుకుంటూ, కేశవపంతులు నరసింహశాస్త్రి, శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతములు జత చేస్తూ, యూనీకోడ్‌లో తిరగ వ్రాసి ఈమాట గ్రంథాలయం కోసం అందచేశారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. వారి అద్వితీయమైన శ్రమకు, ప్రాచీన సాహిత్యం పట్ల వారి నిబద్ధతకూ ఈమాటనుంచి వారికి హృదయపూర్వక అభినందనలు.


ఈ సంచికలో:

  • కథలు: టూఎయిటీన్‌డీ – స్వాతికుమారి బండ్లమూడి; వెడలెను కోదండపాణి – ఆర్. శర్మ దంతుర్తి.
  • కవితలు: సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు – అనామిక; సినిమా – సాంఘిక; ఎందుకో అలా – నవీన్ నంబూరి; మాటల అక్షరాలు – స్వాతీ శ్రీపాద; దృశ్యం – విన్నకోట రవిశంకర్; ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా – కనకప్రసాద్.
  • వ్యాసాలు: శ్రీమాన్ రీమాన్ ఉవాచ – వేమూరి వేంకటేశ్వరరావు; చిత్రం బాపురే విచిత్రం – సాయి బ్రహ్మానందం గొర్తి; ఒక పద్ధతి ప్రకా…రం – కనకప్రసాద్; తెలుగులో పుస్తకప్రచురణ-ఆకారవికారాలు – పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజు, వెల్చేరు నారాయణరావు.
  • పద్యసాహిత్యం: పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం – ఏల్చూరి మురళీధరరావు; నాకు నచ్చిన పద్యం: దాంపత్య మహిమ, కవిత్వ మాధురీమహిమ – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: అదీ ఇదీ వదలితే – కనకప్రసాద్; పిఠాపురం జనరంజని – పరుచూరి శ్రీనివాస్; ప్రార్థన: నువ్వే నేనవ్వు – 1వ భాగం – పాలపర్తి ఇంద్రాణి.