నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం

చం.
ప్రకృతి వధూటి! వుష్పఫల పత్ర రసాల విశాలవాటులన్‌
శుకపిక శారికారుతులు సోలము పెంప ముదంబునింపఁ జం
పక నవమల్లికా కునుమ మంజరి క్రొమ్ముడి గందగింప నె
మ్మొకము దరస్మితంబగుచు బ్రుంగిన మల్లకు సేదదీర్పఁగా
సకి వనలక్ష్మిరాధికయు సల్లపనామృతసారధారలన్‌
జికిలుప దక్షిణానిలము చిత్తముజిల్లనఁ గౌఁగలింప ను
త్సుకమతిఁ దూఁగుటుయ్యెలలఁదూఁగవు; మోహతమంబుగాఁ దటాం
తికమున సన్నగాలి వడదేరెడు శాఖలతోడి వృక్ష పం
క్తి, కదలుముంగురుల్ గలిగి దివ్యరుచిస్మితయుక్తులై న బా
లకులను మూపులందిడి చెలంగెడు చూపఁఱ గాఁగ దేవక
న్యకల యనుంగురూవులకు నానలు దెచ్చుచు శుద్ధవాహినీ
సికతల మందవాయువులు జిల్లనియాఁడఁగ బెక్కణంబు స
ల్పక మనెదేల? తామరకొలంకులఁ బద్మినులోలగింప హం
సికలకు మాన్మథీఘుటిక చెందమి రేకుల నిచ్చిమున్నుద
ర్పక పరమార్చనానియతి రాల్చిన రక్త సరోజపత్రముల్‌
సకియలపై విదిర్చికొన జక్కవలుల్లసమాడు మాడ్కిఁ జూ
చుకముఖవిభ్రమత్స్న విచుంబి సితాంశుకమల్లలలాడ మౌ
క్తికముల సస చల్లికొను తీరున శీకరపంక్తులొండొరుల్‌,
మొకములఁ జల్లఁజల్ల దెలిమోములఁ జెమ్మటలూర జిత్తవం
చక జలకేళిసల్పి స్మరశంభళినంపి నుపర్వకోటిఁ బి
ల్వక యిటు వేఁగుదే? భువనవర్ణిత మాధవమైన నీముఖ
ప్రకటిత చంద్రికారసము వ్రాలిన మంచు ముసుంగుతోడ క
ప్పి కురులువీడి క్రొమ్ముడికి వ్రేఁగుఁదనంబఱఁ బ్రాతరాత్త పు
ష్పకమకరంద బాష్పకణ పంక్తులతో వగదేలెదేల, హా!
యకట, కటా! కనుంగొనితినవ్యయ నవ్యయశోధనుండు స
త్సకలకలాకలాప వసుధాతలనాయక కోటినుత్యుఁ డ
త్యకలుషచిత్తుఁ డార్యజనార్చితుఁ డాగమశాస్త్రకోవిదుం
డకుటిల సాహితీవిభవుఁ డంచితపాండవకీర్తి మాడభూ
షికులజుఁ డార్యసన్నుత నృసింహతనూజుడు వేంకటార్యుఁ డె
న్నికఁ ద్రిదశాలయంబు చొరనేర్చెఁ గటా! హరిపాదనీరజ
ద్వికమఖమేది భక్తిమయ విత్తమునం గనుగొన్నవాఁడహో!
సుకవులు దివ్యసుందరుల చూడ్కులకు మ్మురువైనవాఁడు శా
రికలు శుకాంగనల్‌ నది ఝరీనటనైక తరంగమాలికల్‌
వికచ సరోజషండములు విస్ఫురదభ్రసరస్సితాబ్జ తా
రకలు పటీర భూధర చరన్మృదు మారుతముల్‌ సరస్వ దూ
ర్మికలు వనాంతవాటికలు ప్రేపులు రేలు విరాళిఁ గుందు, నో
సుకవివరేణ్య! చంద్రధరజూట భవత్తటినీ ప్రవాహ మా
డికి వడి మర్త్యలోకమునడిగ్గి బలీంద్రు పదప్రణామ భం
గికయి రసాతలంబరిగె నీదుకవిత్యఝరీ మహాత్వమే
మొకొ జగతీశులన్ బరమమోద సముద్రమునందు ముంచి ది
వ్యకవుల పాండితీ మహిమ వన్నె యెరుంగఁగఁ బొంగిపొంగి మీ
దికెగసి నాకలోకవినుతింబొలుపారె కవీంద్ర! భూమినే
టికి విడనాడి మాకిట గడించితి దుఃఖ విషంబు భూమివం
చకులకునోడితో నముచిశానన గోష్ఠినలంకరింవ నా
రకచనితొక్కొ! రంగనగరంబున వాసముఁ గోరి యింతలో
న కడఁకఁ ద్రిప్పి కేశవుఁననారతముం భజియింప బోతె స్వ
శ్చకితకురంగ నేత్రలకు సాహితియో భరతాదినాట్య సా
ధకమొ విపంచికాలపన ధర్మమొ నేర్పెదె! పారికాంక్షి స
ప్తకమున కంచితౌపనిషదంబగు తత్వము నేర్పఁ బూనితో!
వెకలి, నెరుంగఁజెప్పు పృథీవీసుర తావకవిప్రయోగ వ
హ్నికిఁ గడు దూపిలెం బ్రకృతి, నిర్ఝరవారి మిషాశ్రుధారలం
బ్రకట మహీ ధరంబులును, పంకజవైరియుఁ బాండుతాకళన్
వికృతదివావధూటి కడువేగిన యూర్పులచే, నహోధ్వనిన్
బికములు, ముచ్చరింపవినవే? కవితామధురామృతంబు ని
ప్పుకలఁ బొరల్చినట్లు వగఁ బొందెడు మన్మథుఁబైనఁ జల్లవే?
చకిత మరాళి వర్షఋతుసంగతిఁ గ్రౌంచ బిలంబు దూరి త్వ
న్నికటము నేరుదానికుపదేశము సేయు భవత్కృతి ప్రణా
ళికన దిశారదంబు తఱి లీలమెయింజనుదేర నేర్వరా
దొకొ వగమాకు, దివ్యకవితోజ్వల! వందురియేమి చెప్ప త్వ
త్సుకృతి, శకుంతలాచరిత సూక్తికి కిన్నెరలందు దేవవై
ణిక తతియేమిపాడునొ? ఫణిప్రమదావళి వీనులెట్టివో
సకల మెరుంగ నెవ్వరికి శక్యము?. ..మానిని! యో శకుంతలా!
యొకతియ నీవుధన్యవ తనూన్మద తాప వసంతవేళ మే
నక యెటు గాధినందనుని నామముతో శృతిఁ గూర్చి పాడెనో
మకరపతాకు క్రొమ్మెరుగు మార్గణ ధాటికయెట్టి దొక్కొ కౌ
శిక నికషోపలోరసి నిషేచక తన్మకరీ కలాపచం
ద్రక మెటువంటిదో శిశుకరక్ష శకుంతము లేవొ మాలినీ
సికతల గూఢరత్నముల చెల్వములెట్టివొ కణ్వమౌనియ
త్యకలుష వీతిహోత్రరుచులగ్గలమో యనసూయశీతలో
పకృతియతీతమో పరమపావన చక్రి ఝషంబులూర్ధ్వ లో
కకృతములో యెరుగంగల కాలమువర్ధిలు నీదుజన్మమే
సుకృతము కాళిదానునకు జొప్పడ కీర్తిసుమంబొనంగితీ
నుకవికి వేంకటార్యునకు నూక్తుల నిచ్చితి నిన్భజింప మా
మక కవితావిలాసినికి మవ్వముచాలదు వేంకటార్యక
ల్పకముల నీడలం దమరభామలతో నడయాడి యాడి యొ
క్కొకతరి మిమ్ము నిల్పుమెదఁ గూరిమి నీకవనీతలంబునుం
డి కవితదక్క యే మొసఁగ డెందము కొందలమాఱు సత్కవీ!

