రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మౌనంబంతట మాటలాడె…

అను కావ్యావతరణ కథ

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
ఏప్రిల్ 2025

[అడిగిన వెంటనే ఈ పద్యాలను సుమధురంగా పాడి మాకు అందజేసిన సముద్రాల హరికృష్ణగారికి మా ధన్యవాదాలు! – సం. ]

కం.
శ్రీవిలసత్కావ్యకథా
పావనకలశాబ్ధిభంగభద్రారామా!
నీవారశూకవద్బ్ర
హ్మావరణసమప్రమాణ! ఆత్మారామా! (1)
వ.

అను నా చిలుకపలుకులకు స్వామి చిరునవ్వు నవ్వెనో యేమొ, నా తలపున వెన్నెలారబోసినట్లు తెలివెలుగులు వెల్లివిరిసె, నట్లు తేటపడిన మనఃఫలకమున నొక తేజఃపుంజము ప్రసరించి దివ్యాకృతిఁ గొనె. (2)

ఉ.

పుట్టుచుఁ జచ్చుచున్ మరియు పుట్టు శరీరము సేయు కర్మ పెన్
బుట్టలు గట్ట, దాని తుదముట్టగ వ్రచ్చు మహాప్రయత్నమై
పట్టిన మంత్రదీక్ష నెరపండిన జీవప్రచేతనాగ్ని, తాఁ
బుట్టిన దేమొ తుట్టతుదిపుట్టువు పుట్టనుఁ జీల్చు మౌనియై (3)

ఆ.వె.

మౌని గుండెనిండ మార్దవ మది మెండు
కాని నిండుకుండ కదల కుండు
నొక్క తొణుకు గలుగ నుప్పొంగదే గంగ
సారసత్కథాసుధారసమ్ము! (4)

వ.

అట్టి కథాసుధకై యా మునినాథుని మనమ్మున నేదో మథనమ్ము (5)

ఉ.
ఏ కథ వేదనాద? మగలించు పెఠిల్లున కర్మపాశమున్!
ఏ కథ యచ్చపుం రసపుటేరు? హరించును మూలకామమున్!
ఏ కథ జ్ఞానదీప్తి? కరగించు నవిద్యమహాఘవృత్రమున్!
ఏ కథ విన్న చెప్పిన తరించును సంసృతివార్థి జీవుడున్! (6)
వ.
కథయన్న గట్టు చేర్చెడు నట్టి కథ కావలె, నయిన నా కథను నడిపించు నాయకు డెట్లుండ వలె? కథ లౌకిక మయ్యు రస మలౌకికమగు రీతి, నా నాయకుడు మానవుడయ్యును మహనీయుడు గావలె కదా! (7)
తే.గీ.
అతని నడవడి కర్మయోగాభ్యసనము
అతని యొకచూపు సర్వకామార్థదాయి
అతని విద్వత్త ఆత్మతత్త్వావబోధ
అతడు సకలజీవహితైషి యమృతమూర్తి (8)
వ.
గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, దృఢవ్రతుడునై పదహారుకళల పున్నమచందమామ బోలు నా నాయకు డెక్కడ? యెక్కడ? (9)
కం.
ధీరోదాత్తుడు, శాంతుడు,
వీరోచితరోషదేవభీకరు, డనసూ-
యారూఢమతిద్యుతిసా-
కారుడు, నగు నాయకుండు కలడో లేడో? (10)
వ.
అని తలపోయు సమయంబున “కలడు కలం”డను నొక కలరవంబు వినిపించి, బ్రహ్మతేజంబున బొల్చు నొక మహర్షి సాక్షాత్కరించె (11)
ఆ.వె.
తల్లిదండ్రులకును తగినకుమారుడు
వాగ్విశారదుండు బ్రహ్మవేత్త
తపసి వేదవేది త్రైలోక్యనిత్యసం
చారి మునివరుండు నారదుండు (12)
వ.
అంతఁ, దనకుఁ బ్రాంజలి ఘటించిన మునిసత్తముని శిష్యవాత్సల్యంబున హత్తుకొని యా నారదుం డిట్లు పలికె (13)
కం.
మెల్మేలు నీకు నయ్యా
వాల్మీకీ! నేనెరుగుదు భవదీయవిచా
రోల్ముకము నట్టి గుణవం
తుల్ మునివర! నిక్క మరుదు దొరకొన నైనన్ (14)
కం.
ఉన్నాడు లెస్స యొక్కం
డున్నా డిల రాఘవుండు నురువీరుడు ధృ
త్యున్నతుడును నియతాత్ముడుఁ
జెన్నగు మహనీయదీప్తి శ్రీరాము డనన్ (15)
తే.గీ.
అతని నామంబు రూపంబు నంతరంగ
మొక్క తీరున రమ్యంబ! యుగ్గడించి
యతని గుణములు వివరింప ననువదింప
తాతలే దిగిరావలెగా తపస్వీ! (16)
సీ.
దిగ్దిగంతముఁ బర్వు స్నిగ్ధవర్ణద్యుతి
యూర్ధ్వపుండ్రలలాట మొప్పు శిరము
సరసీజపత్రవిశాలాక్షము వరసుం
దరసుదృఢహనుమంతంబు మోము
పాంచజన్యప్రభాభాతి సుగ్రీవము
కోదండ మమరారు కొదమమూపు
శ్రీదుర్గప్రాకారసాదృశవక్షమ్ము
వసుధాధురంధరబాహుయుగము
తే.గీ.
అతని రూపంబు కనులార నరసి పొగడ
నాదిశేషునకే సాధ్యమగునొ యేమొ!
అతడు జగముల కెల్ల నేమయిన గాని
మురిపెమునఁ దల్లికౌసల్య ముద్దుబిడ్డ (17)

