రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

దర్శనము

రచన: పరిమి శ్రీరామనాథ్
జూన్ 2025

ఆయాహి వరదే దేవి త్ర్యక్షరే బ్రహ్మవాదిని ।
గాయత్రి! ఛన్దసాం మాతర్బ్రహ్మయోని నమోఽస్తు తే ॥

( సిద్ధాశ్రమం. విశ్వామిత్రుని నెలవు. ఉషఃకాలం.)

అరుణిమ లావటిల్లికొనె నంతట కొంచెము కొంచెమై తమో
వరణము జుంజురించినది ప్రాకృతకాంత యెడందలో విమో
హ రహిత శీత వాతములు హత్తుకొనంగ దినాదివేళ పొం
పిరి నవశాంతులావరిలె పేరుకొనెన్ రమణీయశీలముల్.

తలిరాకు పరీవార ము
పలాలనమొనర్ప కొలువు పాటించి కుహూ
కలరవ రాజ్యాంగ సరణి
వెలయించుచు పికవిభుండు వెలసె తరువుపై.

జారిన మంచుబిందువుల జాడలలో నది శీకరాళులొ-
ప్పారి సుఖోపగూహనము పండు కెలంకున కౌశికుండు వి
స్తార విచార వేపథు నిజాంతర చిత్తము నెమ్మదింపగా
తీరిచి పద్మభంగిమను దివ్యవిధమ్మున కూరుచుండినన్.

వాలిన కంటిరెప్పజతపై కుసుమించిన శోణరోచులం
దేలుచు నక్షమాలనొగి తేట మెదల్చుచునున్న యంత విం
తై లలిగాలి యొక్కటి సుతారముగా స్పృశియింప చిత్రవ
ర్ణాల శచీశచాపకిరణమ్ములు తాకుట తోచె మౌనికిన్.

తెలిసిన తల్లడింపు వెనుతీవియ నంతటనాక్రమించి గుం
డెలు వడి దద్దరిల్ల – కబళించిన యుగ్రతపోవ్యథా ఘన
మ్ములిటు ముహుర్ముహుర్మనన మోదములై పరిపాకమందగా
సులలిత నేత్రముల్దెరచి చూచెను గాధిజుడల్ల నల్లనన్.

వన్నెల పూలకొమ్మ, పరభావసమాధులలోని చెమ్మ, యా
పన్నుల వెన్నెలమ్మ, తొలిపాటల కమ్మని పొందికమ్మ, సం
ఛన్న విమోహజాత తమసమ్మును చీల్చు నిజప్రభావముల్
మున్నుడి గాగ నిల్చె ముని ముంగిట సౌరమహావిభూతులన్.

ముత్యము పగడమ్ము, సువర్ణము ధవళమ్ము
నీలమను వర్ణచయము రాణించు తావు;
సంహితోపబృంహణ సీమ, సన్నిభృతము
సాంధ్యకాలోదయానంతశక్తి యామె –

ఒక మోము నవ్వెనా వికలమౌ భవవల్లి
ఐదుమోముల నవ్వులల్లుకొనియె
ఒక చేయి సాకెనా సకలమ్మధీనమ్ము
పది చేతుల కరుణ పల్లవించె
ఒక కాంతి సోకెనా వికసించు జన్మము
వదనపంచక కాంతు లొదవె నంత
ఒక తత్త్వమమరెనా పెకలించు భయరాజి
తత్త్వసర్వస్వమ్ము తరలివచ్చె

ఆ తరళ ఘనసౌందర్యపాత మడరి
తనను ముంచెత్త నిలువెల్ల తడిసి తడిసి
గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.

రావమ్మా వరదాయినీ! కనులలో రాజిల్లవమ్మా, జపా
రావమ్ముల్ ముఖరించి నిశ్చలత కారామమ్ముగా మారె నా
భావాగారము నిన్ను పోల్చుటకు విశ్వాసప్రియే! రమ్ము, యీ
జీవున్ దీపముగా త్వదీయ పదరాజీవాగ్రమందుంచెదన్.

గాదిలి చూపు లేశమునకైనను కానొ మదంబ! యన్న యీ
చేదు జడాస్థిపై కురియజేయ దయామృతమొక్కసారిగా
వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు మూ-
డైదుల కళ్లతో- నెటుల నానుదునో భవదీయదృక్కులన్.