ఈ దేశంలోని కవిత అది మార్గకవితైనా దేశి కవితైనా ప్రధానంగా చతుష్పాది. నాలుగుపాదాలు ఉన్నదానికే పద్యమని పేరు. (పద్యం చతుష్పదీ తచ్చ వృత్తం జాతిరితి ద్విధా – ఛందో మంజరి.) అక్షరాలు లేదా గణాలు ప్రధానంగా కల పద్యానికి వృత్తమని, మాత్రలతో లెక్కించబడే పద్యానికి జాతి అనీ పేరు. ఈ నాలుగు పాదాల నిబంధన వల్లనే ద్విపదను ద్విపద అనీ షట్పదిని షట్పది అనీ పిలువవలసి వచ్చింది. ఒప్పా కాదా అన్న సంగతి పక్కనపెడితే, ఇప్పుడు వ్యవహారంలో పద్యమన్న పదం కవితకు పర్యాయ పదమైంది. గణాలూ మాత్రలూ లేకపోయినా, కవితలో ఎన్ని పాదాలున్నా పద్యమన్న పేరును వాడుతున్నారు.

నాలుగుపాదాల నిడివిని దాటిన పద్యాలను మనం మాలికలన్నాం. సంస్కృతంలో మాలికలు లేవనే చెప్పాలి. తెలుగులో మాలికలకు ప్రాధాన్యం హెచ్చు. కావ్యాలలో మాలికలకన్నా ఆశువుగా కవననైగనిగ్యాన్ని ప్రదర్శిస్తూ కవులు చెప్పిన మాలికలు ఎక్కువ జనాదరణకు నోచుకొన్నాయి. పరిమళం పూలనుండే కాదు, పదాల నుండి కూడా పుడుతుందని, ఆ వాసన నాసికకు కాదు మనసుకు పడుతుందని, దాని వ్యాప్తి కళ్ళకు కాదు చెవులకు తెలుస్తుందనీ ఆనాటి భువనవిజయంలో చూపించిన అల్లసాని పెద్దన 29 పాదాల ‘పూఁతమెఱుంగులుం బసరు పూఁపబెడంగులు’ అన్న అన్యతోసాధ్యమైన హృదయంగమ మాలిక ఏదో అనూహ్యశక్తి సంకల్పం వల్ల నేలకు దిగిన కవితావతారం.

