ఖాళీ కవిత

మాటలు మొత్తం చెట్టుమొదట్లో నుండే.
కొన్ని కొమ్మలకి పిచ్చిపట్టింది.
కాకులు మాటల్ని మొత్తం కరుచుకుపోయాయి.
కొన్నేమో గూళ్ళకి పీచులా వేల్లాడుతున్నాయి.

శిలలు శిల్పాలై మృదువుగానవ్వినా
నువ్వు మాత్రం కరుగవు.
నిన్ను మనిషి అంటారు
నీ హృదయం శిలవంటిది కాదంటారు.

పాతబడి ఉన్నాను
రంగులు వెలసి చెదలు పట్టి
ఒకే దిగులు నిన్ను చూడని దిగులు
వెయ్యినొక్క రూపాల్లో నిన్ను వర్ణిస్తూ
పిచ్చితో ఊహపట్టని కాగితాన్ని శ్రద్ధగా నింపుతూ

చాలా దయతో బోలెడంత దూరాన్ని ప్రేమగా
దోసిలినిండుగా ఇచ్చి
మెడచుట్టూ ఖాళీ కాగితాన్ని
చీకటి శాలువాలా చుట్టి ఆకాశమనుకోమనీ
అక్షరాల నక్షత్రాలను అంటించుకోమనీ
వెళ్ళిపోయావు.

వెనుకకుపోతే చెదలయ్యి
ముందుకుపోతూన్నకొద్దీ మరింత బెంగయ్యి
ఇలా, నేను ఖాళీ కవితలా.