గచ్చు మీద తన నీడనే చూస్తూ
గుమ్మం దగ్గర నిలిచున్న తలుపు
అడుగులతో నడిచొచ్చిన జ్ఞాపికలను దాచుకుని
మూసిన గాజు తలుపుల అరమరలతో
మూగ సాక్షిగా నిలిచిన గది
గాలి తగలడాన్నీ
మనుషులు మాట్లాడటాన్నీ
ఆకులూ కొమ్మలూ కదలడాన్నీ
పట్టించుకోలేక
అచేతనమైన నా మనసు
ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తూ
ఇంకోవైపు నిర్లిప్తమవుతూ
నాచుట్టూ తిరిగి మాయమవుతున్న
జ్ఞాపకాల మౌనం
ఎవరినీ ఏమీ చేసుకోలేని
ఒంటరి నిశ్శబ్దాన్ని సృష్టిస్తూ
ఈ గదిలోకి కాలాన్ని నింపుతూ
ఖాళీ అవుతున్న ఉదయం