తరువాత భట్టుమూర్తి ‘లొట్ట యిదేమి మాట పెనులోభులతో మొగమోటమేల’ అనే 26 పాదాల మాలిక దగ్గర నుండీ కరుణశ్రీ వ్రాసిన కవితా వైజయంతి (దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి… -24గీట్లు) వరకూ మేలుజాతి మాలికలు ఒక వైపైతే, ఆశువులలో అవధానాలలో పండితకవుల పద్యమాలికలొకవైపు. వీటిని చెప్పిన వారు తిరుపతివేంకటకవులు (బాలుడవీవు నీ కవిత బాలిక గాదు… -35 గీట్లు; ఇత్యాది); కొప్పరపు కవులు (తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వరులార!, కందువ మాటలున్ జిగినిగారపు చేతలు… ఇత్యాది); గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారు (శ్రీరమణీయులార! సరసీరుహనిత్య మరందమాధురీ సార వచస్కులార… -45 గీట్లు; మును భోజాధికవిక్రమార్క ముఖ భూపుల్… -60 గీట్లు; వ్యాసుండన్న పురాణవక్త, అతడా? పాండిత్యహీనుండు… -52 గీట్లు); శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి (వీరు తెలుంగు సాములు… -34 గీట్లు; ఏ యెడనో అదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందుకెందుకో… -60 గీట్లు).

వీణావాదనకౌశలంపై కృష్ణమూర్తి శాస్త్రి చెప్పిన ఈ మాలిక ఆంధ్రసాహిత్యంలోనే నిరుపమానమైనది. సంస్థానికులపైనా వీరి మాలికలున్నవి. మారేపల్లి రామచంద్రశాస్త్రి రవివర్మ యొక్క మేనకావిశ్వామిత్రుల చిత్రాన్ని వర్ణిస్తూ ఆశువుగా చెప్పిన 24 గీట్ల మాలిక (ఈ మాలికవల్లనే ఈయనకు ‘కవి’ అన్న బిరుదు దక్కిందట), కాశీ కృష్ణాచార్య (పొలపుల నొల్కు లేముగుద… -23 గీట్లు); ఆదిభట్ల నారాయణ దాసుగారు (షేక్స్‌పియర్ As You Like It నాటకంలోని All the world’s a stage అనే ఘట్టాన్ని అద్భుతరసాస్పదంగా ‘అరయగ నాట్యశాల జగమంతయు…’ అనే 24 గీట్ల చంపకమాలికగా మనోహరంగా వ్రాశారాయన) మొదలైనవారు అనేకమంది ఉన్నారు. అముద్రితగ్రంథచింతామణి సంచికలకే వన్నె తెస్తూ మండపాక పార్వతీశ్వరకవిగారు రచించిన మాలికలు తెలుగు కవితాపిపాసువులు మర్చిపోలేనివి. గొడ్లవర్తి వేంకనమంత్రి 2800 పాదాల రామాయణ మాలిక, వేదుల సత్యనారాయణ శర్మగారి రామాయణమాలిక ఇత్యాదులు మాలికలపై తెలుగువారికున్న ప్రేమను రూఢి చేస్తున్నాయి.

ఈ మాలికల్లో కవులు పెద్దన యొక్క మాలికశైలిని అనుకరించడాన్ని మనం గమనించకుండా ఉండలేం. కాశీకృష్ణాచార్య వంటి వారైతే, పెద్దన మాలిక నమూనాను కావాలని అనుకరిస్తూ కవితలో సగభాగం తెలుగు పదాలతో వ్రాసి, మిగతా సగం సంస్కృతపదాల పోహళింపుగా వ్రాశారు. మాలికలలో వస్తుస్వీకృతి అనేక రకాలుగా మార్పు చెందింది. వడ్డాది సుబ్బరాయుడు అనే కవి స్టీమరు మీద 112 గీట్లతో ఒక చంపకమాలికను వ్రాశారు. జలదుర్గం వెంకన్న అనే కవి అంగీకి తాను సరిపడినంత వస్త్రమిచ్చినా అది చాలలేదని బొంకిన దర్జీపై స్వచ్ఛమైన తెలంగాణ యాసలో ‘ఓరి యెంకన! దోస్తిదారుడా’ అంటూ చెప్పిన సీసమాలిక దర్జీమాలికగా పేరు పొందింది. పెదమందడి వెంకటకృష్ణకవి కర్నూలు జిల్లా పార్వేట ఉత్సవసభావర్ణనగా చెప్పిన మత్తేభమాలిక ఒక అందమైన మాలిక కాగా, సంతాననిరోధకవస్తువులలో ఒకటైన లూప్‌ను వస్తువుగా తీసుకొని పల్లా రామకోటార్యుడు చెప్పిన 134 చరణాల ఉత్పలమాలిక మాలికాకవితలలోనే విలక్షణమైనది. 360 రకాల వడ్లను ఉటంకిస్తూ చించాపట్టణం లక్ష్మణాచార్యులుగారు చెప్పిన బహువ్రీహిసీసమాలిక, చేపూరు లక్ష్మయ్య, పెరంబుదూరు శ్రీనివాసాచార్యులు వివాహానికి కావలసిన వస్తువులపై చెప్పిన సీసమాలికలు, గోవర్ధనం వెంకట నరసింహాచార్యులవారి అశ్వలక్షణసీసమాలిక కూడా విలక్షణమైనవే.