ఉ.
జ్ఞానము సద్వివేకమును సత్యవ్రతమ్మును ధర్మనిష్ఠయున్
మానితనీతివర్తనము మంజులభాషణ సుంత లేనిచో
మానవు డెన్నగా పశుసమానుడ! యా గుణముల్ ప్రపూర్ణసం
స్థానము నొందె రామునిగఁ, దాఁ బురుషోత్తముడయ్యె నవ్విధిన్ (18)
తే.గీ.
అతడు కాలాగ్ని క్రోధమునందు, ప్రేమ
చిందు చల్లనిచూపుల చందురుండు
ధనదసము డీవి, క్షమయందు ధరణి, సత్య
తత్పరతయందు సాక్షాత్తు ధర్మమూర్తి (19)
కం.
శ్రీలలితాలక్ష్మణుడున్
బాలితజనరక్షణోరుభారభరతుడున్
బాలిశశత్రుఘ్నుడుఁ దా
నేలిక యన నొక్క రాముడే యనవలెగా! (20)
కం.
ప్రథితము, నానాఖ్యానక
గ్రథితము, సంసారదుఃఖరక్షస్సకలో
న్మథితము, వేదార్థమ్మిది
కథయనగా రామకథయె కథ యనవలెగా! (21)
ఉ.
ఈ కథ వేదనాద, మగలించు పెఠిల్లని కర్మపాశమున్
ఈ కథ యచ్చపుం రసపుటేరు, హరించును మూలకామమున్
ఈ కథ జ్ఞానదీప్తి, కరగించు నవిద్యమహాఘవృత్రమున్
ఈ కథ విన్నఁ జెప్పినఁ దరించును సంసృతివార్థి జీవుడున్! (22)
కం.
అని రామకథను సంగ్రహ
మునఁ దెల్ప మహర్షివాక్యముల లోలోతుల్
ముని మది నాటె నతండును
ఘనవాక్యవిశారదుండు గావున నంతన్ (23)

(సశేషం)

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Vasu April 2, 2025 6:59 am

    భైరవభట్ల కామేశ్వరరావుగారూ,

    నమస్తే. నేను వాసుని. ఈ పద్యాలన్నీ ఎంతో తియ్యగా ఉన్నాయి. వాల్మీకిని మొత్తం అనువాదం చేయ సంకల్పించారా, సర్?

    -వాసు-

  2. 2
    కామేశ్వరరావు April 4, 2025 11:34 am

    నమస్తే వాసుగారు,
    Thank you. లేదండి, మొత్తం వాల్మీకి రామాయణం నాకు సాధ్యం కాదు. వీలైనప్పుడు కొన్ని కొన్ని భాగాలను, సన్నివేశాలను మాత్రం ప్రయత్నిస్తున్నాను.

  3. 3
    పరిమి శ్రీరామనాథ్ April 26, 2025 7:06 am

    ఈ కథావస్తువు వన్నెను అరగదీయడంలో మానవాళి ఓడిపోతూనే ఉన్నది. నూత్నరుచితో సాక్షాత్కరించిన ఈ పద్యాలు సహృదయహృదయవనాలలో కొత్త అంట్లు కట్టగలవు. రాబోయే కవితాభాగాలకోసం వేయికన్నులతో ఎదురుచూస్తాను. కవితల్లజులు శ్రీకామేశ్వరరావుగారికి నమఃపూర్వక శుభాకాంక్షలు.

  4. 4
    కామేశ్వరరావు May 11, 2025 1:08 pm

    ఈ కథావస్తువు వన్నెను అరగదీయడంలో మానవాళి ఓడిపోతూనే ఉన్నది

    నిజమండీ!

    మీ సహృదయస్పందనకు హృదయపూర్వక కృతజ్ణతలు. మీవంటి రసజ్ఞకవులకు నచ్చిందంటే, అంతకన్నా సంతోషం ఏముంటుంది!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: పినవీరుని పద్యరచనలో గుబాళింపు
  • భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం
  • గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.
  • నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!
  • నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస

ఇటువంటివే…

No related posts.

ఏప్రిల్ 2025 సంచికలో ...

  • అక్కమహాదేవి వచనాలు – 4
  • అభగ్న గర్గరిక
  • అస్తిత్వవాద సాహిత్యం: 2ఇ. దొస్తోయెవ్‍స్కీ
  • ఎవరెస్ట్ బేస్ కాంప్ – 6
  • ఏప్రిల్ 2025
  • ఒక మధ్యాహ్నం పూట ఊళ్ళో
  • ఒక స్వప్నం
  • కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం
  • కాలగర్భ
  • కొన్ని సమయాలలో కొందరు మనుషులు
  • కోయిలబాస
  • తొలి …
  • దుఃఖపు కోట
  • పరావర్తనం
  • ఫోన్‌ తమాషా
  • మానసా పబ్లికేషన్స్ వారి నవలల పోటీ
  • మౌనంబంతట మాటలాడె…
  • యుగాంతమెప్పుడు
  • యూట్యూబ్‍లో ఈమాట: మార్చ్ 2025
  • లంకమల దారుల్లో – వలపటెద్దు కథల్లో
  • వేక్సీన్ రాజకీయాలు
  • వేలూరిగారితో ఒక సంభాషణ
  • సిద్ధార్థ ముక్కుపుల్లలు — స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు
  • సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఒక మధ్యాహ్నం పూట ఊళ్ళో
యుగాంతమెప్పుడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.