విశ్వ కవిత నెరుడా

స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా
ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్‌

నెరుడా(190473)

20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి గాంచనిచోట కవిగాంచును” అన్న నానుడి నెరుడాకు అక్షరాలా వర్తిస్తుంది.గహన విషయాలపైనే కాకుండా సాధారణమైన వాటి మీద కూడ చిక్కని కవిత్వం రాశాడు.జంతువులు ,మొక్కలు,నగరాలు, స్నేహితులుఒక్కటేమిటిసకల చరాచర సృష్టి ఇతని కల్పనా శక్తికి లోబడి ఇతని కవితా ప్రపంచం లోకి వినమ్రంగా తలవంచి ప్రవేశించవలసిందే.అన్నిటా ఎవరు చూడని లోతులు చూడగలడు.స్పానిష్‌లో కవితా వ్యవసాయం బహు విస్తారం. పోతే,నేల పదును,వాతావరణం ,అదును తెలిసిన నిండైన మోతుబరి నెరుడా.నోబెల్‌ (1971) ఇతన్ని వరించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. పాబ్లో నెరుడా అన్నది ఇతని కలం పేరు!అన్నీ తెగనమ్మి తన మొదటి పుస్తకం అచ్చువేసుకొంటున్నప్పుడు ,ఇంట్లో వారికి తన కవితావ్యాసంగం తెలియనివ్వకుండా పెట్టుకొన్నాడు.

వర్షం…
వాన తిరిగి వచ్చింది

ఆకాశం నుండి కాదు

పడమటి నుండి కాదు

నా బాల్యం నుండి నేరుగా వచ్చింది.

రాత్రి చీలి తెరచుకొని ,ఫెళ ఫెళమని

ఉరుము ధ్వని

ఏకాంతపు ప్రతిమూలను ఊడ్చేసింది.

మొదట

పొరలే..

ఆనందం

ఆ పై

గ్రహపు

చిత్తడి

వాలం.

వర్షం

వెళుతోంది..టిక్‌ టాక్‌,వేయి టిక్‌లు

మరో వేయి టాక్‌లు ఓ గుర్రబ్బండి

నల్లని పూరేకుల

కుండపోత

రాత్రి

అకస్మాత్తుగా

జోరుగా

ఆకులను

సూదులతో

పొడుస్తూ

ఒక్కోసారి

తుఫాను

వలువలా

నిశ్శబ్దంలోకి

కొట్టుకుపోతూ

వర్షం..

పై గాలి కడలి

తాజా..

నగ్న గులాబీ

ఆకాశ గళం

నల్లని వయొలిన్‌

కేవల సౌందర్యం

నేన్నిన్ను ప్రేమించాను..

చిన్నప్పటి నుండీ

నీ మంచితనాన్ని చూసి కాదు

నీ అందానికి తెగ మురిసి

నడిచాను ఆగకుండా

పాడైపోయిన బూట్లతో

ఆకాశ నదం

దారాలుగా

నా తలమీద

విడిపోయి

అంతెత్తు నుండి

ఏదో సందేశాన్ని

మోసుకొచ్చి

నాకు ,వేళ్ళకు

చెమ్మగిలే ఆమ్లజని

ఆరణ్య స్వేచ్చ

నాకు తెలుసు

నీవెంత దొంగవో..

చిల్లు

పై కప్పులో

పేదవారి గదుల్లో

చినుకులుగా

రాలిపడుతూ..

అప్పుడు నీవు

అందమైన నీ ముసుగు తొలగించి

దివ్యకవచంలా

క్షుద్రంగా

తళతళలాడే

గాజుకత్తిలా

సరిగ్గా ,అక్కడే

నిజంగా,నీ గురించి తెలుసుకొన్నాను

కానీ

నేను

ఇంకా

నీ వాడినే

ప్రేమలో

రాత్రి

కనురెప్పలు గట్టిగా మూసుకొని

లోకం మీద కురవాలని

నేను ఆశించాను

నా చెవుల్లోనే

పాడతావనుకొన్నాను

ఎందుకంటే ..నా గుండె

మట్టిమొలకను ఊయలూపింది

నా ఎదలో లోహాలు కలగలిశాయి

నా హృదయం లో గోధుమ మొలకెత్తుతుంది

కానీ ,ప్రేమిస్తూనే ఉన్నా

నోటిలో

చేదురుచి మిగిల్చావు

అది పశ్చాత్తాపపు చేదురుచి

నిన్న రాత్రి

శాంటియాగోలో

ఇల్లు

నూవాలెగువాలో

కూలిపోయాయి.

పెళుసు

పుట్టగొడుగులు

రాశులుగా

కుమిలిపాటు

నీ భారీ పాదాలవల్లే

ఇదంతా

పిల్లలు

బురదలో ఏడ్చారు

రోజు మార్చి రోజు

వాన తడిపిన పక్కల్లో

నాశనమైన కుర్చీల్లో

స్త్రీలు

వంటగదిలో రాజేసిన నిప్పులు

నీవు,

నల్లటి వానా

శత్రువు వానా

కురుస్తూనే ఉన్నావు.

మా దైన్యం మీద

నాకెంతో నమ్మకం

ఒకానొక రోజు

ఆ రోజు మా కాలెండర్‌లో గుర్తు పెడతాం

వారందరూ గట్టికప్పులకింద నివసిస్తారు

కారని కప్పులు

పురుషులు వారి వారి ఆలోచనల్లో

అందరూ

నిద్రపోతారు

అప్పుడు మధ్యరాత్రిలో

వాన తిరిగి వస్తుంది

నా బాల్యం నుండి

నేను పాడతాను

పిల్లల కోసం

ప్రపంచం మీద పడే

వాన పాట

ఆనందంగా

శ్రమైకంగా

ఇంకి పోయి

సారవంతమైన కొండల్లో

మైదానాల్లో

నదులకు జీవాన్నిస్తూ

చరియల్లో విస్మృతంగా,

కూలిన గోతులను

కలుపుతూ

హోరుగాలి

పేర్చిన

మంచును

చిట్లగొడుతూ

పశువుల వీపుల మీద

నర్తిస్తూ

మొలకెత్తే గోధుమ

విత్తనాలకు

సత్తువ కలిగిస్తూ

నిగూఢ వృక్షాలకు

అమోఘ స్నానం చేయిస్తూ

పూర్తిస్థాయిలో

పనిచేస్తూ

జారిపోతూ

సూక్ష్మాతి సూక్ష్మంగా

అన్నిచేతులతో అన్ని దారాలతో

అవనీతలం మీద

వర్షం

నిన్నటినుండి

ఓ విషాద

వర్షమా

పాడు!!

పాడు!!

ఇంటికప్పుల మీద

ఆకుల మీద

గడ్డకట్టిన గాలుల మీద

నా హృదయాన,నమ్మకంలో

నా కప్పుమీద నా నరాల్లో

నా సమస్త జీవితంలో

నిన్ను చూస్తే భయం లేదు.

జారిపో ,సాగిపో

ధరణిలోకి

పాడుతూ నీ గీతం

నా గీతం

అంకురాలతోనే

ఇంకా మనకు పని

గానం బాధ్యతను

మనం పంచుకొందాం.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...