మాలికలలో చారిత్రకవిజ్ఞానాన్ని ఇచ్చేవి ఉన్నాయి. ఇదొక పరిశోధనాంశం. ఎల్లాగౌడ్ అనే కవి 1911లో వచ్చిన మూసీ వరదలను వర్ణిస్తూ ఒక సీసమాలిక చెప్పాడు. 18వ శతాబ్దపు కందుకూరి రుద్రన యొక్క నందవరీక వృత్తాంతసీసమాలిక, కపిలవాయి లింగమూర్తిగారి 149 చరణాల తెలంగాణా సంస్థానమాలిక మొదలుకొని, వంశ గోత్రాల మాలికలు, జిల్లాలలోని గ్రామాలపేర్లను వరుసగా చెప్పే మాలికలూ ఉన్నాయి. తెలుగు భాషోద్యమంలో మాలికలది ఒక విశేషమైన పాత్రగా చెప్పవచ్చు. సెట్టి లక్ష్మీ నరసింహం స్త-ప్రాసతో ‘కొత్త తెలుగు’ అన్న పేర శిష్టవ్యవహారికాన్ని సమర్థిస్తూ ఎనభై పాదాల శార్దూల మాలికను వ్రాస్తే, దానికి విమర్శగా అదే స్త-ప్రాసతో గ్రాంథికభాషను సమర్థిస్తూ 98 గీట్ల చంపకమాలికను నండూరి మూర్తిరాజు, 80 గీట్ల ఉత్పలమాలికను పప్పు మల్లికార్జునుడు వ్రాశారు. సెట్టి వారిదే చిత్రమాలికలు అన్న కృతి ఉన్నదట. అందులో రవివర్మ యొక్క ఒక్కొక్క చిత్రాన్నీ ఆయన ఒక్కో మాలికలో వర్ణించారట.

ఈ మాలికలలో ఒక వస్తువును వర్ణించడమే ప్రధానంగా కనబడుతుంది. అయితే, మాలిక అనే శిల్పాన్ని ఒక నూత్నమైన చూపుతో చూసి దాన్ని ఒక మలుపుతిప్పిన వ్యక్తి మానవల్లి రామకృష్ణ కవిగారు. రామకృష్ణకవి 75 పాదాలున్న ఒక మాలికను వ్రాశారన్న సంగతే నాకు ఆశ్చర్యకరమైంది. దీన్ని ఆయన వ్రాసింది 1896లో. ఈ మాలిక వ్రాసేటప్పటికి ఆధునికాంధ్రకవులు చాలామంది ఇంకా పుట్టలేదు. ఈయన చూపిన మలుపును పట్టించుకోనూ లేదు. ఈ దారిని గనుక మరింతమంది కవులు ఆనాడు తేటపరచి ఉన్నట్లయితే, తెలుగు పద్యం వచనకవితకంటే ముందుగానే ఒక అనర్ఘమైన మలుపు తిరిగి ఉండేది. ఇటువంటి ఒక కవిత తెలుగుసాహిత్యంలో ఇప్పటివరకూ ఒక్కటే ఉంది అని చదివిన వెంటనే నాకు అనిపించింది. ఈ మాలికకు ఆయన పెట్టిన పేరు ‘చంపకమాలిక’. చంపకమాల ఛందస్సులో ఈ మాలిక వ్రాయబడింది.

చంపకమాలిక – పేరు చూసి మామూలుదే అనుకున్నాను. కవి ఎన్నుకున్న ఎత్తుగడ – ప్రకృతివధూటి! ప్రకృతికాంతతో మాట్లాడుతున్నాడు కవి అని తెలుస్తూనే ఉంది. ఇదేదో ప్రాకృతికవర్ణనలను ఏకరువుపెట్టే కవితగా అనిపిస్తుంది కానీ, చదువరిని అనేక భావవైరుధ్యపుటావర్తాలలో సుళ్ళు తిరిగేలా చేస్తుంది. ఆ సంగతులను వివరించటానికి నేను ఈ మాలికను కొన్ని భాగాలుగా విభజించి ఇక్కడ చూపుతున్నాను. చూడండి:

ప్రకృతి వధూటి! వుష్పఫల పత్ర రసాల విశాలవాటులన్‌
శుకపిక శారికారుతులు సోలము పెంప ముదంబునింపఁ జం
పక నవమల్లికా కునుమ మంజరి క్రొమ్ముడి గందగింప నె
మ్మొకము దరస్మితంబగుచు బ్రుంగిన మల్లకు సేదదీర్పఁగా
సకి వనలక్ష్మిరాధికయు సల్లపనామృతసారధారలన్‌
జికిలుప దక్షిణానిలము చిత్తముజిల్లనఁ గౌఁగలింప ను
త్సుకమతిఁ దూఁగుటుయ్యెలలఁదూఁగవు; మోహతమంబుగాఁ దటాం
తికమున సన్నగాలి వడదేరెడు శాఖలతోడి వృక్ష పం
క్తి, కదలుముంగురుల్ గలిగి దివ్యరుచిస్మితయుక్తులై న బా
లకులను మూపులందిడి చెలంగెడు చూపఁఱ గాఁగ దేవక
న్యకల యనుంగురూవులకు నానలు దెచ్చుచు శుద్ధవాహినీ
సికతల మందవాయువులు జిల్లనియాఁడఁగ బెక్కణంబు స
ల్పక మనెదేల? తామరకొలంకులఁ బద్మినులోలగింప హం
సికలకు మాన్మథీఘుటిక చెందమి రేకుల నిచ్చిమున్నుద
ర్పక పరమార్చనానియతి రాల్చిన రక్త సరోజపత్రముల్‌
సకియలపై విదిర్చికొన జక్కవలుల్లసమాడు మాడ్కిఁ జూ
చుకముఖవిభ్రమత్స్న విచుంబి సితాంశుకమల్లలలాడ మౌ
క్తికముల సస చల్లికొను తీరున శీకరపంక్తులొండొరుల్‌,
మొకములఁ జల్లఁజల్ల దెలిమోములఁ జెమ్మటలూర జిత్తవం
చక జలకేళిసల్పి స్మరశంభళినంపి నుపర్వకోటిఁ బి
ల్వక యిటు వేఁగుదే? భువనవర్ణిత మాధవమైన నీముఖ
ప్రకటిత చంద్రికారసము వ్రాలిన మంచు ముసుంగుతోడ క
ప్పి కురులువీడి క్రొమ్ముడికి వ్రేఁగుఁదనంబఱఁ బ్రాతరాత్త పు
ష్పకమకరంద బాష్పకణ పంక్తులతో వగదేలెదేల…