వీనులతో చెలంగి నిను విన్న క్షణమ్మున నుండి జీవసౌ-
ధాన పునాదిగోడల కుదారజవమ్ము లభించెనమ్మ వీ-
ణై నినదించి నీ మనువు నార్తమనమ్మొక సూక్తమయ్యె నా
ప్రాణము పొంగువారినది స్వర్గధునీసమమైన వెల్లువై

కామచితాగ్నిలో కరుడుగట్టిన దేహము వ్రేల్చి బుద్ధి కెం-
దామర గ్రోధశైలముకు దబ్బున నేచి మృతుండనై సవి-
త్రీ! మలిజన్మనొందితి దలిర్పగ నీ సముఖమ్ములో నితాం-
తామల ధాతుమంజరికనై యమృతాంశువులన్ రచించెదన్.

పూసకు పూసగా కదుపబోవగ నీ మనుతల్లజప్రమా
శ్వాసము నొందు నా మనసు వారకమై జపమాల చాలనం-
బే సరిలేని రీతిని లయించిన తీయము లందగించి పే-
రాసను లేవదీసినవి యాగమవజ్రఖనీ! తపమ్ములో.

ఓ మనన జనావనకళా! యోగభూమి
కానుఖేలన శీలా! నిరంతరమ్ము
ప్రాపువై యుండవమ్మ పరాకు జేయ
క గొని రక్షింపవమ్మ యీ గాధిసుతుని.

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    శిరీష June 3, 2025 7:49 am

    ప్రతి పద్యమూ కావ్యమే ఎంత గాయత్రీ మంత్ర మహిమ. ఈ పద్యాలను కవి చేత వ్రాయించగలిగిందో? ఇలాంటి కవితలు ఈ కవి కలంనుండి మరెన్నో వచ్చేలా గాయత్రీదేవి దీవించు గాక 🙏🌷

  2. 2
    Srinivasa Nyayapati June 3, 2025 6:42 pm

    శ్రీరామనాథ్‌గారూ,

    “మూడైదుల కళ్లతో నెటుల నానుదునో భవదీయదృక్కులన్.” You caught me here! ఎంతో కొత్తగా ఉంది. అయితే, ధాతుమంజరికా అన్న మాటకు అంతరార్థమేమై ఉంటుందా అని! నిజానికి ముందే చెప్పాలి, సర్. మీ పద్యాలంటే నాకు ఇష్టం. పద్యంలో balance ఉంటుంది, మందాకినీ ప్రవాహం మాదిరి.

    -వాసు-

  3. 3
    కామేశ్వరరావు June 7, 2025 1:39 pm

    మంత్రదర్శనాన్ని ఒక కవితగా వ్రాయాలన్న ఊహ అపూర్వం!

    దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.

    “గొంతు తడియార, తడినిండ నంతరమున
    మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
    “వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”

    సమార్ద్రమైనభావాలు.

    రెండు చిన్న సూచనలు:
    “విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.

    “బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: ఒక కవి చూపించిన బ్రతుకు తెరువు
  • నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం
  • నాకు నచ్చిన పద్యం: ఒక మధురార్తిశీలి కురిపించిన వేదనాశ్రువులు
  • రామరసాయనము
  • నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం

ఇటువంటివే…

  1. మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)

జూన్ 2025 సంచికలో ...

  • Colonial Park
  • అక్కమహాదేవి వచనాలు – 6
  • అనువాద ప్రస్థానం
  • ఊరట
  • ఎండ్‌లెస్
  • కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు
  • కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్
  • చలం గురించి…
  • చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ
  • చలం సాహిత్యం-విముక్తి
  • జూన్ 2025
  • దర్శనము
  • దేశీయ భాషల భావిగతి
  • నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము
  • పంచేంద్రియాలు: 4 రుచి
  • పదప్రవాళం
  • పునః
  • పున్నమ
  • పుస్తక సమీక్ష: గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాల చిత్రణ
  • పుస్తక సమీక్ష: బంగారు తండ్రి
  • ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన
  • మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)
  • యూట్యూబ్‍లో ఈమాట: మే 2025
  • లీల … కేదార్‌నాథ్ డైరీ
  • షాంగ్రి-లా – 2
  • హిందూ మతం అంటే ఏమిటి?
  • ౙాబిలి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పదప్రవాళం
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.