ప్రకృతికాంతా! పుష్పాలతోనూ, ఫలాలతోనూ నిండినటువంటి విశాలమైన మామిడి వాటికలలో చిలుకలు, కోయిలలు, గోరువంకల కుహూనాదాలు మత్తెక్కిస్తూ ఆనందాన్ని పెంచుతూ ఉండగా; వనలక్ష్మి చంపకనవమల్లికా కుసుమ మంజరులతో కేశబంధానికి అలంకరించికొని మనోజ్ఞమైన ముఖం చిరునవ్వులతో కూడినదై నిండిన మల్లెపూలతో సేదతీర్చుతూంటే, రాధిక సల్లాపాలనే అమృతధారలు చికిలిస్తూ ఉంటే, దక్షిణానిలం చిత్తం జిల్లుమంటుండగా కౌగిలిస్తూంటే, ఉత్సాహం నిండిన మనస్సుతో ఎందుకు నువ్వు తూగుటుయ్యలలో తూగవు?

మోహతమంగా తటాంతికంలో సన్నగాలికి శ్రమపడుతున్న శాఖలతో కూడిన వృక్షపంక్తి, కదులుతున్న ముంగురులతో దివ్యమైన కాంతి కలిగిన నవ్వుతో ఉండేటువంటి బాలకులను మూపుమీదనెక్కించుకొని ఉండేటువంటి ప్రేక్షకులు కాగా, దేవకాంతల అనుంగు రూపాలకు సిగ్గు తీసుకువస్తూ, శుద్ధతను మోసుకువచ్చే నదుల మీంచి సైకత తలాల మీదుగా మందవాయువులు జిల్లని ఆడుతుండగా సాభినయనృత్యం చేయకుండా ఈ ప్రవర్తన ఏమిటి?

తామర కొలనులలో పద్మినులు సేవిస్తుండగా ఆడహంసలకు మాన్మథఘుటికలైన చెందమ్మి రేకులనిచ్చి ముందుగా మన్మథపరమార్చనా నియమంగా రాల్చిన ఎర్రని తామరరేకులు చెలికత్తెలపైన రాల్చే విధంగా చక్రవాకాలు పరిహసించే విధంగా స్తనాలను ముద్దిడుతున్న తెల్లని వస్త్రం అల్లల్లాడగా, ముత్యాలను తలబ్రాలుగా పోసికొనే తీరుగా నీటి తుంపురులను పరస్పరం ముఖాలపై చల్లగా, చల్లగా ఆ నిర్మలమైన ముఖాల పైని స్వేదమూరగా, చిత్తాన్ని వంచించేటువంటి జలకేళి సలిపి దూతికను పంపి దేవతలను పిలువకుండా ఇట్లా దుఃఖిస్తావేవిటి?

భువనవర్ణితమాధవమైన నీ ముఖం నుండి పుట్టిన వెన్నెలలను వ్రాలినటువంటి మంచు ముసుగుతో కప్పి, కురులు వీడి కొప్పు బరువు తగ్గగా, ఉదయాన్నే పొందినటువంటి పుష్పమకరందమనే బాష్పకణాలతో దుఃఖపడతావెందుకు?

పైవి ‘ఉండవలసినవిధంగా ఎందుకు లేవు నీవు’ అంటూ ప్రకృతికాంతపై కవి చేస్తున్న ఆక్షేపణలు. ఇవి నాలుగు. ప్రతీ ఆక్షేపణా ఎంతో బిగువుతో అతివిస్తృతంగా ఉంది, ఒక వర్ణచిత్రంలా. మొదటి పాదం మొదలుకొని ఆరు పాదాలు పూర్తిగా, ఏడవ పాదం సగం వరకూ ఒకటే వాక్యం. ఒకటే వర్ణన. తరువాతి వర్ణన మరో ఆరు పాదాలు సుమారుగా. తరువాతి వర్ణన తొమ్మిది పాదాలున్నది ఇంచుమించు. చేసేది ఆక్షేపణ అని చివరి క్రియాపదం వరకు తెలియదు మనకు. అంతవరకూ వర్ణనలో హృదయాన్ని కట్టిపడేస్తూ ఒక్కో అంశమూ ఎంతో హరువుగా చేరుతాయి.

వనలక్ష్మి జీవశక్తికి ప్రతీక. రాధిక ఆహ్లాదశక్తికి ప్రతీక. వారిద్దరూ ప్రకృతివధూటికి చెలికత్తెలు. అవన్నీ ఉన్నా, ఈమె హృదయంలో అలజడి.

మాన్మథీఘుటిక, స్మరశంభళి, పెక్కణము – ఎంత అందమైన పదసృష్టి ఇది!

… హా!
యకట, కటా! కనుంగొనితినవ్యయ నవ్యయశోధనుండు స
త్సకలకలాకలాప వసుధాతలనాయక కోటినుత్యుఁ డ
త్యకలుషచిత్తుఁ డార్యజనార్చితుఁ డాగమశాస్త్రకోవిదుం
డకుటిల సాహితీవిభవుఁ డంచితపాండవకీర్తి మాడభూ
షికులజుఁ డార్యసన్నుత నృసింహతనూజుడు వేంకటార్యుఁ డె
న్నికఁ ద్రిదశాలయంబు చొరనేర్చెఁ గటా!…

హా! అయ్యో! తెలిసింది! వ్యయం కాని నవ్యమైన యశస్సు కలవాడు, కళాపోషకులైన మహరాజుల చేత నుతింపబడేవాడు, అకలుషచిత్తుడు, ఆర్యజనార్చితుడు, ఆగమశాస్త్రకోవిదుడు, అకుటిలసాహితీవిభవుడు, అంచితమైన శుద్ధమైన కీర్తికలవాడు, మాడభూషి కులంలో పుట్టినవాడు, ఆర్యసన్నుతుడైన నృసింహుడి తనూజుడైన వెంకటార్యుడు స్వర్గాన్ని వరించి చొరనేర్చాడని కదూ!

పై కవితాభాగం చదువుతూ ఏదో పేరు తెలియని కవితాప్రపంచపు వీధులలో అప్పటివరకూ తిరుగాడుతున్న చదువరి కాళ్ళను పట్టి అధోలోకాలలోకి లాగివేస్తోందీ ఈ భాగం. ఎక్కడ పైన చూపించిన భావప్రపంచం? ఎక్కడ ఈ మృతిదుఃఖం?!

…హరిపాదనీరజ
ద్వికమఖమేది భక్తిమయ విత్తమునం గనుగొన్నవాఁడహో!
సుకవులు దివ్యసుందరుల చూడ్కులకు మ్మురువైనవాఁడు శా
రికలు శుకాంగనల్‌ నది ఝరీనటనైక తరంగమాలికల్‌
వికచ సరోజషండములు విస్ఫురదభ్రసరస్సితాబ్జ తా
రకలు పటీర భూధర చరన్మృదు మారుతముల్‌ సరస్వ దూ
ర్మికలు వనాంతవాటికలు ప్రేపులు రేలు విరాళిఁ గుందున్..

ఆ మాడభూషి వేంకటార్యుడింకా ఎటువంటివాడు? హరియొక్క పాదపద్మాల జంటను భక్తిమయవిత్తంతో కనుగొన్నాడట. సుకవుల, దివ్యసుందరుల చూపులకు సుందరమైనవాడట! అటువంటివాడు నింగికెగయడం చూసి, శారికలు శుకాంగనలు, నదులమీద కదలాడే అలల మాలికలు, వికసించిన సరోజాల గుంపులు, గర్జించే మేఘాలు, సరస్సులు, శ్వేతోత్పలాలు, తారకలు, చందనాది వృక్షాలు, పర్వతాలు, చలించే మృదువైన గాలులు, సముద్రతరంగాలు, వనాంతవాటికలు, వేకువలు, రాత్రులు – ఈ మొత్తమన్నీ కూడా నిండైన వలపుతో దుఃఖిస్తున్నాయట.

… ఓ
సుకవివరేణ్య! చంద్రధరజూట భవత్తటినీ ప్రవాహ మా
డికి వడి మర్త్యలోకమునడిగ్గి బలీంద్రు పదప్రణామ భం
గికయి రసాతలంబరిగె నీదుకవిత్యఝరీ మహాత్వమే
మొకొ జగతీశులన్ బరమమోద సముద్రమునందు ముంచి ది
వ్యకవుల పాండితీ మహిమ వన్నె యెరుంగఁగఁ బొంగిపొంగి మీ
దికెగసి నాకలోకవినుతింబొలుపారెఁ…

ఓ సుకవివరేణ్యుడా! చంద్రశేఖరుడి జూటంపైని ఉన్న తటినీ ప్రవాహం మర్త్యలోకంపై దిగి, బలిచక్రవర్తి పదప్రణామం కోసమని రసాతలానికి వెళ్ళింది. కానీ నీ కవితాఝరి ఉన్నదే, అది ఇంతకంటే గొప్పగా జగతీశులైన రాజులను పరమమోదసముద్రంలో ముంచింది. దివ్యకవుల పాండితీ మహిమ వన్నె తెలుసుకోడానికని పొంగి, పొంగి మీదికెగసి, స్వర్గలోకంలోకపు దేవతల పొగడ్తలతో ప్రకాశించింది. దాని మహాత్వమే తీరుదో!

.… కవీంద్ర! భూమినే
టికి విడనాడి మాకిట గడించితి దుఃఖ విషంబు భూమివం
చకులకునోడితో నముచిశానన గోష్ఠినలంకరింవ నా
రకచనితొక్కొ! రంగనగరంబున వాసముఁ గోరి యింతలో
న కడఁకఁ ద్రిప్పి కేశవుఁననారతముం భజియింప బోతె స్వ
శ్చకితకురంగ నేత్రలకు సాహితియో భరతాదినాట్య సా
ధకమొ విపంచికాలపన ధర్మమొ నేర్పెదె! పారికాంక్షి స
ప్తకమున కంచితౌపనిషదంబగు తత్వము నేర్పఁ బూనితో!
వెకలి, నెరుంగఁజెప్పు పృథీవీసుర తావకవిప్రయోగ వ
హ్నికిఁ గడు దూపిలెం బ్రకృతి, నిర్ఝరవారి మిషాశ్రుధారలం
బ్రకట మహీ ధరంబులును, పంకజవైరియుఁ బాండుతాకళన్
వికృతదివావధూటి కడువేగిన యూర్పులచే, నహోధ్వనిన్
బికములు, ముచ్చరింపవినవే? కవితామధురామృతంబు ని
ప్పుకలఁ బొరల్చినట్లు వగఁ బొందెడు మన్మథుఁబైనఁ జల్లవే?
చకిత మరాళి వర్షఋతుసంగతిఁ గ్రౌంచ బిలంబు దూరి త్వ
న్నికటము నేరుదానికుపదేశము సేయు భవత్కృతి ప్రణా
ళికన దిశారదంబు తఱి లీలమెయింజనుదేర నేర్వరా
దొకొ వగమాకు, దివ్యకవితోజ్వల! వందురియేమి చెప్ప త్వ
త్సుకృతి, శకుంతలాచరిత సూక్తికి కిన్నెరలందు దేవవై
ణిక తతియేమిపాడునొ? ఫణిప్రమదావళి వీనులెట్టివో
సకల మెరుంగ నెవ్వరికి శక్యము?

ఓ కవీంద్రా! ఎందుకీ లోకాన్ని విడిచిపెట్టి మాకింత దుఃఖవిషాన్నందించి వెళ్ళావు? ఈ భూలోకంలోని వంచకులకు ఓడిపోయావేమో. దేవలోకంలో ఇంద్రసభను అలంకరిద్దామని వెళ్ళావేమో! రంగనగరంలో వాసాన్ని కోరి యింతలో యత్నమేదో త్రిప్పినట్లు కేశవుడిని నిరంతరమూ భజియించడానికి వెళ్ళిన నిన్ను చూసి చకితలైన దేవకాంతలకు సాహిత్యమో, భరతనాట్యపు రహస్యాలో లేదా వీణావాదన ధర్మాలో నేర్పుతున్నావేమో! సప్తర్షులకు ఉపనిషత్తత్త్వాన్ని నేర్పబూనావేమో!

నీ వియోగాగ్నిని భరించలేని ప్రకృతి ఖేదపడుతోంది. నదులనే మిషాశ్రుధారలను రాల్చుతున్నాయి మహీధరాలు. చంద్రుడు తెల్లబోయాడు. వికృతంగా దివావధూటి ఊర్పులతోనూ, పికాలన్నీ అహోధ్వనితోనూ నీపై తమ ద్వేషాన్ని ప్రకటిస్తున్నది నీవు వినవే? నిప్పుకణాలేవో దొర్లించినట్లుగా సంతాపాన్ని పొందుతున్న మన్మథుడిపై నీ కవితామధురామృతాన్ని చల్లవే? చకితమరాళి వర్షఋతువులో క్రౌంచబిలాన్ని ప్రవేశించి నీకు చేరువ కావడానికి ఉపదేశం చేసేటువంటి నీకృతి లీలతో బయలుదేరడానికి ఏర్పరచరాదా మా ఈ సంతాపం మాకు?

దివ్యకవితోజ్వలా! దుఃఖపడి ఏమని చెప్పమంటావు? నీ సుకృతి అయిన శకుంతలాచరితసూక్తిని విన్న కిన్నెరలు దేవవీణలతో ఏమి పాడతారో! నాగకన్యల చెవులు ఏవిధమైనవో! అన్నీ తెలుసుకోవడం ఎవరికైనా కుదిరే పనేనా?

కవీ అతని కృతీ రెండూ ఒకటే. మాడభూషివారి భరతాభ్యుదయమనే మనోహరకావ్యం రామకృష్ణకవిగారి వేదనాభరితమనస్సులో పల్లటీలు కొడుతోంది. మాడభూషి వేంకటాచార్యులు ఒక వేశ్య సాన్నిధ్యంలో ఈ రసవంతమైన కావ్యాన్ని ఆశువుగా చెప్పారట. ఈ కవితలో మానవల్లివారీ కావ్యాన్ని కాళిదాసు శాకుంతలంతో పోల్చుతూ అనేకరకాలుగా వర్ణించడం వినూత్నాభివ్యక్తి. క్రౌంచమార్గం హంసలు మానససరోవరాన్ని చేరుకునే మార్గం. దీనికే హంసద్వారమని పేరు. (చూ. మేఘసందేశం 1.61)

…మానిని! యో శకుంతలా!
యొకతియ నీవుధన్యవ తనూన్మద తాప వసంతవేళ మే
నక యెటు గాధినందనుని నామముతో శృతిఁ గూర్చి పాడెనో
మకరపతాకు క్రొమ్మెరుగు మార్గణ ధాటికయెట్టి దొక్కొ కౌ
శిక నికషోపలోరసి నిషేచక తన్మకరీ కలాపచం
ద్రక మెటువంటిదో శిశుకరక్ష శకుంతము లేవొ మాలినీ
సికతల గూఢరత్నముల చెల్వములెట్టివొ కణ్వమౌనియ
త్యకలుష వీతిహోత్రరుచులగ్గలమో యనసూయశీతలో
పకృతియతీతమో పరమపావన చక్రి ఝషంబులూర్ధ్వ లో
కకృతములో యెరుగంగల కాలమువర్ధిలు నీదుజన్మమే
సుకృతము కాళిదానునకు జొప్పడ కీర్తిసుమంబొనంగితీ
నుకవికి వేంకటార్యునకు నూక్తుల నిచ్చితి నిన్భజింప మా
మక కవితావిలాసినికి మవ్వముచాలదు వేంకటార్యక
ల్పకముల నీడలం దమరభామలతో నడయాడి యాడి యొ
క్కొకతరి మిమ్ము నిల్పుమెదఁ గూరిమి నీకవనీతలంబునుం
డి కవితదక్క యే మొసఁగ డెందము కొందలమాఱు సత్కవీ!

ఓ మానినీ! శకుంతలా! నీ వొక్కదానివే ధన్యవు. నీవు పుట్టేందుకు తనూన్మదతాపమున్న వసంతవేళలో మేనక ఏవిధంగా గాధినందనుడి నామంతో శృతికూర్చి పాడిందో! మకరపత్రాల సింగారపు బాణాల ధాటి ఎట్టిదో! విశ్వామిత్రుడనే గీటురాయి యొక్క ఉరస్సు పై గీసిన ఆమె యొక్క మకరీకలాపాల చంద్రకం ఎటువంటిదో! శిశువును కాపాడిన ఆ పక్షులేవో! కణ్వమహర్షి అకలుషమైన వీతిహోత్రపుటతిశయాలేవో!

శకుంతల సఖియైన అనసూయ యొక్క మేలు అతీతమో, ఆ చేపలు ఏ ఊర్ధ్వలోకంలో తయారుచేయబడ్డవో – వీటిని తెలుసుకోగలిగే కాలమెపుడూ జయిస్తూనే ఉంటుంది. శకుంతలా, నీ జన్మమే ఒక సుకృతఫలితం. కాళిదాసుకు కీర్తి అనే సుమాన్నిచ్చావు. ఈ సుకవి అయిన వేంకటార్యుడికి సూక్తులనిచ్చావు. నిన్ను పొగడడానికి నా కవితావిలాసినికున్న సుకుమారత సరిపోదు. వేంకటార్యుడనే కల్పవృక్షం చెంతలో అమరభామలతో నడయాడి, యాడి ఒక్కోసమయంలో మమ్మల్ని యెదలో నిలుపుకో. ప్రేమగా నీకు అవనీతలం నుంచి కవిత తప్ప ఇంకేమి ఇవ్వను?

ఓ సత్కవీ! నా గుండె కలతపడుతోంది – అంటూ మాలికను ముగించారు మానవల్లివారు.

కవిని కవియొక్క కావ్యము కమ్మివేసింది. కవి లేడు, కాని కవి పలికిన కావ్యం ఉంది. ఆ కావ్యంలోని నాయిక ఉంది. ఆ కవిత ఇచ్చిన రసానందం ఉంది. దాన్నే గానం చేశారు రామకృష్ణకవి. ఇంతకన్నా కవికి కావలసినదేమిటి? కవిని పొగిడుతూ ఒక కవిత వ్రాస్తున్నపుడు వెనుక నుండి ఎవరో సుతారంగా భుజంమీద చేయి వేస్తే, వేసిన వారివైపుకు తిరినట్టుగా రామకృష్ణకవి శకుంతలవైపుకు తిరిగారు. ఆమెతో మాట్లాడారు.

ఈ కవిత మానవల్లివారు వ్రాసేటప్పటికి కృష్ణశాస్త్రి పుట్టలేదు. తిలక్ పుట్టలేదు. 1890ల నాటికి మానవల్లివారు కవితారచనలు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఆయనలోని పరిశోధకుడింకా బయల్పడలేదు. మాడభూషివారు పరమపదించే సమయానికి మానవల్లి వారిది ముప్పై ఏళ్ళ ప్రాయం. ఈయన్ను ఆ మహాకవి పరిపరివిధాలుగా ప్రోత్సహించి ఉంటారు.

భావపూరితమైన ప్రకృతివర్ణనతో మొదలై, ఒక కవిమృతిజనితదుఃఖం నింపుకొని, ఆ కవిని స్మరిస్తూ, వియోగాన్ని వర్ణించి, కవి వ్రాసిన కావ్యం కవిస్మృతి కన్నా బలీయంగా యెదను పట్టి లాగుతూంటే దాన్ని తల్చుకొని, ఆ స్థితి నుంచి కావ్యనాయికతో సల్లాపమాడి, ‘మామక కవితావిలాసిని మువ్వము చాలదు’ అంటూ తిరిగి తేరుకొని మళ్ళీ కొందలమారిన డెందముతో సత్కవిని స్మరించి ముగిసిన ఈ కవిత వంటి ఎలిజీని నేను మరొకదాన్ని చూడలేదు. చరిత్రకారులు గుర్తింపని ఆధునికాంధ్రయుగంలోని మొట్టమొదటి మాలికాస్మృతిగీతమిది.